Monday, August 30, 2010

పార్టీ వీడిన - పార్టీ చీల్చిన వారికి మాత్రమే రాజకీయ ఎదుగుదల : వనం జ్వాలా నరసింహారావు

సెప్టెంబర్ 3, 2010 న నాలుగో సారి
సోనియా కాంగ్రెస్ అధ్యక్షురాలు కానున్న సందర్భంగా


లాంఛనప్రాయంగా ముగియనున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ఫలితం అందరూ ఊహించిందే. గత పన్నెండేళ్ల గా రికార్డు స్థాయిలో అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన సోనియా గాంధి వరుసగా నాలుగో పర్యాయం ఎన్నిక కానుంది. అసంతృప్తిని పసికట్టిన సోనియా అత్తగారి తరహా దిద్దుబాటలోనే పయనించి, చీలికకు శ్రీకారం చుట్టి, సమూల ప్రక్షాలణ చేసి, అసలు-సిసలైన వీర విధేయులను మాత్రమే తన వెంట వుంచుకుని, వారసత్వానికి మార్గం సుగమం చేయనుందా? నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్థానంలో, ధిక్కరించి పార్టీ వీడిన ప్రముఖులకే ప్రధాని, ఉప ప్రధాని, రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవులు దక్కాయి. విధేయత, వీర విధేయత ప్రదర్శించిన వారంతా తాము అనుభవిస్తున్న పదవులను కాపాడుకోవడానికే పరిమితమయ్యారే కాని ఉన్నత శిఖరాలకు చేరుకోలేక పోయారు. ఎత్తుకు పై ఎత్తులు వేయగల కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే... ఏదీ అసాధ్యం కాదు!

ఆంగ్లేయుల పాలనలోని భారతీయ సివిల్ సర్వెంట్-రాజకీయ సంస్కర్త ఎలన్ ఆక్టేవియన్ హ్యూమ్, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు కారకుడైతే...... ఇటలీ దేశానికి చెందిన భారతీయురాలు సోనియా గాంధి, చిక్కుల్లో పడ్డ పార్టీని, ప్రక్షాలణచేసి-పునర్నిర్మించి-పూర్వ వైభవాన్ని సమకూర్చి, కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారకురాలైంది. రాజీవ్ గాంధి మరణానంతరం, సోనియా నిరాకరించిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలను అనూహ్య పరిస్థితుల్లో చేపట్టి, మైనారిటీ ప్రభుత్వానికి ప్రధానిగా సారధ్యం వహించి, ఐదేళ్లలో మెజారిటీ స్థాయికి తీసుకొచ్చినప్పటికీ, పార్టీ పరంగా అదృష్టాలు తారుమారయ్యేందుకు కారకుడయ్యాడన్న అప్రతిష్టను తెచ్చుకున్నాడు పీవీ నరసింహారావు. సోనియా విశ్వాసాన్ని కోల్పోయి పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజీనామా చేయక తప్పలేదు. జిత్తులమారిగా పేరున్న మరో వృద్ధ నాయకుడు సీతారాం కేసరికి ఆ రెండు పదవులు దక్కాయి. సీతారాం కేసరికి వ్యతిరేకంగా పలువురు సీనియర్ నాయకులు పార్టీని వీడే పరిస్థితులు తలెత్తడంతో, పార్టీ ఛిన్నాభిన్నం కాకుండా "రక్షించమని" కొందరు నాయకుల అభ్యర్థన మేరకు, నెహ్రూ-గాంధి వారసత్వ పరంపరలో ఐదో తరం ప్రతినిధిగా, సోనియా గాంధి తొలుత పార్టీ "ప్రాధమిక సభ్యత్వం" స్వీకరించారు. అచిర కాలంలోనే, "రెండు నెలల అపారమైన అనుభవంతో", పార్టీ శ్రేయోభిలాషులు కోరడంతో కాదనలేక, 1998 లో, కొందరు ఆమె "జాతీయత" ను ప్రశ్నించినప్పటికీ, అధ్యక్ష పదవిని చేపట్టి, గత పన్నెండేళ్ల గా పార్టీకి తిరుగులేని నాయకురాలిగా-మకుటంలేని మహారాణిగా, నెహ్రూ-గాంధి వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. పార్టీలో ఆమె తీసుకున్న నిర్ణయమే "ఏకాభిప్రాయం".

నెహ్రూ-గాంధి కుటుంబీకుల అనుకూల-ప్రతికూల శక్తుల, వ్యక్తుల, ముఠా రాజకీయాల మధ్య జరుగుతున్న ఆధిపత్య సమరమే, భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర. విధేయులు "అణిగిమణిగి" వుండి, దొరికిన దానితో సంతృప్తి పడుతుంటే, వ్యతిరేకులు అడపాదడపా ఎదురుతిరగకుండా వుండలేక పోయారు. మొరార్జీ దేశాయ్, విశ్వనాథ ప్రతాప సింగ్, చంద్రశేఖర్, గుజ్రాల్ ఎదురు తిరిగి పార్టీని వీడక పోయినట్లతే, ఏ నాటికీ "ప్రధాన మంత్రి" అయ్యేవారు కానే కాదు. జగ్జీవన్ రాం కు ఉప ప్రధాన మంత్రి దక్కే అవకాశమే వుండకపోయేది. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి కాగలిగింది కాంగ్రెస్ పార్టీని వీడినందునే. వారే కనుక వీర విధేయతతో పార్టీలో కొనసాగినట్లైతే, ఒక ప్రణబ్ ముఖర్జీ వలెనో, గులాం నబీ ఆజాద్ లాగానో, అలాంటి మరి కొందరి వలెనో, మంత్రివర్గంలో స్థానంతో సరిపుచ్చుకోవాల్సిందే.

భారత జాతీయ కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం, అసంతృప్తులు, ధిక్కారాలు, ఎదురీతలు, చీలికలు అంతర్భాగాలే. చాలావరకు నెహ్రూ-గాంధి కుటుంబీకుల ఆధిపత్యం చుట్టూతా నే అవన్నీ చోటు చేసుకున్నాయనాలి. విశ్లేషించి చూస్తే, ఎదురు తిరగడమైనా - చీలిక తేవడమైనా, మోతీలాల్ నెహ్రూతో మొదలెట్టి, ఆ వారసత్వ పరంపరలో ప్రతి ఒక్కరు, తమ మాట చెల్లని ప్రతిసారీ పార్టీని ప్రత్యక్షంగానో పరోక్షంగా నో వీడడమో, చీల్చడమో, "మనస్సాక్షి చెప్పినట్లు" నడచుకోమని కార్యకర్తలను ప్రోత్సహించడమో-పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేయమని సూచించడమో, వ్యతిరేకులు పార్టీని వదలి వెళ్లే పరిస్థితులు కలిపించడమో చరిత్ర చెప్పిన వాస్తవం. అలా జరిగిన ప్రతిసారీ ఆ కుటుంబీకులు పార్టీలో తమ ఆధిపత్యాన్ని పదిల పరచుకున్న విషయమూ జగమెరిగిన సత్యం. దాని వల్ల దేశానికి మేలు జరిగి వుండొచ్చు. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటై వుండొచ్చు. ఆ క్రమంలోనే ఆ వారసుల నాయకత్వం మినహా గత్యంతరం లేని అవసరం కూడా ఏర్పడింది. అదే ఇప్పటికీ కొనసాగుతోంది.

నెహ్రూ-గాంధి కుటుంబ ఆధిపత్యానికి ఆద్యుడైన ప్రధమ తరం నాయకుడు మోతీలాల్ నెహ్రూ, రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి, లండన్ లో విద్యనభ్యసించి రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో చేరిన కుమారుడు జవహర్లాల్ నెహ్రూకు, తన తర్వాత వెనువెంటనే "అధ్యక్ష బాధ్యత" అప్ప చెప్పారు. వారసత్వానికి, రెండో తరం నాయకత్వానికి, బలమైన పునాదులు, లాహోర్ లో జరిగిన 44 వ ప్లీనరీలో, 1929 లోనే వేశారు. ఆ కుటుంబానికి రాజకీయ పరంగా మద్దతిచ్చిన మహాత్మా గాంధి, ఆయన జీవించినంతవరకు, నెహ్రూను వ్యతిరేకించిన-వ్యతిరేకించగల సామర్థ్యం వుందని భావించిన వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్ర బోస్, టాండన్, పట్టాభి సీతారామయ్య లాంటి నాయకులందరినీ పార్టీలో మైనారిటీకి తగ్గించేందుకు సహకరించారనే ది వాస్తవం. స్వాతంత్ర్యం లభించిన తర్వాత అలనాటి కాంగ్రెస్ అధ్యక్షుడు ఆచార్య కృపలానీ చర్యలను తరచుగ ప్రశ్నించు తూ, తన ఆధిపత్యాన్ని నెహ్రూ ప్రదర్శించడం కూడా తిరుగుబాటు లాంటిదే. భారత దేశానికి "డొమినియన్ హోదా" విషయంలో, మోతీలాల్ పార్టీని వదిలి స్వరాజ్ పార్టీ స్థాపనకు తోడ్పడగా, కొడుకు గాంధి పక్షం వహించాడు. ముగ్గురు ప్రధాన మంత్రులను దేశానికిచ్చి, నాలుగో తరం త్వరలో ఆ పదవిని చేపట్టడానికి సిద్ధంగా వున్న అరుదైన కుటుంబం అది. నాలుగు దశాబ్దాలు వివిధ దశల్లో, పాతిక పర్యాయాలు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టిన ఘనత కూడా ఆ కుటుంబానిదే.

నెహ్రూ వారసురాలిగా ఇందిరా గాంధి తొలుత పార్టీ పగ్గాలను 1959-60 లో చేపట్టింది. తండ్రి మరణానంతరం, లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత, 1966 లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజుల్లో పార్టీలో రెండు బలమైన వర్గాలుండేవి. ఇందిర అనుయాయులైన "సామ్యవాదులు", మొరార్జీ-తదితరుల నాయకత్వంలోని "సంప్రదాయ వాదులు" ఆధిపత్యం కొరకు బహిరంగంగానే విమర్శించుకునే వారు. 1967 ఎన్నికల్లో పార్టీ విజయం సాధించినప్పటికీ, మెజారిటీ భారీగా తగ్గింది. పార్లమెంటరీ పార్టీ నాయకత్వానికి జరిగిన పోటీలో, ఆదినుంచీ నెహ్రూ-గాంధి కుటుంబ ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన మొరార్జీ దేశాయ్ ని ఇందిర ఓడించింది. మొరార్జీ తరహా సంప్రదాయ నాయకులు మరికొందరు ఇందిరకు విధేయత చూపారు అప్పట్లో. తప్పని పరిస్థితుల్లో తనను వ్యతిరేకించిన మొరార్జీ ని మంత్రివర్గంలో తీసుకుని కీలకమైన ఆర్థిక శాఖనిచ్చింది ఇందిర. బాంకుల జాతీయం, రాజా భరణాల రద్దు లాంటి విధాన పరమైన నిర్ణయాల నేపధ్యంలో, మొరార్జీ దేశాయ్ తో సహా, హేమామేమీలైన "సంప్రదాయ వాదుల" ను బయటకు పంపేందుకు, 1969 లో పార్టీని చీల్చింది ఇందిర. ఆమెతో విభేదించి, తమదే అసలైన పార్టీగా ప్రకటించి, దానికి సారధ్యం వహించి, ఆ తర్వాత జనతా పార్టీలో విలీనం చేసిన మొరార్జీ దేశాయ్ ప్రప్రధమ కాంగ్రేసేతర ప్రభుత్వ ప్రధాన మంత్రి కాగలిగారు. నెహ్రూ-గాంధి కుటుంబ వారసత్వాన్ని వ్యతిరేకించగలిగిన వారే, ప్రధాన మంత్రి స్థాయికి ఎదగ గలుగుతారని నిరూపించారాయన.

మైనారిటీలో పడిన ఇందిర వర్గం కాంగ్రేసేతర సోషలిస్టుల-వామ పక్షాల మద్దతు పొంది విప్లవాత్మక సంస్కరణలతో బలమైన నాయకురాలిగా ఎదగసాగింది. బంగ్లాదేశ్ మీద సాధించిన విజయం నేపధ్యంలో జరిగిన 1971 ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించి, కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని నాయకురాలయ్యారు. పార్టీని అంటిపెట్టుకున్న విధేయుల్లో కొందరు క్రమేపీ ఆమెను అంతర్లీనంగా వ్యతిరేకించసాగారు. పార్టీని వీడిన "యంగ్ టర్క్స్" ఎస్ చంద్రశేఖర్ ప్రధాన మంత్రి స్థాయికి, కృష్ణకాంత్ ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. ఇందిర మరో విమర్శకుడు, ఐ కె గుజ్రాల్ కూడా రాజీనామా చేసి ప్రధాన మంత్రి కాగలిగారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల పూర్వ రంగంలో, ఆమెకు అత్యంత విధేయుడుగా వున్న జగ్జీవన్ రాం ఆమెను ఎదిరించి పార్టీని వదిలి, "కాంగ్రెస్ ఫర్ డెమాక్రసీ" ని స్థాపించి, జనతా కూటమితో కలిసి పోటీ చేయడం వల్లనే ఉప ప్రధాన మంత్రి కాగలిగారు. 1977 ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన తర్వాత పార్టీలో తన వీర విధేయులకు తప్ప ఇతరులకు స్థానం లేకుండా చేసి, పార్టీని చీల్చి, ఇందిరా కాంగ్రెస్ పేరుతో పునర్నిర్మించి, ఎవరినీ నమ్మలేని పరిస్థితుల్లో 1978 లో తానే అధ్యక్ష పదవిని చేపట్టింది. అనతి కాలంలోనే అఖండ విజయం సాధించి ప్రధాని కాగలిగింది. దురదృష్టవశాత్తు, ఆమె వారసుడిగా ఎదుగుతున్న చిన్న కొడుకు సంజయ్ గాంధి దుర్మరణం పాలవడంతో, పెద్దకొడుకు రాజీవ్ గాంధిని నెహ్రూ-గాంధి కుటుంబ పాలనను కొనసాగించడానికి రాజకీయ తెరమీదికి తీసుకొచ్చింది. "వీర విధేయులు" దానికి మద్దతీయగా, "నిశ్సబ్ద వ్యతిరేకులు" మౌనం పాటించారు. సమయం కొరకు వేచి చూడ సాగారు. హత్యకు గురయ్యేంతవరకూ పార్టీ పగ్గాలు ఇందిరా గాంధి తన చేతుల్లోనే వుంచుకుని, తదనంతరం రాజీవ్ గాంధి కి వారసత్వం ఇచ్చింది. ఇక నాటినుంచి భారత జాతీయ కాంగ్రెస్‌ను ఇందిరా కాంగ్రెస్ అని వాడుకలో పిలవడం, ఏఐసీసీ (ఐ) అని ఉపయోగించడం మొదలైంది.

ఇందిర హత్యకు గురికావడంతో, నెహ్రూ-గాంధి వారసత్వంలో నాలుగో తరం పార్టీ నాయకత్వం మొదలైంది. అప్పటి వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా వున్న రాజీవ్ గాంధి నాయకు డయ్యారు. 1984 సార్వత్రిక ఎన్నికల్లో, గతంలో ఎన్నడు సాధించలేనంత భారీ మెజారిటీతో రాజీవ్ పార్టీని గెలిపించారు. భారత జాతీయ కాంగ్రెస్ వందేళ్లు పూర్తి చేసుకున్న సంవత్సరంలో 1985 లో, "ఇందిర కాంగ్రెస్ పార్టీ" అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ ను, మంత్రివర్గంలో తీసుకుని ఆర్థిక శాఖను కేటాయించాడు. దరిమిలా వీపీ సింగ్ "ధిక్కార ధోరణి" ని సహించలేని రాజీవ్, తల్లి ఇందిర ఏ విధంగా మొరార్జీ ని తొలగించిందో, అలానే, సింగ్ శాఖలో మార్పులు చేసి రక్షణ శాఖకు మార్చాడు. ఎప్పుడైతే "బోఫోర్స్" కుంభకోణానికి సంబంధించిన సమాచారం వెలుగులో తేవడానికి సింగ్ సిద్ధపడుతున్నాడని అనుమానం వచ్చిందో, రాజీవ్ ఆయనను ఆ శాఖనుంచి కూడా తప్పించడం జరిగింది. కాంగ్రెస్ ప్రాధమిక సభ్యత్వానికి, పార్లమెంటు స్థానానికి రాజీనామా చేసిన వీపీ సింగ్, 1989 లో జరిగిన ఎన్నికల్లో జనతా దళ్ అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికై, "నేషనల్ ఫ్రంట్" ప్రభుత్వానికి సారధ్యం వహించి ప్రధాన మంత్రి అయ్యారు. ఆయనే కనుక రాజీవ్ గాంధీకి "వీర విధేయుడి" గా వుండిపోయినట్లైతే, తన ఆర్థిక శాఖను కాపాడుకో గలిగే వాడే కాని, ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగేవాడు కానే కాదు. 1991 మధ్యంతర ఎన్నికల్లో ప్రచారంలో వున్న రాజీవ్ గాంధి హత్యకు గురికావడంతో ఆయన స్థానంలో పీవీ నరసింహారావు "ఏకాభిప్రాయ అభ్యర్థి" గా పార్టీ పదవిని చేపట్టి, ఎన్నికల తర్వాత ప్రధాన మంత్రి అయ్యారు.

నెహ్రూ-గాంధి వారసత్వ పరంపరకు చెందని వారికి, పార్టీ సారధ్యం-ప్రధాన మంత్రి పదవి రావడం పలువురిని ఆశ్చర్య పరిచింది. సోనియా తన చెప్పు చేతల్లో వుంటాడనుకున్న వ్యక్తి, సొంత నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో, భారత దేశ ఆర్థిక సంస్కరణల ఆద్యుడిగా మన్ననలందుకోవడం జరిగింది. రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా తెచ్చి, భవిష్యత్ ప్రధాని కావడానికి పునాదులు వేశారాయన. సోనియా ఆగ్రహానికి మాత్రం గురికాక తప్పలేదు. ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందిన పార్టీ నాయకత్వ బాధ్యతలనుంచి దయనీయంగా తొలగించారాయనను. ఆయన స్థానంలో వచ్చిన కేసరికి అదే పరిస్థితి ఎదురైంది తర్వాత. సోనియా శకం మొదలైంది. ఐదో తరం వ్యక్తిగా పార్టీ అధ్యక్షురాలైంది.

సోనియా అధ్యక్ష పదవిని అనుకున్నంత సులభంగా అధిష్టించలేదు. నెహ్రూ-గాంధి కుటుంబ వారసత్వ నాయకత్వంపై నున్న వ్యతిరేకత ప్రభావం ఆమెపై కూడా సహజంగానే పడింది. పీవీ రావడంతో ఇక వారసత్వ రాజకీయాలు స్వస్తి అని భావించిన పలువురు కాంగ్రెస్ "ఆశావహులు" నిరాశకు గురయ్యారు. ఇంతలో 2004 ఎన్నికల సంరంభం మొదలైంది. రద్దయిన లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన శరద్ పవార్, ఎన్నికల్లో కాంగ్రెస్ పక్ష ప్రధాని అభ్యర్థిగా, భారత దేశంలో పుట్టిన వారి పేరునే ప్రకటించాలన్న నినాదం లేవదీశాడు. ధిక్కార స్వరం వినిపించాడు. జన్మ తః ఇటలీ దేశస్తురాలైన సోనియాకు నెహ్రూ-గాంధి వారసురాలిగా ప్రధాని కాకూడదన్న భావం ఆయనకే కాకుండా మరి కొందరిలో కూడా ప్రస్ఫుటంగా కనిపించింది. మాట నెగ్గించుకోలేని పవార్, మాజీ లోక్ సభ సభాపతి సంగ్మాతో కలిసి "నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ" ని నెలకొల్పారు. స్థైర్యం కోల్పోని సోనియా, చాకచక్యంగా మన్మోహన్ సింగ్ ను తెర పైకి తెచ్చింది.

ఎన్నికల అనంతరం యూపీయే ప్రభుత్వానికి సారధ్యం వహించడానికి ఆమె తిరస్కరించి, ఆయనను ప్రధానిని చేసింది. ప్రణబ్ కుమార్ ముఖర్జీ గతంలో కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహించినప్పుడు, రిజర్వ్ బాంక్ గవర్నర్ గా మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఆర్థిక మంత్రి హోదా రిజర్వ్ బాంక్ గవర్నర్ హోదాకంటే పెద్దే కాకుండా, రిపోర్టింగ్ అధికారిక స్థాయి కూడా. అదే ప్రణబ్ కుమార్ ముఖర్జీ ఇప్పుడు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పనిచేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ సీనియారిటీ, సోనియా నిర్ణయం ముందు పనికి రాలేదు. ఆయనకు ప్రధాని కావాలన్న ఆశా చావలేదు. అవకాశం వస్తే, ధిక్కరించగలిగితే, వదులుకుంటాడా? గతంలో రాజీవ్ గాంధి హయాంలో, ఇందిర హత్యానంతరం జరిగిన ఎన్నికల తర్వాత, నిర్లక్ష్యానికి గురై పార్టీని వీడి సొంత కుంపటి కూడా పెట్టుకున్నారు. తిరిగి పీవీ హయాంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా స్వగృహ ప్రవేశం చేసి, పార్టీకి-సోనియాకు విధేయుడిగా ఇప్పుడు కొనసాగుతున్నారు. ఆయనలోని అలనాటి రాజీవ్ (నెహ్రూ-గాంధి) వ్యతిరేకత దేనికైనా దారితీయవచ్చునేమో! శరద్ పవార్ మనసు మార్చుకుని, సోనియా సారధ్యంలోకి పరోక్షంగా చేరినప్పటికీ ప్రధాని కావాలన్న కోరిక దేనికైనా దారితీయవచ్చు.

తనకు మద్దతు ఇస్తూనే-ఇస్తున్నట్లు నటిస్తూనే, పరోక్షంగా, అవకాశం కొరకు ఎదురుచూస్తున్న పార్టీ లోని సొంత మనుషుల వ్యవహారం సోనియాకు తెలియకుండా వుంటుందా? ప్రతిభా పాటిల్ పదవీ కాలం ముగియగానే, ఆమె స్థానంలో కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థిగా మన్మోహన్ ను ప్రతిపాదించి, ప్రధాని పీఠంపై తనయుడు రాహుల్ గాంధీని కూచోబెట్టాలంటే, నామ మాత్రం వ్యతిరేకత కూడా లేకుండా జాగ్రత్త పడాలి. బయటపడి ఏదో ఒక కారణం చూపించి, సోనియా సూచనను పాటించని వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లు ఆమెకు అసలైన శత్రువులు కారని ఆమెకూ తెలుసు. జగన్ లాంటి వారు జాతీయ స్థాయిలో సోనియాని అస్థిరపరిచలేరని కూడా అమెకు తెలుసు. వచ్చిన చిక్కల్లా "కంట్లో నలుసుల" తోనే. సోనియాకు కాంగ్రెస్ పార్టీని మరో మారు ఏదో ఒక రకంగా, అత్తగారి తరహాలో చీలిస్తేనో, లేక, ఏదో కారణాన జాతీయ స్థాయిలో ఆమెను వ్యతిరేకించేవారు చీలిపోతేనే మంచిది. నెహ్రు-గాంధీ వారసత్వం చెక్కు చెదరకుండా వుండాలంటే కాంగ్రెస్ పార్టీలో మరో ప్రక్షాళన జరగాల్సిందే.

కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గురించి అందరూ మాట్లాడే వారే. క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా వున్న ఏకె ఆంటోనీ ఒకప్పుడు పార్టీని వీడిన వాడే. ప్రణబ్ ముఖర్జీ పార్టీని వీడిన వాడే. ఇందిరకు వ్యతిరేకంగా కాంగ్రెస్ (ఐ) నుంచి బయటకొచ్చి, భారత జాతీయ కాంగ్రెస్ (అర్స్) స్థాపించినప్పుడు అందులో చేరిన ప్రముఖుల్లో ఆంటోనీ ఒకరు. సోనియాకు సన్నిహితుడైన ప్రియరంజన్ దాస్ మున్షీ కూడా ఒకరు. ఆంటోనీ అంతటితో ఆగకుండా, కాంగ్రెస్ (ఎ) ను స్థాపించి, 1982 లో స్వగృహ ప్రవేశం చేసి, పార్టీలో క్రమశిక్షణను కాపాడే పనిలో వున్నాడు! సోనియా ఆదేశాలిచ్చిందన్న సాకుతో, మొయిలీలు-అహ్మద్ పటేల్లు-ప్రణబ్ ముఖర్జీలు, వారు చెప్పారని ఆంధ్రా నాయకులు, జగన్ కు మంచిచెపుతున్నట్లు నటిస్తూనే, ఆమెకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. అలాంటి వారిని గుర్తించే ప్రయత్నం జరుగుతుండొచ్చు. అందుకే పార్టీలో చీలిక తప్పకపోవచ్చు.

భారత జాతీయ కాంగ్రెస్(ఆర్) కాని, భారత జాతీయ కాంగ్రెస్ (ఎస్) కాని ఆవిర్భవించవచ్చు. అనూహ్యంగా తెర పైకి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి కాంగ్రెస్ (పి) స్థాపన జరిగినా ఆశ్చర్యం లేదు. అలా జరగాలంటే, జగన్ లాంటి యువ నాయకులను వెంట వుంచుకోవాల్నా? వదిలించుకోవాల్నా? అన్న ఆలోచన చేయకుండా సోనియా వుండే అవకాశాలు లేనే లేవు!

2 comments:

  1. పర్టీ వదలిన మాజీ లోక్సభ స్పీకర్ సంగ్మా చెడాడు. కూతురిని రాహువు కి పరిచయం చేసినా ఏమీ బావుకోలేదు, అమ్మ ఆశీర్వాదం తప్ప. అందరికీ వర్కవుట్ అవదు. బాగా విశదీకరించారు, బావుంది. రాశారు.

    ReplyDelete
  2. As days goes by it is difficult to split the party by Jagan, that to when the party is in power in AP and at Center.

    He needs 70 Congress MLA's and get external help from TDP to form the government.

    ReplyDelete