నృగు మహారాజు చరిత్ర, వ్రేపల్లెలో బలరాముడు
శ్రీ మహాభాగవత కథ-74
వనం జ్వాలా నరసింహారావు
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును
కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద
నిర్విఘ్నరీతి ‘జ్వాలా’
మతినై
ఒక రోజున ప్రద్యుమ్నుడు మొదలైన యాదవ
కుమారులు ఉద్యానవనానికి వెళ్లి అక్కడ ఒక నీళ్లులేని పాడుబడ్డ బావిలో ఒక పెద్ద
ఊసరవెల్లిని చూశారు. దాన్ని బావి నుండి బయటకు తీద్దామని ప్రయత్నం చేశారు. ఎంత కష్ట
పడ్డా దాన్ని బయటకు లాగలేకపోయారు. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం
చెప్పారు. ఆయనను నీళ్లబావి దగ్గరికి తీసుకుపోయారు. శ్రీకృష్ణుడు దాన్ని ఒక
గడ్డిపరకను లాగి తీసినట్లు బయటకు తీశాడు. మరుక్షణంలో ఊసరవెల్లి పురుష రూపాన్ని
ధరించింది. అలా ఆయన ఎందుకు ఊసరవెల్లి ఆకారంలో ఉన్నాడో చెప్పమని అడిగాడు
శ్రీకృష్ణుడు.
జవాబుగా ఆ పురుషుడు, తాను నృగుడు అనే పేరు కల ఇక్ష్వాకు మహారాజు పుత్రుడినని,
భూమినంతా పాలించానని, సిరి సంపదలతో వర్దిల్లానని, తాను
బ్రాహ్మణులకు దానమిచ్చిన గోవుల సంఖ్య లెక్కపెట్టడం కష్టమని,
అనేక విదాలైన దానాలు చేశానని, పంచ మహా యజ్ఞాలు చేశానని
అన్నాడు. ధర్మబద్ధంగా తాను ప్రవర్తిస్తున్న సమయంలో ఒక పొరపాటు జరిగిందన్నాడు. తాను
కశ్యపుడనే బ్రాహ్మణుడికి దానం చేసిన ఆవు తిరిగొచ్చి తన మందలో కలిస్తే, అది
గ్రహించక, దాన్ని వేరే బ్రాహ్మణుడికి దానమిచ్చానని, దానివల్ల వారిద్దరి మధ్య తగాదా జరిగిందని చెప్పాడు. ఆ ఇద్దరు బ్రాహ్మణుల
మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగిందని, ఇద్దరూ తన దగ్గరికి
వచ్చారని, తనకు తన గోవు తప్ప వేరే ఏమీ అక్కరలేదని కశ్యపుడు
పట్టుబట్టాడని అన్నాడు. రెండో సారి తాను దానం ఇచ్చిన బ్రాహ్మణుడు కూడా అదే ఆవు
కావాలని పట్టుబట్టాడని, తనకేమీ పాలుపోలేదని చెప్పాడు.
ఆ తరువాత నృగుడికి అవసాన దశ
ప్రాప్తించింది. ఆయన్ను యమభటులు తీసుకుపోయి యమధర్మరాజు ముందు నిలబెట్టారు.
నృగుడిని ముందు పాపకర్మఫలాన్ని అనుభవించి, ఆ తరువాత
పుణ్యకర్మను అనుభవించమని చెప్పాడు యముడు. ఆ విధంగా చెప్పి తనను భూమ్మీద పడేస్తే
ఊసరవెల్లి రూపం కలిగిందని, కృష్ణుడి సందర్శనం వల్ల పాపపరిహారం అయిందని నృగుడు చెప్పాడు. నృగమహారాజు
చెప్పినదంతా విన్న శ్రీకృష్ణుడు అక్కడున్న యదుకుమారులకు,
రాజులకు చాలా ధర్మ విషయాలను చెప్పాడు దాని ఆధారంగా. బ్రాహ్మణుల సొమ్ము పొరపాటున
కూడా తినకూడదనేది దాని సారాంశం. ధర్మం తెలుసుకుని బ్రాహ్మణుల పట్ల పరమ భక్తితో
మెలగమని యదువీరులకు చెప్పి, శ్రీకృష్ణుడు తన మందిరానికి
వెళ్లిపోయాడు.
ఇదిలా వుండగా, ఒకనాడు బలరాముడు బంధువులందరినీ చూడాలన్న కోరికతో వ్రేపల్లెకు
వెళ్లాడు. ఆయన రాకకు యశోదాదేవి, నందుడు, గోపాలురు
సంతోషించారు. బలరాముడు ఒక నిర్జన ప్రదేశానికి వెళ్లి గోపాలురతో సంతోషంగా కాలం
గడుపుతుండగా, అక్కడికి గోపకాంతలు వచ్చారు. బలరాముడిని చూసి
వారూ సంతోషపడ్డారు. ఆయన తమ్ముడు శ్రీకృష్ణుడిని గూర్చి అడిగారు. తమనందరినీ విడిచి
వెళ్లడం ఆయనకు భావ్యమేనా అని ప్రశ్నించారు. యమునానది ఇసుక తిన్నెలమీద కలిసి
తిరిగిన రోజులను గుర్తు చేశారు. బలరాముడు వారిని అనునయించాడు. సరస వచనాలు పలికాడు.
కృష్ణుడి సందేశాన్ని వారికి వినిపించాడు. రెండు నెలలు వ్రేపల్లెలోనే వున్నాడు.
సుందరీమణులంతా తనను కొలుస్తుంటే ఆనందం పొందాడు. గోపికా రమణులతో మధువు సేవించి, కలిసి నృత్యం చేశాడు.
బలరాముడు అప్పుడు జలక్రీడ చేసి
ఆనందించాలని భావించి, యమునా నదిని తన దగ్గరికి రమ్మని పిలిచాడు.
యమునా నది మద్యం మత్తులో ఉన్నాడని బలరాముడి మాటలు నిర్లక్ష్యం చేసి, అతడి ఆజ్ఞను లెక్కచేయలేదు. ఉగ్రుడైన బలరాముడు తన నాగలి దెబ్బతో యమునా
నదిని నూరు చీలికలు చేస్తానన్నాడు. మహా ప్రవాహంతో ఉరకలు వేస్తున్న యమునానదిని
మూలంతో సహా వచ్చేట్లు ఒక్క లాగు లాగాడు. దానితో యమునా నది భయభ్రాంతురాలైంది.
సుందరి రూపాన్ని ధరించి వేగంగా బలరాముడి దగ్గరికి వచ్చింది. తనను రక్షించమని యాదవ
వీరుడిని ప్రార్థించింది. ఆయన్ను స్తుతించింది. ఆమెను పూర్వ మార్గంలో ప్రవహించమని
అన్నాడు బలరాముడు. తానిక ఆమెను హింసించనని హామీ ఇచ్చాడు. ఆ తరువాత యమునా నదిలో
జలక్రీడలాడారు.
బలరాముడికి యమునా నది వస్త్రాలను, రత్నాభరణాలను, బంగారు హారాన్ని
బహుమానంగా ఇచ్చింది. బలరాముడు నాగలితో యమునా నదిని తన వద్దకు లాగినప్పుడు ఏర్పడ్డ
చీలిక ఇప్పటికీ కనిపిస్తున్నది.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)
No comments:
Post a Comment