Tuesday, February 9, 2010

"శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం" గ్రంథ ప్రకటన విధానం- గ్రంథ సమర్పణ ప్రకారం

జ్వాలా మ్యూజింగ్స్-25

PUBLISHING THE EPIC BOOK
SREEMATH ANDHRA VALMIKI RAMAYANAM
EPIC BOOK DEDICATION PROGRAM)

వనం జ్వాలా నరసింహారావు

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం యథా వాల్మీకంగా పూర్వకాండలతో ఉత్తర కాండను కూడా కలిపి రచించడం పూర్తి చేసిన తర్వాత ఎలా ఆ గ్రంథాన్ని ముద్రించింది, ఎవరి తోడ్పాటుతో జరిగింది, ఎవరికి-ఎప్పుడు-ఎలా అంకితమిచ్చింది వాసుదాసు గారి మాటల్లోనే తెలుసుకుందాం. అలనాటి ప్రముఖ దినపత్రిక రాసిన వార్త కూడా చదవొచ్చు-జ్వాలా

“ఇంత గొప్ప గ్రంథాన్ని ముద్రించడం ఎలాగని నా స్నేహితులు కొందరు నాతో కలిసి ఆలోచన చేశారు. ఈ వార్త తెలుసుకున్న ఒక "స్వదేశీయ ప్రభువు" గారు, తాను ఆ భారమంతా మీదేసుకుంటానని చెప్పి, ప్రతిఫలాపేక్ష లేకుండా, వాగ్దానాన్ని నెరవేర్చుకొని, వేలాది రూపాయలు వ్యయం చేసి, ముద్రింపచేసి, "కృతి" కి, "కృతి కర్త" కు చిరాయువు కలిగించారు. ఏ ప్రభువైనా, ఏ ధనికుడైనా, ప్రతిఫలాపేక్షలేకుండా, ఇంత ధనం ఖర్చుచేసి, తన సంస్థానంలో కాకుండా దూర దేశంలో వుంటూ-తనకేమాత్రం సంబంధం లేనట్టి నా లాంటి అనామకుడి కృతిని ముద్రించడానికి సహాయపడడం లోకంలో విని వుండం. ప్రభువులు ఏ ప్రతిఫలాన్ని కోరుతారని అనుకోవచ్చు. ఆత్మ తుష్టికొరకు తమను పొగిడించుకోకుండా "ఒక వరాటకమేని ఇచ్చిన ప్రభువులు వీరును వీరిమాతులులును కాకుండా మరెవ్వరు?" కాబట్టి, ఇట్టి ప్రభువులు నాకు లభించడం కూడా, శ్రీరాముడి అనుగ్రహమే అని నా నమ్మకం. ఈ విషయంలో తన నిర్వ్యాజ కరుణకు పాత్రులైన ఆ సత్ ప్రభువుగారికి శ్రీరాముడే సర్వ శ్రేయోదాయి అవ్వాలి. "సాత్త్వికదానేఛ్చు" లగు ఆ ప్రభువుగారు, తన పేరును ఇందులో ప్రకటించడానికి నాకు అనుమతి ఇవ్వనందున ఆయనెవరో లోకానికి తెలియచేయలేక పోతున్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను”.

“గ్రంథ రచన పూర్తవగానే ముగ్గురు స్నేహితులం కూర్చొని, దీన్ని, కృతిపతైన ఒంటిమిట్ట శ్రీకోదండరాముడికి నివేదించి, లోకానికి తెలియచేయడం ఎలాగని ఆలోచన చేశాం. ఆ సమయంలో అనుకోకుండా, నా పాత స్నేహితుడు, కడప మండలం-పొద్దుటూరులో న్యాయవాదిగా పనిచేస్తున్న బ్రహ్మ శ్రీ రాజ శ్రీ వి. వసంత రావు గారు చెన్నపురికి వచ్చి, వార్త తెలుసుకొని, కార్యక్రమాన్ని మంచిగా జరిపించాలని ప్రోత్సహించడమే కాకుండా, సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆయనంతటితో ఆగకుండా, కడప మండలంలోని స్నేహితులతో-హితులతో-భాషాభిమానులతో-దైవ భక్తిగలవారితో ఒక ఆహ్వాన సభను ఏర్పాటు చేశారు. అందులో బ్రహ్మ శ్రీ మహారాజ శ్రీయుతులు నెమలి పట్టాభిరామరావు (కొచ్చిన్ సంస్థానంలో దివానుగా వుండేవారు), ఏ. పరశురామ రావు, వావిలికొలను రామానుజ రావు, సి. నంజుండప్ప, కే. గుండు రావు, కామసముద్రము నరసింహాచార్యులు, ఎన్. నరసింగరావు, సత్యధీరగురురాజప్రియ కౌకూరు రామచంద్రరావు, యమ్మనూరు నాగయ్య, ఆర్. గిరిరావు గార్లు, మహరాజ శ్రీయుతులు కొణదల రామచంద్రారెడ్డి, విఠాయా గంటిసెట్టి గార్లు ఆహ్వాన సంఘ సభ్యులు. వీరికి సహాయపడేందుకు, శ్రీమదాయుర్వేదమార్తండ భిషజ్మణి పండిత డి. గోపాలాచార్యులు గారు, మహారాజ శ్రీ పానుగంటి రామారాయనింగారు, బ్రహ్మ శ్రీ రాజ శ్రీ గుమ్ముడూరు వేంకట రంగారావు గారు, వేంకట సుబ్బయ్య గారు, ఏ. జయరామరావుగారు, క్రొత్తపల్లి వేంకట పద్మనాభ శాస్త్రి గారు ముందుకొచ్చారు”.

“ఇలాంటి మహనీయుల కలయికతో అలంకరించిన సభ ఎలాంటి కార్యాన్నైనా చేయగలదు కదా ! పైగా, వీరి ప్రార్థనలను అంగీకరించి, గ్రంథ సమర్పణ సమయంలో, సభాధ్యక్షుడిగా వుండడానికి "చిత్రనళీయం" లాంటి అనేక రూపక గ్రంథాలను రచించి, బళ్లారిలో న్యాయవాద వృత్తిలో వున్న, శతావధాని-ఉభయ వేదాంత ప్రవర్తకులు, మహారాజ రాజ శ్రీ శ్రీమద్ధర్మవరము రామ కృష్ణమాచార్యులు గారు ఒప్పుకున్నారు. 1908వ సంవత్సరం అక్టోబర్ నెల 9, 10, 11 తేదీలలో-అంటే, కీలక నామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి, బహుళ పాడ్యమి-విదియ తిథులలో "కావ్య సమర్పణ" జరుగుతుందని పత్రికా ప్రకటన ఇచ్చింది ఆహ్వాన సంఘం. ఇలా ఆంధ్ర లోకానికి వెల్లడి చేయడమే కాకుండా, హిత-కవి-పండితులందరినీ ప్రత్యేకంగా "విజ్ఞాపన పత్రికల" ను పంపించి ఆహ్వానించారు. నా పాత స్నేహితులు, ఒంటిమిట్ట దేవాలయ ధర్మకర్త మహారాజ శ్రీ తిప్పన సుబ్బారెడ్డి గారు, గ్రామ మెజిస్ట్రేట్ మహారాజ శ్రీ ఆకేపాటి సుబ్బారెడ్డి గారు, గ్రామంలో కావలసినన్ని వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయించి, దేవాలయాన్ని అలంకరించి కార్యక్రమానికి సిద్ధం చేశారు. సమాచారం తెలుసుకున్న చుట్టు-పక్కల గ్రామ ప్రజలు కార్యక్రమం ఆరంభానికి ఒకరోజు ముందు కల్లా ఒంటిమిట్టకు రాసాగారు. మహాత్ముడైన బమ్మెర పోతన పేరు ఇప్పటికీ (అప్పటికీ) మండలంలో భక్తితో స్మరించబడుతుండం వల్ల, ఆ కవి పట్ట భద్రుడు ఎలాగైతే భాగవతాన్ని అర్పించాడో, అలానే ఎవరో శ్రీ కోదండరామస్వాముల వారికి శ్రీ రామాయణం సమర్పించేందుకు వస్తున్నారని విన్న వారందరు, భక్తి ఆవేశంతో-బాలోన్మత్త పిశాచగ్రస్తులలాగా "రామ-రామ" అంటూ, అన్ని వర్ణాల వారు, చుట్టు-పక్కల పది యోజనాల నుంచి వచ్చారు. అధమపక్షం అలా వచ్చిన వారి సంఖ్య అయిదు వేల పైనే వుంటుంది”.

“ఆహ్వానాలందుకుని వచ్చిన వారిలో చాలామంది గొప్ప కవులు, విద్వాంసులు, అధికారులు, పూజ్యులున్నారు. రాలేక పోయినవారిలో కొందరు గ్రంథావిష్కరణకు తమ ఆమోదం తెలుపుతూ ప్రత్యుత్తరమో-మాట మాత్రంగానో తెలియ పరిచారు. కొందరు సందేశాలను పంపారు. ఇలాంటి వారిలో రాజ శ్రీ రాయ బహదూర్ పి. అనంతాచార్యులవారు, విద్యా వినోద-విశారద-సి. ఐ. ఇ, మహామహోపాధ్యాయ బిరుదాంకితులు బ్రహ్మ శ్రీ కొక్కొండ వేంకటరత్నము పంతులు గారు, రస్సల్ కొండ డిప్యూటీ కలెక్టర్ మహారాజ శ్రీ జయంతి రామయ్య పంతులు గారు, గుంటూరు జిల్లా కోర్ట్ మునసబు వావిలాల శివావధానులు గారు, పిఠాపురం ప్రధానోపాధ్యాయుడు కూచి నరసింహము పంతులు గారు, వైజాగ్ వకీలు బి. యాజులు గారు, కర్ణాటక పండితులు బ్రహ్మ శ్రీ సిద్ధాంతి శివశంకర శాస్త్రి గారు ప్రముఖులు. చెన్నపురి కళాశాలలనుంచి ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజ సభ్యులు, కొందరు విద్యార్థులు వచ్చారు. పూర్వాచార పరాయణుడు-ప్రసిద్ధ పురాతన పుంగనూరు సంస్థాన ప్రభువు, మహారాజ రాజశ్రీ రాజా వీర బసవచిక్కరాయలు యశోవంత బహదూర్ గారు ఆయన సంస్థానంలోని దివాన్-పండితుడు బ్రహ్మ శ్రీ శేషప్ప శాస్త్రి గారిని, ఆస్థాన విద్వాంసుడు బ్రహ్మ శ్రీ వేంకటరామ శాస్త్రి గారిని పంపారు”.

“చెన్నపురి నుంచి శ్రీ శైలాద్దంకి సమయోద్దండ కోలాహల లక్ష్మీ నృసింహ కుమారేత్యాద్యభిజనవ్యపదేశ భాసురులు, అఖిల హరిదంతర విసృత్వర కవితా పరిమళ మహాకవిత్వోచిత సహృదయ సముదయ సాదర సమర్పిత కవిభూషణ బిరుద భూషణుడు, శ్రీమత్కుమార తాతా చార్యులు గారొచ్చారు. శ్రీ కాళహస్తి నుంచి ఆంధ్రీకృత మహాభారతులు, ఉభయ భాషా కవిత్వ తత్వజ్ఞులు బ్రహ్మ శ్రీ శత ఘంటము వేంకట రంగ శాస్త్రి గారొచ్చారు. వేంకటగిరి నుంచి కపిలాచిత్రకాయ ఉపాఖ్యానాది గ్రంథ కర్త శ్రీమదుభయ వేదాంత ప్రవర్తకులు శ్రీమత్కొమాండూరు శ్రీనివాసాచార్యులు గారు, తిరుపతి నుంచి చుళికీకృత సమస్తాంధ్ర గ్రంథులు-ఉభయ కవివయన్యులు బ్రహ్మ శ్రీ నాగ పూడి కుప్పుసామయ్య గారు వచ్చారు. ఉభయ వేదాంత ప్రవర్తకులు-పండితులు శ్రీమత్కమలాపురము రాఘవాచార్యులు గారు, గోపాలాచార్యులు గారు, తర్క వ్యాకరణ పారంగతులు సీతారామ శాస్త్రి గారు, శ్రీమదష్టావధానం నరసింహాచార్యులు గారు, పార్థసారథి సెట్టి గారు, కోటి రెడ్డి గారు, కె. చెంగయ్య గారి లాంటి కవులు, విద్వాంసులు అనేకమంది వచ్చారు. వచ్చిన వారంతా విద్యావంతులే. అనాహుతులై వచ్చిన వారిలోనూ పెక్కురు విద్యావంతులున్నారు. అపరిచితులైన వారి పేర్లను నమోదు చేసుకునే అవకాశం కలగలేదు”.

“కార్యక్రమం మూడు రోజులూ, ఉదయం, శ్రీ సీతారామచంద్రులకు సహస్రనామార్చన యథావిధిగా జరుపబడింది. మొదటిరోజు ఉదయాన సంస్కృత వాల్మీకి రామాయణం, ఆంధ్ర వాల్మీకి రామాయణం పుస్తకాలను శ్రీస్వామివారి పల్లకిలో వుంచి, ఆ పల్లకిని, రాయబహద్దర్ బ్రహ్మ శ్రీ హనుమంత గౌడ్ గారు, నెమలి సుబ్బరావు గారు, మల్లవరపు పెంచలార్య కవి గారు, కాకినాడ సరస్వతీ పత్రికాధిపతి బ్రహ్మ శ్రీ కొత్తపల్లి సూర్యారావు గారు-ఇతర ప్రముఖులు తమ భుజాలపై మోసారు. బ్రహ్మ శ్రీ కొత్తపల్లి పద్మనాభ శాస్త్రి గారు, బ్రహ్మ శ్రీ రాజ శ్రీ కూనపరాజు శేషాద్రి రావు గారు, ఛత్రం-చామర పట్టుకుని తోడురాగా, మంగళ వాద్యాలతో దేవాలయ గ్రామ ప్రదక్షిణగా వూరేగించారు. గ్రంథానికి పూజ చేసిన తర్వాత ముందున్న కొంత భాగాన్ని కవి చదివారు. ఒక్కరే మూడు దినాల్లో పూర్తి గ్రంథాన్ని చదవడం కష్టమని భావించి, చిలుకూరి కృష్ణమూర్తి గారు, వేంకట సుబ్బయ్య గారు, పద్మనాభ శాస్త్రి గారు, కోమాండూరు శ్రీనివాసాచార్యులు గారు, క్రొత్తపల్లి సూర్యారావు గారు, కూనపరాజు శేషాద్రి రావు గారు, కాళహస్తి శర్మ గారు తోడ్పడి పుస్తక పఠన పూర్తి చేశారు. మొదటిరోజు మధ్యాహ్నం దేవాలయ ముఖ మంటపంలో సభ జరిగింది. సీతారామ శాస్త్రి గారు, అష్టావధానం నరసింహాచార్యులు గారు, ఆర్కాట్ హనుమంతాచార్యులు గారు, అద్దంకి తాతాచార్యులు గారు, వాధూల శ్రీ వేంకట ప్రసన్న యోగీంద్ర స్వాముల (ధర్మకర్త) వారు, శ్రీ రామాయణం గురించి ఉపన్యసించారు. తెలుగు రాని బ్రహ్మ శ్రీ గోపాలసామయ్యర్ కూడా ఉపన్యసించారు”.

“రెండో రోజు మధ్యాహ్నం తిరిగి సభ జరిగింది. ఆహ్వాన సభా సభ్యుడు వి. వసంత రావు గారు సభ ఉద్దేశాన్ని, ఒంటిమిట్ట గ్రామ ప్రసిద్ధిని, కార్యక్రమ అపూర్వత్వాన్ని గురించి వివరించారు. ఆహ్వానితులకు స్వాగతం పలుకుతూ, (మూడు సీస పద్యాలు, ఒక ఉత్పలమాల, ఒక కవిరాజవిరాజితము) "స్వాగత పంచ రత్నాలు" చదివి వినిపించారు. అనంతరం సభాధ్యక్షుడు శ్రీమద్ధర్మవరము కృష్ణమాచార్యులు గారు ఆంధ్రా భాషా విషయాలను గురించి ఉపన్యసించి, సందేశాలను చదివి వినిపించి, గ్రంథోత్పత్తిని గురించి తెలుపమని కోరారు. "భక్తే ఈ గ్రంథ రచనకు కారణం" అని చెప్పిన నేను, ఈ విషయంలో శ్రీరామచంద్రుడు చేసిన సహాయం గురించి వివరించాను. ఆ తర్వాత సభాధ్యక్షుడు పండితులను ఉద్దేశించి, ఆంధ్ర వాల్మీకి రామాయణాన్ని, పరీక్షించవచ్చని కోరారు. అప్పటికప్పుడు కొందరడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగింది. చాలామంది పండితులు సభానంతరం వారి వసతి గృహాలకు గ్రంథాలను తీసుకొనిపోయి శోధించారు. ఆ రాత్రి పాదుకా పట్టాభిషేకం నాటకం ప్రదర్శించారు. వచ్చిన డబ్బులను దేవాలయానికి విరాళంగా ఇచ్చారు. పిండారబోసినట్లున్న పౌర్ణమి నాటి పండు వెన్నెలలో, నంజుండప్ప గారు, కమలాపురం రాఘవాచార్యులు గారు, నెమలి సుబ్బరావు గారు సీతా కల్యాణం హరి కథా కాలక్షేపం బోధించారు”.

“మూడో రోజు ఉదయం హిందూ మతం గురించి ఉపన్యాసాలయిన తర్వాత గ్రంథ పరీక్ష జరిగింది. పండితులందరూ వారి వారి సంతుష్టిని పద్యంగానో-ఉపన్యాసంగానో వెల్లడిచేసి, కృతిని ప్రశంసించి కవిని ఆశీర్వదించారు. పట్టాభిషేకం భాగం పఠనంతో, సభాధ్యక్షుడి ఉపన్యాసంతో సభ ముగిసింది. కనీ-వినీ ఎరుగని రీతిలో కార్యక్రమం ముగిసి, లోకులెల్లరు కొనియాడుతుంటే. శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం, కృతి భర్తైన ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి వారికి సమర్పించబడింది”.

“దిన త్రయం అన్నదానం జరిగింది. చిన్నా-పెద్దా తేడా లేకుండా అందరూ అందులో పాల్గొన్నారు. హేమా-హేమీలనుకునే వారు నడుం బిగించి వడ్డన చేశారు. వారందరికీ నా సాష్టాంగ నమస్కారాలు. అన్నదానానికి సహాయపడిన యాదాళ్ళ నాగమాంబ గారికి, శ్రీ వేంకట సుబ్బయ్య గారికి, శ్రీ యాదాళ్ల పాపయ్య సెట్టి గారికి, ఇతర పుణ్యాత్ములందరికి శ్రీరాముడు శాశ్వత సౌఖ్యాలను ఇచ్చుగాక”.

“కొక్కొండ వేంకటరత్నము పంతులు గారు "శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణ కృతి ప్రశంస" గా "రత్నావళి పద్య పంచక బహు కృతి" ని చేశారు. అలానే కవిభూషణ అద్దంకి కుమార తాతర్య గారు, నాగ పూడి కుప్పుసామయ్య గారు, వేంకట రంగ శాస్త్రి గారు, మల్లవరపు పెంచలార్య కవి గారు, కొమాండూరు శ్రీనివాసాచార్యులు గారు, నాధముని దాసు గారు పద్య రూపంలో ప్రశంసించగా ఇతరులు ఉపన్యాస రూపంగా ప్రశంసించారు. అలనాటి పత్రికల్లో ఈ కార్యక్రమాన్ని గురించి విశేషంగా వార్తలొచ్చాయి. ప్రశసింస్తూ ప్రసంగం చేసిన వారు-పద్యాలను చదివిన వారు, నన్ను బమ్మెర పోతనతో పోల్చారు”.- వావిలికొలను సుబ్బరావు

అలనాటి సభలో పండితుల ప్రశంసలు-చెన్నపురి "ఆంధ్ర ప్రకాశిక" ప్రచురించిన వార్త:

"మునుపు తెనుగు భాగవతము బమ్మెర పోతరాజు దనకిడె నిపు డిం పెనయ న్వావిలి కొలని సుబ్బరావిడియె నాంధ్రరామాయణమున్..." - కొక్కొండ వేంకటరత్నము పంతులు గారు

"ఆన్ధ్రవాల్మీకి బిరుదం సుబ్బరాయాయ దిత్సితమ్..." - అద్దంకి కుమార తాతార్యః

"...ఆంధ్రభాషను రచించితి వీవు తెలుంగువారి కింపై యెసలారు పల్కులను హారియశోలతకాలవాలమై" - నాగపూడి కుప్పుసామయ్య
"అలవాల్మీకి మహర్షి సంస్కృత.... ... మహాకావ్యమున్ లలితోక్తిం దెనిగించినాడవు బుధుల్ వర్ణించి మే లౌననన్" - వేంకటరంగ శాస్త్రి

"... మౌనికావ్యతత్త్వమ్మును గాండసప్తకము వాసు కవింబలె నిర్వహింపలేమి మ్మనమెల్ల నీసుజన మిత్రుని జెల్లెదె యాంధ్రవాల్మికాఖ్య మ్మనసార బిల్వ... " - మల్లవరపు పెంచలార్యకవి

"ఎనిమిది యేడులలోపల, ఘనమగు రామాయణాంధ్ర కావ్యమును రచించినమేటివి నీ వొక్కడ, వనఘా నిన్నెనయుసుకవుల వనిం గలరే" - శ్రీమత్కొమాండూరు శ్రీనివాసాచార్యులు

"ఈతడే బమ్మెర పోతనాఖ్యుం డన, భాగవతమునకు బ్రతి యనంగ నాంధ్రవాల్మీకి రామాయణకావ్యంబు, రామాంకితంబుగ వ్రాసె నిపుడు.... .... మనకు బమ్మెర పోతనామాత్యుడితడే, యనుచు బల్కితి నమ్ముడీ యార్యులార..." - నాథమునిదాసు

"ఘృతము, క్షీరము, శర్కర కల్పిన నెట్టులుండునో గ్రంథమంతయు నట్టిదిగా నున్నది. ఇట్టి మృదులమైన పాకము శయ్యతోడి యాంధ్రగ్రంథము నేనింతవరకు జూడలేదు" - సీతారామ శాస్త్రి

ఆంధ్ర వాల్మీకి రామాయణాన్ని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామికి అంకితమిచ్చిన కార్యక్రమ విశేషాలను "హూణ పత్రిక" లే కాకుండా కాకినాడకు చెందిన "ఆర్య మత బోధిని" లోను, బొంబాయి నుండి ప్రచురించబడే "ఆంధ్ర పత్రిక" లోను కూడా వివరంగా ప్రకటించబడింది.

"ఆంధ్ర ప్రకాశిక": 17-10-1908

కృతి సమర్పణము: - ఒంటిమెట్ట యనునది చిన్న పల్లెటూరు. కడపకును, నందలూరుకును మధ్యనున్నది. ఇచట శ్రీకోదండరామస్వామి దేవాలయము కలదు. ఏకశిలా నగరమని వాడబడు పవిత్ర స్థాన మిదియే. భగవత్కథామయంబగు భాగవతమును బోతనామాత్యు డాంధ్రీకరించి, తన్మహాగ్రంథమును నీ శ్రీరామచంద్రుని కే యంకితముజేసి కృతార్థుండయ్యెను.

"బాలరసాలసాల నవపల్లవ కోమలకావ్యకన్యకన్
గూళల కిచ్చి యప్పడుపు గూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికు లైననేమి గహనాంతరసీమల కందమూల కౌ
ద్దాలికు లైననేమి నిజ దారసుతోదర పోషణార్థమై"

యని పోతనామాత్యుడు తన దృఢాభినివేశమును విశదీకరించి, తన శ్రీమదాంధ్ర మహాభాగవతమును నరాంకితము సేయనొల్లక భగవదంకిత మొనర్చెను. భగవద్భక్తుడగు పోతనామాత్యుడొనర్చిన సత్కార్యమునే యనుసరించి, బ్రహ్మశ్రీ వావిలికొలను సుబ్బారావు గారు తమ యాంధ్రవాల్మీకి రామాయణమును గోదండ రామస్వామి కంకితమొనర్చిరి. ఈ కృతి సమర్పణ మహోత్సవము గడచిన 9, 10, 11 తేదీలలో నొంటిమెట్టయందు శ్రీ రామస్వామి ప్రత్యక్షమున నిరుపమానముగ నెరవేర్పబడెను. బ్రహ్మశ్రీ సుబ్బారావు గారు చెన్నపురి సర్వ కళాశాలయందు బ్రధానాంధ్రోపాధ్యాయులుగ నున్నారు. శ్రీ సుబ్బారావు గారు వాల్మీకి రామాయణమును యథావిధిగా నాంధ్రీకరించి, యాంధ్రాభాషాప్రపంచమునకు మహోపకారమొనర్చిరి. ఈ మహాకృతి సమర్పణోత్సవమునకు జాలమంది ప్రముఖులును, విద్యార్థులును విచ్చేసిరి. ధర్మవరము కృష్ణమాచార్యులు మొదలగువారు సమయానుకూలముగ బ్రసంగించిరి. డిప్యూటీ కలెక్టమరు మెII టి. వి. గోపాలస్వామి అయ్యర్ గారు కించిత్పరిజ్ఞానము గల తెనుగున నుపన్యసించిరి. బళ్లారి సరసవినోదినీ సభవారు పాదుకాపట్టాభిషేక నాటకమును జయప్రదముగ ప్రదర్శించిరి. ఆంధ్ర వాల్మీకి రామాయణము నుండి కొన్ని భాగములు చదువబడెను. ప్రతిదినమును నొకపండితుడు శ్రీకోదండరామస్వామి సమక్షమున నీనూతన గ్రంథమును బఠించుచుండెను. వచ్చినవారలకెల్ల సంతృప్తిగా విందు లొసంగ బడెను. ఇట్టి సంస్తవనీయం బగు కార్యమొనర్చిన బ్రహ్మశ్రీ ఆంధ్రవాల్మీకి సుబ్బారావు గారికి శ్రీరామచంద్రుం డాయురారోగ్యంబు లొసంగి మనుచుగాత. ఆంధ్రభాషా ప్రపంచమందు విలసిల్లిన నీ యాంధ్ర వాల్మీకి రామాయణమును గనులార జూచి, మనసార బఠించి, పట్టరాని ప్రమదంబున

"ఇమ్మహి మానుషాధముల కిచ్చిపురంబులు వాహనంబులున్
సొమ్ములు గొన్నిపుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే
సమ్మెటవ్రేటులం దినక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నే
మమ్మున సుబ్బరాయకవి మాన్యు డటంచు గవీంద్రు డెంచెడున్”

అని ప్రకటింప బడియున్నది.-- వావిలికొలను సుబ్బారావు


(ఒక అజ్ఞాత మహానుభావుడి ద్వారా "కాలిఫోర్నియా (అమెరికా) విశ్వ విద్యాలయం" కు చెందిన "బర్క్ లీ" గ్రంథాలయంలో చేరుకుని, "గూగుల్ సంస్థ" డిజిటలైజ్ చేసి నందువల్ల నాకంట పడిన వాసు దాసు-వావిలికొలను సుబ్బరావు- గారి అలనాటి "శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం" మొదటి సంపుటి- బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ కాండలు మూలం-చదివి అద్భుతమైన మానవాళి జనన-మరణ చక్రబంధం గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయమని ప్రార్థన)

http://books.google.com/books?id=jZMJAQAAIAAJ&printsec=frontcover&source=gbs_v2_summary_r&cad=0#v=onepage&q=&f=false

5 comments:

  1. అప్పటి విషయాలను పూసగ్రుచ్చినట్లుగా వివరించిన మీ బ్లాగు విషయాలను ఎక్కువమంది చదవటానికి వీలుగా కూడలి జల్లెడ మొదలైన సమూహాలకు లింకుచేయగలరు.
    తరువాత మీరు ఆంధ్ర వాల్మీకి రామాయణాంతర్గత ఛందోవివరాలను తెలియజేసే పుస్తకాన్నో వ్యాసాలనో తెలియపరుస్తానని అన్నారు. దానికోసం ఎంతో కుతూహలంతో ఎదురుచూస్తున్నాను. పూర్తయినవెంటనే పంపించగలరని ( e- మెయిలుద్వారా ) ఆశిస్తున్నాను.

    ReplyDelete
  2. దయతో word verification ను తీసివేయగలరు.
    మీ బ్లాగు settings లోనికి వెళ్ళి word verification ను disable చేయండి.

    ReplyDelete
  3. అయ్యా నమస్కారం.
    వంద సంవత్సరాల కింద ఏ మహానుభావుడు కాలిఫోర్నియాలోని గ్రంథాలయానికి వాసు దాసు గారి అలనాటి ఆంధ్ర వాల్మీకాన్ని చేర్చాడో తెలియదు గాని, దాన్ని డిజిటలైజ్ చేసినా గూగుల్ సంస్థను అభినందించాలి. తొమ్మిదొందల పేజీల ఆ గ్రంథంలోని ఆరంభ పేజీలలోని విషయాలను చదివితీరాల్సిందే. "ఒరిజినల్" చదివే తీరికా-ఓపికా లేని సాహితీ ప్రియులకు నేను చదివిన దానిని-అనుభవంతో రుచి చూసిన దానిని, తెలియచేసే ప్రయత్నమే ఇది. ఛందో ప్రయోగాల పుస్తకం పూర్తి కావాలంటే, కిష్కింధ కాండ దొరకాలి. మిగిఇన కాండలు అయిపోయాయి. అయితే ఇంకా తుది మెరుగులు దిద్దుతున్నాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత (మార్చ్ ఏడున) ఒక వారం రోజుల్లో పూర్తిచేయ గలుగుతానేమో. కాగానే బ్లాగ్ లో చేరుస్తాను.
    వర్డ్ వెరిఫికేషన్ తొలగించే ప్రయత్నం చేస్తాను.
    జ్వాలా నరసింహారావు వనం

    ReplyDelete
  4. వాసుదాసు గారి కిష్కింద కాండము మూలము నా దగ్గఱ ఉన్నది. వారి మందరము నాకింకా చేరలేదు. తణుకు వెళ్ళినపుడు దొరకవచ్చును. తణుకులో ఒక కాపీ మాత్రమే ఉందన్నారు. దాచి ఉంచమని చెప్పాను. వెళ్ళినపుడు తీసుకు రావాలి. నా దగ్గఱనున్న మూల ప్రతితో మీ కేవిధంగా నైనై e- మెయిలు ద్వారా సహాయపడగలిగితే చెప్పండి. తప్పకుండా సహాయపడతాను.

    ReplyDelete
  5. ధన్యవాదాలు.
    బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ కాండలు మూలం నాకు ఇన్‍టర్‍నెట్‍లో దొరికాయి. నేను రాయదల్చిన దానికి మందరం దొరికితే మేలు. కొన్ని రోజులు వేచి చూస్తాను. ఎలాగూ, బాల కాండ తుది మెరుగుల పని వుందింకా. బాల, అయోధ్య, సుందర కాండలనే (మందరం) ఇంతవరకు పూర్తిగా చదివాను. అరణ్య కాండ హైదరాబాద్ వెళ్లేలోపు చదవడం పూర్తి చేయాలన్న సంకల్పంతో ఇప్పటికి సగం చదవగలిగాను. ప్రస్తుతానికి అసంపూర్తిగా వున్న వీటితో పాటు, "జ్వాలా మ్యూజింగ్స్"-ప్రధమ భాగం పూర్తి చేసే కార్యక్రమంలో కూడా వున్నాను. శ్రీ రాముడి దయ వల్ల ఇవన్నీ జరుగుతాయని నమ్మకం. అన్నింటికన్నా మొదలు శ్రీరామాయణం ఎందుకు చదవాలని వాసుదాసు గారు వంద సంవత్సరాల క్రితం రాసిన దాన్ని సాహితీ మిత్రులకు లఘుకృతిలో అందించే పనిలో కూడా వున్నాను. దానికింకా మరో మూడు-నాలుగు రోజులు పట్టవచ్చు. ప్రస్తుతం కాలిఫోర్నియాకు వచ్చాను.
    జ్వాలా నరసింహా రావు

    ReplyDelete