సాల్వుడిని, దంతవక్త్రుడిని వధించిన శ్రీకృష్ణుడు
శ్రీ మహాభాగవత కథ-78
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును
కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద
నిర్విఘ్నరీతి ‘జ్వాలా’
మతినై
శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని
పరిణయమాడడానికి తీసుకుని వస్తున్నప్పుడు, శిశుపాలుడికి సహాయంగా వచ్చి ఓడించబడిన సాల్వమహీపాలుడు కృష్ణుడి మీద పగబూనాడు.
యాదవుడనేవాడు లేకుండా చేస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసి అది నెరవేర్చుకోవడానికి శివుడి
గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అతడి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై
సాల్వుడిని వరం కోరుకొమ్మన్నాడు. తాను ఆకాశమార్గంలో కోరిన విధంగా సంచరించడానికి ఒక
గొప్ప వాహనాన్ని ప్రసాదించమని అడిగాడు సాల్వుడు. తగిన విమానాన్ని నిర్మించి
సాల్వుడికి ఇవ్వమని శివుడు మయుడికి చెప్పాడు. మయుడు శివుడు చెప్పినట్లే ‘సౌభకం’ అనే పేరుగల విమానాన్ని నిర్మించి
సాల్వుడికి ఇచ్చాడు. ఆ విమానాన్ని ఎక్కి ద్వారకానగారానికి పోయి ఆ పురవాసులను
నిర్బంధించసాగాడు సాల్వుడు.
ద్వారకానగారాన్ని అల్లకల్లోలం చేశాడు
సాల్వుడు. విమానంలో కూచుని ఆకాశం నుండి చెట్లను, రాళ్లను యాదవులమీద కురిపించేవాడు. సాల్వుడి చేతిలో
ద్వారకానగరం నాశనం కాబడింది. ఇదంతా ప్రద్యుమ్నుడు గమనించాడు. రథాన్ని అధిరోహించి
సాల్వుడితో యుద్ధానికి వెళ్లాడు. ఆయన వెంట యాదవ శ్రేష్ఠులు కూడా వెళ్లారు.
యాదవ-సాల్వ సైన్యాల యుద్ధం దేవ-దానవ యుద్ధాన్ని తలపింప చేసింది. సాల్వుడి మాయలని
ప్రద్యుమ్నుడు చేధించాడు. మహాపరాక్రమంతో యుద్ధం చేశాడు. సాంబుడు కూడా సాల్వుడిని
ఎదుర్కున్నాడు. సౌభక విమానం మీద బాణాలు వేశాడు. సాత్యకి అదే పని చేశాడు. ఇలా
ఒక్కొక్క యదువీరుడు వారి-వారి పరాక్రమానికి అనుగుణంగా యుద్ధం చేశారు. సాల్వుడికి
అమితమైన కోపం వచ్చింది. అతడి విమానం తన అమోఘమైన మాయలను చూప సాగింది. భీభత్సంగా తన
మాయలన్నీ ప్రదర్శిస్తూ యాదవుల గుండెలు కలతపడేట్లు రెచ్చిపోయింది. దీంతో సాల్వుడికి
ఎక్కడలేని ధైర్యం వచ్చింది. మరింత భీకరంగా పోరాడాడు. యాదవ సైన్యం కూడా వెనక్కు
తగ్గలేదు.
ప్రద్యుమ్నుడికి, సాల్వుడి మంత్రి ద్యుముడికి మధ్య జరిగిన
యుద్ధంలో ద్యుముడిని చంపాడు ప్రద్యుమ్నుడు. యుద్ధరంగం మొత్తం భీభత్సంగా తయారైంది.
ఎవరూ తగ్గకుండా 27 రోజులపాటు రెండు సైన్యాలూ యుద్ధం చేశాయి. ఇంద్రప్రస్థపురం నుండి
ద్వారకకు వస్తున్న శ్రీకృష్ణుడు శత్రువులతో యుద్ధం చేస్తున్న యాదవ వీరులను, ఆకాశవీధిలో వున్న సౌభక విమానాన్ని, అందులో వున్న
సాల్వుడిని చూశాడు. తన రథాన్ని సౌభకం దగ్గరికి పోనిమ్మన్నాడు సారథిని. ఇది గమనించి
సాల్వుడు పరాక్రమంతో ఒక్కసారి ముందుకు దూకాడు. శక్తి ఆయుధాన్ని శ్రీకృష్ణుడి సారథి
దారుకుడి మీద ప్రయోగించాడు. దాన్ని శ్రీకృష్ణుడు పొడి చేసి నేలకూల్చాడు. తన
బాణాలతో కృష్ణుడు సాల్వుడిని బాధించాడు. మాటల యుద్ధానికి దిగిన సాల్వుడు, తన
స్నేహితుడు శిశుపాలుడిని శ్రీకృష్ణుడు సంహరించినందుకు,
రుక్మిణిని ధర్మం తప్పి వరించినందుకు నిందించాడు. శ్రీకృష్ణుడు అప్పుడు విసిరిన గద
దెబ్బకు సౌభక విమానంతో సహా పారిపోయాడు సాల్వుడు.
ఇదిలా వుండగా ఒక వ్యక్తి ఆకాశం నుండి
శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, ఆయన
తండ్రైన వసుదేవుడిని సాల్వుడు పట్టి బంధించి తీసుకుపోయాడని చెప్పాడు. శ్రీకృష్ణుడు
కొంతసేపు చింతించాడు. ఇంతలో సాల్వుడు తన మాయా బలంతో మళ్లీ కృష్ణుడి ముందుకు
వచ్చాడు. మాయా వసుదేవుడిని చూపిస్తూ, సాల్వుడు, అతడి శిరస్సును ఖండిస్తానని బెదిరించాడు. మాయా వసుదేవుడి తల నరికి సౌభక
విమానంలో వెళ్లిపోయాడు. జరిగినదంతా మిధ్య అని యాదవ వీరులు కృష్ణుడికి చెప్పారు.
అప్పుడు శ్రీకృష్ణుడు సాల్వుడిని చంపి తీరాలని నిశ్చయించుకున్నాడు. తీవ్ర బాణ
వర్షంతో ఆకాశమంతా కప్పేశాడు. సాల్వుడి కిరీటాన్ని,
ధనుస్సును, కవచాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. గద విసరి విమానాన్ని పొడి పొడి
చేశాడు. అది నేల కూలింది. దాన్ని సముద్ర మధ్యలో పడేట్లు చేశాడు కృష్ణుడు.
సాల్వుడు పౌరుషంతో గదను ధరించి
శ్రీకృష్ణుడి మీదికి వచ్చాడు. గదను పట్టుకున్న వాడి చేతిని ఖండించాడు కృష్ణుడు. సుదర్శన
చక్రాన్ని ప్రయోగించి సాల్వమహీపాలుడి శిరస్సును ఖండించాడు. ఇది చూసిన శిశుపాలుడి
తమ్ముడు దంతవక్త్రుడు శ్రీకృష్ణుడి మీదికి వచ్చాడు. గద ధరించి శ్రీకృష్ణుడు
వాడికెదురుగా వెళ్ళాడు. దంతవక్త్రుడు పెద్ద గద తీసుకుని కృష్ణుడి తలమీద కొట్టాడు.
ఆగ్రహంతో కృష్ణుడు ఎదురు దెబ్బ తీశాడు. కృష్ణుడి గదాఘాతానికి దంతవక్త్రుడు
ప్రాణాలు విడిచాడు. అతడి శరీరం నుండి వచ్చిన తేజస్సు శ్రీకృష్ణుడిలో లీనమైంది. దంతవక్త్రుడి
తమ్ముడు విదూరథుడు కూడా శ్రీకృష్ణుడి మీదికి యుద్ధానికి వచ్చి చచ్చాడు.
శ్రీకృష్ణుడి విజయాన్ని చూసి యాదవులు
అమితానందంతో ఆయన్ను కీర్తించారు. యుద్ధరంగం నుండి శ్రీకృష్ణుడు ద్వారకానగరంలోకి
ప్రవేశించాడు. ఆ తరువాత తన అంతఃపురంలోకి వెళ్లాడు.
(బమ్మెర
పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment