“రాజశేఖర రెడ్డి-రామలింగ రాజు” ప్రస్తావన లేని
108-నూట ఎనిమిది సేవల ఐదో వార్షికోత్సవం
వనం జ్వాలా నరసింహారావు
108 అత్యవసర సహాయ సేవల మాజీ కన్సల్టెంటు
సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో, తనంతట తానే స్వయంగా వెల్లడిచేసిన అంశాల ఆధారంగా, లొంగిపోయి, పందొమ్మిది నెలలకు పైగా జైలు జీవితం గడిపిన ఆ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ రామలింగ రాజుకు, ఎట్టకేలకు, షరతులతో కూడిన బెయిల్ దొరికింది. బెయిల్ దొరికే ముందర, సీబీఐ న్యాయస్థానంలో సమర్పించిన చార్జ్ షీట్ లో ఆయనపై మోపిన అభియోగాలకు లిఖిత పూర్వంగా ఇచ్చిన జవాబులో, తనపై చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని ఆయన పేర్కొన్న ట్లుగా మీడియాలో వార్తలొచ్చాయి. ఏదేమైనా విచారణ పూర్తయ్యేవరకూ నిజా-నిజాలు బయటపడవు. ఆయనకు బెయిల్ దొరకడానికి సరిగ్గా "ఐదు రోజుల క్రితం" ఆయన నెలకొల్పిన, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో ఆరంభించి-పది రాష్ట్రాలకు వ్యాపించి-అంతర్జాతీయంగా భారత దేశానికి పేరు తెచ్చిన 108 అత్యవసర సహాయ సేవలు, ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా " ఐదో వార్షికోత్సవం" జరుపుకుంది. కాకపోతే, కోట్లాది రూపాయల విరాళాన్ని తన సొంత డబ్బులతో సమకూర్చి, కోట్ల విలువ చేసే భూమిని-భవనాలను ఆయన స్థాపించిన ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఇ.ఎం.ఆర్.ఐ) కు ఇచ్చిన రామలింగ రాజు పేరు నామ మాత్రంగా కూడా ఆ ఉత్సవాల్లో ఎక్కడా వినిపించలేదు. ఆయన చైర్మన్ గా రాజీనామా చేసిన అనంతరం, ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన వ్యక్తి కానీ, అయన నియమించిన ఇ.ఎం.ఆర్.ఐ ముఖ్య కార్య నిర్వహణాధికారి కానీ ఆయనను కనీసం ఒక్కసారైనా ఆ సందర్భంగా గుర్తుచేసుకోక పోవడం శోచనీయం.
"కారే రాజుల్? రాజ్యముల్ గలుగవే? వారేరీ? సిరి మూటగట్టుకొని పోవంజాలిరే?" అని బలి చక్రవర్తి శుక్రాచార్యుడితో అన్నాడో లేదో కాని, తన గ్రంధంలో అలా-ఆ పాత్ర ద్వారా, బమ్మెర పోతన ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు జవాబు పోతన దగ్గరుందో లేదో కాని, తన జీవిత కాలంలోనే, తన "సిరి” ని (సంపద ఎలాగూ మహేంద్రా పరమైంది!) ఇతరులు మూట గట్టుకొని సమాజంలో (పేరు-ప్రతిష్టలతో) వెలిగి పోతుంటే, నిశ్శబ్దంగా కుమిలిపోవడం తప్ప ఏమీ చేయలేని దీనస్థితిలో వున్న రామలింగ రాజు సమాజానికి ఎలాంటి ప్రశ్నలు సంధించగలడనేది రాయడం పోతన లాంటి వారి తరం కూడా కాదని అనాలి. ఒక చోట చేసిన (సత్యం కంప్యూటర్స్ విషయంలో చేశాడో లేదో ఇంకా తేలాల్సి వుంది) నేరానికి, ఇంకో చోట కూడా (108 అత్యవసర సహాయ సేవలకు సంబంధించి) చేయని నేరానికి శిక్ష విధించడం న్యాయమేనా? అదే జరుగుతుందిప్పుడు.
"భద్రత మీ హక్కు" అన్న నినాదంతో, దేశంలోని ప్రతి పౌరుడికి, అత్యవసర పరిస్థితుల్లో-ఎల్ల వేళలా, తక్షణ వైద్య సహాయం, నేరాల, అగ్ని ప్రమాదాల బారి నుండి రక్షణ కలిగించాలన్న ఆయన మహత్తర ఆశయాన్ని, ప్రభుత్వ ప్రయివేట్ పథకంగా మలిచి, ఆ సేవలను తొలుత మన రాష్ట్రంలో ఉచితంగా అందచేసిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పరిస్థితీ అంతే అనాలి. 108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం నుంచి అమలు దాకా ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు, అటు రాజు జైలుకు వెళ్లేంత వరకు, ఇటు రాజశేఖర రెడ్డి అకాల మరణం పాలయ్యేంతవరకు, త్రి కరణ శుద్ధిగా, ప్రయివేట్ పరంగా-ప్రభుత్వ పరంగా రాజు-రాజశేఖర రెడ్డి కృషిచేసిన విషయం, లక్షలాది ప్రాణాలను కాపాడేందుకు దోహద పడే అత్యవసర సహాయ సేవల రూపకల్పన చేశారన్న విషయం, ఎవరిని అడిగినా చెబుతారు. కాకపోతే, ఆ సేవలను ప్రారంభించి అయిదేళ్లు పూర్తి చేసుకుని ఆగస్టు పదిహేనున వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా, ముఖ్యమంత్రి రోశయ్య మినహా ఒక్కరు కూడా వారిరువురి పేరు ప్రస్తావించక పోవడం దురదృష్టకరం. సభా ముఖంగా ప్రసంగం చేసిన సిఇఓ వెంకట్ తో సహా, ఏడాది క్రితం ఇ.ఎం.ఆర్.ఐ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జీవీ కృష్ణారెడ్డి మర్యాద పూర్వకంగానైనా వారి పేర్లను జ్ఞప్తికి చేసుకోకపోవడంలోని అంతరార్థం ఏమిటో? అసలింతకీ, ఐదేళ్ల వార్షికోత్సవం జరుపుకుంది ఆ సేవల ప్రారంభానికా? లేక ఆ సేవలను ప్రారంభించిన ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ ఆవిర్భావానికా? ఈ రెండింటికి కాదన్న రీతిలో కొందరు వక్తలు ప్రసంగించారు. "జీవీకే ఇ.ఎం.ఆర్.ఐ 108 అంబులెన్సు సేవలు ప్రారంభమై ఐదేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమం" గా దీనిని అభివర్ణించడం విచారకరం.
హైదరాబాద్ తాజ్ కృష్ణా హోటల్ లో జరిగిన "జీవీకే ఇ.ఎం.ఆర్.ఐ వార్షికోత్సవం" లో మాట్లాడిన సంస్థ చైర్మన్ జీవి కృష్ణారెడ్డి, ఐదేళ్ల కిందట 30 అంబులెన్సులతో ప్రారంభమైన 108 సేవలు, ప్రస్తుతం 752 కు చేరి, సుమారు డబ్బై వేల ప్రాణాలు కాపాడా మన్నారు. ఆ క్రమంలోనే, ఆయన, ఏ మహానుభావుడు ఆ సేవలను ప్రారంభించింది, ఎవరెవరి కృషి వల్ల 30 నుంచి 752 కు పెరిగింది (వాస్తవానికి మొత్తం అంబులెన్సులు 802) కొంచెమన్నా వివరించితే ఔదార్యంగా వుండేది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోన్ చేస్తే ఇ.ఎం.ఆర్.ఐ సేవల బాధ్యతను స్వీకరించానని (తనంతట తానుగా ఇలాంటి మహత్తర సేవా కార్యక్రమం స్వీకరించే దాతృత్వ గుణం లేదని !) ఒప్పుకున్నందుకు అభినందించాలి ఆయనను. తర్వాత ప్రసంగించిన ముఖ్యమంత్రి రోశయ్య, 108 సేవలను రామలింగ రాజు సొంత నిధులతో ప్రారంభించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సేవలను విస్తరించడానికి ప్రభుత్వ సాయం కోరిన విషయాన్ని, కోరిన వెంటనే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 95% వ్యయం భరించడానికి ఒప్పుకున్న విషయాన్ని, "సత్యం సంస్థ సమస్యల్లో వున్నప్పుడు" జీవీకే గ్రూప్ నిర్వహణ బాధ్యతను చేపట్టిన విషయాన్ని వివరించి, రాజు ప్రస్తావన, రాజశేఖర రెడ్డి ప్రస్తావన తేకపోతే, జీవీకే ఇ.ఎం.ఆర్.ఐ (చైర్మన్, సిఇఓ లతో సహా) తో పాటు అఖిలాంధ్ర ప్రజానీకం వారిద్దరినీ మరిచి పోయినట్లే అనుకోవాలి.
అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం సంస్థ ముఖ్య కార్య నిర్వహణాధికారి, వెంకట్ చంగవల్లి కూడా రామలింగ రాజు, రాజశేఖర రెడ్డిల ప్రస్తావన తేకుండా వార్షికోత్సవ ప్రసంగం చేయడం. 2005 కు పూర్వం అత్యవసర సహాయ సేవల గురించి కాని, అధునాతన అంబులెన్సుల గురించి కాని, 108 నంబర్ గురించి కాని, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల గురించి కాని, అంబులెన్స్ పైలట్ల గురించి కాని భారత దేశంలో ఎవరూ విని వుండరని చెప్పారే తప్ప, అవన్నీ కార్యరూపం దాల్చడానికి కారణ భూతులైన వారెవరో చెప్పకపోవడం బాధాకరం. కనీసం ఆయనైనా సంస్థ ఆవిర్భావం నాటినుంచి, నేటి దాకా, దాని వెనుక నున్న ఓ నలుగురైదుగురి పేర్లనన్నా "ఐదేళ్ల వార్షికోత్సవం" లో ప్రస్తావించినట్లతే బాగుండేదేమో ! వెంకట్ సంస్థ సిఇఓ బాధ్యతలు చేపట్టే నాటికే, ఏడాది పూర్తిచేకోవడమే కాకుండా, ఎన్ని రకాల పునాదులో వేయడం జరిగింది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ కేంద్రం ఏర్పాటు, ప్రోటోకాల్స్ రూపకల్పన, అంబులెన్స్ డిజైన్ కు అంకురార్పణ లాంటి పలు విషయాల్లో పురోగతి అంతో ఇంతో జరిగింది. రాజు గారికి సహాయం చేసిన-సలహాలనిచ్చిన వారెందరో వున్న విషయం వెంకట్ కంటే ఇతరులకు ఎక్కువ తెలియదు. ఐదేళ్లకోసారి, పదేళ్లకోసారి జరిగే ఇలాంటి కార్యక్రమాల్లో వారి నొక్క సారి జ్ఞప్తికి తెచ్చుకోవడం కనీస మర్యాద. రామలింగ రాజు సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో జైలుకెళ్లాల్సి వచ్చిన పూర్వ రంగంలో, ఆ తర్వాత కొంత కాలం, మీడియా ముఖంగా ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు కంట తడి పెట్టిన వెంకట్ కనీసం ఆయన గురించి ఒక్క మాటన్నా చెప్పకపోవడానికి బలవత్తరమైన కారణం వుండి వుండాలి.
కార్యక్రమం ఆరంభంలో ఇ.ఎం.ఆర్.ఐ ప్రస్థానం పై చూపించిన వీడియో ఫిల్మ్ లో, రాజు గారి ప్రోద్బలంతో చైర్మన్ ఎమిరిటస్ గా కొంతకాలం వున్న కలాం సూక్తులను వినిపించగా లేంది, రాజు చెప్పిన ఒకటి-రెండు మాటలను వల్లె వేస్తే వచ్చిన ప్రమాదమేంటో వెంకట్ మాత్రమే చెప్పగలరు. ఇ.ఎం.ఆర్.ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు రామ లింగరాజు తన పదవికి రాజీనామా చేయడంతో, అంతవరకు ఆయన ఆహ్వానం మేరకు ఇ.ఎం.ఆర్.ఐ బోర్డ్ సభ్యులుగా వున్న వారిలో చైర్మన్ ఎమిరిటస్ గా వున్న మాజీ రాష్ర్ట్రపతి భారత రత్న ఏ.పీ.జె అబ్దుల్ కలాంతో సహా నలుగురు మినహా అందరూ రాజీనామా చేశారు. ఆపదలో ఆదుకోలేని వారి ఆప్త వాక్యాలు ఎవరికి కావాలి? కలాం వాక్యాలతో మొదలైన వీడియో చిత్రంలో, చూపించాల్సిన వాటిలో, దివంగత ముఖ్యమంత్రికి 108 అత్యవసర సహాయ సేవల అంబులెన్సులతో వున్న అనుబంధానికి సంబంధించిన ఒకటి రెండు అంశాలుంటే బాగుండేదేమో! రామలింగ రాజు "విజన్" గురించి ఒక నాడు పదే-పదే పలు సందర్భాల్లో ప్రస్తావించిన వెంకట్, ఈ నాడు తొమ్మిది రాష్ట్రాల్లో ఆ సేవలు లభ్యమవడానికి ఆ "విజన్" ప్రధాన కారణమన్న విషయం చెప్పి వుండాల్సింది. అప్పట్లో రాజీనామా చేయకుండా, ఇప్పటిదాకా గవర్నింగ్ బోర్డు సభ్యుడిగా సేవలందిస్తున్న కూకట్ పల్లి ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాశ్ నారాయణను వేదిక పైకి ఆహ్వానించి, కనీసం ఆయన ద్వారానన్నా అత్యవసర సహాయ సేవల ఆవిర్భావ-ఆరోహణల గురించి చెప్పించినట్లైతే బాగుండేది.
ఇవ్వాళ 108 అత్యవసర సహాయ సేవలు లభ్యమవుతున్న తొమ్మిది రాష్ట్రాల్లో ఒక్కటి కూడా "జీవీకే ఇ.ఎం.ఆర్.ఐ" అవతారంలో వచ్చినవి కాదు. ఆ రాష్ట్రాలన్నీ రామలింగ రాజు చైర్మన్ గా వున్నప్పుడే ఆ సేవలను ఇ.ఎం.ఆర్.ఐ ద్వారా పొందాయి. వాస్తవానికి, అలా పొందిన పది రాష్ట్రాల్లో (కారణాలు ఏవైనా) జీవీకే బాధ్యతలు స్వీకరించిన తర్వాత "రాజస్థాన్" ఉపసంహరించుకుంది. సేవల విస్తరణకు ఎవరు కారణమో చెప్పకపోయినా, ఉపసంహరణకు బాధ్యులెవరో చెప్పినా బాగుండేదేమో! వీటన్నింటి కన్నా గమనించాల్సిన విషయం, సంస్థ చూపించిన వీడియోలో, ఆగస్టు పదిహేను 2005 న ప్రప్రధమంగా అత్యవసర సహాయ సేవలు ఆరంభమైన సందర్భంలో (నేటి ఐదేళ్ల వార్షికోత్సవం జరుపుకోవడానికి కారణమైన రోజు!) తీసిన ఫొటోలో రామలింగ రాజు ఫొటోని "కవర్" చేసి చూపడం! ఆ నాటి ఆ ఫొటోలో దయానిధి మారన్, రాజశేఖర రెడ్డి, రోశయ్యల సరసన రామలింగ రాజు వున్నప్పటికీ, ఆ ఫొటోని జనవరి 9, 2009 కి పూర్వం వెంకట్ కొన్ని వందల-వేల సార్లు అనేక సందర్భాల్లో చూపించినప్పటికీ, ఐదేళ్ల వార్షికోత్సవంలో ఆయన్ను తప్ప అందరినీ చూపించారు. ఇంకా నయం మారన్ ను, రాజశేఖర రెడ్డిని కూడా కత్తిరించలేదు!
ప్రపంచంలోనే ప్రప్రధమంగా సత్యం రామ లింగరాజు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి పుణ్యమా అని లక్షలాది ప్రాణాలను కాపాడడానికి ఉద్దేశించబడిన ఈ అత్యవసర సహాయ సేవలు, వ్యక్తిగత పట్టింపులకు-పంతాలకు అతీతంగా నిర్వహించాల్సిన-అమలు చేయాల్సిన ఈ సేవలు ఏ ఒక్కరి సొత్తో-సొమ్మో కావు-కాకూడదు. రాజు ఆలోచనలు కార్యరూపంలోకి తేవడానికి ఏడాదికి పైగా తోడ్పడిన వారిలో, ఆయనే స్థాపించిన హెచ్.ఎం.ఆర్.ఐ (104 సేవలు) సిఇఓ గా ప్రస్తుతం పనిచేస్తున్న డాక్టర్ బాలాజి, ఆరోగ్య-వైద్య సంబంధమైన విషయాల్లో కీలకమైన సలహాలనిచ్చిన డాక్టర్ ఎ. పి. రంగారావు, వెంకట్ కు పూర్వం సిఇఓ గా పనిచేసి మొదటి అవగాహనా ఒప్పందంపై సంతకం చేసిన వారణాసి సుధాకర్ లాంటి కొందరిని వార్షికోత్సవంలో గుర్తుచేసుకుంటే బాగుండేదేమో! వీరి లాంటి ఎందరో కలిసి రూపొందించిన ప్రణాళికా బద్ధమైన కార్యాచరణ పథకమే 108-అత్యవసర సహాయ సేవలు. కనీస మర్యాదకోసమైనా రాజు కుటుంబ సభ్యులను ఆహ్వానించి వుండాల్సింది. రామలింగ రాజు పేరును రోశయ్య ప్రస్తావించగా లేని భయం సంస్థ చైర్మన్ కు, సిఇఓ కు ఎందుకుండాలనో వారికే తెలియాలి. బహుశా కావాలనే అలా చేశారే మో? "చీమల పుట్ట పాములపాలైనట్లు", ప్రస్తుతం వారెవరినీ అనుకున్నవారు లేకపోవడం దురదృష్టకరం. రామలింగ రాజు అంబులెన్స్ పైన తన పేరు గాని, తన సత్యం సంస్థ పేరు కానీ వుండాలని మాటమాత్రంగానైనా అనలేదు. ఇప్పుడేమో అవే అంబులెన్సులు ఒకరి సొంత ఆస్తిలాగా రోడ్లపై తిరుగుతున్నాయి.
Sir,
ReplyDeleteIts very unfortunate that the persons Raju taken confidence not mentioned his name. Any way common people like us know about the originator of the concept. At the same time, Sri. Raju life and his professional career is is lesson to many. You are already started analyzing those lessons for the benefit of many. One need to read in between the lines that all. Thank you very much.
you expressed your feelings with a force. as i was not at the function, i mainly concentrated on 'gratitude' which is lacking in the day to day life particularly in political field. you and me besides rosayya garu are among those who have seen the plight of a former prime minister in a guest house. you were there in anjayya episode also. i recollected all those incidents in my blog in the back drop of 108 5th anniversary.(bhandaru srinivasrao-www.bhandarusrinivasarao.blogspot.com
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteWow !
ReplyDeleteI am upset with you that you did not add my name :) [Just kidding...]
-anil Jampala
It is unfortunate I am not understood completely, despite 4 years of friendship. I don’t think I need to prove my values of being grateful to people who contributed to EMRI’s growth on a daily / event basis.
ReplyDeleteVenkat Changavalli