వనం జ్వాలా నరసింహా రావు
కార్ల్ మార్క్స్ నిర్థారితవాద సిద్ధాంతంలో, ఆయన కలలు కన్న కార్మిక రాజ్య స్థాపన పూర్వ రంగంలో "నిరంకుశ-భూస్వామ్య-ధన స్వామ్య వ్యవస్థ" కు వ్యతిరేకంగా శ్రామికవర్గం పోరాడుతుందని, దరిమిలా విజయం సాధిస్తుందని-ముందున్న వ్యవస్థ కూలిపోతుందని, శ్రామికవర్గ నియంతృత్వం స్థాపించబడుతుందని, కుల-మత-వర్గ-పేద-ధనిక తేడాలు సమసిపోతాయని జోస్యం చెప్పాడు. సోవియట్, చైనా దేశాల్లో శ్రామిక వర్గం అధికారంలోకి వచ్చేంతవరకు చాలావరకు ఆయన చెప్పినట్లే జరిగింది. ఆ తర్వాత కారణాలే వైనా, సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ సిద్ధాంత పరమైన అధికారానికి దూరమైంది. చైనాలో కొనసాగుతున్న కమ్యూనిజం, మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతాలకు అదనంగా మావో ఆలోచనా విధానం చేర్చింది.
భారత దేశంలోని (ఉమ్మడి) కమ్యూనిస్టులు సోవియట్-చైనా భావాలకు అనుకూల-ప్రతికూల-మధ్యేవాద మార్గంలో ప్రస్థానం మొదలెట్టి, ఒక లక్ష్యం-ధ్యేయం లేకుండా పయనించడం జరిగింది. సిద్ధాంత పరంగా ఉమ్మడి పార్టీలో మొదలైన చీలిక, దరిమిలా, పేరుకే సిద్ధాంత పరంగా మారి, మితవాద-అతివాద-తీవ్రవాద-భావాలలో ముక్క చెక్కలైంది. పార్లమెంటరీ పంథా కోరుకున్న వర్గాలు ఏదో ఒక జాతీయ-ప్రాంతీయ పార్టీతో ఎన్నికల అవగాహనా ఒప్పందం కుదుర్చుకుని, అర-కొర స్థానాలను చట్ట సభల్లో సంపాదించుకోవడంతో సరిపుచ్చుకుంటున్నాయి. ప్రజలకు, ప్రజా ఉద్యమాలకు, ప్రజల సమస్యలకు దూరమై, ఒకరినొకరు విమర్శించుకునే స్థాయికి దిగిపోయారు. చివరకు పరిస్థితి ఎలా మారిందో అంచనా వేయడానికి ఉదాహరణలుగా సీపీఐ నాయకుల దైవ దర్శనాలు, సీపీఎం నాయకుల దిద్దుబాటు చర్యల చొరవలు, చెప్పుకోవాల్సి వచ్చింది. నిరంతర దిద్దుబాటు ప్రక్రియ ద్వారా, పార్టీ కేడర్లు-లీడర్లు తాము చేస్తున్న తప్పులు సరి దిద్దుకునే మార్గాలను సూచించింది సీపీఎం.
దిద్దుబాటు ప్రక్రియను పార్టీ అగ్రశ్రేణి నాయకత్వంతో ఆరంభించి, జిల్లా-గ్రామ శ్రేణి కేడర్‌లకు వర్తింపజేసే విధానాన్ని, 2010 జూన్ నెల చివరికల్లా పూర్తిచేయాలని అక్టోబర్ 2009లో సిపిఎం కేంద్ర కమిటీ తీర్మానించింది. ఆ నిర్ణయం అమలుకు సంబంధించిన సమాచారం లేదు. సీపీఎం పార్టీలో అవకాశ వాదం, ఆస్తులు సమకూర్చుకునే పద్ధతి, విపరీతంగా పెరిగిపోతున్నదని, ఆంధ్ర ప్రదేశ్ లో దీని ప్రభావం తీవ్రంగా వుందని, పార్టీ నియమావళి ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, తమకు ప్రభుత్వం ద్వారా లభించే జీతాలను-అలవెన్సులను పార్టీకిచ్చే సంప్రదాయం కూడా కొందరు పాటించడం లేదని, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు బాధ్యతల నిర్వహణలో పార్టీని అనుసంధానం చేయడం జరగడం లేదని, ఇవన్నీ పార్టీకి లాభించని విషయాలని కేంద్ర కమిటీ భావించింది. ధన బలం, మద్యం వాడకం, అవినీతి చర్యలు పార్టీలో బాగా పెరిగిఫొయాయని, ఆంధ్ర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎన్నికలలో డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేశారని, పార్టీ నియమ-నిబంధనలను-విలువలను పాటించేవారి సంఖ్య తరిగిపోతున్నదని, పార్టీ సభ్యుల జీవన శైలిలోనే మార్పొచ్చిందని, భవంతుల్లో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడుతున్నారని, వివాహాల్లో విపరీతంగా ఖర్చు చేస్తున్నారని, పండుగలు-పబ్బాలు సమృద్ధిగా జరుపుకుంటున్నారని, ఆదాయానికి మించి ఖర్చు చేస్తున్నారని, అలాంటి వారిపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ, పార్టీ కమిటీలు చర్యలు తీసుకునే పరిస్థితులు లేవని కేంద్ర కమిటీ దిగులుపడింది.
కార్ల్ మార్క్స్ లాంటి మహా-మహానుభావులు, కారణజన్ములు, ఆలోచనాపరులు, అవనిలో అరుదుగా అవతరిస్తుంటారు. పెట్టుబడిదారీ ధన స్వామ్య-భూస్వామ్య వ్యవస్థ అనుసరించే దోపిడీ విధానాన్ని, వక్రమార్గంలో అది అభివృద్ధి చెందడాన్ని అన్ని కోణాల్లోంచి విశ్లేషణ చేసేందుకు, పరిణామక్రమంలో శ్రామికవర్గ నియంతృత్వం స్థాపించబడి, ఒకనాటి దోపిడీ వ్యవస్థే సామ్యవాద వ్యవస్థగా మార్పు చెందనున్నదని చెప్పేందుకు కార్ల్ మార్క్స్ తన కమ్యూనిస్ట్ సాహిత్యంలో ప్రాధాన్యమిచ్చాడు. ఒక వైపు అలా ప్రాధాన్యమిచ్చినప్పటికీ, ఆయన రాసిన ప్రతి అక్షరంలో మానవతా విలువలే ప్రతిబింబిస్తాయి. అరిస్టాటిల్ నుండి ఆయన తరం వరకు వేళ్లూనుకుంటూ వస్తున్న సామాజిక విశ్వాసాలను-విజ్ఞానాన్ని కూలంకషంగా సంశ్లేషణ చేయడానికి మార్క్స్ చేసిన ప్రయత్నంలో, స్వయం ప్రతిభతో నిండిన ఆయన ఆలోచనా ధోరణి ప్రస్ఫుటమౌతుంది. ఏ విధమైన పరిస్థితులుంటే మానవాభివృద్ధి సుసాధ్యమవుతుందన్న అంశాన్ని అందరికీ విశద పర్చాలన్న ఆతృత-ఆందోళన మార్క్స్ రచనల్లో-సాహిత్యంలో అణువణువునా దర్శనమిస్తుంది. ప్రతివ్యక్తి స్వేచ్ఛగా అభివృద్ధి చెందడంలోనే, ఇతర వ్యక్తులందరి అభివృద్ధి సాధ్యపడి, తద్వారా సామాజికాభివృద్ధి జరిగేందుకు వీలవుతుందని, ఆ ప్రక్రియను వేగవంతం చేయాలనీ మార్క్స్ భావిస్తాడు. హేతుబద్ధ ప్రణాళిక-సహకార ఉత్పత్తి-పంపిణీలో సమాన వాటాల ఆధారంగా, అన్నిరకాల రాజకీయ-సామాజిక-ఉద్యోగ స్వామ్య అధికార క్రమానికి దూరంగా వుండే, ప్రజాస్వామ్య-లౌకిక వ్యవస్థ ఏర్పాటై తీరుతుందని మార్క్స్ నిర్ధారిత సిద్ధాంతంలో పేర్కొంటాడు. మార్క్స్ జీవించిన రోజుల నాటి ప్రపంచంలో-ఆ మాటకొస్తే ఇప్పటికీ, ఎప్పటికీ, మన చుట్టూ జరుగుతున్న వాస్తవాలకు-యదార్థ సంఘటనలకు అద్దంపట్టే తాత్త్విక-సామాజిక మార్గమే ఆయన ప్రవచించిన గతి తార్కిక భౌతికవాదం.
ఆ సిద్ధాంతాన్ని అన్వయిస్తూ, మానవ విలువలను-మానవాళి చరిత్రను మార్క్సిజం విశదీకరించే ప్రయత్నం చేసింది. మనుషుల మానసిక-ఆధ్యాత్మిక జీవనశైలి, ఆలోచనా సరళి, జీవిత లక్ష్యం-గమనం వారి-వారి మనుగడకు, సహజీవనానికి అవసరమైన భౌతిక పరిస్థితులపైనే ఆధారపడి వుంటాయి. మానవుడు తను బ్రతకడానికి అవసరమైన వాటిని ఉత్పత్తి చేసుకునేందుకు, ఎవరెవరి తో-ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవాలనే దానిపైనే సమాజంలో వర్గాలు ఏర్పడతాయి. వీటికి అనుకూలమైన ఆర్థిక ప్రాతిపదికపైనే, సామాజిక-రాజకీయ సంస్థలకు-వ్యవస్థలకు అనుకూలమైన ఆలోచనల నిర్మాణ స్వరూపం ఏర్పాటవుతుంది. అందువల్లే వర్గపోరాటాల చరిత్రే సామాజిక చరిత్రంటాడు మార్క్స్. ఒక మజిలీ-లేదా దశ నుండి, దానికి పూర్తిగా విరుద్ధమైన వ్యతిరేక మజిలీకి-దశకు చరిత్ర పయనించి, సంశ్లేషణ దశలో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే శ్రామిక రాజ్య ఆధారితమైన వ్యవస్థ ఏర్పాటవుతుంది. కాకపోతే, ఈ విధమైన మార్పు జరగాలంటే, ఆద్యంతం విరుద్ధ-విభిన్న మార్గాలలో పయనించడం, విరుద్ధ-విభిన్న అంశాలను ఎదుర్కోవడం, ఒత్తిళ్లను-సంఘర్షణలను తట్టుకోవడం తప్పనిసరి. అంటే, సమాజంలోని వైరుధ్యాలే సంఘర్షణలకు దారితీసి, ప్రజా వ్యతిరేక వ్యవస్థను కూల దోసి, శ్రామిక రాజ్యస్థాపన, వర్గ భేదాలు లేని సమసమాజ వ్యవస్థ ఏర్పాటవుతుందని మార్క్సిజం చెప్తోంది.
ఈ నేపధ్యంలో, ఇప్పటికీ, అల నాడు మార్క్స్ చెప్పిన సిద్ధాంతాలను తు. చ తప్పకుండా పాటిస్తూ, నాలుగు దశాబ్దాలు పార్టీ సభ్యత్వం లేకపోయినా-తీసుకోక పోయినా, ఒకనాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి, చీలిక తర్వాత భారత కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీకి పనిచేసి, ఆ తర్వాత పార్టీ ఆదేశం మేరకు సభ్యత్వం తీసుకుని, గత పాతికేళ్లగా పార్టీకి సేవ చేస్తూ, సమాజం తనకు అప్ప చెప్పిన ఇతర బాధ్యతలను నెరవేరుస్తున్న ఎనభై రెండేళ్ల కమ్యూనిస్టు యోధుడు-పౌర హక్కుల ఉద్యమ ఆద్యుడు-ప్రజా వైద్యుడు-మాజీ రాజ్య సభ సభ్యుడు, ఖమ్మం జిల్లాలో నివసిస్తున్న "సీమాంధ్ర-తెలంగాణ" వాసి, డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణ మూర్తి జీవన యానం కమ్యూనిస్టులకు-కమ్యూనిస్టే తరులకు ఆదర్శప్రాయం. సీపీఎం దిద్దుబాటు ఉద్యమానికి ఆయన లాంటి వారి అరుదైన జీవితం ప్రామాణికం. సీపీఎం పార్టీ తలపెట్టిన "దిద్దుబాటు" కార్యక్రమంలో భాగంగా స్పందించని "కామ్రేడ్లు" తప్పనిసరిగా డాక్టర్ జీవిత కథ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిందే!
సహస్ర చంద్రుడు డాక్టర్ యలమంచిలి... (దీని రెండో భాగం.. తరువాత)
No comments:
Post a Comment