ముదిరి పాకాన పడుతున్న కాంగ్రెస్ రాజకీయాలు
వనం జ్వాలా నరసింహా రావు
అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో, ఆంగ్లేయుల "విభజించి పాలించే" విధానం నర-నరాన పాకిందంటే అతిశయోక్తి కాదే మో. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో పరిణామాలను గమనిస్తే, ఒకరిపై ఇంకొకరు దుమ్మెత్తి పోసుకునే స్థితికి దిగజారి పోయిందనాలి. అధిష్ఠానం అంటే కూడా భయం లేకుండా పోతుందేమో అనిపిస్తోంది. ఒక వైపు రోశయ్య-జగన్ వర్గాలుగా, మరో పక్క సీమాంధ్ర-తెలంగాణ వాదులుగా-ఒకే ప్రాంతంలోని సమ్మతి-అసమ్మతి ముఠాలుగా-ఒకే జిల్లాలో రెండు చీలికలుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు బాహాటంగా ప్రకటనలు చేస్తున్నారు. అధిష్ఠానం తన వంతుగా, వర్గాలను-విభేదాలను, అందులోని వ్యక్తుల ఇష్టానుసారంగా, ఒక్కోసారి ఒక్కో విధంగా రెచ్చగొట్టే విధానం అవలంబిస్తుంటుంది. అప్పుడప్పుడూ, తన మాటను మరీ ఖాతరు చేయడం లేదని భావించినప్పుడు, ఒకరిద్దరి మీద తాత్కాలికంగానో-తాత్కాలిక శాశ్వతంగానో వేటు వేయడం, ఆ తర్వాత అదంతా తమ సొంత ఇంటి వ్యవహారంగా పేర్కొనడం, అందరూ సర్దుకోవడం జరుగుతుంటుంది. అంబటిపై చర్యైనా, పాల్వాయిపై మౌనమైనా, గోనె-యాష్కీ మధ్య తలదూర్చక పోవడమైనా, రాయపాటి-కన్నాల విభేదాలను నాన్చడమైనా, అధిష్ఠానం ఎత్తుగడల్లో భాగమే.
వైఎస్ జగన్మోహన రెడ్డి, ఏది జరిగినా తన మంచికేనన్న దృక్ఫదంతో, ఓదార్పు యాత్ర పేరుతో జనంలోకి దూసుకుపోతున్నాడు. సుదీర్ఘ యాత్రలో, చాలా భాగం సంయమనంతో ఉపన్యాసాలిచ్చినప్పటికీ, మనసులో మాట బయట పెట్ట దల్చుకున్నప్పుడు, వెనుకా-ముందు చూడకుండా, మాట్లాడడం భవిష్యత్ సంకేతాలకు నిదర్శనమనొచ్చు. "సహనం కోల్పోయే సమయం" ఆసన్నమైందన్న సంకేతాలనూ ఇస్తున్నాడు. మొత్తమ్మీద జగన్ వ్యవహారం ముదిరి-ముదిరి పాకాన పడిందనే అనాలి. ఓదార్పు యాత్రలో ఆయనేం మాట్లాడాడన్నది ప్రధానం కానేకాదు. ఆయన వేరుకుంపటి పెట్టినా-పెట్టకపోయినా, మునుపెన్నడూ లేని విధంగా పార్టీ సంక్షోభంలో పడిపోతున్నదనడంలో అతిశయోక్తి లేశ మాత్రం కూడా లేదు. ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చిన ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ఒక్కసారి ఓడితే మళ్ళీ అధికారంలోకి రాలేదు. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ కే ఆ మినహాయింపుంది ఇంతవరకు. దానికి కారణం ఇక్కడ ఇంతవరకు ఒకే ఒక్క బలమైన ప్రాంతీయ పార్టీ వుండడమే. బహుశా ఇక ముందు ఇక్కడ కూడా, జాతీయ కాంగ్రెస్ మనుగడ ఏదో ఒక ప్రాంతీయ పార్టీపై ఆధారపడే రోజులు రాబోతున్నాయే మో ! అందుకే జగన్ ను వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా వుండకపోవచ్చునేమో!
జగన్ అనుంగు సహచరుడిగా భావిస్తున్న కాపు వర్గానికి చెందిన నాయకుడు అంబటి రాంబాబును, పార్టీనుంచి సస్పెన్షన్ చేసిన వైనం కాంగ్రెస్ శ్రేణుల్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, చేయకూడని విధంగా, రాంబాబు విమర్శలు చేశాడన్న ఆరోపణతో ఆయన్ను సస్పెండ్ చేసింది అధిష్ఠానం. రాంబాబు సస్పెన్షన్ వ్యవహారంతో ఆగకుండా, వైఎస్ జగన్ ఓదార్పు యాత్రలో రోశయ్యపై చేసినట్లు మీడియాలో వచ్చిన వ్యాఖ్యలకు సంబంధించిన నివేదికలు కూడా తెప్పించుకుంటామని మొయిలీ అన్నారు. జగన్ ధిక్కార ధోరణిని సహించబోమన్న సందేశం ఆయన మాటల్లో స్పష్టంగా వ్యక్తమైంది. అంతటితో ఆగకుండా జగన్ మరో వీరాభిమాని, కాంగ్రెస్ కిసాన్ సెల్ కార్యదర్శి గట్టు రామచంద్ర రావుకు ఉద్వాసన జరిగింది. మరో జగన్ వీరాభిమాని రోశయ్యను "చేతకాని సీఎం" అంటూ పత్రికలకెక్కింది. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణానంతరం కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా విశ్లేషిస్తే ధిక్కార స్వరాల, అసంతృప్తి జ్వాలల భారత కాంగ్రెస్ నూట పాతికేళ్ల చరిత్ర గుర్తుచేసుకోవచ్చు. అఖిల భారత కాంగ్రెస్ అధిష్ఠానం, పటిష్ఠమైన ఈ ఒక్క కాంగ్రెస్ పాలిత రాష్ట్రాన్ని, అప్రయత్నంగానే వదులుకునే దిశగా అడుగులేస్తున్నదన్న అనుమానం పార్టీ శ్రేణుల్లో కలుగుతుందనాలి.
కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు, ముఠా పోకడలు, అధిష్ఠానాన్ని ధిక్కరించడం, పార్టీని వీడిపోవడం, స్వగృహ ప్రవేశం చేయడం, గతంలో కంటే ప్రాధాన్యత సంపాదించుకోవడం లాంటివి ఆది నుంచీ జరుగుతున్నదే. లాలా లజపతి రాయ్, చిత్తరంజన్ దాస్ లాంటి నాయకులు బ్రిటీష్ ప్రభుత్వపు రౌలట్‌చట్టాన్ని నిరసిస్తూ "సత్యాగ్రహం" చేపట్టాలన్న తీర్మానాన్ని వ్యతిరేకించినప్పుడు మోతీలాల్ నెహ్రూ, గాంధి పక్షం వహించారు. చట్ట సభల్లో ప్రవేశించే విషయంలో తీవ్ర అభిప్రాయ బేధాలొచ్చి, మాట నెగ్గించుకోలేని చిత్తరంజన్ దాస్ పార్టీకి రాజీనామా చేసి "స్వరాజిస్ట్ పార్టీ" ని స్థాపిస్తే, మోతీలాల్ నెహ్రూ ఆయన పక్షానే నిలిచారు గాంధీజీకి వ్యతిరేకంగా. జవహర్లాల్ నెహ్రూను, స్వతంత్రం రాకమునుపు ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వానికి సారధిని చేసేందుకు, అబుల్ కలాం ఆజాద్ తో రాజీనామా చేయించి, ఆయన స్థానంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా నెహ్రూ వ్యవహరించేందుకు తోడ్పడ్డారు గాంధీజీ. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించినంతవరకు, రాగ ద్వేషాలకు, మహాత్ముడంతటి వాడే అతీతం కాదని అనుకోవడానికి నిదర్శనంగా భవిష్యత్ లో వల్లభాయ్ పటేల్ ప్రధాని అయ్యే అవకాశాలను కూడా పరోక్షంగా దెబ్బ తీశారు గాంధీజీ.
నీలం-కళా వెంకట్రావుల వ్యూహంలో, మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న ప్రకాశం పంతులు పదవి కోల్పోయి, కాంగ్రెస్ వదిలి, తిరిగి స్వగృహ ప్రవేశం చేసి, అదే సంజీవరెడ్డి ప్రోద్బలంతో ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి అయ్యారు. మద్య నిషేధం సాకుగా, సంజీవరెడ్డి బలపర్చిన ప్రకాశం పంతులు రాజీనామా చేయడంతో గవర్నర్ పాలన విధించడం, శాసన సభను రద్దుచేయడం జరిగింది. అవన్నీ కాంగ్రెస్ ముఠా రాజకీయాలే. 1955 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం బెజవాడ గోపాల రెడ్డి ముఖ్య మంత్రి అయ్యారు. మళ్ళీ ముఠా రాజకీయాలు మొదలయ్యాయి. గోపాలరెడ్డికి వ్యతిరేకంగా, కళా వెంకట్రావును, కల్లూరు చంద్రమౌళిని కలుపుకుని ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి పనిచేయ సాగారు. అధిష్ఠానం దూతగా వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి వారి మధ్య తాత్కాలికంగా రాజీ కుదిరించారు. అయినా ధిక్కార స్వరాలు ఆగిపోలేదు. కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, పాగా పుల్లారెడ్డి, బొమ్మ కంటి సత్యనారాయణ రావు ప్రభృతులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పార్టీని వదిలి, "డెమోక్రాటిక్ పార్టీ” ని స్థాపించారు. ఆ తర్వాత స్వగృహ ప్రవేశం చేసారంతా.
"ఆంధ్ర ప్రదేశ్" రాష్ట్రం అవతరించిన తర్వాత ముఖ్య మంత్రి పదవికోసం పోటీ మొదలైంది. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దరిమిలా ఆయన బలపడకుండా జాతీయ రాజకీయాల్లోకి లాగడమే మంచిదని భావించిన జవహర్లాల్ నెహ్రూ, యు ఎన్ ధేబర్ స్థానంలో, 1960 లో ఆయన్ను ఏఐసీసీ అధ్యక్షుడిగా నియమించారు. 1962 లో ఎన్నిక లొచ్చే సమయానికల్లా సంజీవరెడ్డిని తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకుని రావడం జరిగింది. 1964 లో కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి అయింతర్వాత, మళ్లీ ముఠా రాజకీయాలకు తెర లేచింది. కాసుకు వ్యతిరేకంగా ఏసీ సుబ్బారెడ్డి అసంతృప్తి కాంగ్రెస్ వర్గానికి బాహాటంగానే నాయకత్వం వహించారు. కాసు వర్గాన్ని "మినిస్టీరియలిస్టులు" అని, ఏసీ వర్గాన్ని "డిసిడెంట్లు" అని పిలిచేవారు. మర్రి చెన్నారెడ్డి మద్దతు కాసు వర్గానికుండేది. 1967 లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి గెలిచిన మర్రి చెన్నారెడ్డి ఎన్నికల కేసులో సభ్యత్వాన్ని కోల్పోవడమే కాకుండా, ఆరేళ్లు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడవడంతో, 1969 తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం చేపట్టారు. చెన్నారెడ్డి ధిక్కార ధోరణి పుణ్యమా అని, కాసు ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేయడం, ఆయన స్థానంలో పీవీ నరసింహా రావు రావడం జరిగింది.
ఇందిరాగాంధి ప్రధానమంత్రిగా రాజకీయాలలో తనదంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటున్న1969-1971 మధ్య కాలంలో, సిండికేట్ గా పిలువబడే అతిరథ-మహారథులైన అలనాటి కాంగ్రెస్ ఉద్దండ పిండాలను ఆమె మట్టికరిపించారు. భారతదేశ చరిత్రలో మొట్ట మొదటిసారి-చివరిసారి, ప్రధాన మంత్రిగా, దేశంలోని అత్యున్నత పదవికి తన పార్టీ పక్షాన తానే ప్రతిపాదించిన వ్యక్తికి వ్యతిరేకంగా తనపార్టీవారినే ఓటేయమని ఇందిరాగాంధి ప్రోత్సహించిన రోజులవి. అప్పట్లో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్న విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. తర్వాత, దేశ రాజకీయాల్లో సంభవించిన పరిణామాల నేపధ్యంలో, కాంగ్రెస్ పార్టీలోపలా-వెలుపలా, తరచూ, "అతివాద-మితవాద" శక్తుల-వ్యక్తుల ప్రస్తావన రావడం ఆరంభమయింది. "సిండికేట్" గా సంబోధించబడే కాంగ్రెస్ నాయకులైన మొరార్జీ దేశాయ్, ఎస్. కె. పాటిల్, అతుల్య ఘోష్, నిజలింగప్ప (పార్టీ అధ్యక్షుడు) లాంటి వారితో, పార్టీలో అతివాదులుగా ముద్రపడిన వారు బహిరంగంగానే విభేదిస్తుండేవారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధి నాయకత్వాన్ని పూర్తిగా బలపరుస్తున్న వర్గం, సిండికేట్ పక్షానున్న వారిని "సామ్యవాద-లౌకికవాద" వ్యతిరేకులని ముద్రవేశారు. ఒక వైపు పార్టీలో ఆమెకు లభించిన ఆధిపత్యం, మరోవైపు వామపక్షాల నుండి లభిస్తున్న మద్దతు, ఇందిరాగాంధికి ముందుకు కొనసాగడానికి ధైర్యాన్నిచ్చింది. లౌకిక వాదం మీద, ప్రజాస్వామ్యం మీద, సామ్యవాద సిద్ధాంతాల మీద నమ్మకం వున్న వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరాలని పిలుపిచ్చిందామె. దేశాభివృద్ధిలో పాలు పంచుకోమని విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏ కొద్దిమంది హక్కుభుక్తం కాదని, పౌరులందరికీ దానిపై హక్కుందని స్పష్ట పరిచింది. మహాత్మాగాంధి, జవహర్లాల్ నెహ్రూల అడుగుజాడల్లో కాంగ్రెస్ పనిచేస్తుందని-దేశాభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పేందుకు, ప్రజల-పార్టీ శ్రేణుల మద్దతు కూడగట్టేందుకు, దేశవ్యాప్తంగా పర్యటించిన ఇందిరాగాంధిని పార్టీనుంచి బహిష్కరించే చర్యలు నిజలింగప్ప చేపట్టడంతో, చీలికకు రంగం పూర్తిగా సిద్ధమయింది. అత్యధిక సంఖ్యాకులైన ఇందిరాగాంధి మద్దతు దారులు, నిజలింగప్ప ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని తప్పుబట్టి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశాలను నిర్వహించి, సి. సుబ్రహ్మణ్యంను తాత్కాలిక అధ్యక్షుడుగా ఎన్నుకోవడంతో భారత జాతీయ కాంగ్రెస్ చీలిపోయింది.
ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓడిన ఇందిర తిరిగి అధికారంలోకి రావడంతో, సమ్మతి-అసమ్మతి రాగాల మధ్య, ముఖ్యమంత్రుల మార్పిడికి శ్రీకారం చుట్టడం జరిగింది. బహిరంగంగానే, అసమ్మతికి అధిష్ఠానం ప్రోత్సాహం లభించేది. ముల్కి కేసు తీర్పుపై పీవీ చేసిన వ్యాఖ్యల దరిమిలా పదవి కోల్పోయిన ఆయన స్థానంలో కొన్నాళ్లకు జలగం ముఖ్యమంత్రి కావడం, ఎమర్జెన్సీ కాలంలో ఇందిర విధేయుడుగా, పేరు తెచ్చుకున్న జలగం, ఆ తర్వాత కాలంలో, ఇందిర మంత్రివర్గంలో "ఎమర్జెన్సీ హోం మినిస్టర్" గా పనిచేసిన "బ్రహ్మానంద రెడ్డి” కాంగ్రెస్ లో చేరాడు. 1978 శాసనసభ ఎన్నికల్లో, ఇందిరా కాంగ్రెస్ (నేటి అఖిల భారత జాతీయ కాంగ్రెస్-ఐ) ను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి విజయ పథంలో నడిపించగా, వెంగళ రావు నేతృత్వంలోని కాంగ్రెస్ పరాజయం పాలైంది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు మొదటిసారి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన మాజీ ప్రధాని ఇందిరకు ఖమ్మంలో (తన స్వంత జిల్లా) కనీసం గెస్ట్ హౌజ్ కూడా ఇవ్వని వెంగళరావు మళ్ళీ ఇందిర పంచన చేరి కేంద్రంలో మంత్రి పదవి అనుభవించారు. పీసీసీ అధ్యక్షుడుగా కూడా పని చేశారు.
అసమ్మతి పుణ్యమా అని, అంజయ్య, భవనం, విజయ భాస్కర రెడ్డి ముఖ్య మంత్రులయ్యారు. 1983 లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ను, 1989 లో గెలిపించిన చెన్నారెడ్డి, ముఖ్య మంత్రి కావడానికి అధిష్ఠానం ఆశీస్సులు తప్పనిసరైంది. మళ్ళీ అసమ్మతి... మళ్ళీ ధిక్కార స్వరాలు.. ఏడాదికే ఆయన స్థానంలో, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి ముఖ్య మంత్రయ్యారు. ఆయన్నూ వుండనివ్వలేదు అధిష్ఠానం. మరో మారు విజయ భాస్కర రెడ్డిని ముఖ్య మంత్రిని చేసి, తెలుగు దేశం ఇంకో మారు అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసింది. అప్పట్లో అసమ్మతిని, ధిక్కార స్వరాన్ని వినిపించిన డాక్టర్ రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి మరో పది సంవత్సరాలు పట్టింది. ఆయన రెండో పర్యాయం ముఖ్య మంత్రి అయింతర్వాత, ఆకస్మికంగా మరణించడంతో, ఆరేళ్లు వినిపించని ధిక్కార స్వరాలు మళ్లీ మొదలయ్యాయి. ఆయన వున్నప్పుడు ధిక్కారానికి అవసరం లేనందునో-వీలు కలగనందునో తాత్కాలికంగా ఆగినా, కాంగ్రెస్ లో అంతర్భాగమైన ధిక్కార పర్వాలు, అసంతృప్తి కాండలు మళ్ళీ మొదలయ్యాయి.
నూటా పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలో ఏదో విధంగా అధిష్ఠానాన్ని ధిక్కరించని నాయకులు అరుదు. కాకపోతే ఆ తర్వాత సర్దుకు పోయేవారు. మూడు సార్లు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మోతీలాల్ నెహ్రూ అధిష్ఠానాన్ని ధిక్కరించి "స్వరాజిస్ట్ పార్టీ" లో చేరారు. స్వతంత్రం రాక పూర్వం మూడు పర్యాయాలు, వచ్చిన తర్వాత రెండు సార్లు అధ్యక్షుడైన జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడు టాండన్ ను రాజీనామా చేయించేందుకు ధిక్కార ధోరణితో వ్యవహరించారు. సుభాష్ చంద్ర బోసును దింపే ప్రయత్నంలో గాంధీజీ అంతటి వాడే రాగ ద్వేషాలకు లోనయ్యారు. స్వతంత్రం వచ్చిన సమయంలో ఆచార్య కృపలానీ అధ్యక్షుడిగా వున్నారు. 1961-69 మధ్య కాలంలో నీలం సంజీవరెడ్డి, కామరాజ్ నాడార్, నిజలింగప్పల పర్వం కొనసాగింది. 1969 లో ఇందిరా గాంధీ శకం మొదలై, పార్టీ చీలిపోయి, జగ్జీవన్ రాం అధ్యక్షుడయ్యారు. అధిష్ఠానాన్ని "సిండికేట్" పేరుతో ధిక్కరించిన ఇందిర పార్టీనే చీల్చారు. కొన్నాళ్లు ఇతరులకు అవకాశమిచ్చిన ఇందిరా గాంధీ 1983 నుంచి 1985 వరకు స్వయంగా తానే అధ్యక్ష పీఠాన్ని అధిష్టించింది. 1985 లో కొడుకు రాజీవ్ గాంధీకి అధ్యక్ష వారసత్వం లభించింది. ఇక అప్పటినుంచి హత్యకు గురయ్యేవరకు ఆయనే అధ్యక్షుడు. పీవీ, కేసరిల తర్వాత ఆ పీఠాన్ని 1998 లో అధిష్టించిన సోనియా గాంధీ, గత 12 సంవత్సరాలుగా మకుటం లేని మహారాణిలా, ఒంటి "చేతితో" అధిష్ఠానం అంటే తానే అన్న రీతిలో వ్యవహరిస్తోంది. పార్టీలో "ఏకాభిప్రాయం" అంటే, సోనియా గాంధి అనే "ఏక వ్యక్తి అభిప్రాయం" గా కాంగ్రెస్ పరిస్థితి మారిపోయింది. పార్టీలో ఎవరికి ఎప్పుడు ప్రాధాన్యత వుంటుందో-ఎప్పుడు ఎవరికి వుండకుండా పోతుందో చెప్ప గల వారు లేరిప్పుడు. సుమారు పాతిక పర్యాయాలు పార్టీ పగ్గాలను చేజిక్కించుకుని, నలభై సంవత్సరాల పాటు అధ్యక్ష పీఠం అధిష్ఠించింది నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారే. అదే వారసత్వానికి చెందిన సోనియా గాంధీ నాయకత్వంలోని అధిష్ఠానం ప్రస్తుతం అవలంభిస్తున్నది మాత్రం "విభజించి పెత్తనం సాగించడం" అనే బ్రిటీష్ పోకడలు. భవిష్యత్ లో పార్టీకి ఆ పోకడలు లాభం చేకూరుస్తాయనుకోవడం పొరపాటే.
//రాగ ద్వేషాలకు, మహాత్ముడంతటి వాడే అతీతం కాదని అనుకోవడానికి నిదర్శనంగా //
ReplyDeleteSir,
ఎవరినో ఎందుకు ప్రధాని చేయటం? తాను అవుతానంటే అవ్వకుండా ఎవరైనా గాంధీని అడ్డుకునగలిగేవారా?
అప్పుడు భేదాభిప్రాయాలు వున్నా మరీ ఇప్పటి కాంగ్రెస్ నాయకుల్లా 'నీచ్ కుత్తే కమీనే' లు కాదు. ఎప్పుడో జరిగిన కాంగ్రెస్ చరిత్ర ఇప్పటి కంపును వివరించడానికి అప్రస్తుతంగా అనిపిస్తోంది.
బాగా వివరించారు
ReplyDeleteబాబు SNKR కాలం మారింది. అప్పటి నాయకులు వేరు, ఇప్పటి నాయకులు వేరు. అలాగే ప్రజలు కూడా.
ReplyDeleteనీ లాగ అసభ్యం గా మాట్లాడే వాల్లు ఆ కాలం లో ఉండి ఉండరనుకొంటున్నా.
అజ్ఞాత మరి నేచెప్పిందేమిటనుకున్నారు? మేనమామ కాదు అమ్మ తమ్ముడు అన్నట్టుంది మీ వ్యాఖ్య. మీ సులోచనాలను శుబ్ర పరచుకుని మరోక్కమారు చదవమని విన్నవించుకుంటాను.
ReplyDeleteఅసభ్యమా? పాత హిందీ సినిమాల్లో ప్రతి హీరో తల్లి, చెల్లి విలన్ ను అనే మాట అసభ్యం అంటున్నారే?! అసలు సిసలు కాంగ్రెస్ నాయకులకు ఇది సామాన్యమైన తిట్టుగా కూడా అనిపించేది కాదు. దీన్ని బట్టి మీరు కాంగ్రెస్ వారు కాదు అని తేటతెల్లమవుతోంది. :)