Monday, October 11, 2021

కదంబ వంశం (బ్రాహ్మణ రాజులు-18) ...... (స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా) : వనం జ్వాలా నరసింహారావు

 కదంబ వంశం (బ్రాహ్మణ రాజులు-18)

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)

వనం జ్వాలా నరసింహారావు

           దక్షిణాపథ, దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధికెక్కిన రాజవంశాలలో కదంబ వంశం ఒకటి. ఈ వంశీయుల తొలి నివాసం తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్లాలో వున్న కందూరు గ్రామం. కందూరు చాళుక్యుల కాలంలో ప్రసిద్దికెక్కిన గిరి దుర్గం. కందూరునాడును కందూరు పట్టణంగా కూడా పిలవడం జరిగింది. తెలుగు చోడులలో ఒక శాఖవారు తెలంగాణాలోని నల్లగొండ, మహబూబ్ నగర్ మండలాలను, ఖమ్మం మండలంలోని నేలకొండపల్లి ప్రాంతాన్ని, కొలనుపాక, కోడూరు, కందూరు, వర్ధమానపురం, పానుగల్లు పట్టణాలను రాజధానులుగా చేసుకుని పాలించారు.

         కందూరులో పెద్ద సంఖ్యలో కదంబ వృక్షాలుండేవి. కదంబ వృక్షాల వల్ల మయూర శర్మ వంశానికి కదంబ వంశమని పేరు వచ్చింది. కదంబులు హారీత పుత్రులు. మానవ్యస గోత్రులు. వేదవేదాంగేతిహాస, కావ్య నాటక, అలంకార శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించారు. సకల సద్గుణ సంపన్నులు. వీరు బ్రాహ్మణులు. కందూరు గ్రామ వాస్తవ్యులు.

         కదంబ వంశంలో మయూర శర్మ జన్మించాడు. బ్రాహ్మణుడైన మయూర శర్మ పౌరుష ప్రతాపాలున్నవాడు. అతడు బ్రాహ్మణ్యాన్ని వీడకుండా క్షత్రియ ధర్మాన్ని అవలంభించి, బ్రహ్మక్షత్రతేజో భృతుడయ్యాడు. అతడు కాంచీ నగరాన్నుండి బయల్దేరి శ్రీ పర్వతారణ్యంలోని ఆటవిక జాతుల వారిని పురికొల్పి, తన సైన్యాన్ని చేర్చుకుని, వారికి సైనిక శిక్షణ ఇచ్చి, వీరులుగా తీర్చిదిద్దాడు. తన గ్రామంలోని, పరిసర గ్రామాలలోని స్నేహితులను సైన్యంలో చేర్చుకున్నాడు. అలా చేర్చుకున్న సైన్యంతో కలిసి మయూర శర్మ అనేక ప్రాంతాల మీద దండయాత్రలు నిర్వహించి విజయుడై, తన వంశం పేరుతో కదంబ రాజ్యాన్ని స్థాపించాడు. అతడి రాజ్యం క్రమేపీ అభివృద్ధి చెంద సాగింది. మయూర శర్మ పల్లవ రాజుల సామంతులుగా వున్న బృహద్బాణ రాజులను ఓడించాడు.

         మయూర శర్మ కదంబ రాజ్యాన్ని నిర్భీతిగా, ప్రశాంతంగా, ప్రజానురంజకంగా పాలించాడు. అతడు అష్టాదశ అశ్వమేధ యాగాలు చేశాడని అంటారు. పరశురాముడి లాంటి పరాక్రమవంతుడని అతడికి పేరు. మయూర శర్మ కాలంలో భారత దేశాన్ని పాలించిన అనేక రాజ వంశాల వారు బ్రాహ్మణులు. వారు క్షత్రియ ధర్మాన్ని అవలంభించి, బ్రాహ్మణత్వాన్ని వీడకుండా పరిపాలన చేశారు. ఆ రోజుల్లో క్షత్రియులు, బ్రాహ్మణుల మధ్య వైవాహిక సంబంధ బాంధవ్యాలు వుండేవి. మయూర శర్మ క్రీస్తుశకం 345 నుండి క్రీస్తుశకం 360 వరకు సుమారు 15 సంవత్సరాలు పాలించాడు.

         మయూర శర్మ మరణించిన తరువాత అతడి కుమారుడు కంగవర్మ కదంబ రాజ్య సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు సమర్థుడైన రాజు. ఇతడు సుమారు 25 సంవత్సరాలు వైభవంగా పాలించాడు. కంగవర్మ కుమారుడు భగీరధుడు క్రీస్తుశకం 385 లో రాజ్యానికి వచ్చి సుమారు 25 సంవత్సరాలు పాలించాడు. తండ్రి, తాతల లాగానే ఇతడు కూడా చక్కటి పాలన అందించాడు. భగీరధుడి పెద్ద కుమారుడు రఘువు క్రీస్తుశకం 410 లో రాజ్యానికి వచ్చి 15 సంవత్సరాలు పాలించాడు. ఇతడి పాలనా కాలం స్వర్ణయుగం అని పిల్వబడ్డది. రఘువు కదంబ రాజ్యాన్ని బలిష్టపర్చాడు. రఘువు తరువాత భగీరధుడి రెండవ కుమారుడు కకుత్స వర్మ రాజ్య పాలనా బాధ్యత వహించి ఇరుగు పొరుగు రాజులతో, రాజ వంశాల వారితో చక్కటి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పాడు. కకుత్స వర్మ గొప్ప వీరుడు. ఇతడు క్రీస్తుశకం 425 నుండి సుమారు 25 సంవత్సరాలు పాలించాడు.

         కకుత్స వర్మ పెద్ద కుమారుడు శాంతి వర్మ క్రీస్తుశకం 450 లో అధికారంలోకి వచ్చాడు. ఇతడు శత్రు భయంకరుడు. అనేక రాజ్యాలను జయించి విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇతడి పాలనా కాలం సుమారు 25 సంవత్సరాలు. కకుత్స వర్మ రెండవ కుమారుడు కృష్ణ వర్మ, శాంతి వర్మ తరువాత రాజయ్యాడు. కృష్ణ వర్మ కుమారుడు విష్ణు వర్మ తండ్రి మరణానంతరం కదంబ రాజ్య పాలనా బాధ్యతలు స్వీకరించాడు. ఇతడు పల్లవుల ధాటికి తట్టుకోలేక వారికి సామంతుడిగా వుండిపోయాడు. శాంతి వర్మ కుమారుడు మృగేశ వర్మ కదంబ రాజ్య పాలనా బాధ్యతను క్రీస్తుశకం 470 లో స్వీకరించి సుమారు 18 సంవత్సరాలు పాలించాడు. ఇతడు సకల విద్యలలో నిష్ణాతుడు. పల్లవ రాజ్యం మీద దండయాత్రలు చేసి విజయం సాధించి, కదంబ వంశ ప్రతిష్టను ఇనుమడింప చేశాడు.

         మృగేశ వర్మ కుమారుడు రవి వర్మ క్రీస్తుశకం 488 లో కదంబ రాజ్య పాలనా బాధ్యతలు వహించాడు. రవి వర్మ బలసంపన్నుడు. తన జ్ఞాతి అయిన విష్ణు వర్మ పల్లవుల సామంతుడు కావడం సహించలేక, అతడి రాజ్యం మీద దండయాత్రలు చేశాడు. పల్లవులు విష్ణు వర్మకు సైన్య సహాయం చేశారు. అయినప్పటికీ యుద్ధంలో విష్ణు వర్మ, రవి వర్మ చేతిలో చనిపోయాడు. రవి వర్మ పట్టుదల కలవాడు. విష్ణు వర్మకు సహకరించిన పల్లవుల మీద దండయాత్ర చేసి వారిని ఓడించాడు. చివరకు అఖండ కదంబ రాజ్య పాలకుడు అయ్యాడు. రవివర్మ 60 సంవత్సరాలు పాలించాడు.

         రవి వర్మ తరువాత అతడి కుమారుడు హరి వర్మ క్రీస్తుశకం 538 లో కదంబ రాజ్య సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు శాంతి కాముకుడు. ఇతడి పాలనా కాలంలో మొదటి పులకేశి విజృంభించి, కదంబ రాజ్యంలోని అనేక భాగాలను జయించాడు. హరివర్మ అతడిని ఎదిరించలేక మిగిలిన భూభాగాలను 12 సంవత్సరాలు పాలించాడు. ఇతడితో కదంబ వంశం ప్రధాన శాఖ అంతరించింది.

         ఇదిలా వుండగా కృష్ణ వర్మ సంతతి వారిలో విష్ణు వర్మ కుమారుడు సింహ వర్మ పల్లవుల సహాయంతో రాజ్యాన్ని తిరిగి సంపాదించాడు. అతడి వంశీయులలో రెండవ కృష్ణ వర్మ, మాంద్రాత్రి వర్మ, అజ వర్మ, భోగి వర్మ కదంబ రాజ్యాన్ని పాలించారు. అజ వర్మ, భోగి వర్మల కాలంలో కదంబ రాజ్య వంశం పూర్తిగా అంతరించి పోయింది.  

No comments:

Post a Comment