శ్రీకృష్ణుడి మహిమను తెలుసుకున్న నారద మహర్షి
శ్రీ మహాభాగవత కథ-76
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించి
ఆయన భవనంలో వున్న పదహారువేలమంది కన్యలను వివాహం చేసుకున్నాడన్న వార్త నారద మహర్షి
విన్నాడు. ఆ కన్యలందరికీ, ఒక్కొక్కరికి, ఒక్కో
రూపంలో దర్శనం ఇచ్చి సంతోషపరిచాడన్న విషయం కూడా విని,
శ్రీకృష్ణుడి వైభవాన్ని స్వయంగా చూడాలని ద్వారకానగారానికి వచ్చాడు నారదుడు. ఆయన
చూసిన ద్వారక శ్రీకృష్ణుడి నివాసం కావడంతో, అది, ఇంద్రుడి అమరావాతీ నగరంలా శోభాయమానంగా మెరిసిపోతున్నది. ద్వారకానగరంలో
ప్రవేశించిన నారద మహర్షి విశ్వకర్మ నిర్మితమైన పదహారు వేల మేడలను చూశాడు. స్ఫటిక
స్తంబాలతో కట్టబడి, మళ్లీ మళ్లీ చూడాలనిపించే బహుసుందరంగా
వున్న ఆ సౌధాలను నారదుడు తనివితీరా చూశాడు.
ఒకానొక సౌధంలో ప్రవేశించిన నారదుడికి
స్వర్ణసింహాసనం మీద కూర్చుని, కొలువై వున్న
శ్రీకృష్ణుడు ఆయన్ను చూసి ఎదురు వెళ్లాడు. శ్రీకృష్ణుడు దేవర్షికి నమస్కరించి తన
సింహాసనం మీద ఆ దేవర్షిని కూచోబెట్టాడు. నారద మహర్షి పాద తీర్థాన్ని తన శిరస్సు
మీద ధరించాడు. నారదుడిని, తానేం చేయాలో ఆనతి ఇవ్వమన్నాడు. శ్రీకృష్ణుడి పాదపద్మాల
మీదే తన ధ్యాస సదా నిలిపే విధంగా వరమియ్యమని కోరాడు నారదుడు. నారదుడి మాటలకు
శ్రీకృష్ణుడు ప్రసన్నమయ్యాడు.
శ్రీకృష్ణుడి యోగమాయా ప్రభావాన్ని
తెలుసుకోవడానికి నారదుడు అక్కడి నుండి ఇంకొక మందిరానికి పోయాడు. అక్కడ ఉద్ధవుడితో
జూదం ఆడుతూ కనిపించిన శ్రీకృష్ణుడిని చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ కూడా శ్రీకృష్ణుడి
సత్కారాలను పొందాడు. వేరొక మందిరానికి పోయిన నారదుడికి శ్రీకృష్ణుడు ఆయన పుత్రులతో
కలిసి ఆనందిస్తున్న దృశ్యం కనిపించింది. మరొక మందిరంలో కూడా శ్రీకృష్ణుడిని
చూశాడు. మరొక మందిరం ఉద్యానవనంలో పత్నీ సమేతుడై విహరిస్తున్న కృష్ణుడిని చూశాడు.
ఇంకో ఇంట్లో ధ్యాన నిష్టలో వున్నట్లు కనిపించాడు. ఒకచోట సంధ్యావందనం చేస్తున్నాడు.
మరొక చోట పురాణం చదువుకుంటున్నాడు. ఇంకో చోట పంచ యజ్ఞాలు చేస్తున్నాడు. ఇంకో
ప్రియురాలి ఇంట్లో బలరాముడితో సమాలోచన చేస్తూ కనిపించాడు. ఒక చోట గోదానాలు
చేస్తున్నాడు.
నారదుడు అలా తిరుగుతూనే వున్నాడు. వేదస్వరూపుడు, సాక్షాత్తు పరమాత్ముడు అయిన శ్రీకృష్ణుడి మహిమలకు నారదుడు
ఆశ్చర్యపోయాడు. పరాత్పరుడైన శ్రీకృష్ణుడిని చూసి నారదుడు పరమానందభరితుడయ్యాడు.
ఆయన్ను ఒక ఇంట్లో కలిసి, ఆయన మహిమలు తెలుసుకోవడం ఎవరి తరం
కాదన్నాడు. శ్రీకృష్ణుడి దివ్య చరిత్రను కీర్తిస్తూ అందరికీ తెలియపరుస్తానని అంటూ,
నారాయణ నామస్మరణ చేసుకుంటూ వెళ్లిపోయాడు.
శ్రీకృష్ణుడు ప్రతిరోజూ రాజ కార్యాలను
నిర్వహిస్తూ వుండగా, ఒకనాడు, ఒక
బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వచ్చాడు. తన విన్నపం వినమని ప్రార్థించాడు. చెప్పడం
ప్రారంభించాడు. ‘జరాసంధుడు అనే రాజు గిరివ్రజపురం రాజధానిగా చేసుకుని, తనను
ఎదిరించిన ఇతర రాజులను బందీలుగా చేసి, తన రాజధాని నగరంలో
బంధించాడు. అలా బంధించబడిన రాజులు సుమారు ఇరవై వేలమంది వుంటారు’. వారంతా తనను
శ్రీకృష్ణుడి దగ్గరికి పంపారన్నాడు. తమని కాపాడమని వారు ప్రార్తిస్తున్నారని
చెప్పాడు. ఇలా ఆ బ్రాహ్మణుడు చెపుతున్న సమయంలో నారద మహర్షి సభలోకి ప్రవేశించాడు.
తనను దర్శించుకోవడానికి వచ్చిన నారద
మహర్షిని పాండవుల విషయం అడిగాడు శ్రీకృష్ణుడు. ధర్మరాజు ధర్మ చింతనతో రాజసూయ యాగం
చేయాలని సంకల్పించాడని, అతడు చేయబోతున్న యజ్ఞాన్ని శ్రీకృష్ణుడు
రక్షించాలని, వీలు చూసుకుని ఆయన దగ్గరికి వెళ్లి విజయం
చేకూర్చాలని నారదుడు బదులిచ్చాడు. ఇది విన్న శ్రీకృష్ణుడు అక్కడే వున్న ఉద్ధవుడి
వైపు చూసి ఏంచేద్దాం అని సలహా అడిగాడు. ధర్మరాజు యజ్ఞానికి పూనుకోవడం
హర్షనీయమైనదని, ఇదే అవకాశంగా తీసుకుని భీముడితో పోయి
జరాసందుడిని వధించవచ్చని, ఆయన దగ్గరికి బ్రాహ్మణ వేషంలో పోయి
ఏది అడిగినా యిస్తాడు కాబట్టి యుద్ధ బిక్ష వేడడం మంచిదని,
ధర్మరాజు రాజసూయ యాగాన్ని రక్షించే బాధ్యత శ్రీకృష్ణుడి మీదే వున్నదని ఉద్ధవుడు
చెప్పాడు.
నారదుడి మాటలు, ఉద్ధవుడి మాటలు విన్న శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థ నగరానికి రథం
ఎక్కి బయల్దేరాడు. ద్వారకను దాటాడు. దానికి ముందు నారదుడిని సత్కరించి సాగనంపాడు.
మధ్యలో ఒక ఉద్యానవనంలో విడిది చేశాడు. జరాసంధుడి చెరసాలలో వున్న రాజులు పంపిన
బ్రాహ్మణ దూతతో, తాను వారిని కాపాడుతానని అభయమిచ్చాడు. ఆ తరువాత ధర్మరాజు దగ్గరికి
భార్యలతో, కొడుకులతో, బంధువులతో, స్నేహితులతో కలిసి బయల్దేరాడు.
ఇంద్రప్రస్థ పురాన్ని చేరుకున్న
శ్రీకృష్ణుడు నగరానికి సమీపంలో వున్న ఉద్యానవనంలో బసచేశాడు.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ
మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment