Monday, October 11, 2021

కదంబ వంశం (బ్రాహ్మణ రాజులు-18) ...... (స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా) : వనం జ్వాలా నరసింహారావు

 కదంబ వంశం (బ్రాహ్మణ రాజులు-18)

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)

వనం జ్వాలా నరసింహారావు

           దక్షిణాపథ, దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధికెక్కిన రాజవంశాలలో కదంబ వంశం ఒకటి. ఈ వంశీయుల తొలి నివాసం తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్లాలో వున్న కందూరు గ్రామం. కందూరు చాళుక్యుల కాలంలో ప్రసిద్దికెక్కిన గిరి దుర్గం. కందూరునాడును కందూరు పట్టణంగా కూడా పిలవడం జరిగింది. తెలుగు చోడులలో ఒక శాఖవారు తెలంగాణాలోని నల్లగొండ, మహబూబ్ నగర్ మండలాలను, ఖమ్మం మండలంలోని నేలకొండపల్లి ప్రాంతాన్ని, కొలనుపాక, కోడూరు, కందూరు, వర్ధమానపురం, పానుగల్లు పట్టణాలను రాజధానులుగా చేసుకుని పాలించారు.

         కందూరులో పెద్ద సంఖ్యలో కదంబ వృక్షాలుండేవి. కదంబ వృక్షాల వల్ల మయూర శర్మ వంశానికి కదంబ వంశమని పేరు వచ్చింది. కదంబులు హారీత పుత్రులు. మానవ్యస గోత్రులు. వేదవేదాంగేతిహాస, కావ్య నాటక, అలంకార శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించారు. సకల సద్గుణ సంపన్నులు. వీరు బ్రాహ్మణులు. కందూరు గ్రామ వాస్తవ్యులు.

         కదంబ వంశంలో మయూర శర్మ జన్మించాడు. బ్రాహ్మణుడైన మయూర శర్మ పౌరుష ప్రతాపాలున్నవాడు. అతడు బ్రాహ్మణ్యాన్ని వీడకుండా క్షత్రియ ధర్మాన్ని అవలంభించి, బ్రహ్మక్షత్రతేజో భృతుడయ్యాడు. అతడు కాంచీ నగరాన్నుండి బయల్దేరి శ్రీ పర్వతారణ్యంలోని ఆటవిక జాతుల వారిని పురికొల్పి, తన సైన్యాన్ని చేర్చుకుని, వారికి సైనిక శిక్షణ ఇచ్చి, వీరులుగా తీర్చిదిద్దాడు. తన గ్రామంలోని, పరిసర గ్రామాలలోని స్నేహితులను సైన్యంలో చేర్చుకున్నాడు. అలా చేర్చుకున్న సైన్యంతో కలిసి మయూర శర్మ అనేక ప్రాంతాల మీద దండయాత్రలు నిర్వహించి విజయుడై, తన వంశం పేరుతో కదంబ రాజ్యాన్ని స్థాపించాడు. అతడి రాజ్యం క్రమేపీ అభివృద్ధి చెంద సాగింది. మయూర శర్మ పల్లవ రాజుల సామంతులుగా వున్న బృహద్బాణ రాజులను ఓడించాడు.

         మయూర శర్మ కదంబ రాజ్యాన్ని నిర్భీతిగా, ప్రశాంతంగా, ప్రజానురంజకంగా పాలించాడు. అతడు అష్టాదశ అశ్వమేధ యాగాలు చేశాడని అంటారు. పరశురాముడి లాంటి పరాక్రమవంతుడని అతడికి పేరు. మయూర శర్మ కాలంలో భారత దేశాన్ని పాలించిన అనేక రాజ వంశాల వారు బ్రాహ్మణులు. వారు క్షత్రియ ధర్మాన్ని అవలంభించి, బ్రాహ్మణత్వాన్ని వీడకుండా పరిపాలన చేశారు. ఆ రోజుల్లో క్షత్రియులు, బ్రాహ్మణుల మధ్య వైవాహిక సంబంధ బాంధవ్యాలు వుండేవి. మయూర శర్మ క్రీస్తుశకం 345 నుండి క్రీస్తుశకం 360 వరకు సుమారు 15 సంవత్సరాలు పాలించాడు.

         మయూర శర్మ మరణించిన తరువాత అతడి కుమారుడు కంగవర్మ కదంబ రాజ్య సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు సమర్థుడైన రాజు. ఇతడు సుమారు 25 సంవత్సరాలు వైభవంగా పాలించాడు. కంగవర్మ కుమారుడు భగీరధుడు క్రీస్తుశకం 385 లో రాజ్యానికి వచ్చి సుమారు 25 సంవత్సరాలు పాలించాడు. తండ్రి, తాతల లాగానే ఇతడు కూడా చక్కటి పాలన అందించాడు. భగీరధుడి పెద్ద కుమారుడు రఘువు క్రీస్తుశకం 410 లో రాజ్యానికి వచ్చి 15 సంవత్సరాలు పాలించాడు. ఇతడి పాలనా కాలం స్వర్ణయుగం అని పిల్వబడ్డది. రఘువు కదంబ రాజ్యాన్ని బలిష్టపర్చాడు. రఘువు తరువాత భగీరధుడి రెండవ కుమారుడు కకుత్స వర్మ రాజ్య పాలనా బాధ్యత వహించి ఇరుగు పొరుగు రాజులతో, రాజ వంశాల వారితో చక్కటి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పాడు. కకుత్స వర్మ గొప్ప వీరుడు. ఇతడు క్రీస్తుశకం 425 నుండి సుమారు 25 సంవత్సరాలు పాలించాడు.

         కకుత్స వర్మ పెద్ద కుమారుడు శాంతి వర్మ క్రీస్తుశకం 450 లో అధికారంలోకి వచ్చాడు. ఇతడు శత్రు భయంకరుడు. అనేక రాజ్యాలను జయించి విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇతడి పాలనా కాలం సుమారు 25 సంవత్సరాలు. కకుత్స వర్మ రెండవ కుమారుడు కృష్ణ వర్మ, శాంతి వర్మ తరువాత రాజయ్యాడు. కృష్ణ వర్మ కుమారుడు విష్ణు వర్మ తండ్రి మరణానంతరం కదంబ రాజ్య పాలనా బాధ్యతలు స్వీకరించాడు. ఇతడు పల్లవుల ధాటికి తట్టుకోలేక వారికి సామంతుడిగా వుండిపోయాడు. శాంతి వర్మ కుమారుడు మృగేశ వర్మ కదంబ రాజ్య పాలనా బాధ్యతను క్రీస్తుశకం 470 లో స్వీకరించి సుమారు 18 సంవత్సరాలు పాలించాడు. ఇతడు సకల విద్యలలో నిష్ణాతుడు. పల్లవ రాజ్యం మీద దండయాత్రలు చేసి విజయం సాధించి, కదంబ వంశ ప్రతిష్టను ఇనుమడింప చేశాడు.

         మృగేశ వర్మ కుమారుడు రవి వర్మ క్రీస్తుశకం 488 లో కదంబ రాజ్య పాలనా బాధ్యతలు వహించాడు. రవి వర్మ బలసంపన్నుడు. తన జ్ఞాతి అయిన విష్ణు వర్మ పల్లవుల సామంతుడు కావడం సహించలేక, అతడి రాజ్యం మీద దండయాత్రలు చేశాడు. పల్లవులు విష్ణు వర్మకు సైన్య సహాయం చేశారు. అయినప్పటికీ యుద్ధంలో విష్ణు వర్మ, రవి వర్మ చేతిలో చనిపోయాడు. రవి వర్మ పట్టుదల కలవాడు. విష్ణు వర్మకు సహకరించిన పల్లవుల మీద దండయాత్ర చేసి వారిని ఓడించాడు. చివరకు అఖండ కదంబ రాజ్య పాలకుడు అయ్యాడు. రవివర్మ 60 సంవత్సరాలు పాలించాడు.

         రవి వర్మ తరువాత అతడి కుమారుడు హరి వర్మ క్రీస్తుశకం 538 లో కదంబ రాజ్య సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు శాంతి కాముకుడు. ఇతడి పాలనా కాలంలో మొదటి పులకేశి విజృంభించి, కదంబ రాజ్యంలోని అనేక భాగాలను జయించాడు. హరివర్మ అతడిని ఎదిరించలేక మిగిలిన భూభాగాలను 12 సంవత్సరాలు పాలించాడు. ఇతడితో కదంబ వంశం ప్రధాన శాఖ అంతరించింది.

         ఇదిలా వుండగా కృష్ణ వర్మ సంతతి వారిలో విష్ణు వర్మ కుమారుడు సింహ వర్మ పల్లవుల సహాయంతో రాజ్యాన్ని తిరిగి సంపాదించాడు. అతడి వంశీయులలో రెండవ కృష్ణ వర్మ, మాంద్రాత్రి వర్మ, అజ వర్మ, భోగి వర్మ కదంబ రాజ్యాన్ని పాలించారు. అజ వర్మ, భోగి వర్మల కాలంలో కదంబ రాజ్య వంశం పూర్తిగా అంతరించి పోయింది.  

Sunday, October 10, 2021

సగర చక్రవర్తి వృత్తాంతం ...... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-76 : వనం జ్వాలా నరసింహారావు

 సగర చక్రవర్తి వృత్తాంతం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-76

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (12-10-2021)

ఇంతవరకిలా చెప్పిన విశ్వామిత్రుడు, అంటున్నాడీవిధంగా: "పూర్వ కాలంలో మిక్కిలిశూరుడు-సత్కార్యాలుచేయడంలో ఆసక్తున్నవాడు, ప్రజలను పాలించడానికి సంతోషించేవాడు, కీర్తిమంతుడైన సగరుడు, అయోధ్యకు చక్రవర్తిగా వుండేవాడు. తనకు కొడుకుల్లేరని చింతించిన సగరుడు, పవిత్ర నడవడిగలిగిన-మంచిగుణాలున్న ఒక్క కొడుకైనా పుట్టలేదేనని బాధపడుతుండే వాడు. మహా తేజోవంతుడైన ఆ సగరుడికి ఇద్దరు భార్యలు. పుణ్యకార్యాలందు ఆసక్తిగలది-నిత్య సత్రవ్రతైన విదర్భ రాజు కూతురు కేశిని సగరుడి పెద్ద భార్య. మిక్కిలి చక్కనైన అరిష్టనేమి కూతురు సుమతి ఆయన చిన్నభార్య. సౌందర్యంలో అశ్వినీ సుతులతో సమానమైన సగరుడు భృగు ప్రస్రవణమనే పెరున్న పర్వతంపైన వందేళ్లు తపస్సు చేశాడు. విష్ణు తేజమున్న ఆయన కప్పుడు భృగుడు ప్రత్యక్షమై, ఆనందభాష్పాలు రాలుస్తూ తన్నే చూస్తున్న సగరుడికి రెండు వరాలిచ్చాడు. ఆయనకు ఎంతోమంది కుమారులు కలుగుతారని, ఆయన కీర్తికూడా లోకమంతా వ్యాపిస్తుందని, ఇద్దరుభార్యలలో ఒకామెకు వంశోద్ధారకుడైన ఒక్కడేకొడుకు పుట్తాడని,ఇంకొకామెకు అరవైవేలమంది జన్మిస్తారని చెప్పాడు భృగుడు. తమలో ఒక్కకొడుకెవరికి పుడ్తాడనీ-అరవేలమంది ఎవరికి పుడ్తారనీ ప్రశ్నించిన ఆయన భార్యలతో, ఎవరెట్లా కోరుకుంటే అలానే జరుగుతుందని జవాబిస్తాడు భృగుడు. ఎవరికేవిధంగా కావాల్నో అడగమనికూడా అంటాడాయన వారితో. వంశ ప్రతిష్ఠాపకుడైన ఒక్క కొడుకే తనకు కావాలని కేశిని కోరగా, బహు పుత్రులు కావాలని సుమతి కోరింది. అలా వరాలు పొందిన సగరుడు భార్యలతో అయోధ్యకు పోయాడు. కొంతకాలం తర్వాత ఆయన భార్యలు గర్భం ధరించారు".

"కమలాలలాంటి కళ్లున్న కేశిని ఒక కుమారుడిని కనగా, రెండో భార్య సుమతి గుండ్రని గర్భ పిండం పగలతీసుకుని అరవైవేలమంది శిశువులు జన్మించారు. కేశిని తన కుమారుడికి ’అసమంజుడు’ అనే పేరుపెట్టింది.పిల్లలందరికి యవ్వనంవచ్చి,అందంగా విహరించే వారయ్యేంతవరకు, ఒక్కొక్కరిని ఒక్కొక్క నేతి కుండలో వుంచి దాదులు నేర్పుతో చాలాకాలం పెంచారు. పెద్దభార్య కొడుకైన అసమంజుడు ఊళ్లోవున్న పిల్లల్ని చంపడం అలవాటుగా చేసుకున్నాడు. సాహసవంతుడైన అసమంజుడు వాళ్లను తీసుకునిపోయి, సరయూనది ప్రవాహంలోపడేసి, వాళ్లు నీళ్లల్లో మునుగుతూ-తేలుతూ కొట్టుకుంటుంటే, ఒడ్డుపైనుండి నవ్వుతూ వేడుక చూస్తుండేవాడు. పాప కార్యమనుకోకుండా వాడలా సుజనులకు కీడు చేయడాన్ని సహించని సగరుడు, జనాల మేలుకోరి, ధర్మంగా, దాక్షిణ్యం చూపకుండా, అసమంజుడిని అడవులకు వెళ్లగొట్టాడు. అసమంజుడి కొడుకు అంశుమంతుడు న్యాయవాదై-సమస్త ప్రజల మేలుకోరే వాడయ్యాడు. ఆ సమయంలో యజ్ఞం చేయాలన్న సంకల్పం కలిగింది సగరుడికి".

(తనకు జ్యేష్ఠ భార్యవలన కలిగిన జ్యేష్ఠ పుత్రుడైన అసమంజుడిని అడవులకు పంపడం ఎంతవరకు సమంజసమన్న ధర్మ సందేహం కలగొచ్చు. ఇది శాస్త్ర సమ్మతమేనా-కాదా అన్న సందేహమూ కలగొచ్చు. పున్నామ నరకాన్నుండి కాపాడేవాడు పుత్రుడే కదా ! ఒకడికి నలుగురు కొడుకులుంటే ఆ పని చేసేవాడెవరు? నిస్సందేహంగా జ్యేష్ఠ పుత్రుడే. పెద్దకొడుకు పుట్టగానే మనిషి పుత్రవంతుడు అని పిలువబడతాడు. దాంతో పితృల ఋణం తీరిపోతుంది. తనకూ పున్నామ నరక బాధ తప్పుతుంది. ఏ జ్యేష్ఠ పుత్రుడు పుట్టగానే మనిషి పితృల ఋణాన్నుండి ముక్తుడవుతాడో-ఏ జ్యేష్ఠ పుత్రుడి వల్ల మోక్షం పొందుతాడో, వాడొక్కడే ధర్మ శాస్త్రం ప్రకారం పుట్టిన పుత్రుడు. మిగిలిన వారందరినీ ’కామజులు’ అంటారని మునులు చెప్తారు. దీని ప్రకారం సగరుడు పెద్ద కొడుకైన అసమంజుడిని అడవులకు పంపకూడదు. అయితే రామాయణంలో, జ్యేష్ఠ పుత్రుడు గుణవంతుడైతేనే పుత్ర గౌరవానికి యోగ్యుడవుతాడుగాని, కాకపోతే అయోగ్యుడేనని చెప్పబడింది. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే అయోధ్య కాండలో ఒకానొక చోట ఈ విషయాన్ని తెలియచేస్తాడు. బ్రాహ్మణుడు బ్రాహ్మణ కర్మను, క్షత్రియుడు క్షత్రియ కర్మను, వైశ్యుడు వైశ్య కర్మను నెరవేర్చకపోతే పతితుడవితాడని గౌతముడంటాడు. తల్లి తప్ప పతితులైన వారందరూ వదలాల్సిన వారే-గురువైనా, పుత్రుడైనా, సోదరులైనా, సఖుడైనా, సంబంధులైనా, చుట్టాలైనా, శిశ్యులైనా, సేవకులైనా- వదలాల్సిన వారే. అలా చేయకపోతే మహా దోషం వస్తుందని శాస్త్రం చెప్తుంది. రాజుకు ముఖ్య ధర్మం ప్రజా పాలన-సగరుడదే చేశాడు. ఇదంతా ఇలా వుంటే, సగరుడు వెళ్లగొట్టిన అసమంజుడు, మనదేశం వదిలి, ఈజిప్ట్ వెళ్లి ఆ దేశానికి ప్రభువయ్యాడని చరిత్ర కారుడు బి. దాస్ తన "Indo-Egyptian History" అనే పుస్తకంలో రాసాడు). 

వంగ రాజ్య వంశం (బ్రాహ్మణ రాజులు-17) ...... (స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా) : వనం జ్వాలా నరసింహారావు

 వంగ రాజ్య వంశం (బ్రాహ్మణ రాజులు-17)

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)

వనం జ్వాలా నరసింహారావు  

           గుప్త సామ్రాజ్య పతనానంతరం వంగ దేశంలో ఒక స్వతంత్ర రాజ్యం ఆవిర్భవించింది. ఈ రాజ్యం మొదట్లో దక్షిణ, పశ్చిమ ప్రాగ్భాగాలలో విస్తరించింది. క్రీస్తుశకం ఆరవ శతాబ్ది ప్రథమార్థంలో స్వతంత్ర వంగ రాజ్యం నెలకొల్పబడింది. వంగ రాజ్యానికి సంబంధించిన తొలి ముగ్గురు రాజులు గోపచంద్రుడు, ధర్మాదిత్యుడు, సమాచారదేవుడు. వీరి సమగ్ర సమాచారం లభ్యం కావడం లేదు. ఈ ముగ్గురు రాజులలో సమాచారదేవుడు ప్రకటించిన బంగారు నాణేలు కనుగొనబడ్డాయి. శాసనాలలో ఈ రాజులు మహారాజాదిరాజులుగా వర్ణించబడ్డారు. వైశ్యగుప్తుడు, గోపచంద్రుడు వేయించిన శాసనాలలో విజయసేనుడి ప్రశంస వున్నది. విజయసేనుడు వైశ్యగుప్తుడి సామంతుడు. వైశ్యగుప్తుడి తరువాత వంగ దేశంలో గుప్త చక్రవర్తుల పరిపాలన అంతరించిపోయింది. క్రీస్తుశకం 507 లో గోపచంద్రుడు స్వతంత్ర రాజ్యం నెలకొల్పాడు.

         క్రీస్తుశకం 543 వరకు గుప్త చక్రవర్తుల అధికారం ఉత్తర వంగ దేశంలో చెల్లుతుండేది. గోపచంద్రుడు వంగ దేశాన్ని క్రీస్తుశకం 507 నుండి క్రీస్తుశకం 525 వరకు స్వతంత్రంగా పాలించాడు. గోపచంద్రుడి తరువాత ధర్మాదిత్య, సమాచారదేవులు వంగ దేశాన్ని పాలించారు. సమాచారదేవుడు 14 సంవత్సరాలు పాలించాడు. మొత్తంమీద గోపచంద్రుడు, ధర్మాదిత్యుడు, సమాచారదేవుడు కలిపి క్రీస్తుశకం 507 నుండి క్రీస్తుశకం 575 వరకు వంగ రాజ్యాన్ని ఏలారు.

         బాదామీచాళుక్య చక్రవర్తి కీర్తివర్మ, టిబెట్ రాజు స్రోన్బట్సన్ దండయాత్రల వల్ల వంగ రాజ్యం పతనమై పోయింది. వంగ రాజ్యం వంగ, గౌడ రాజ్యాలుగా విభజించబడింది. గౌడ దేశం ఉత్తర, పశ్చిమ వంగ దేశ భాగాలుగా వ్యాపించి వుండేది. దక్షిణ, తూర్పు భాగాలు వంగ దేశంగా పరిగణించబడేవి. వంగ దేశ ప్రాచీన నామం సమతత. మహాసేన గుప్తుడి చివరి రాజ్య సంవత్సరాలలో గౌడ దేశంలో శశాంకుడు పాలనా బాధ్యత వహించి స్వతంత్ర రాజ్యాన్ని స్తాపించాడు. శశాంకుడు మహాసేన గుప్తుడి సోదరుడి కొడుకు. శశాంకుడి రాజధాని కనక సువర్ణపురం. మార్షిదాబాద్ జిల్లాలోని బెర్హంపూర్ కు 10 కిలోమీటర్ల దూరంలో వున్న రాంగామాట శిధిలాలు పూర్వం కనక సువర్ణపురివై వుండవచ్చు.

         మాణ వంశీయులు శశాంకుడికి పూర్వం వంగ దేశంలోని పర్వత ప్రాంతాలను పాలించారు. వీరి రాజ్యం మిడ్నాపూర్, గయల దాకా విస్తరించి వుండేది. వీరు కళింగం దాకా తమ రాజ్యాన్ని వ్యాపింప చేసుకున్నారు. శంభుయశనుడు ఈ వంశీయుడు. క్రీస్తుశకం 580 నుండి క్రీస్తుశకం 603 వరకు 23 సంవత్సరాలు కళింగ దేశాన్ని పాలించాడు. శశాంకుడు ఇతడిని ఓడించి అతడికి చెందిన కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు.

         శైలోద్భవ వంశీయులు కొంగోద రాజ్యాన్ని పాలిస్తూ క్రీస్తుశకం 619 వరకు శశాంకుడి సామంతులుగా వున్నారు. తరువాత స్వతంత్రులయ్యారు. శశాంకుడు గౌడ దేశాన్ని మహేంద్రగిరి దాకా విస్తరించాడు. ఉత్తర మగథ భూభాగాలను స్వాధీనపర్చుకున్నాడు. కనోజి పాలకుడు గృహవర్మ మౌఖరి వంశీయుడు. మౌఖరి ఈశానవర్మ కాలం నుండి గౌడులు మౌఖరులతో శత్రుత్వం కలిగి వుండేవారు. మాళవ గుప్త రాజులకు మౌఖరులకు బద్ధ వైరం. కాబట్టి శశాంకుడు దేవగుప్తుడితో స్నేహం చేసుకున్నాడు.

         శశాంకుడు క్రీస్తుశకం 637-638 వరకు మగథను పాలించినట్లు ఆధారాలున్నాయి. శశాంకుడు వంగ దేశ ప్రథమ స్వతంత్ర ప్రభువు. అతడు గౌడ రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా రూపొందించడమే కాకుండా దక్షిణ అంగ, కళింగ దేశాలను జయించి ప్రబల శక్తి సమన్వితమైన రాజుగా కీర్తి వహించాడు.      

Saturday, October 9, 2021

 తెలుగువారి మక్కువ చూరగొన్న తిక్కన పద్యరత్నం

ఆస్వాదన-41

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (10-10-2021)

ద్రౌపదీదేవి సౌందర్యాన్ని రకరకాలుగా పొగుడుతూ ఆమెనుద్దేశించి ఎన్నో రెచ్చగొట్టే మాటలంటాడు కీచకుడు. ఆమె నవ్వుతే ఏం పోతుందనీ, నోరు విప్పి మాట్లాడితే ఏం ఒలికిపోతుందనీ, ఆమె మనసులోని సరసత్వం వెల్లడి చేస్తే ఏం పోతుందనీ అధముడైన కీచకుడు ఆమెను సమీపిస్తాడు. ఆమె మాటలు వినాలని ముచ్చటపడతాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుందామని భావిస్తాడు. తన ప్రేమను ఆమెకు తెలియచేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తాడు.

ద్రౌపది తన వైముఖ్యాన్ని, అనాదరాన్ని అతడి మాటలు విన్నా విననట్లు నటించడం ద్వారా వ్యక్తం చేసింది. ద్రౌపదీదేవికి విపరీతమైన కోపం వచ్చినప్పటికీ, దాన్ని బయటకు పోక్కనీయకుండా, తనను తాను నిగ్రహించుకుని, నేర్పుగా తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే కీచకుడు ఆమె మాటలను వినిపించుకోకుండా, లక్ష్యపెట్టక, ‘మన్మథ బాణాల తాకిడికి ఓర్చుకోలేక పోతున్నాను’ అని అన్నాడో, అప్పుడు ద్రౌపది కోపం పెరిగిపోయింది. నీచుడైన కీచకుడిని భయపెట్టాలని గట్టిగా చెప్పింది. అప్పుడు తిక్కన ద్రౌపది నోట పలికించడానికి రాసిన పద్యం:

శా: దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫుర

ద్గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్

గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దోర్లీలన్ వెసంగిట్టి గం

ధర్వుల్ మానము బ్రాణముం గొనుట తధ్యం బెమ్మెయిం గీచకా!

వారించడానికి వీలులేని భుజబల పరాక్రమం గలిగిన గర్విష్టులైన శత్రువుల నవలీలగా వధించే విద్యలో ప్రవీణులని ప్రఖ్యాతిగాంచిన ఐదుగురు గంధర్వులు తన భర్తలని, వారు ఇప్పుడే అవలీలగా కీచకుడి ప్రాణాలను హరిస్తారు సుమా! అని హెచ్చరిస్తుంది ద్రౌపది. 

దీన్ని విశ్లేషిస్తూ డాక్టర్ ఆర్ అనంత పద్మనాభరావు గారు ఇలా రాశారు: “తిక్కన భారత రచనలో తెలుగువారి మక్కువ చూరగొన్న పద్య రత్నాలలో ఇది ఒకటి. తిక్కన తన రచనకు తానే మురిసిపోయి, విరాట పర్వంలోని ఇదే ఆశ్వాసంలో మరోసారి ద్రౌపది నోట పలికించిన పద్యం ఇది. అ ఆవిధంగా తిక్కన ఈ పద్యం మీద వున్న అభిమానాన్ని ప్రకటించుకున్నారు. ఇలా తిక్కన పునరావృత్తి చేసిన రెండు-మూడు పద్యాలలో ఇదొకటి. అదే దీని ఘనత!”.  

రెండో పర్యాయం ఈ పద్యం రాసినప్పుడు దీన్ని విశ్లేషిస్తూ డాక్టర్ ఆర్ అనంత పద్మనాభరావు గారు ఇలా రాశారు: “రెండవసారి ఇదే పద్యాన్ని ద్రౌపది నోటి వెంట రావడానికి కారణం వేరే వుంది. ఈ సారి, కీచకుడి ముందు పాండవ ప్రతాపాన్ని కీర్తించిన పద్ధతిని భీముడికి తెలియచెప్పడమే కాకుండా, తాను వాడితో అన్న ఆ మాటలు నిజం చేయమని, చేయాల్సిన అవసరం వచ్చిందని, భీముడికి పరోక్షంగా సూచించడానికి అదే పద్యాన్ని, అవే మాటలతో తు-చ తప్పకుండా పునరుక్తం చేయడం జరిగింది. ఇక ముందు భీముడు కీచకవధ ప్రయత్నం చేస్తాడని, అందులో దుర్వార ఉద్యమం, బాహు విక్రమం, గర్వాంధ ప్రతివీరనిర్మథన విద్యా ప్రదర్శనం అనే దశలు స్ఫురిస్తాయి”.     

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, విరాటపర్వం, ద్వితీయాశ్వాసం  

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

Wednesday, October 6, 2021

మౌఖరి వంశం (బ్రాహ్మణ రాజులు-16) ....... (స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా) : వనం జ్వాలా నరసింహారావు

మౌఖరి వంశం (బ్రాహ్మణ రాజులు-16)

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)

వనం జ్వాలా నరసింహారావు  

           భారత దేశంలోని ప్రాచీన రాజ వంశాలలో మౌఖరి వంశం కూడా ఒకటి. మహాభారతంలో మద్ర దేశాధీశుడు, అశ్వపతి వంశీయుడు, మౌఖరులు ఈ ఆశ్వపతి వంశానికి చెందిన వారు. వీరు గొప్ప రాజ్యాన్ని నెలకొల్పి పాలించారు. మద్రదేశం నేటి పంజాబ్ లోనిది. ఆశ్వపతులు ఈ ప్రాంత పాలకులు. మౌఖరి వంశీయులు ఉత్తర హిందూ దేశమంతా వ్యాపించారు. క్రీస్తుశకం ఆరవ శతాబ్దంలో గయ ప్రాంతాన వీరి పాలన కొనసాగింది. గయ జిల్లాలోని నాగార్జునికొండ, బరబరా కొండలలో ఈ వంశానికి చెందిన శాసనాలలు లభించాయి. ఈ వంశానికి చెందిన ముగ్గురు రాజులు యజ్ఞవర్మ, శార్దూలవర్మ, అనంత వర్మలు గుప్త చక్రవర్తుల సామంతులుగా వ్యవహరించారు.

         మౌఖరి వంశానికి ఆద్యుడు యజ్ఞవర్మ గుప్త చక్రవర్తులకు సామంతుడిగా వ్యవహరించాడు. విదేయ సామంతుడిగా గుప్త రాజుల శత్రువులతో పోరాడి విజయాలు సాధించాడు. ఇతడి పాలనా కాలం క్రీస్తుశకం 501-520. సుమారు 19 సంవత్సరాలు. యజ్ఞవర్మ అనంతరం శార్దూల వర్మ మౌఖరి సామంత రాజ్యాధిపత్యం స్వీకరించాడు. శార్దూల వర్మ గుప్త రాజులతో చక్కటి సంబంధాలు కలిగి వున్నాడు. శార్దూల వర్మ క్రీస్తుశకం 520 నుండి క్ర్ఫీస్తుశకం 535 వరకు 15 సంవత్సరాలు పాలించాడు. మౌఖరి వంశ రాజులలో అనంత వర్మ మూడవవాడు. ఇతడు తన సామంత రాజ్యాన్ని క్రీస్తుశకం 535 నుండి క్రీస్తుశకం 550 వరకు సుమారు 15 సంవత్సరాలు పాలించాడు.

         మౌఖరి వంశంలో రెండవ శాఖ వారు శక్తిమంతులు. బలపరాక్రమ సంపన్నులు. వీరు గొప్ప రాజ్యాలను స్థాపించారు. మౌఖరి వంశీయుల రాజ్యం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపించింది. మౌఖరి వంశంలో నాల్గవ రాజైన ఈశానవర్మ సామంత రాజ్యాదిపత్యం వహించిన తరువాత ఈ వంశీయుల అభ్యుదయం ఉన్నత శిఖరాలను అధిరోహించింది. ఈశానవర్మ కుమారుడు శర్వవర్మ. విష్ణుకుండిన ఇంద్రభట్టారకుడు శర్వవర్మకు తన కుమార్తె ఇంద్రభట్టారికను ఇచ్చి వివాహం చేసి, రెండు రాజ్యాలు సఖ్యంగా వుండడానికి తోడ్పడ్డాడు. మౌఖరి రాజ్యాన్ని విస్తృత పరచాలాన్న ఆశయంతో ఈశానవర్మ అంగరాజ్యాన్ని జయించి, ముందుకు సాగాడు. ఈశానవర్మ అపరిమిత సైన్యసంపద కలవాడు. మౌఖరి రాజులలో ఈశానవర్మ కడు సమర్థుడు. స్వతంత్ర రాజ్య స్థాపకుడు. గుప్తరాజులు వారి పూర్వ వైభవాన్ని పునరుద్ధరించాలని భావించి, సైన్యాన్ని పెంపొందించుకొని మౌఖరి ఈశానవర్మను ఎదిరించారు. ఈశానవర్మ పోరాడినా లాభం లేకపోయింది. అపజయం పొందాడు. అపరిమిత సైన్యంతో అనేక దేశాలను జయించి, మౌఖరి వంశ ప్రతిష్టను ఇనిమడింప చేసిన ఈశానవర్మ భారతదేశ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి, క్రీస్తుశకం 550 నుండి క్రీస్తుశకం 576 వరకు 26 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు.

         మౌఖరి ఈశానవర్మ కుమారుడు శర్వవర్మ తండ్రి అనంతరం రాజ్యాదిపత్యాన్ని వహించాడు. ఇతడు రాజకీయ దురంధరుడు. అపరిమిత బలసంపన్నుడు. అజేయుడు. ఇతడు తన కుమారుడితో కలిసి యుద్ధం చేసి మగథ రాజ్యాన్ని ఆక్రమించాడు. శర్వవర్మ తండ్రితో కలిసి హూణులతో యుద్ధాలు చేసి విజయాలు సాధించారు. శర్వవర్మ కొద్దికాలం (క్రీస్తుశకం 576-580) మాత్రమే పాలించాడు. మౌఖరి శర్వవర్మ కుమారుడు అనంతవర్మ (అవంతీవర్మ) ఆ తరువాత రాజ్యానికి వచ్చాడు. ఇతడు కూడా అసాధారణ ప్రజ్ఞావంతుడు. మౌఖరి వంశీయులలో గర్వించదగ్గ వ్యక్తి. అవంతీవర్మ తరువాత అతడి కుమారుడు గృహవర్మ మౌఖరి రాజ్యాధిపతి అయ్యాడు. ఇతడి పాలనాకాలం క్రీస్తుశకం 600 నుండి క్రీస్తుశకం 606. గృహవర్మ మరణానంతరం అతడి సోదరుడు మౌఖరి రాజ్య పాలనా బాధ్యత వహించాడు. ఈశానవర్మ వంశ చరిత్ర ఇంతటితో ముగిసింది.

         క్రీస్తుశకం 7 వ శతాబ్ది ప్రథమ పాదం వరకు మౌఖరి వంశేయులు గొప్ప రాజులుగా కీర్తించబడి వైభవోపేతంగా పాలించారు.