పౌండ్రక వాసుదేవుడి చావు, హస్తినను గంగలో తోసే ప్రయత్నం
శ్రీ మహాభాగవత కథ-75
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
పౌండ్రక వాసుదేవుడనే కరూశ దేశాధిపతి
శ్రీకృష్ణుడి మీద అకారణంగా ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఆ ద్వేషం పగగా మారింది.
శ్రీకృష్ణుడిని జయించాలనే కోరిక పెరిగింది. తనకొక్కడికే భూమ్మీద ‘వాసుదేవుడు’ అన్న పేరుండాలి కాని మరెవ్వరికీ వుండకూడదని నిశ్చయించుకుని, తన దూతను పిలిచి, కృష్ణుడి దగ్గరికి పంపాడు. ఆయన
తనను తాను వాసుదేవుడు అని పిలుచుకోవడం తప్పని చెప్పమన్నాడు దూతకు. దూత
శ్రీకృష్ణుడున్న ద్వారకానగారానికి పోయి, ఆయన సభలో
వున్నప్పుడు, రాజు తనకు చెప్పి పంపిన మాటలు అప్పచెప్పాడు. ‘సిగ్గు లేకుండా తన పేరు
పెట్టుకుని కృష్ణుడు ఎలా వ్యవహరిస్తున్నాడని’ తన రాజైన పౌండ్రక వాసుదేవుడన్న
వ్యాఖ్యలు వినిపించాడు. గోవులు మేపుకునే గోపాలుడికి తనతోటి పంతం ఎందుకని అన్నట్లు
కూడా చెప్పాడు దూత. తన ఘనతను తెలుసుకుని తనని సేవించక పోతే యుద్ధరంగంలో తనను
ఎదుర్కోవాల్సి వస్తుందనీ, అప్పుడు తన ప్రతాపం ఏమిటో
తెలుస్తుందనీ పౌండ్రక వాసుదేవుడు హెచ్చరించినట్లు దూత చెప్పాడు శ్రీకృష్ణుడికి.
తాను పౌండ్రక వాసుదేవుడికి ఇష్టం లేని
శంఖచక్రాది చిహ్నాలను ధరించి వెంటనే యుద్ధానికి వస్తున్నట్లు ఆయనకు చెప్పమని దూతతో
అన్నాడు కృష్ణుడు. ఘోర రణంలో వాడిని కుప్పకూలుస్తానని కూడా చెప్పమన్నాడు. ఈ మాటలకు
పౌండ్రక వాసుదేవుడి దూత ఉలిక్కి పడ్డాడు. భయపడ్డాడు. తన రాజు దగ్గరికి పోయి
జరిగినదంతా చెప్పాడు. దానితో పౌండ్రక వాసుదేవుడికి కృష్ణుడంటే పగ మరింత పెరిగింది.
కృష్ణుడు పౌండ్రక వాసుదేవుడి మీదకు పరమోత్సాహంగా దండయాత్రకు బయల్దేరాడు. అతి
వేగంగా కాశీనగరానికి చేరుకున్నాడు. పౌండ్రక వాసుదేవుడు కూడా రణోత్సాహంతో
యుద్ధరంగానికి వచ్చాడు. ఆయన మిత్రుడు కాశీరాజు ఆయనకు సహాయంగా తన సైన్యాన్ని
తీసుకుని వచ్చాడు.
కృత్రిమమైన శంఖం, చక్రం, గద, శార్జ్ఞ్గం,
కౌస్తుభమణితో పౌండ్రక వాసుదేవుడు యుద్ధానికి వచ్చాడు. వాడిని తేరిపార చూశాడు
కృష్ణుడు. వాడి వేషం చూసి కృష్ణుడు నవ్వడంతో పౌండ్రక వాసుదేవుడికి కోపం వచ్చింది.
ధనుర్బాణాలు ధరించి కృష్ణుడిమీద బాణాలు కురిపించాడు. ఆయుధం వెంట ఆయుధాన్ని
ప్రయోగించాడు. ఆ ఆయుధాలన్నిటినీ తుంచివేశాడు కృష్ణుడు. తన పాంచజన్యాన్ని
పూరించాడు. సమస్త శత్రు సైన్యాన్ని హతం చేశాడు కృష్ణుడు. శ్రీకృష్ణ పౌండ్రకుల ఘోర
సంగ్రామంలో రక్తం ప్రవాహం కట్టింది. పౌండ్రకుడిని తీవ్రంగా హెచ్చరిస్తూ, వాడి రథాన్ని విరగ గొట్టాడు కృష్ణుడు. సుదర్శన చక్రంతో పౌండ్రకుడిని
సంహరించాడు. అంతటితో ఆగకుండా కాశీరాజును కూడా చంపాడు. వాడి తలను కాశీపట్టణంలో
పడేట్లు కొట్టాడు.
పౌండ్రక వాసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ
ధరించే శంఖచక్రాది చిహ్నాలు ధరించి, అతడిమీద
కోపంతో అనుక్షణం తలుస్తూ వుండడం వల్ల మోక్షసామ్రాజ్యాన్ని పొందగలిగాడు.
యుద్ధరంగంలో ఇలా జరుగుతే, అక్కడ కాశీనగరంలో పడిన తలను చూసి కాశీపతి పత్నులంతా
దుఃఖించారు. కాశీరాజు కుమారుడు సుదక్షిణుడు శ్రీకృష్ణుడిని సంహరించడానికి ఉపాయం
వెతక సాగాడు. పరమేశ్వరుడిని పూజించగా శంకరుడు అతడి పట్ల కరుణ వహించి ఏం కావాల్నో
అడగమన్నాడు. కృష్ణుడిని యుద్ధంలో గెలిచే విధానం చెప్పమని ప్రార్థించాడు. అభిచార
హోమం చేసి అగ్నిహోత్రుడిని సంతృప్తి పరిస్తే అతడు సుదక్షిణుడి కోరిక
నేరవేరుస్తాడని చెప్పాడు శివుడు. సుదక్షిణుడు అలాగే చేయగా అగ్నికుండం నుండి ఒక
కృత్య ఆవిర్భవించింది. అతి భయంకారాకారంతో బయల్దేరిందది. అతి వేగంగా కృష్ణుడి
నగరానికి వచ్చింది. దాన్ని చూసి భయపడిన ద్వారాకావాసులు శ్రీకృష్ణుడి చెంతకు
చేరారు. రక్షించమన్నారు. సుదక్షిణుడు పంపిన కృత్యను వధించాలని నిర్ణయించాడు
కృష్ణుడు.
శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని
సుదక్షిణుడు ప్రయోగించిన కృత్య మీదకు పంపాడు. తన మీదకు వస్తున్న చక్రాన్ని చూసి
భయపడకుండా దాని మీద పడపోయింది కృత్య. అప్పుడు సుదర్శన చక్రం కృత్యమీద అగ్నిజ్వాలలు
కురిపించింది. ఆ మంటల వేడి తట్టుకోలేక కృత్య తన రౌద్రాన్ని విడిచి పెట్టి తిరుగు
ముఖం పట్టింది. సుదర్శన చక్రం కాశీ పట్టణం ప్రవేశించి, అక్కడ అభిచార హోమం చేస్తున్న సుదక్షిణుడిని, చేయిస్తున్న ఋత్విజులను దగ్దం చేసింది. కాశీపురాన్ని భస్మం చేసింది.
తృప్తి చెందిన చక్రం చివరకు తన రౌద్రాకారం వదిలి, తిరిగి
వచ్చి శ్రీకృష్ణుడి పక్కనే నిలిచి ఆ పరమాత్ముడి సేవలో వుండిపోయింది.
ఇదిలా వుండగా, ద్వివిదుడనే వానర నాయకుడు నరకాసురుడిని చంపిన కృష్ణుడి మీద
కోపంతో కృష్ణ పాలిత ప్రాంతాలను ధ్వంసం చేశాడు. ఒకనాడు ద్వివిదుడు రైవత పర్వతం
దగ్గరికి వెళ్లి, అక్కడ జూదం ఆడుతున్న బలరాముడిని చూశాడు.
చూసి వివిధ రకాల వానర చేష్టలు చేశాడు. వాడిని ఉపేక్షించి లాభం లేదని తలచిన
బలరాముడు వాడితో యుద్ధానికి దిగాడు. చివరకు వాడిని సంహరించాడు.
ఇదిలా వుండగా, దుర్యోధనుడి కుమార్తె లక్షణ వివాహ సమయంలో శ్రీకృష్ణుడి (జాంబవతి)
కుమారుడు సాంబుడు ఆమెను ఎత్తుకుపోయాడు. కౌరవులు అతడితో యుద్ధానికి దిగారు. ఆ
యుద్ధంలో కౌరవుల పక్షాన కర్ణుడు మొదలైన మహా వీరులు కూడా వున్నారు. అయినప్పటికీ
సాంబుడు అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. కౌరవ వీరులు ఒక్కసారిగా సాంబుడిని
చుట్టుముట్టారు. అతడిని బందీని చేశారు. లక్షణ సహితంగా అతడిని హస్తినాపురానికి
తీసుకువచ్చారు కౌరవులు.
ఈ విషయమంతా నారదుడు యాదవులకు చెప్పగా
వారంతా కౌరవుల మీదికి యుద్ధానికి బయల్దేరారు. బంధువుల మీద యుద్ధం వద్దని చెప్పి, వారిని యుద్ధం విరమింప చేసి, బలరాముడు హస్తినాపురానికి పోయి, వూరి బయటున్న ఉద్యానవనంలో విశ్రమించాడు. తాను వచ్చిన పని తెలియచేయడానికి
ఉద్ధవుడిని కౌరవుల దగ్గరికి పంపాడు. బలరాముడు వచ్చిన సంగతి విన్న కౌరవులు ఉద్ధవుడి
వెంట బలరాముడి దగ్గరికి ఆయన్ను చూడడానికి వెళ్లారు. సాంబుడిని బంధించడం తప్పని
బలరాముడు చెప్పగా దుర్యోధనుడికి కోపం వచ్చింది. యాదవులను నిందించాడు. వారితో
చుట్టరికం అక్కరలేదన్నాడు. సాంబుడిని విడిపించడం అసంభవమని చెప్పి ఆగ్రహంతో
దుర్యోధనుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. బలరాముడు మండి పడ్డాడు. తన బలాన్ని, శౌర్యాన్ని యుద్ధంలో చూపాలనుకున్నాడు. శ్రీకృష్ణుడి మహిమ వారికి తెలియదు
కదా అనుకున్నాడు.
ధారుణి మీద ఇక కౌరవ వంశమే లేకుండా
చేయాలనుకున్న బలరాముడు ఉగ్రాకారుడై తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ నాగలిని
ఎత్తి పట్టుకున్నాడు. తన నాగలిని చొప్పించి,
హస్తినాపురం ఉన్నంత మేరకు మొత్తం గడ్డను పెకలించి గంగానదిలో పడవేయబోయాడు. అప్పుడు
హస్తినాపురం గడగడ వణికింది. గోపురాలు, ప్రాకారాలతో సహా
సమస్తం తలకిందులై పట్టణం ఒరిగిపోయింది. హస్తిన ప్రజలు భూమ్మీద అడుగు మోపలేక
ఆర్తిచెందారు. ఇదంతా బలరాముడి పనని కౌరవ నాథులు గుర్తించారు. కలవర పడ్డారు.
బలరాముడి శరణు కోరాలని నిశ్చయించారు. సాంబుడిని, లక్షణను
అలంకరించి బలరాముడి దగ్గరికి తీసుకు వచ్చి దుర్యోధనాదులు ఆయనకు సాష్టాంగనమస్కారం
చేసి ఆయన్ను స్తుతించారు. తమ అజ్ఞానాన్ని మన్నించమని వేడుకున్నారు. ఆయన శరణు
కోరుతున్నామని అన్నారు. తాను హస్తినను గంగలో ముంచనని, వారు
నిశ్చింతగా వారి నివాసాలకు వెళ్లమని చెప్పాడు బలరాముడు.
లాంఛనంగా తన కూతురు లక్షణను
అత్తవారింటికి పంపుతూ, యాదవులను సాగనంపాడు దుర్యోధనుడు. బలరాముడు
పరమానందంతో కొడుకును, కోడలిని తీసుకుని ద్వారక చేరుకున్నాడు.
ఇప్పటికీ హస్తినాపురం దక్షిణం వైపు కొంచెం పైకి లేచి, ఉత్తరం
భాగం గంగానది వైపు కొంచెం కుంగి వున్నట్లుగా వుంటుంది.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం,
రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment