Sunday, October 10, 2021

వంగ రాజ్య వంశం (బ్రాహ్మణ రాజులు-17) ...... (స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా) : వనం జ్వాలా నరసింహారావు

 వంగ రాజ్య వంశం (బ్రాహ్మణ రాజులు-17)

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)

వనం జ్వాలా నరసింహారావు  

           గుప్త సామ్రాజ్య పతనానంతరం వంగ దేశంలో ఒక స్వతంత్ర రాజ్యం ఆవిర్భవించింది. ఈ రాజ్యం మొదట్లో దక్షిణ, పశ్చిమ ప్రాగ్భాగాలలో విస్తరించింది. క్రీస్తుశకం ఆరవ శతాబ్ది ప్రథమార్థంలో స్వతంత్ర వంగ రాజ్యం నెలకొల్పబడింది. వంగ రాజ్యానికి సంబంధించిన తొలి ముగ్గురు రాజులు గోపచంద్రుడు, ధర్మాదిత్యుడు, సమాచారదేవుడు. వీరి సమగ్ర సమాచారం లభ్యం కావడం లేదు. ఈ ముగ్గురు రాజులలో సమాచారదేవుడు ప్రకటించిన బంగారు నాణేలు కనుగొనబడ్డాయి. శాసనాలలో ఈ రాజులు మహారాజాదిరాజులుగా వర్ణించబడ్డారు. వైశ్యగుప్తుడు, గోపచంద్రుడు వేయించిన శాసనాలలో విజయసేనుడి ప్రశంస వున్నది. విజయసేనుడు వైశ్యగుప్తుడి సామంతుడు. వైశ్యగుప్తుడి తరువాత వంగ దేశంలో గుప్త చక్రవర్తుల పరిపాలన అంతరించిపోయింది. క్రీస్తుశకం 507 లో గోపచంద్రుడు స్వతంత్ర రాజ్యం నెలకొల్పాడు.

         క్రీస్తుశకం 543 వరకు గుప్త చక్రవర్తుల అధికారం ఉత్తర వంగ దేశంలో చెల్లుతుండేది. గోపచంద్రుడు వంగ దేశాన్ని క్రీస్తుశకం 507 నుండి క్రీస్తుశకం 525 వరకు స్వతంత్రంగా పాలించాడు. గోపచంద్రుడి తరువాత ధర్మాదిత్య, సమాచారదేవులు వంగ దేశాన్ని పాలించారు. సమాచారదేవుడు 14 సంవత్సరాలు పాలించాడు. మొత్తంమీద గోపచంద్రుడు, ధర్మాదిత్యుడు, సమాచారదేవుడు కలిపి క్రీస్తుశకం 507 నుండి క్రీస్తుశకం 575 వరకు వంగ రాజ్యాన్ని ఏలారు.

         బాదామీచాళుక్య చక్రవర్తి కీర్తివర్మ, టిబెట్ రాజు స్రోన్బట్సన్ దండయాత్రల వల్ల వంగ రాజ్యం పతనమై పోయింది. వంగ రాజ్యం వంగ, గౌడ రాజ్యాలుగా విభజించబడింది. గౌడ దేశం ఉత్తర, పశ్చిమ వంగ దేశ భాగాలుగా వ్యాపించి వుండేది. దక్షిణ, తూర్పు భాగాలు వంగ దేశంగా పరిగణించబడేవి. వంగ దేశ ప్రాచీన నామం సమతత. మహాసేన గుప్తుడి చివరి రాజ్య సంవత్సరాలలో గౌడ దేశంలో శశాంకుడు పాలనా బాధ్యత వహించి స్వతంత్ర రాజ్యాన్ని స్తాపించాడు. శశాంకుడు మహాసేన గుప్తుడి సోదరుడి కొడుకు. శశాంకుడి రాజధాని కనక సువర్ణపురం. మార్షిదాబాద్ జిల్లాలోని బెర్హంపూర్ కు 10 కిలోమీటర్ల దూరంలో వున్న రాంగామాట శిధిలాలు పూర్వం కనక సువర్ణపురివై వుండవచ్చు.

         మాణ వంశీయులు శశాంకుడికి పూర్వం వంగ దేశంలోని పర్వత ప్రాంతాలను పాలించారు. వీరి రాజ్యం మిడ్నాపూర్, గయల దాకా విస్తరించి వుండేది. వీరు కళింగం దాకా తమ రాజ్యాన్ని వ్యాపింప చేసుకున్నారు. శంభుయశనుడు ఈ వంశీయుడు. క్రీస్తుశకం 580 నుండి క్రీస్తుశకం 603 వరకు 23 సంవత్సరాలు కళింగ దేశాన్ని పాలించాడు. శశాంకుడు ఇతడిని ఓడించి అతడికి చెందిన కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు.

         శైలోద్భవ వంశీయులు కొంగోద రాజ్యాన్ని పాలిస్తూ క్రీస్తుశకం 619 వరకు శశాంకుడి సామంతులుగా వున్నారు. తరువాత స్వతంత్రులయ్యారు. శశాంకుడు గౌడ దేశాన్ని మహేంద్రగిరి దాకా విస్తరించాడు. ఉత్తర మగథ భూభాగాలను స్వాధీనపర్చుకున్నాడు. కనోజి పాలకుడు గృహవర్మ మౌఖరి వంశీయుడు. మౌఖరి ఈశానవర్మ కాలం నుండి గౌడులు మౌఖరులతో శత్రుత్వం కలిగి వుండేవారు. మాళవ గుప్త రాజులకు మౌఖరులకు బద్ధ వైరం. కాబట్టి శశాంకుడు దేవగుప్తుడితో స్నేహం చేసుకున్నాడు.

         శశాంకుడు క్రీస్తుశకం 637-638 వరకు మగథను పాలించినట్లు ఆధారాలున్నాయి. శశాంకుడు వంగ దేశ ప్రథమ స్వతంత్ర ప్రభువు. అతడు గౌడ రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా రూపొందించడమే కాకుండా దక్షిణ అంగ, కళింగ దేశాలను జయించి ప్రబల శక్తి సమన్వితమైన రాజుగా కీర్తి వహించాడు.      

No comments:

Post a Comment