సగర చక్రవర్తి వృత్తాంతం
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-76
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (12-10-2021)
ఇంతవరకిలా చెప్పిన విశ్వామిత్రుడు, అంటున్నాడీవిధంగా: "పూర్వ కాలంలో మిక్కిలిశూరుడు-సత్కార్యాలుచేయడంలో
ఆసక్తున్నవాడు, ప్రజలను పాలించడానికి సంతోషించేవాడు,
కీర్తిమంతుడైన సగరుడు, అయోధ్యకు చక్రవర్తిగా
వుండేవాడు. తనకు కొడుకుల్లేరని చింతించిన సగరుడు, పవిత్ర నడవడిగలిగిన-మంచిగుణాలున్న ఒక్క కొడుకైనా పుట్టలేదేనని బాధపడుతుండే
వాడు. మహా తేజోవంతుడైన ఆ సగరుడికి ఇద్దరు భార్యలు. పుణ్యకార్యాలందు ఆసక్తిగలది-నిత్య
సత్రవ్రతైన విదర్భ రాజు కూతురు కేశిని సగరుడి పెద్ద భార్య. మిక్కిలి చక్కనైన
అరిష్టనేమి కూతురు సుమతి ఆయన చిన్నభార్య. సౌందర్యంలో అశ్వినీ సుతులతో సమానమైన
సగరుడు భృగు ప్రస్రవణమనే పెరున్న పర్వతంపైన వందేళ్లు తపస్సు చేశాడు. విష్ణు
తేజమున్న ఆయన కప్పుడు భృగుడు ప్రత్యక్షమై, ఆనందభాష్పాలు రాలుస్తూ
తన్నే చూస్తున్న సగరుడికి రెండు వరాలిచ్చాడు. ఆయనకు ఎంతోమంది కుమారులు కలుగుతారని, ఆయన కీర్తికూడా లోకమంతా వ్యాపిస్తుందని, ఇద్దరుభార్యలలో ఒకామెకు
వంశోద్ధారకుడైన ఒక్కడేకొడుకు పుట్తాడని,ఇంకొకామెకు అరవైవేలమంది
జన్మిస్తారని చెప్పాడు భృగుడు. తమలో ఒక్కకొడుకెవరికి పుడ్తాడనీ-అరవేలమంది ఎవరికి
పుడ్తారనీ ప్రశ్నించిన ఆయన భార్యలతో, ఎవరెట్లా కోరుకుంటే అలానే
జరుగుతుందని జవాబిస్తాడు భృగుడు. ఎవరికేవిధంగా కావాల్నో అడగమనికూడా అంటాడాయన
వారితో. వంశ ప్రతిష్ఠాపకుడైన ఒక్క కొడుకే తనకు కావాలని కేశిని కోరగా, బహు పుత్రులు కావాలని సుమతి కోరింది. అలా వరాలు పొందిన సగరుడు భార్యలతో
అయోధ్యకు పోయాడు. కొంతకాలం తర్వాత ఆయన భార్యలు గర్భం ధరించారు".
"కమలాలలాంటి కళ్లున్న కేశిని ఒక కుమారుడిని కనగా, రెండో భార్య సుమతి గుండ్రని గర్భ పిండం పగలతీసుకుని అరవైవేలమంది శిశువులు జన్మించారు.
కేశిని తన కుమారుడికి ’అసమంజుడు’ అనే పేరుపెట్టింది.పిల్లలందరికి యవ్వనంవచ్చి,అందంగా విహరించే వారయ్యేంతవరకు, ఒక్కొక్కరిని ఒక్కొక్క
నేతి కుండలో వుంచి దాదులు నేర్పుతో చాలాకాలం పెంచారు. పెద్దభార్య కొడుకైన అసమంజుడు
ఊళ్లోవున్న పిల్లల్ని చంపడం అలవాటుగా చేసుకున్నాడు. సాహసవంతుడైన అసమంజుడు వాళ్లను
తీసుకునిపోయి,
సరయూనది ప్రవాహంలోపడేసి, వాళ్లు నీళ్లల్లో
మునుగుతూ-తేలుతూ కొట్టుకుంటుంటే, ఒడ్డుపైనుండి నవ్వుతూ
వేడుక చూస్తుండేవాడు. పాప కార్యమనుకోకుండా వాడలా సుజనులకు కీడు చేయడాన్ని సహించని
సగరుడు, జనాల మేలుకోరి,
ధర్మంగా, దాక్షిణ్యం చూపకుండా, అసమంజుడిని అడవులకు వెళ్లగొట్టాడు. అసమంజుడి కొడుకు అంశుమంతుడు
న్యాయవాదై-సమస్త ప్రజల మేలుకోరే వాడయ్యాడు. ఆ సమయంలో యజ్ఞం చేయాలన్న సంకల్పం
కలిగింది సగరుడికి".
(తనకు జ్యేష్ఠ భార్యవలన కలిగిన జ్యేష్ఠ పుత్రుడైన అసమంజుడిని అడవులకు పంపడం
ఎంతవరకు సమంజసమన్న ధర్మ సందేహం కలగొచ్చు. ఇది శాస్త్ర సమ్మతమేనా-కాదా అన్న సందేహమూ
కలగొచ్చు. పున్నామ నరకాన్నుండి కాపాడేవాడు పుత్రుడే కదా ! ఒకడికి నలుగురు
కొడుకులుంటే ఆ పని చేసేవాడెవరు? నిస్సందేహంగా జ్యేష్ఠ
పుత్రుడే. పెద్దకొడుకు పుట్టగానే మనిషి పుత్రవంతుడు అని పిలువబడతాడు. దాంతో పితృల
ఋణం తీరిపోతుంది. తనకూ పున్నామ నరక బాధ తప్పుతుంది. ఏ జ్యేష్ఠ పుత్రుడు పుట్టగానే
మనిషి పితృల ఋణాన్నుండి ముక్తుడవుతాడో-ఏ జ్యేష్ఠ పుత్రుడి వల్ల మోక్షం పొందుతాడో, వాడొక్కడే ధర్మ శాస్త్రం ప్రకారం పుట్టిన పుత్రుడు. మిగిలిన వారందరినీ ’కామజులు’
అంటారని మునులు చెప్తారు. దీని ప్రకారం సగరుడు పెద్ద కొడుకైన అసమంజుడిని అడవులకు
పంపకూడదు. అయితే రామాయణంలో,
జ్యేష్ఠ పుత్రుడు గుణవంతుడైతేనే పుత్ర గౌరవానికి
యోగ్యుడవుతాడుగాని,
కాకపోతే అయోగ్యుడేనని చెప్పబడింది. సాక్షాత్తు
శ్రీరామచంద్రుడే అయోధ్య కాండలో ఒకానొక చోట ఈ విషయాన్ని తెలియచేస్తాడు. బ్రాహ్మణుడు
బ్రాహ్మణ కర్మను,
క్షత్రియుడు క్షత్రియ కర్మను, వైశ్యుడు వైశ్య కర్మను నెరవేర్చకపోతే పతితుడవితాడని గౌతముడంటాడు. తల్లి తప్ప
పతితులైన వారందరూ వదలాల్సిన వారే-గురువైనా, పుత్రుడైనా, సోదరులైనా,
సఖుడైనా, సంబంధులైనా, చుట్టాలైనా,
శిశ్యులైనా, సేవకులైనా- వదలాల్సిన
వారే. అలా చేయకపోతే మహా దోషం వస్తుందని శాస్త్రం చెప్తుంది. రాజుకు ముఖ్య ధర్మం
ప్రజా పాలన-సగరుడదే చేశాడు. ఇదంతా ఇలా వుంటే, సగరుడు వెళ్లగొట్టిన
అసమంజుడు,
మనదేశం వదిలి, ఈజిప్ట్ వెళ్లి ఆ
దేశానికి ప్రభువయ్యాడని చరిత్ర కారుడు బి. దాస్ తన "Indo-Egyptian
History" అనే పుస్తకంలో రాసాడు).
No comments:
Post a Comment