Tuesday, October 27, 2020

సాల్వుడిని, దంతవక్త్రుడిని వధించిన శ్రీకృష్ణుడు .... శ్రీ మహాభాగవత కథ-78 : వనం జ్వాలా నరసింహారావు

 సాల్వుడిని, దంతవక్త్రుడిని వధించిన శ్రీకృష్ణుడు

శ్రీ మహాభాగవత కథ-78

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పరిణయమాడడానికి తీసుకుని వస్తున్నప్పుడు, శిశుపాలుడికి సహాయంగా వచ్చి ఓడించబడిన సాల్వమహీపాలుడు కృష్ణుడి మీద పగబూనాడు. యాదవుడనేవాడు లేకుండా చేస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసి అది నెరవేర్చుకోవడానికి శివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అతడి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై సాల్వుడిని వరం కోరుకొమ్మన్నాడు. తాను ఆకాశమార్గంలో కోరిన విధంగా సంచరించడానికి ఒక గొప్ప వాహనాన్ని ప్రసాదించమని అడిగాడు సాల్వుడు. తగిన విమానాన్ని నిర్మించి సాల్వుడికి ఇవ్వమని శివుడు మయుడికి చెప్పాడు. మయుడు శివుడు చెప్పినట్లే ‘సౌభకం అనే పేరుగల విమానాన్ని నిర్మించి సాల్వుడికి ఇచ్చాడు. ఆ విమానాన్ని ఎక్కి ద్వారకానగారానికి పోయి ఆ పురవాసులను నిర్బంధించసాగాడు సాల్వుడు.

ద్వారకానగారాన్ని అల్లకల్లోలం చేశాడు సాల్వుడు. విమానంలో కూచుని ఆకాశం నుండి చెట్లను, రాళ్లను యాదవులమీద కురిపించేవాడు. సాల్వుడి చేతిలో ద్వారకానగరం నాశనం కాబడింది. ఇదంతా ప్రద్యుమ్నుడు గమనించాడు. రథాన్ని అధిరోహించి సాల్వుడితో యుద్ధానికి వెళ్లాడు. ఆయన వెంట యాదవ శ్రేష్ఠులు కూడా వెళ్లారు. యాదవ-సాల్వ సైన్యాల యుద్ధం దేవ-దానవ యుద్ధాన్ని తలపింప చేసింది. సాల్వుడి మాయలని ప్రద్యుమ్నుడు చేధించాడు. మహాపరాక్రమంతో యుద్ధం చేశాడు. సాంబుడు కూడా సాల్వుడిని ఎదుర్కున్నాడు. సౌభక విమానం మీద బాణాలు వేశాడు. సాత్యకి అదే పని చేశాడు. ఇలా ఒక్కొక్క యదువీరుడు వారి-వారి పరాక్రమానికి అనుగుణంగా యుద్ధం చేశారు. సాల్వుడికి అమితమైన కోపం వచ్చింది. అతడి విమానం తన అమోఘమైన మాయలను చూప సాగింది. భీభత్సంగా తన మాయలన్నీ ప్రదర్శిస్తూ యాదవుల గుండెలు కలతపడేట్లు రెచ్చిపోయింది. దీంతో సాల్వుడికి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. మరింత భీకరంగా పోరాడాడు. యాదవ సైన్యం కూడా వెనక్కు తగ్గలేదు.

ప్రద్యుమ్నుడికి, సాల్వుడి మంత్రి ద్యుముడికి మధ్య జరిగిన యుద్ధంలో ద్యుముడిని చంపాడు ప్రద్యుమ్నుడు. యుద్ధరంగం మొత్తం భీభత్సంగా తయారైంది. ఎవరూ తగ్గకుండా 27 రోజులపాటు రెండు సైన్యాలూ యుద్ధం చేశాయి. ఇంద్రప్రస్థపురం నుండి ద్వారకకు వస్తున్న శ్రీకృష్ణుడు శత్రువులతో యుద్ధం చేస్తున్న యాదవ వీరులను, ఆకాశవీధిలో వున్న సౌభక విమానాన్ని, అందులో వున్న సాల్వుడిని చూశాడు. తన రథాన్ని సౌభకం దగ్గరికి పోనిమ్మన్నాడు సారథిని. ఇది గమనించి సాల్వుడు పరాక్రమంతో ఒక్కసారి ముందుకు దూకాడు. శక్తి ఆయుధాన్ని శ్రీకృష్ణుడి సారథి దారుకుడి మీద ప్రయోగించాడు. దాన్ని శ్రీకృష్ణుడు పొడి చేసి నేలకూల్చాడు. తన బాణాలతో కృష్ణుడు సాల్వుడిని బాధించాడు. మాటల యుద్ధానికి దిగిన సాల్వుడు, తన స్నేహితుడు శిశుపాలుడిని శ్రీకృష్ణుడు సంహరించినందుకు, రుక్మిణిని ధర్మం తప్పి వరించినందుకు నిందించాడు. శ్రీకృష్ణుడు అప్పుడు విసిరిన గద దెబ్బకు సౌభక విమానంతో సహా పారిపోయాడు సాల్వుడు.

ఇదిలా వుండగా ఒక వ్యక్తి ఆకాశం నుండి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, ఆయన తండ్రైన వసుదేవుడిని సాల్వుడు పట్టి బంధించి తీసుకుపోయాడని చెప్పాడు. శ్రీకృష్ణుడు కొంతసేపు చింతించాడు. ఇంతలో సాల్వుడు తన మాయా బలంతో మళ్లీ కృష్ణుడి ముందుకు వచ్చాడు. మాయా వసుదేవుడిని చూపిస్తూ, సాల్వుడు, అతడి శిరస్సును ఖండిస్తానని బెదిరించాడు. మాయా వసుదేవుడి తల నరికి సౌభక విమానంలో వెళ్లిపోయాడు. జరిగినదంతా మిధ్య అని యాదవ వీరులు కృష్ణుడికి చెప్పారు. అప్పుడు శ్రీకృష్ణుడు సాల్వుడిని చంపి తీరాలని నిశ్చయించుకున్నాడు. తీవ్ర బాణ వర్షంతో ఆకాశమంతా కప్పేశాడు. సాల్వుడి కిరీటాన్ని, ధనుస్సును, కవచాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. గద విసరి విమానాన్ని పొడి పొడి చేశాడు. అది నేల కూలింది. దాన్ని సముద్ర మధ్యలో పడేట్లు చేశాడు కృష్ణుడు.

సాల్వుడు పౌరుషంతో గదను ధరించి శ్రీకృష్ణుడి మీదికి వచ్చాడు. గదను పట్టుకున్న వాడి చేతిని ఖండించాడు కృష్ణుడు. సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సాల్వమహీపాలుడి శిరస్సును ఖండించాడు. ఇది చూసిన శిశుపాలుడి తమ్ముడు దంతవక్త్రుడు శ్రీకృష్ణుడి మీదికి వచ్చాడు. గద ధరించి శ్రీకృష్ణుడు వాడికెదురుగా వెళ్ళాడు. దంతవక్త్రుడు పెద్ద గద తీసుకుని కృష్ణుడి తలమీద కొట్టాడు. ఆగ్రహంతో కృష్ణుడు ఎదురు దెబ్బ తీశాడు. కృష్ణుడి గదాఘాతానికి దంతవక్త్రుడు ప్రాణాలు విడిచాడు. అతడి శరీరం నుండి వచ్చిన తేజస్సు శ్రీకృష్ణుడిలో లీనమైంది. దంతవక్త్రుడి తమ్ముడు విదూరథుడు కూడా శ్రీకృష్ణుడి మీదికి యుద్ధానికి వచ్చి చచ్చాడు.

శ్రీకృష్ణుడి విజయాన్ని చూసి యాదవులు అమితానందంతో ఆయన్ను కీర్తించారు. యుద్ధరంగం నుండి శ్రీకృష్ణుడు ద్వారకానగరంలోకి ప్రవేశించాడు. ఆ తరువాత తన అంతఃపురంలోకి వెళ్లాడు.

       (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

Monday, October 26, 2020

ధర్మరాజు రాజసూయ యాగం, జరాసంధ, శిశుపాల వధ .... శ్రీ మహాభాగవత కథ-77 : వనం జ్వాలా నరసింహారావు

 ధర్మరాజు రాజసూయ యాగం, జరాసంధ, శిశుపాల వధ

శ్రీ మహాభాగవత కథ-77

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థ నగరానికి విచ్చేశాడని, సమీపంలోని ఉద్యానవనంలో బసచేశాడని ధర్మరాజుకు తెలిసింది. ఆయన పరమానందభరితుడై తమ్ములతో, భందుమిత్రులతో, కృష్ణుడికి ఎదురేగి స్వాగతం చెప్పడానికీ బయల్దేరి, ఆయన్ను చేరుకున్నాడు. శ్రీకృష్ణుడిని ధర్మరాజు గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆయన తరువాత భీమార్జునులు అలాగే చేశారు. నకుల సహదేవులు నమస్కరించారు. అంతా కలిసి ఇంద్రప్రస్థ పురంలోకి ప్రవేశించారు.

పురజనులంతా శ్రీకృష్ణుడిని చూడడానికి దారిపొడవునా గుమిగూడారు. పౌరకాంతలు ఆయన లీలావిశేషాలను ముచ్చటించుకున్నారు. ఆ దివ్యమూర్తిని తమ మనస్సులలో నిలుపుకుని ఆనందంతో మైమరచి కృష్ణ లీలలను గీతాలుగా పాడుకున్నారు. ముత్తైదువలు కృష్ణుడికి హారతులిస్తుంటే, పాండవులు ఆయన్ను అనుసరిస్తుంటే, శ్రీకృష్ణుడు అంతఃపురంలోకి ప్రవేశించాడు. మేనత్త కుంతీదేవికి నమస్కరించాడు. ద్రౌపదీదేవి కృష్ణుడికి నమస్కరించింది. ఆయనతో వచ్చిన వారందరినీ సముచిత రీతిగా గౌరవించి, సత్కరించారు. ఇంద్రప్రస్థ పురంలో శ్రీకృష్ణుడు కొన్ని నెలలపాటు వున్నాడు.

ఒకరోజున ధర్మరాజు నిండుకొలువు తీర్చి, సింహాసనం మీద ఆసీనుడై, శ్రీకృష్ణుడిని చూసి, రాజసూయ యజ్ఞం చేయాలన్న తన కోరికను వెల్లడించాడు. దాన్ని నిర్వహించడానికి శ్రీకృష్ణుడికంటే ఎక్కువైన ఆత్మబంధువులు ఎవరూ లేరని కూడా అన్నాడు. ధర్మరాజు ఆలోచన చాలా గొప్పగా వుందని, సమస్త శత్రునాశనానికి కారణమైన రాజసూయ యజ్ఞాన్ని త్వరగా ప్రారంభించమని, ఆయన నలుగురు తమ్ములు శత్రువులను శౌర్య సంపదతో సంహరించగల వీరాధి వీరులని, యజ్ఞం చేశాడన్న ఘనకీర్తిని సంపాదించి ఆయన శాసనం కింద సమస్త భూచక్రాన్ని నిలిపి వుంచమని అన్నాడు శ్రీకృష్ణుడు. తాను కూడా ధర్మరాజు ఆజ్ఞానుసారం అన్నీ చేస్తానని, యజ్ఞానికి కావాల్సిన సమస్త వస్తు సామగ్రిని తక్షణమే తెప్పించమని, సమస్త శత్రువులను గెలవడానికి ఆయన తమ్ములను నాలుగు దిక్కులకు పంపించమని కృష్ణుడు చెప్పాడు.

కృష్ణుడి సూచన, సలహా మేరకు సహదేవుడిని దక్షిణ దిక్కుకు, నకులుడిని పడమటి దిక్కుకు, ఆర్జునుడిని ఉత్తర దిక్కుకు, భీముడిని తూర్పు దిక్కుకు శత్రు రాజులను జయించి రావడానికి చతురంగ బలాలతో వెళ్లమన్నాడు ధర్మరాజు. నలుగురు తమ్ములూ అన్నగారు చెప్పినట్లు నలు దిక్కులకు పోయి, వీరాధివీరులైన రాజులందరినీ జయించి, వెనక్కు వచ్చి, ధర్మరాజుకు నమస్కరించి, తాము ఏఏ దేశాల రాజులను ఎలా గెలిచింది వివరించారు. ఒక్క జరాసంధుడు మాత్రం ధర్మరాజు అధికారాన్ని ఆమోదించలేదని చెప్పాడు అర్జునుడు. జరాసంధుడిని చంపటానికి తనకు ఉద్ధవుడు చెప్పిన ఉపాయం ప్రకారం, తాను, భీమార్జునులు కలిసి బ్రాహ్మణ వేషంలో మగధ దేశాధిపతి దగ్గరికి వెళ్లి, యుద్ధ బిక్ష ప్రసాదించమని అడిగి, ఆయనను అంగీకరింప చేసి, జరాసంధుడిని భీముడితో చంపిస్తానని అంటాడు కృష్ణుడు.

ఆ తరువాత భీమార్జునులు, శ్రీకృష్ణుడు కలిసి బ్రాహ్మణుల వేషాలు ధరించి, జరాసంధుడి రాజధానైన గిరివ్రజ పురంలోకి పోయి, జరాసంధుడిని కలిశారు. ఆయన్ను, ఆయన దాతృత్వాన్ని పొగిడారు వారు. బలి చక్రవర్తితో, శిబితో పోల్చారు. వారి మాటలు విని ఆశ్చర్యంగా చూశాడు వారిని. వారు బ్రాహ్మణ వేషంలో వచ్చిన రాజులని గ్రహించాడు. బ్రాహ్మణులు కోరింది ఏదైనా ఇచ్చి తీరుతానని నిశ్చయించుకున్నాడు. కృష్ణభీమార్జునులను చూసి, ఏంకావాలో కోరుకొమ్మన్నాడు. యుద్ధ బిక్షను ప్రసాదించమని అడిగాడు శ్రీకృష్ణుడు. తామెవరో చెప్పాడు. తమ ముగ్గురిలో ఎవరితోనైనా జరాసంధుడు ద్వంద్వ యుద్ధం చేయడం తమ అభిమతం అన్నాడు. తనను యుద్ధంలో ఎదిరించి కృష్ణుడు పోరాడలేడని, అర్జునుడు తనకన్నా చిన్నవాడని, వాయుపుత్రుడే తనతో సరి సమానంగా యుద్ధం చేయగల బలశాలి అని, కాబట్టి భీమసేనుడితో యుద్ధం చేస్తానని అంటూ, భీముడిని యుద్ధానికి పిలిచాడు. ఒక భయంకరమైన గద తెప్పించి భీముడికి ఇచ్చాడు జరాసంధుడు.

పురం బయటకు వెళ్లి భీమజరాసంధులు యుద్ధానికి సిద్ధమయ్యారు. వారి మధ్య యుద్ధం మహా భయంకరంగా సాగింది. వారి ద్వంద్వ యుద్ధం ఉగ్రరూపాన్ని దాల్చింది. ఒకరినొకరు కొట్టుకుంటూ ఘోరాతిఘోరంగా యుద్ధం చేశారు. ఇద్దరి గదాయుధాలు ముక్కలయ్యాయి. బాహువులతో ముష్టియుద్ధానికి దూకారిద్దరూ. ముష్టి యుద్ధం కూడా ఉగ్ర స్థాయికి చేరుకుంది. శ్రీకృష్ణుడు భీముడికి తన దివ్యశక్తితో అలసట లేకుండా చేసి అత్యంత బలాన్ని ప్రసాదించాడు. భీముడు చూస్తుండగా ఒక చెట్టు కొమ్మ చివరను పట్టుకుని దానిని రెండుగా చీల్చేశాడు. జరాసంధుడిని అలా చీల్చమని పరోక్షంగా సంజ్ఞ చేశాడలా. భీముడు జరాసంధుడిని కింద పడేసి, శరీరాన్ని రెండుగా చీల్చేసి, పెద్దగా అరిచాడు. కృష్ణార్జునులు భీముడిని అభినందించారు. కృష్ణుడు జరాసంధుడి కొడుకు సహదేవుడికి పట్టం కట్టాడు. చెరసాలలో వున్న రాజులను బంధవిముక్తులను చేశాడు. వారంతా కృష్ణుడిని స్తుతించారు.

కృష్ణుడు ఆ తరువాత భీమార్జునులతో కలిసి ఇంద్రప్రస్థ పురం చేరుకున్నాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడికి నమస్కరించి, ఆయన అంగీకారంతో రాజసూయ యాగం చేయడానికి బ్రాహ్మణులను ఋత్విజులుగా ఆహ్వానించాడు. మహామునులెందరినో యజ్ఞానికి ఆహ్వానించాడు. కురుకుల వృద్ధులను ఆహ్వానించాడు. గురూత్తములను పిలిచాడు. దుర్యోధనాదులను ఆహ్వానించాడు. బ్రాహ్మణులు, అనేకమంది రాజులు రాజసూయ యాగానికి వచ్చారు. ఏ లోపం లేకుండా ధర్మరాజు యజ్ఞదీక్షను స్వీకరించాడు. కురు సార్వభౌముడైన దుర్యోధనుడిని, కర్ణుడిని, భీముడిని,   ఆర్జునుడిని,  నకులుడిని, సహదేవుడిని, ద్రౌపదీదేవిని, ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క పనిలో నియమించాడు ధర్మరాజు.

బ్రహ్మాది దేవతలు యజ్ఞం చూడడానికి వచ్చారు. శాస్త్రోక్తంగా రాజసూయ యాగం జరిగింది. హవిస్సులను ఆయా దేవతలకు అందచేశారు. యజ్ఞం పరిసమాప్తి చివరిరోజున ధర్మరాజు ఋత్విజులను, సదస్యులను, గురువులను, బ్రాహ్మణులను పూజించాడు. అప్పుడు ‘అగ్రపూజకు అర్హుడు ఎవరని ధర్మరాజు ప్రశ్నించాడు. పరమాత్ముడైన శ్రీకృష్ణుడు అగ్రపూజార్హుడు అని సహదేవుడు అన్నాడు. ఆయనక్కడ వుండగా వేరేవాడు ఎలా అర్హుడవుతారని ప్రశ్నించాడు. అక్కడున్న పెద్దలంతా సహదేవుడు చెప్పినట్లే చేయమని ధర్మరాజుకు చెప్పారు. ధర్మరాజు అత్యంత భక్తి భావంతో శ్రీకృష్ణుడి పాదపద్మాలను కడిగాడు. పవిత్ర జలాలను తన శిరస్సు మీద చల్లుకున్నాడు. కుంతీదేవి, భీమార్జున, నకులసహదేవులు, ద్రౌపదీదేవి కూడా జలాలను చల్లుకున్నారు.

అక్కడే వున్న శిశుపాలుడు శ్రీకృష్ణుడికి జరుగుతున్న ఆ సన్మానాన్ని సహించలేకపోయాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. కృష్ణుడికి అగ్రపూజ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇదంతా వివేకం లేని పనన్నాడు. కృష్ణుడు కులగోత్రాలు లేనివాడన్నాడు. వావివరుసలు లేనివాడన్నాడు. జారుడని, జన్మాంతందాకా చోరుడని నిందిస్తూ కృష్ణుడు అగ్రపూజకు అర్హుడు కాడన్నాడు. శిశుపాలుడు ఎంతగా నిందిస్తున్నా శ్రీకృష్ణుడు మొదలు పట్టించుకోలేదు. కాని సభాసదులు ఆ నిందలు భరించలేకపోయారు. శిశుపాలుడిని ఎదిరించారు. పాండవులతో యుద్ధానికి దిగాడు శిశుపాలుడు. అప్పటిదాకా మౌనంగా వున్న శ్రీకృష్ణుడు శిశుపాలుడిని కోపంగా చూసి, తన సుదర్శన చక్రంతో శిశుపాలుడి శిరస్సును ఖండించాడు. శిశుపాలుడి శరీరం నుండి తేజస్సు వెలువడి శ్రీకృష్ణుడిలో కలిసిపోయింది.

ఆ తరువాత ధర్మరాజు సన్మానించాల్సిన వారందరినీ సన్మానించాడు. ద్రౌపదీదేవితో కలిసి అవభ్రుత స్నానానికి గంగానదికి పరివార సమేతంగా పోయాడు ధర్మరాజు. రాజసూయ యాగం చూడడానికి వచ్చిన బ్రహ్మాది దేవతలు సకల సత్కారాలు పొంది వెళ్లిపోయారు. శ్రీకృష్ణుడిని మరికొంత కాలం ఇంద్రప్రస్థ పురంలోనే వుండమని ధర్మరాజు కోరడంతో ఆయన పాండవులతో కలిసి అక్కడే వున్నాడు. దుర్యోధనుడు మాత్రం ఆయన సహజ గుణానికి అనుగుణంగా అసూయ పడ్డాడు. ఆ తరువాత కొన్నాళ్లకు శ్రీకృష్ణుడు ధర్మరాజును వీడ్కొని, భార్యలతో, హితులతో, బంధువులతో కలిసి ద్వారకానగారానికి వెళ్లాడు.                 

       (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

Sunday, October 25, 2020

శ్రీకృష్ణుడి మహిమను తెలుసుకున్న నారద మహర్షి ..... శ్రీ మహాభాగవత కథ-76 : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీకృష్ణుడి మహిమను తెలుసుకున్న నారద మహర్షి

శ్రీ మహాభాగవత కథ-76

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించి ఆయన భవనంలో వున్న పదహారువేలమంది కన్యలను వివాహం చేసుకున్నాడన్న వార్త నారద మహర్షి విన్నాడు. ఆ కన్యలందరికీ, ఒక్కొక్కరికి, ఒక్కో రూపంలో దర్శనం ఇచ్చి సంతోషపరిచాడన్న విషయం కూడా విని, శ్రీకృష్ణుడి వైభవాన్ని స్వయంగా చూడాలని ద్వారకానగారానికి వచ్చాడు నారదుడు. ఆయన చూసిన ద్వారక శ్రీకృష్ణుడి నివాసం కావడంతో, అది, ఇంద్రుడి అమరావాతీ నగరంలా శోభాయమానంగా మెరిసిపోతున్నది. ద్వారకానగరంలో ప్రవేశించిన నారద మహర్షి విశ్వకర్మ నిర్మితమైన పదహారు వేల మేడలను చూశాడు. స్ఫటిక స్తంబాలతో కట్టబడి, మళ్లీ మళ్లీ చూడాలనిపించే బహుసుందరంగా వున్న ఆ సౌధాలను నారదుడు తనివితీరా చూశాడు.

ఒకానొక సౌధంలో ప్రవేశించిన నారదుడికి స్వర్ణసింహాసనం మీద కూర్చుని, కొలువై వున్న శ్రీకృష్ణుడు ఆయన్ను చూసి ఎదురు వెళ్లాడు. శ్రీకృష్ణుడు దేవర్షికి నమస్కరించి తన సింహాసనం మీద ఆ దేవర్షిని కూచోబెట్టాడు. నారద మహర్షి పాద తీర్థాన్ని తన శిరస్సు మీద ధరించాడు. నారదుడిని, తానేం చేయాలో ఆనతి ఇవ్వమన్నాడు. శ్రీకృష్ణుడి పాదపద్మాల మీదే తన ధ్యాస సదా నిలిపే విధంగా వరమియ్యమని కోరాడు నారదుడు. నారదుడి మాటలకు శ్రీకృష్ణుడు ప్రసన్నమయ్యాడు.

శ్రీకృష్ణుడి యోగమాయా ప్రభావాన్ని తెలుసుకోవడానికి నారదుడు అక్కడి నుండి ఇంకొక మందిరానికి పోయాడు. అక్కడ ఉద్ధవుడితో జూదం ఆడుతూ కనిపించిన శ్రీకృష్ణుడిని చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ కూడా శ్రీకృష్ణుడి సత్కారాలను పొందాడు. వేరొక మందిరానికి పోయిన నారదుడికి శ్రీకృష్ణుడు ఆయన పుత్రులతో కలిసి ఆనందిస్తున్న దృశ్యం కనిపించింది. మరొక మందిరంలో కూడా శ్రీకృష్ణుడిని చూశాడు. మరొక మందిరం ఉద్యానవనంలో పత్నీ సమేతుడై విహరిస్తున్న కృష్ణుడిని చూశాడు. ఇంకో ఇంట్లో ధ్యాన నిష్టలో వున్నట్లు కనిపించాడు. ఒకచోట సంధ్యావందనం చేస్తున్నాడు. మరొక చోట పురాణం చదువుకుంటున్నాడు. ఇంకో చోట పంచ యజ్ఞాలు చేస్తున్నాడు. ఇంకో ప్రియురాలి ఇంట్లో బలరాముడితో సమాలోచన చేస్తూ కనిపించాడు. ఒక చోట గోదానాలు చేస్తున్నాడు.

నారదుడు అలా తిరుగుతూనే వున్నాడు. వేదస్వరూపుడు, సాక్షాత్తు పరమాత్ముడు అయిన శ్రీకృష్ణుడి మహిమలకు నారదుడు ఆశ్చర్యపోయాడు. పరాత్పరుడైన శ్రీకృష్ణుడిని చూసి నారదుడు పరమానందభరితుడయ్యాడు. ఆయన్ను ఒక ఇంట్లో కలిసి, ఆయన మహిమలు తెలుసుకోవడం ఎవరి తరం కాదన్నాడు. శ్రీకృష్ణుడి దివ్య చరిత్రను కీర్తిస్తూ అందరికీ తెలియపరుస్తానని అంటూ, నారాయణ నామస్మరణ చేసుకుంటూ వెళ్లిపోయాడు.

శ్రీకృష్ణుడు ప్రతిరోజూ రాజ కార్యాలను నిర్వహిస్తూ వుండగా, ఒకనాడు, ఒక బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వచ్చాడు. తన విన్నపం వినమని ప్రార్థించాడు. చెప్పడం ప్రారంభించాడు. ‘జరాసంధుడు అనే రాజు గిరివ్రజపురం రాజధానిగా చేసుకుని, తనను ఎదిరించిన ఇతర రాజులను బందీలుగా చేసి, తన రాజధాని నగరంలో బంధించాడు. అలా బంధించబడిన రాజులు సుమారు ఇరవై వేలమంది వుంటారు’. వారంతా తనను శ్రీకృష్ణుడి దగ్గరికి పంపారన్నాడు. తమని కాపాడమని వారు ప్రార్తిస్తున్నారని చెప్పాడు. ఇలా ఆ బ్రాహ్మణుడు చెపుతున్న సమయంలో నారద మహర్షి సభలోకి ప్రవేశించాడు.

తనను దర్శించుకోవడానికి వచ్చిన నారద మహర్షిని పాండవుల విషయం అడిగాడు శ్రీకృష్ణుడు. ధర్మరాజు ధర్మ చింతనతో రాజసూయ యాగం చేయాలని సంకల్పించాడని, అతడు చేయబోతున్న యజ్ఞాన్ని శ్రీకృష్ణుడు రక్షించాలని, వీలు చూసుకుని ఆయన దగ్గరికి వెళ్లి విజయం చేకూర్చాలని నారదుడు బదులిచ్చాడు. ఇది విన్న శ్రీకృష్ణుడు అక్కడే వున్న ఉద్ధవుడి వైపు చూసి ఏంచేద్దాం అని సలహా అడిగాడు. ధర్మరాజు యజ్ఞానికి పూనుకోవడం హర్షనీయమైనదని, ఇదే అవకాశంగా తీసుకుని భీముడితో పోయి జరాసందుడిని వధించవచ్చని, ఆయన దగ్గరికి బ్రాహ్మణ వేషంలో పోయి ఏది అడిగినా యిస్తాడు కాబట్టి యుద్ధ బిక్ష వేడడం మంచిదని, ధర్మరాజు రాజసూయ యాగాన్ని రక్షించే బాధ్యత శ్రీకృష్ణుడి మీదే వున్నదని ఉద్ధవుడు చెప్పాడు.

నారదుడి మాటలు, ఉద్ధవుడి మాటలు విన్న శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థ నగరానికి రథం ఎక్కి బయల్దేరాడు. ద్వారకను దాటాడు. దానికి ముందు నారదుడిని సత్కరించి సాగనంపాడు. మధ్యలో ఒక ఉద్యానవనంలో విడిది చేశాడు. జరాసంధుడి చెరసాలలో వున్న రాజులు పంపిన బ్రాహ్మణ దూతతో, తాను వారిని కాపాడుతానని అభయమిచ్చాడు. ఆ తరువాత ధర్మరాజు దగ్గరికి భార్యలతో, కొడుకులతో, బంధువులతో, స్నేహితులతో కలిసి బయల్దేరాడు.

ఇంద్రప్రస్థ పురాన్ని చేరుకున్న శ్రీకృష్ణుడు నగరానికి సమీపంలో వున్న ఉద్యానవనంలో బసచేశాడు.                  

     (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

Saturday, October 24, 2020

పౌండ్రక వాసుదేవుడి చావు, హస్తినను గంగలో తోసే ప్రయత్నం ..... శ్రీ మహాభాగవత కథ-75 : వనం జ్వాలా నరసింహారావు

 పౌండ్రక వాసుదేవుడి చావు, హస్తినను గంగలో తోసే ప్రయత్నం 

శ్రీ మహాభాగవత కథ-75

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

పౌండ్రక వాసుదేవుడనే కరూశ దేశాధిపతి శ్రీకృష్ణుడి మీద అకారణంగా ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఆ ద్వేషం పగగా మారింది. శ్రీకృష్ణుడిని జయించాలనే కోరిక పెరిగింది. తనకొక్కడికే భూమ్మీద ‘వాసుదేవుడు అన్న పేరుండాలి కాని మరెవ్వరికీ వుండకూడదని నిశ్చయించుకుని, తన దూతను పిలిచి, కృష్ణుడి దగ్గరికి పంపాడు. ఆయన తనను తాను వాసుదేవుడు అని పిలుచుకోవడం తప్పని చెప్పమన్నాడు దూతకు. దూత శ్రీకృష్ణుడున్న ద్వారకానగారానికి పోయి, ఆయన సభలో వున్నప్పుడు, రాజు తనకు చెప్పి పంపిన మాటలు అప్పచెప్పాడు. ‘సిగ్గు లేకుండా తన పేరు పెట్టుకుని కృష్ణుడు ఎలా వ్యవహరిస్తున్నాడని’ తన రాజైన పౌండ్రక వాసుదేవుడన్న వ్యాఖ్యలు వినిపించాడు. గోవులు మేపుకునే గోపాలుడికి తనతోటి పంతం ఎందుకని అన్నట్లు కూడా చెప్పాడు దూత. తన ఘనతను తెలుసుకుని తనని సేవించక పోతే యుద్ధరంగంలో తనను ఎదుర్కోవాల్సి వస్తుందనీ, అప్పుడు తన ప్రతాపం ఏమిటో తెలుస్తుందనీ పౌండ్రక వాసుదేవుడు హెచ్చరించినట్లు దూత చెప్పాడు శ్రీకృష్ణుడికి.     

తాను పౌండ్రక వాసుదేవుడికి ఇష్టం లేని శంఖచక్రాది చిహ్నాలను ధరించి వెంటనే యుద్ధానికి వస్తున్నట్లు ఆయనకు చెప్పమని దూతతో అన్నాడు కృష్ణుడు. ఘోర రణంలో వాడిని కుప్పకూలుస్తానని కూడా చెప్పమన్నాడు. ఈ మాటలకు పౌండ్రక వాసుదేవుడి దూత ఉలిక్కి పడ్డాడు. భయపడ్డాడు. తన రాజు దగ్గరికి పోయి జరిగినదంతా చెప్పాడు. దానితో పౌండ్రక వాసుదేవుడికి కృష్ణుడంటే పగ మరింత పెరిగింది. కృష్ణుడు పౌండ్రక వాసుదేవుడి మీదకు పరమోత్సాహంగా దండయాత్రకు బయల్దేరాడు. అతి వేగంగా కాశీనగరానికి చేరుకున్నాడు. పౌండ్రక వాసుదేవుడు కూడా రణోత్సాహంతో యుద్ధరంగానికి వచ్చాడు. ఆయన మిత్రుడు కాశీరాజు ఆయనకు సహాయంగా తన సైన్యాన్ని తీసుకుని వచ్చాడు.

కృత్రిమమైన శంఖం, చక్రం, గద, శార్జ్ఞ్గం, కౌస్తుభమణితో పౌండ్రక వాసుదేవుడు యుద్ధానికి వచ్చాడు. వాడిని తేరిపార చూశాడు కృష్ణుడు. వాడి వేషం చూసి కృష్ణుడు నవ్వడంతో పౌండ్రక వాసుదేవుడికి కోపం వచ్చింది. ధనుర్బాణాలు ధరించి కృష్ణుడిమీద బాణాలు కురిపించాడు. ఆయుధం వెంట ఆయుధాన్ని ప్రయోగించాడు. ఆ ఆయుధాలన్నిటినీ తుంచివేశాడు కృష్ణుడు. తన పాంచజన్యాన్ని పూరించాడు. సమస్త శత్రు సైన్యాన్ని హతం చేశాడు కృష్ణుడు. శ్రీకృష్ణ పౌండ్రకుల ఘోర సంగ్రామంలో రక్తం ప్రవాహం కట్టింది. పౌండ్రకుడిని తీవ్రంగా హెచ్చరిస్తూ, వాడి రథాన్ని విరగ గొట్టాడు కృష్ణుడు. సుదర్శన చక్రంతో పౌండ్రకుడిని సంహరించాడు. అంతటితో ఆగకుండా కాశీరాజును కూడా చంపాడు. వాడి తలను కాశీపట్టణంలో పడేట్లు కొట్టాడు.

పౌండ్రక వాసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ ధరించే శంఖచక్రాది చిహ్నాలు ధరించి, అతడిమీద కోపంతో అనుక్షణం తలుస్తూ వుండడం వల్ల మోక్షసామ్రాజ్యాన్ని పొందగలిగాడు.

యుద్ధరంగంలో ఇలా జరుగుతే, అక్కడ కాశీనగరంలో పడిన తలను చూసి కాశీపతి పత్నులంతా దుఃఖించారు. కాశీరాజు కుమారుడు సుదక్షిణుడు శ్రీకృష్ణుడిని సంహరించడానికి ఉపాయం వెతక సాగాడు. పరమేశ్వరుడిని పూజించగా శంకరుడు అతడి పట్ల కరుణ వహించి ఏం కావాల్నో అడగమన్నాడు. కృష్ణుడిని యుద్ధంలో గెలిచే విధానం చెప్పమని ప్రార్థించాడు. అభిచార హోమం చేసి అగ్నిహోత్రుడిని సంతృప్తి పరిస్తే అతడు సుదక్షిణుడి కోరిక నేరవేరుస్తాడని చెప్పాడు శివుడు. సుదక్షిణుడు అలాగే చేయగా అగ్నికుండం నుండి ఒక కృత్య ఆవిర్భవించింది. అతి భయంకారాకారంతో బయల్దేరిందది. అతి వేగంగా కృష్ణుడి నగరానికి వచ్చింది. దాన్ని చూసి భయపడిన ద్వారాకావాసులు శ్రీకృష్ణుడి చెంతకు చేరారు. రక్షించమన్నారు. సుదక్షిణుడు పంపిన కృత్యను వధించాలని నిర్ణయించాడు కృష్ణుడు.

శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని సుదక్షిణుడు ప్రయోగించిన కృత్య మీదకు పంపాడు. తన మీదకు వస్తున్న చక్రాన్ని చూసి భయపడకుండా దాని మీద పడపోయింది కృత్య. అప్పుడు సుదర్శన చక్రం కృత్యమీద అగ్నిజ్వాలలు కురిపించింది. ఆ మంటల వేడి తట్టుకోలేక కృత్య తన రౌద్రాన్ని విడిచి పెట్టి తిరుగు ముఖం పట్టింది. సుదర్శన చక్రం కాశీ పట్టణం ప్రవేశించి, అక్కడ అభిచార హోమం చేస్తున్న సుదక్షిణుడిని, చేయిస్తున్న ఋత్విజులను దగ్దం చేసింది. కాశీపురాన్ని భస్మం చేసింది. తృప్తి చెందిన చక్రం చివరకు తన రౌద్రాకారం వదిలి, తిరిగి వచ్చి శ్రీకృష్ణుడి పక్కనే నిలిచి ఆ పరమాత్ముడి సేవలో వుండిపోయింది.

ఇదిలా వుండగా, ద్వివిదుడనే వానర నాయకుడు నరకాసురుడిని చంపిన కృష్ణుడి మీద కోపంతో కృష్ణ పాలిత ప్రాంతాలను ధ్వంసం చేశాడు. ఒకనాడు ద్వివిదుడు రైవత పర్వతం దగ్గరికి వెళ్లి, అక్కడ జూదం ఆడుతున్న బలరాముడిని చూశాడు. చూసి వివిధ రకాల వానర చేష్టలు చేశాడు. వాడిని ఉపేక్షించి లాభం లేదని తలచిన బలరాముడు వాడితో యుద్ధానికి దిగాడు. చివరకు వాడిని సంహరించాడు.

ఇదిలా వుండగా, దుర్యోధనుడి కుమార్తె లక్షణ వివాహ సమయంలో శ్రీకృష్ణుడి (జాంబవతి) కుమారుడు సాంబుడు ఆమెను ఎత్తుకుపోయాడు. కౌరవులు అతడితో యుద్ధానికి దిగారు. ఆ యుద్ధంలో కౌరవుల పక్షాన కర్ణుడు మొదలైన మహా వీరులు కూడా వున్నారు. అయినప్పటికీ సాంబుడు అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. కౌరవ వీరులు ఒక్కసారిగా సాంబుడిని చుట్టుముట్టారు. అతడిని బందీని చేశారు. లక్షణ సహితంగా అతడిని హస్తినాపురానికి తీసుకువచ్చారు కౌరవులు.

ఈ విషయమంతా నారదుడు యాదవులకు చెప్పగా వారంతా కౌరవుల మీదికి యుద్ధానికి బయల్దేరారు. బంధువుల మీద యుద్ధం వద్దని చెప్పి, వారిని యుద్ధం విరమింప చేసి, బలరాముడు హస్తినాపురానికి పోయి, వూరి బయటున్న ఉద్యానవనంలో విశ్రమించాడు. తాను వచ్చిన పని తెలియచేయడానికి ఉద్ధవుడిని కౌరవుల దగ్గరికి పంపాడు. బలరాముడు వచ్చిన సంగతి విన్న కౌరవులు ఉద్ధవుడి వెంట బలరాముడి దగ్గరికి ఆయన్ను చూడడానికి వెళ్లారు. సాంబుడిని బంధించడం తప్పని బలరాముడు చెప్పగా దుర్యోధనుడికి కోపం వచ్చింది. యాదవులను నిందించాడు. వారితో చుట్టరికం అక్కరలేదన్నాడు. సాంబుడిని విడిపించడం అసంభవమని చెప్పి ఆగ్రహంతో దుర్యోధనుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. బలరాముడు మండి పడ్డాడు. తన బలాన్ని, శౌర్యాన్ని యుద్ధంలో చూపాలనుకున్నాడు. శ్రీకృష్ణుడి మహిమ వారికి తెలియదు కదా అనుకున్నాడు.

ధారుణి మీద ఇక కౌరవ వంశమే లేకుండా చేయాలనుకున్న బలరాముడు ఉగ్రాకారుడై తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ నాగలిని ఎత్తి పట్టుకున్నాడు. తన నాగలిని చొప్పించి, హస్తినాపురం ఉన్నంత మేరకు మొత్తం గడ్డను పెకలించి గంగానదిలో పడవేయబోయాడు. అప్పుడు హస్తినాపురం గడగడ వణికింది. గోపురాలు, ప్రాకారాలతో సహా సమస్తం తలకిందులై పట్టణం ఒరిగిపోయింది. హస్తిన ప్రజలు భూమ్మీద అడుగు మోపలేక ఆర్తిచెందారు. ఇదంతా బలరాముడి పనని కౌరవ నాథులు గుర్తించారు. కలవర పడ్డారు. బలరాముడి శరణు కోరాలని నిశ్చయించారు. సాంబుడిని, లక్షణను అలంకరించి బలరాముడి దగ్గరికి తీసుకు వచ్చి దుర్యోధనాదులు ఆయనకు సాష్టాంగనమస్కారం చేసి ఆయన్ను స్తుతించారు. తమ అజ్ఞానాన్ని మన్నించమని వేడుకున్నారు. ఆయన శరణు కోరుతున్నామని అన్నారు. తాను హస్తినను గంగలో ముంచనని, వారు నిశ్చింతగా వారి నివాసాలకు వెళ్లమని చెప్పాడు బలరాముడు.

లాంఛనంగా తన కూతురు లక్షణను అత్తవారింటికి పంపుతూ, యాదవులను సాగనంపాడు దుర్యోధనుడు. బలరాముడు పరమానందంతో కొడుకును, కోడలిని తీసుకుని ద్వారక చేరుకున్నాడు. ఇప్పటికీ హస్తినాపురం దక్షిణం వైపు కొంచెం పైకి లేచి, ఉత్తరం భాగం గంగానది వైపు కొంచెం కుంగి వున్నట్లుగా వుంటుంది.            

     (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

Friday, October 23, 2020

నృగు మహారాజు చరిత్ర, వ్రేపల్లెలో బలరాముడు ..... శ్రీ మహాభాగవత కథ-74 : వనం జ్వాలా నరసింహారావు

 నృగు మహారాజు చరిత్ర, వ్రేపల్లెలో బలరాముడు

శ్రీ మహాభాగవత కథ-74

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

ఒక రోజున ప్రద్యుమ్నుడు మొదలైన యాదవ కుమారులు ఉద్యానవనానికి వెళ్లి అక్కడ ఒక నీళ్లులేని పాడుబడ్డ బావిలో ఒక పెద్ద ఊసరవెల్లిని చూశారు. దాన్ని బావి నుండి బయటకు తీద్దామని ప్రయత్నం చేశారు. ఎంత కష్ట పడ్డా దాన్ని బయటకు లాగలేకపోయారు. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పారు. ఆయనను నీళ్లబావి దగ్గరికి తీసుకుపోయారు. శ్రీకృష్ణుడు దాన్ని ఒక గడ్డిపరకను లాగి తీసినట్లు బయటకు తీశాడు. మరుక్షణంలో ఊసరవెల్లి పురుష రూపాన్ని ధరించింది. అలా ఆయన ఎందుకు ఊసరవెల్లి ఆకారంలో ఉన్నాడో చెప్పమని అడిగాడు శ్రీకృష్ణుడు.

జవాబుగా ఆ పురుషుడు, తాను నృగుడు అనే పేరు కల ఇక్ష్వాకు మహారాజు పుత్రుడినని, భూమినంతా పాలించానని, సిరి సంపదలతో వర్దిల్లానని, తాను బ్రాహ్మణులకు దానమిచ్చిన గోవుల సంఖ్య లెక్కపెట్టడం కష్టమని, అనేక విదాలైన దానాలు చేశానని, పంచ మహా యజ్ఞాలు చేశానని అన్నాడు. ధర్మబద్ధంగా తాను ప్రవర్తిస్తున్న సమయంలో ఒక పొరపాటు జరిగిందన్నాడు. తాను కశ్యపుడనే బ్రాహ్మణుడికి దానం చేసిన ఆవు తిరిగొచ్చి తన మందలో కలిస్తే, అది గ్రహించక, దాన్ని వేరే బ్రాహ్మణుడికి దానమిచ్చానని, దానివల్ల వారిద్దరి మధ్య తగాదా జరిగిందని చెప్పాడు. ఆ ఇద్దరు బ్రాహ్మణుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగిందని, ఇద్దరూ తన దగ్గరికి వచ్చారని, తనకు తన గోవు తప్ప వేరే ఏమీ అక్కరలేదని కశ్యపుడు పట్టుబట్టాడని అన్నాడు. రెండో సారి తాను దానం ఇచ్చిన బ్రాహ్మణుడు కూడా అదే ఆవు కావాలని పట్టుబట్టాడని, తనకేమీ పాలుపోలేదని చెప్పాడు.

ఆ తరువాత నృగుడికి అవసాన దశ ప్రాప్తించింది. ఆయన్ను యమభటులు తీసుకుపోయి యమధర్మరాజు ముందు నిలబెట్టారు. నృగుడిని ముందు పాపకర్మఫలాన్ని అనుభవించి, ఆ తరువాత పుణ్యకర్మను అనుభవించమని చెప్పాడు యముడు. ఆ విధంగా చెప్పి తనను భూమ్మీద పడేస్తే ఊసరవెల్లి రూపం కలిగిందని, కృష్ణుడి సందర్శనం వల్ల  పాపపరిహారం అయిందని నృగుడు చెప్పాడు. నృగమహారాజు చెప్పినదంతా విన్న శ్రీకృష్ణుడు అక్కడున్న యదుకుమారులకు, రాజులకు చాలా ధర్మ విషయాలను చెప్పాడు దాని ఆధారంగా. బ్రాహ్మణుల సొమ్ము పొరపాటున కూడా తినకూడదనేది దాని సారాంశం. ధర్మం తెలుసుకుని బ్రాహ్మణుల పట్ల పరమ భక్తితో మెలగమని యదువీరులకు చెప్పి, శ్రీకృష్ణుడు తన మందిరానికి వెళ్లిపోయాడు.

ఇదిలా వుండగా, ఒకనాడు బలరాముడు బంధువులందరినీ చూడాలన్న కోరికతో వ్రేపల్లెకు వెళ్లాడు. ఆయన రాకకు యశోదాదేవి, నందుడు, గోపాలురు సంతోషించారు. బలరాముడు ఒక నిర్జన ప్రదేశానికి వెళ్లి గోపాలురతో సంతోషంగా కాలం గడుపుతుండగా, అక్కడికి గోపకాంతలు వచ్చారు. బలరాముడిని చూసి వారూ సంతోషపడ్డారు. ఆయన తమ్ముడు శ్రీకృష్ణుడిని గూర్చి అడిగారు. తమనందరినీ విడిచి వెళ్లడం ఆయనకు భావ్యమేనా అని ప్రశ్నించారు. యమునానది ఇసుక తిన్నెలమీద కలిసి తిరిగిన రోజులను గుర్తు చేశారు. బలరాముడు వారిని అనునయించాడు. సరస వచనాలు పలికాడు. కృష్ణుడి సందేశాన్ని వారికి వినిపించాడు. రెండు నెలలు వ్రేపల్లెలోనే వున్నాడు. సుందరీమణులంతా తనను కొలుస్తుంటే ఆనందం పొందాడు. గోపికా రమణులతో మధువు సేవించి, కలిసి నృత్యం చేశాడు. 

బలరాముడు అప్పుడు జలక్రీడ చేసి ఆనందించాలని భావించి, యమునా నదిని తన దగ్గరికి రమ్మని పిలిచాడు. యమునా నది మద్యం మత్తులో ఉన్నాడని బలరాముడి మాటలు నిర్లక్ష్యం చేసి, అతడి ఆజ్ఞను లెక్కచేయలేదు. ఉగ్రుడైన బలరాముడు తన నాగలి దెబ్బతో యమునా నదిని నూరు చీలికలు చేస్తానన్నాడు. మహా ప్రవాహంతో ఉరకలు వేస్తున్న యమునానదిని మూలంతో సహా వచ్చేట్లు ఒక్క లాగు లాగాడు. దానితో యమునా నది భయభ్రాంతురాలైంది. సుందరి రూపాన్ని ధరించి వేగంగా బలరాముడి దగ్గరికి వచ్చింది. తనను రక్షించమని యాదవ వీరుడిని ప్రార్థించింది. ఆయన్ను స్తుతించింది. ఆమెను పూర్వ మార్గంలో ప్రవహించమని అన్నాడు బలరాముడు. తానిక ఆమెను హింసించనని హామీ ఇచ్చాడు. ఆ తరువాత యమునా నదిలో జలక్రీడలాడారు.

బలరాముడికి యమునా నది వస్త్రాలను, రత్నాభరణాలను, బంగారు హారాన్ని బహుమానంగా ఇచ్చింది. బలరాముడు నాగలితో యమునా నదిని తన వద్దకు లాగినప్పుడు ఏర్పడ్డ చీలిక ఇప్పటికీ కనిపిస్తున్నది.             

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)