Saturday, October 9, 2021

 తెలుగువారి మక్కువ చూరగొన్న తిక్కన పద్యరత్నం

ఆస్వాదన-41

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (10-10-2021)

ద్రౌపదీదేవి సౌందర్యాన్ని రకరకాలుగా పొగుడుతూ ఆమెనుద్దేశించి ఎన్నో రెచ్చగొట్టే మాటలంటాడు కీచకుడు. ఆమె నవ్వుతే ఏం పోతుందనీ, నోరు విప్పి మాట్లాడితే ఏం ఒలికిపోతుందనీ, ఆమె మనసులోని సరసత్వం వెల్లడి చేస్తే ఏం పోతుందనీ అధముడైన కీచకుడు ఆమెను సమీపిస్తాడు. ఆమె మాటలు వినాలని ముచ్చటపడతాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుందామని భావిస్తాడు. తన ప్రేమను ఆమెకు తెలియచేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తాడు.

ద్రౌపది తన వైముఖ్యాన్ని, అనాదరాన్ని అతడి మాటలు విన్నా విననట్లు నటించడం ద్వారా వ్యక్తం చేసింది. ద్రౌపదీదేవికి విపరీతమైన కోపం వచ్చినప్పటికీ, దాన్ని బయటకు పోక్కనీయకుండా, తనను తాను నిగ్రహించుకుని, నేర్పుగా తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే కీచకుడు ఆమె మాటలను వినిపించుకోకుండా, లక్ష్యపెట్టక, ‘మన్మథ బాణాల తాకిడికి ఓర్చుకోలేక పోతున్నాను అని అన్నాడో, అప్పుడు ద్రౌపది కోపం పెరిగిపోయింది. నీచుడైన కీచకుడిని భయపెట్టాలని గట్టిగా చెప్పింది. అప్పుడు తిక్కన ద్రౌపది నోట పలికించడానికి రాసిన పద్యం:

శా: దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫుర

ద్గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్

గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దోర్లీలన్ వెసంగిట్టి గం

ధర్వుల్ మానము బ్రాణముం గొనుట తధ్యం బెమ్మెయిం గీచకా!

వారించడానికి వీలులేని భుజబల పరాక్రమం గలిగిన గర్విష్టులైన శత్రువుల నవలీలగా వధించే విద్యలో ప్రవీణులని ప్రఖ్యాతిగాంచిన ఐదుగురు గంధర్వులు తన భర్తలని, వారు ఇప్పుడే అవలీలగా కీచకుడి ప్రాణాలను హరిస్తారు సుమా! అని హెచ్చరిస్తుంది ద్రౌపది. 

దీన్ని విశ్లేషిస్తూ డాక్టర్ ఆర్ అనంత పద్మనాభరావు గారు ఇలా రాశారు: “తిక్కన భారత రచనలో తెలుగువారి మక్కువ చూరగొన్న పద్య రత్నాలలో ఇది ఒకటి. తిక్కన తన రచనకు తానే మురిసిపోయి, విరాట పర్వంలోని ఇదే ఆశ్వాసంలో మరోసారి ద్రౌపది నోట పలికించిన పద్యం ఇది. అ ఆవిధంగా తిక్కన ఈ పద్యం మీద వున్న అభిమానాన్ని ప్రకటించుకున్నారు. ఇలా తిక్కన పునరావృత్తి చేసిన రెండు-మూడు పద్యాలలో ఇదొకటి. అదే దీని ఘనత!”.  

రెండో పర్యాయం ఈ పద్యం రాసినప్పుడు దీన్ని విశ్లేషిస్తూ డాక్టర్ ఆర్ అనంత పద్మనాభరావు గారు ఇలా రాశారు: “రెండవసారి ఇదే పద్యాన్ని ద్రౌపది నోటి వెంట రావడానికి కారణం వేరే వుంది. ఈ సారి, కీచకుడి ముందు పాండవ ప్రతాపాన్ని కీర్తించిన పద్ధతిని భీముడికి తెలియచెప్పడమే కాకుండా, తాను వాడితో అన్న ఆ మాటలు నిజం చేయమని, చేయాల్సిన అవసరం వచ్చిందని, భీముడికి పరోక్షంగా సూచించడానికి అదే పద్యాన్ని, అవే మాటలతో తు-చ తప్పకుండా పునరుక్తం చేయడం జరిగింది. ఇక ముందు భీముడు కీచకవధ ప్రయత్నం చేస్తాడని, అందులో దుర్వార ఉద్యమం, బాహు విక్రమం, గర్వాంధ ప్రతివీరనిర్మథన విద్యా ప్రదర్శనం అనే దశలు స్ఫురిస్తాయి”.     

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, విరాటపర్వం, ద్వితీయాశ్వాసం  

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

No comments:

Post a Comment