మౌఖరి
వంశం (బ్రాహ్మణ రాజులు-16)
(స్వర్గీయ
బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)
వనం
జ్వాలా నరసింహారావు
భారత దేశంలోని ప్రాచీన
రాజ వంశాలలో మౌఖరి వంశం కూడా ఒకటి. మహాభారతంలో మద్ర దేశాధీశుడు, అశ్వపతి వంశీయుడు,
మౌఖరులు ఈ ఆశ్వపతి వంశానికి చెందిన వారు. వీరు గొప్ప రాజ్యాన్ని నెలకొల్పి
పాలించారు. మద్రదేశం నేటి పంజాబ్ లోనిది. ఆశ్వపతులు ఈ ప్రాంత పాలకులు. మౌఖరి
వంశీయులు ఉత్తర హిందూ దేశమంతా వ్యాపించారు. క్రీస్తుశకం ఆరవ శతాబ్దంలో గయ ప్రాంతాన
వీరి పాలన కొనసాగింది. గయ జిల్లాలోని నాగార్జునికొండ, బరబరా
కొండలలో ఈ వంశానికి చెందిన శాసనాలలు లభించాయి. ఈ వంశానికి చెందిన ముగ్గురు రాజులు యజ్ఞవర్మ, శార్దూలవర్మ, అనంత వర్మలు గుప్త చక్రవర్తుల
సామంతులుగా వ్యవహరించారు.
మౌఖరి వంశానికి ఆద్యుడు యజ్ఞవర్మ గుప్త
చక్రవర్తులకు సామంతుడిగా వ్యవహరించాడు. విదేయ సామంతుడిగా గుప్త రాజుల శత్రువులతో
పోరాడి విజయాలు సాధించాడు. ఇతడి పాలనా కాలం క్రీస్తుశకం 501-520. సుమారు 19
సంవత్సరాలు. యజ్ఞవర్మ అనంతరం శార్దూల వర్మ మౌఖరి సామంత రాజ్యాధిపత్యం
స్వీకరించాడు. శార్దూల వర్మ గుప్త రాజులతో చక్కటి సంబంధాలు కలిగి వున్నాడు.
శార్దూల వర్మ క్రీస్తుశకం 520 నుండి క్ర్ఫీస్తుశకం 535 వరకు 15 సంవత్సరాలు
పాలించాడు. మౌఖరి వంశ రాజులలో అనంత వర్మ మూడవవాడు. ఇతడు తన సామంత రాజ్యాన్ని
క్రీస్తుశకం 535 నుండి క్రీస్తుశకం 550 వరకు సుమారు 15 సంవత్సరాలు పాలించాడు.
మౌఖరి వంశంలో రెండవ శాఖ వారు
శక్తిమంతులు. బలపరాక్రమ సంపన్నులు. వీరు గొప్ప రాజ్యాలను స్థాపించారు. మౌఖరి వంశీయుల
రాజ్యం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపించింది. మౌఖరి వంశంలో నాల్గవ రాజైన ఈశానవర్మ
సామంత రాజ్యాదిపత్యం వహించిన తరువాత ఈ వంశీయుల అభ్యుదయం ఉన్నత శిఖరాలను
అధిరోహించింది. ఈశానవర్మ కుమారుడు శర్వవర్మ. విష్ణుకుండిన ఇంద్రభట్టారకుడు
శర్వవర్మకు తన కుమార్తె ఇంద్రభట్టారికను ఇచ్చి వివాహం చేసి, రెండు
రాజ్యాలు సఖ్యంగా వుండడానికి తోడ్పడ్డాడు. మౌఖరి రాజ్యాన్ని విస్తృత పరచాలాన్న
ఆశయంతో ఈశానవర్మ అంగరాజ్యాన్ని జయించి, ముందుకు సాగాడు.
ఈశానవర్మ అపరిమిత సైన్యసంపద కలవాడు. మౌఖరి రాజులలో ఈశానవర్మ కడు సమర్థుడు. స్వతంత్ర
రాజ్య స్థాపకుడు. గుప్తరాజులు వారి పూర్వ వైభవాన్ని పునరుద్ధరించాలని భావించి, సైన్యాన్ని పెంపొందించుకొని మౌఖరి ఈశానవర్మను ఎదిరించారు. ఈశానవర్మ
పోరాడినా లాభం లేకపోయింది. అపజయం పొందాడు. అపరిమిత సైన్యంతో అనేక దేశాలను జయించి, మౌఖరి వంశ ప్రతిష్టను ఇనిమడింప చేసిన ఈశానవర్మ భారతదేశ చరిత్రలో ప్రముఖ
స్థానాన్ని ఆక్రమించి, క్రీస్తుశకం 550 నుండి క్రీస్తుశకం
576 వరకు 26 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు.
మౌఖరి ఈశానవర్మ కుమారుడు శర్వవర్మ తండ్రి
అనంతరం రాజ్యాదిపత్యాన్ని వహించాడు. ఇతడు రాజకీయ దురంధరుడు. అపరిమిత బలసంపన్నుడు.
అజేయుడు. ఇతడు తన కుమారుడితో కలిసి యుద్ధం చేసి మగథ రాజ్యాన్ని ఆక్రమించాడు.
శర్వవర్మ తండ్రితో కలిసి హూణులతో యుద్ధాలు చేసి విజయాలు సాధించారు. శర్వవర్మ కొద్దికాలం
(క్రీస్తుశకం 576-580) మాత్రమే పాలించాడు. మౌఖరి శర్వవర్మ కుమారుడు అనంతవర్మ (అవంతీవర్మ)
ఆ తరువాత రాజ్యానికి వచ్చాడు. ఇతడు కూడా అసాధారణ ప్రజ్ఞావంతుడు. మౌఖరి వంశీయులలో
గర్వించదగ్గ వ్యక్తి. అవంతీవర్మ తరువాత అతడి కుమారుడు గృహవర్మ మౌఖరి రాజ్యాధిపతి
అయ్యాడు. ఇతడి పాలనాకాలం క్రీస్తుశకం 600 నుండి క్రీస్తుశకం 606. గృహవర్మ మరణానంతరం
అతడి సోదరుడు మౌఖరి రాజ్య పాలనా బాధ్యత వహించాడు. ఈశానవర్మ వంశ చరిత్ర ఇంతటితో
ముగిసింది.
క్రీస్తుశకం 7 వ శతాబ్ది ప్రథమ పాదం వరకు మౌఖరి వంశేయులు గొప్ప రాజులుగా కీర్తించబడి వైభవోపేతంగా పాలించారు.
No comments:
Post a Comment