ధర్మరాజు రాజసూయ యాగం, జరాసంధ, శిశుపాల వధ
శ్రీ మహాభాగవత కథ-77
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థ నగరానికి
విచ్చేశాడని, సమీపంలోని ఉద్యానవనంలో బసచేశాడని
ధర్మరాజుకు తెలిసింది. ఆయన పరమానందభరితుడై తమ్ములతో,
భందుమిత్రులతో, కృష్ణుడికి ఎదురేగి స్వాగతం చెప్పడానికీ
బయల్దేరి, ఆయన్ను చేరుకున్నాడు. శ్రీకృష్ణుడిని ధర్మరాజు
గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆయన తరువాత భీమార్జునులు అలాగే చేశారు. నకుల
సహదేవులు నమస్కరించారు. అంతా కలిసి ఇంద్రప్రస్థ పురంలోకి ప్రవేశించారు.
పురజనులంతా శ్రీకృష్ణుడిని చూడడానికి
దారిపొడవునా గుమిగూడారు. పౌరకాంతలు ఆయన లీలావిశేషాలను ముచ్చటించుకున్నారు. ఆ
దివ్యమూర్తిని తమ మనస్సులలో నిలుపుకుని ఆనందంతో మైమరచి కృష్ణ లీలలను గీతాలుగా
పాడుకున్నారు. ముత్తైదువలు కృష్ణుడికి హారతులిస్తుంటే, పాండవులు ఆయన్ను
అనుసరిస్తుంటే, శ్రీకృష్ణుడు అంతఃపురంలోకి ప్రవేశించాడు. మేనత్త కుంతీదేవికి
నమస్కరించాడు. ద్రౌపదీదేవి కృష్ణుడికి నమస్కరించింది. ఆయనతో వచ్చిన వారందరినీ
సముచిత రీతిగా గౌరవించి, సత్కరించారు. ఇంద్రప్రస్థ పురంలో
శ్రీకృష్ణుడు కొన్ని నెలలపాటు వున్నాడు.
ఒకరోజున ధర్మరాజు నిండుకొలువు తీర్చి, సింహాసనం మీద ఆసీనుడై, శ్రీకృష్ణుడిని
చూసి, రాజసూయ యజ్ఞం చేయాలన్న తన కోరికను వెల్లడించాడు. దాన్ని నిర్వహించడానికి శ్రీకృష్ణుడికంటే
ఎక్కువైన ఆత్మబంధువులు ఎవరూ లేరని కూడా అన్నాడు. ధర్మరాజు ఆలోచన చాలా గొప్పగా
వుందని, సమస్త శత్రునాశనానికి కారణమైన రాజసూయ యజ్ఞాన్ని
త్వరగా ప్రారంభించమని, ఆయన నలుగురు తమ్ములు శత్రువులను శౌర్య సంపదతో సంహరించగల
వీరాధి వీరులని, యజ్ఞం చేశాడన్న ఘనకీర్తిని సంపాదించి ఆయన
శాసనం కింద సమస్త భూచక్రాన్ని నిలిపి వుంచమని అన్నాడు శ్రీకృష్ణుడు. తాను కూడా
ధర్మరాజు ఆజ్ఞానుసారం అన్నీ చేస్తానని, యజ్ఞానికి కావాల్సిన
సమస్త వస్తు సామగ్రిని తక్షణమే తెప్పించమని, సమస్త
శత్రువులను గెలవడానికి ఆయన తమ్ములను నాలుగు దిక్కులకు పంపించమని కృష్ణుడు
చెప్పాడు.
కృష్ణుడి సూచన, సలహా మేరకు సహదేవుడిని దక్షిణ దిక్కుకు,
నకులుడిని పడమటి దిక్కుకు, ఆర్జునుడిని ఉత్తర దిక్కుకు, భీముడిని తూర్పు దిక్కుకు శత్రు రాజులను జయించి రావడానికి చతురంగ బలాలతో
వెళ్లమన్నాడు ధర్మరాజు. నలుగురు తమ్ములూ అన్నగారు చెప్పినట్లు నలు దిక్కులకు పోయి, వీరాధివీరులైన రాజులందరినీ జయించి, వెనక్కు వచ్చి, ధర్మరాజుకు నమస్కరించి, తాము ఏఏ దేశాల రాజులను ఎలా
గెలిచింది వివరించారు. ఒక్క జరాసంధుడు మాత్రం ధర్మరాజు అధికారాన్ని ఆమోదించలేదని
చెప్పాడు అర్జునుడు. జరాసంధుడిని చంపటానికి తనకు ఉద్ధవుడు చెప్పిన ఉపాయం ప్రకారం, తాను, భీమార్జునులు కలిసి బ్రాహ్మణ వేషంలో మగధ
దేశాధిపతి దగ్గరికి వెళ్లి, యుద్ధ బిక్ష ప్రసాదించమని అడిగి,
ఆయనను అంగీకరింప చేసి, జరాసంధుడిని భీముడితో చంపిస్తానని
అంటాడు కృష్ణుడు.
ఆ తరువాత భీమార్జునులు, శ్రీకృష్ణుడు కలిసి బ్రాహ్మణుల వేషాలు ధరించి, జరాసంధుడి
రాజధానైన గిరివ్రజ పురంలోకి పోయి, జరాసంధుడిని కలిశారు.
ఆయన్ను, ఆయన దాతృత్వాన్ని పొగిడారు వారు. బలి చక్రవర్తితో, శిబితో పోల్చారు. వారి మాటలు విని ఆశ్చర్యంగా చూశాడు వారిని. వారు
బ్రాహ్మణ వేషంలో వచ్చిన రాజులని గ్రహించాడు. బ్రాహ్మణులు కోరింది ఏదైనా ఇచ్చి
తీరుతానని నిశ్చయించుకున్నాడు. కృష్ణభీమార్జునులను చూసి,
ఏంకావాలో కోరుకొమ్మన్నాడు. యుద్ధ బిక్షను ప్రసాదించమని అడిగాడు శ్రీకృష్ణుడు.
తామెవరో చెప్పాడు. తమ ముగ్గురిలో ఎవరితోనైనా జరాసంధుడు ద్వంద్వ యుద్ధం చేయడం తమ
అభిమతం అన్నాడు. తనను యుద్ధంలో ఎదిరించి కృష్ణుడు పోరాడలేడని, అర్జునుడు తనకన్నా
చిన్నవాడని, వాయుపుత్రుడే తనతో సరి సమానంగా యుద్ధం చేయగల
బలశాలి అని, కాబట్టి భీమసేనుడితో యుద్ధం చేస్తానని అంటూ, భీముడిని యుద్ధానికి పిలిచాడు. ఒక భయంకరమైన గద తెప్పించి భీముడికి
ఇచ్చాడు జరాసంధుడు.
పురం బయటకు వెళ్లి భీమజరాసంధులు
యుద్ధానికి సిద్ధమయ్యారు. వారి మధ్య యుద్ధం మహా భయంకరంగా సాగింది. వారి ద్వంద్వ
యుద్ధం ఉగ్రరూపాన్ని దాల్చింది. ఒకరినొకరు కొట్టుకుంటూ ఘోరాతిఘోరంగా యుద్ధం
చేశారు. ఇద్దరి గదాయుధాలు ముక్కలయ్యాయి. బాహువులతో ముష్టియుద్ధానికి దూకారిద్దరూ.
ముష్టి యుద్ధం కూడా ఉగ్ర స్థాయికి చేరుకుంది. శ్రీకృష్ణుడు భీముడికి తన
దివ్యశక్తితో అలసట లేకుండా చేసి అత్యంత బలాన్ని ప్రసాదించాడు. భీముడు చూస్తుండగా
ఒక చెట్టు కొమ్మ చివరను పట్టుకుని దానిని రెండుగా చీల్చేశాడు. జరాసంధుడిని అలా
చీల్చమని పరోక్షంగా సంజ్ఞ చేశాడలా. భీముడు జరాసంధుడిని కింద పడేసి, శరీరాన్ని
రెండుగా చీల్చేసి, పెద్దగా అరిచాడు. కృష్ణార్జునులు భీముడిని
అభినందించారు. కృష్ణుడు జరాసంధుడి కొడుకు సహదేవుడికి పట్టం కట్టాడు. చెరసాలలో
వున్న రాజులను బంధవిముక్తులను చేశాడు. వారంతా కృష్ణుడిని స్తుతించారు.
కృష్ణుడు ఆ తరువాత భీమార్జునులతో
కలిసి ఇంద్రప్రస్థ పురం చేరుకున్నాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడికి నమస్కరించి, ఆయన అంగీకారంతో రాజసూయ యాగం చేయడానికి బ్రాహ్మణులను
ఋత్విజులుగా ఆహ్వానించాడు. మహామునులెందరినో యజ్ఞానికి ఆహ్వానించాడు. కురుకుల
వృద్ధులను ఆహ్వానించాడు. గురూత్తములను పిలిచాడు. దుర్యోధనాదులను ఆహ్వానించాడు.
బ్రాహ్మణులు, అనేకమంది రాజులు రాజసూయ యాగానికి వచ్చారు. ఏ
లోపం లేకుండా ధర్మరాజు యజ్ఞదీక్షను స్వీకరించాడు. కురు సార్వభౌముడైన దుర్యోధనుడిని, కర్ణుడిని, భీముడిని, ఆర్జునుడిని, నకులుడిని, సహదేవుడిని,
ద్రౌపదీదేవిని, ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క పనిలో నియమించాడు ధర్మరాజు.
బ్రహ్మాది దేవతలు యజ్ఞం చూడడానికి
వచ్చారు. శాస్త్రోక్తంగా రాజసూయ యాగం జరిగింది. హవిస్సులను ఆయా దేవతలకు అందచేశారు.
యజ్ఞం పరిసమాప్తి చివరిరోజున ధర్మరాజు ఋత్విజులను, సదస్యులను, గురువులను, బ్రాహ్మణులను పూజించాడు.
అప్పుడు ‘అగ్రపూజ’కు అర్హుడు ఎవరని ధర్మరాజు ప్రశ్నించాడు.
పరమాత్ముడైన శ్రీకృష్ణుడు అగ్రపూజార్హుడు అని సహదేవుడు అన్నాడు. ఆయనక్కడ వుండగా
వేరేవాడు ఎలా అర్హుడవుతారని ప్రశ్నించాడు. అక్కడున్న పెద్దలంతా సహదేవుడు
చెప్పినట్లే చేయమని ధర్మరాజుకు చెప్పారు. ధర్మరాజు అత్యంత భక్తి భావంతో
శ్రీకృష్ణుడి పాదపద్మాలను కడిగాడు. పవిత్ర జలాలను తన శిరస్సు మీద చల్లుకున్నాడు.
కుంతీదేవి, భీమార్జున, నకులసహదేవులు, ద్రౌపదీదేవి కూడా జలాలను
చల్లుకున్నారు.
అక్కడే వున్న శిశుపాలుడు
శ్రీకృష్ణుడికి జరుగుతున్న ఆ సన్మానాన్ని సహించలేకపోయాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు.
కృష్ణుడికి అగ్రపూజ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇదంతా వివేకం లేని పనన్నాడు.
కృష్ణుడు కులగోత్రాలు లేనివాడన్నాడు. వావివరుసలు లేనివాడన్నాడు. జారుడని, జన్మాంతందాకా
చోరుడని నిందిస్తూ కృష్ణుడు అగ్రపూజకు అర్హుడు కాడన్నాడు. శిశుపాలుడు ఎంతగా
నిందిస్తున్నా శ్రీకృష్ణుడు మొదలు పట్టించుకోలేదు. కాని సభాసదులు ఆ నిందలు
భరించలేకపోయారు. శిశుపాలుడిని ఎదిరించారు. పాండవులతో యుద్ధానికి దిగాడు
శిశుపాలుడు. అప్పటిదాకా మౌనంగా వున్న శ్రీకృష్ణుడు శిశుపాలుడిని కోపంగా చూసి, తన సుదర్శన చక్రంతో శిశుపాలుడి శిరస్సును ఖండించాడు.
శిశుపాలుడి శరీరం నుండి తేజస్సు వెలువడి శ్రీకృష్ణుడిలో కలిసిపోయింది.
ఆ తరువాత ధర్మరాజు సన్మానించాల్సిన
వారందరినీ సన్మానించాడు. ద్రౌపదీదేవితో కలిసి అవభ్రుత స్నానానికి గంగానదికి పరివార
సమేతంగా పోయాడు ధర్మరాజు. రాజసూయ యాగం చూడడానికి వచ్చిన బ్రహ్మాది దేవతలు సకల
సత్కారాలు పొంది వెళ్లిపోయారు. శ్రీకృష్ణుడిని మరికొంత కాలం ఇంద్రప్రస్థ పురంలోనే వుండమని
ధర్మరాజు కోరడంతో ఆయన పాండవులతో కలిసి అక్కడే వున్నాడు. దుర్యోధనుడు మాత్రం ఆయన
సహజ గుణానికి అనుగుణంగా అసూయ పడ్డాడు. ఆ తరువాత కొన్నాళ్లకు శ్రీకృష్ణుడు
ధర్మరాజును వీడ్కొని, భార్యలతో, హితులతో, బంధువులతో కలిసి ద్వారకానగారానికి వెళ్లాడు.
(బమ్మెర
పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment