Thursday, August 26, 2010

సహస్ర చంద్రుడు రాధాకృష్ణ : వనం జ్వాలా నరసింహారావు


గుణవంతుడు, కృతజ్ఞుడు, సత్య శీలుడు, సమర్థుడు, నిబద్ధత కల వాడు, నిశ్చల సంకల్పుడు, కమ్యూనిస్టు సదాచారం మీరనివాడు, ప్రజలకు మేలు చేయాలన్న కోరికున్నవాడు, సాహిత్యాభిలాషి, కోపమంటే ఎరుగని వాడు, ప్రతిభావంతుడు, వృత్తిలో నిపుణుడు, ప్రవృత్తిలో అసూయ లేనివాడు, వేదికపై ఉపన్యాసం ఇస్తే వైరి వర్గాలు కూడా మెచ్చుకునే సామర్థ్యం కల వాడు, మానవ విలువలకు కట్టుబడిన వాడు, పౌర హక్కులను కాపాడగలనని నిరూపించిన "షోడశ కళల" ను పుణికి పుచ్చుకున్న అరుదైన మహామనిషి డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణ మూర్తి. "సహస్ర చంద్ర దర్శనం" చేసుకుంటున్న సందర్భంగా ఆయనను గురించి తెలిసిన వారు-తెలియని వారు, తెలుసుకోవాల్సిన విషయాలెన్నో... ఎన్నెన్నో! "వైఆర్కెన" గా, "డాక్టర్ గారు" గా అందరూ పిలిచే ఈ మనిషి చిన్నతనం ‍నుండే నిరీశ్వరవాది. గోరా ప్రభావంతో హేతువాదం కూడా జోడైంది ఆయనలో. సహధర్మచారిణి కూడా, ఆయన బాటలోనే, వివాహమైన కొద్ది కాలంలోనే పయనించడంతో, ఇంట్లో పూజలు-దేవుళ్ల బొమ్మలు లేవు. ముగ్గురు పిల్లలకూ ఆయన అలవాట్లే అబ్బాయి. ఇంటికొకరు అన్నట్లు, పెద్ద కోడలు మాత్రం మంచి భక్తురాలైంది. అయితే, సాహిత్యాభిలాషైన వైఆర్కె్ పుస్తక పఠనం విషయంలోను, జ్ఞాన సముపార్జన విషయంలోను నిరీశ్వర వాదాన్ని-హేతువాదాన్ని అంటిపెట్టుకునేంత "కన్సర్వేటివ్" కాదనాలి. ఆయన కన్సర్వేటివిజం అంతా, ఆహార పానీయాల్లోను, వేష భాషల్లోను, అలవాటున్నంతవరకు ధూమపానం చేయడంలోను మాత్రమే. ఐదు పర్యాయాలు జైలు జీవితం గడిపిన డాక్టర్ గారు, వరంగల్ జైలులో వున్నప్పుడు, తోటి ఖైదీల దగ్గర షడ్దర్శనాలు, భగవద్గీత, ఇస్లాం మతం, ఆయుర్వేద రహస్యాలు లాంటి విషయాలను ఆసక్తిగా నేర్చుకున్నారు.

1985 లో పార్టీ సభ్యత్వం తీసుకున్న డాక్టర్ వైఆర్కెా, గత పాతికేళ్లలో, సీపీఎం రాష్ట్ర కమిటీలో, కార్యదర్శి వర్గంలో వున్నప్పటికీ, ఎన్నడూ ఆర్థిక పరమైన బాధ్యతలు తీసుకోలేదు. సభ్యత్వం తీసుకున్న తర్వాత "ఆస్తి" సమకూర్చుకోలేదు. పార్టీ నుంచి ఒక్క పైసా తీసుకోలేదు. పార్టీలో ఏ పదవినీ ఆశించని ఆయన, ఇచ్చిన బాధ్యతను ఎన్నడూ కాదనలేదు. వంట్లో శక్తి వున్నంతవరకు పార్టీకి సేవ చేసిన యలమంచిలి, ఎన్నికల పదవులపట్ల కూడా విముఖత చూపించినా, మూడు పర్యాయాలు ఖమ్మం లోక్ సభ స్థానానికి పోటీ చేయక తప్పలేదు. రెండు సార్లు సభ్యత్వం లేకపోయినా పార్టీ ఆదేశాల మేరకు "బాధ్యత" గా ఒప్పుకున్నారు. రాజ్యసభ సభ్యుడు కావాలని కూడా ఆయనెప్పుడూ కోరుకోలేదు సరి కదా, ఊహించనూలేదు. 1996 ఫిబ్రవరి నెలలో హాస్పిటల్లో పని చేసుకుంటున్నప్పుడు, మోటూరు హనుమంతరావు విజయవాడ నుంచి ఫోన్ చేశారు రాధాకృష్ణమూర్తికి. తెలుగు దేశం పార్టీతో అప్పట్లో వున్న అవగాహన ప్రకారం సీపీఎం కు కేటాయించే రాజ్యసభ స్థానానికి ఆయన పేరు ప్రతిపాదించనున్నందున, దానికి ఆయన అంగీకారం తెలపాల్సిందిగా కోరారు మోటూరి. తనకెందుకన్న వైఆర్కెప తో, "రాజ్యసభకు పంపుతామంటే వద్దంటారేంటి" అని ప్రశ్నించారాయన. చివరకు భార్యా పిల్లలను సంప్రదించి, సంకోచంగానే సమ్మతి తెలియ చేశారు డాక్టర్.

రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు నెల నెలా పార్టీకి జమ కట్టాల్సిన మొత్తం పోను, మిగాతాదాంట్లో, తన కుటుంబ నిర్వహణకు ఖర్చుచేసి, మిగిలిందంతా "చిత్త శుద్ధి" తో పార్టీకి జమచేశారు. సభ్యత్వం అయిపోయిన తర్వాత వస్తున్న పెన్షన్ మొత్తాన్ని పార్టీకి ఇవ్వడం తో పాటు, తన తదనంతరం తన భార్యకు పంపితే, అది కూడా పార్టీకే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 1985 కు పూర్వం, అదీ సభ్యత్వం తీసుకోక ముందు, డాక్టర్ గారు సంపాదించిన ఆస్తిని ఆయనకు హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత ఇద్దరు కుమారులకు బదిలీ చేసి, ఎటువంటి ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేకుండా జీవిస్తున్నారాయన. పిల్లలు సమకూర్చిన పైకంతో ఆయన వ్యక్తిగత అవసరాలు తీర్చుకుంటున్నారు. పుస్తక పఠనం, రచనా వ్యాసంగం, మిత్రులతో కబుర్లు, పార్టీకి అవసరమైనప్పుడు సూచనలు-సలహాలు ఇస్తూ కమ్యూనిజాన్ని అభిమానిస్తూ, అందులోని మంచిని పది మందికి తెలియచేస్తూ, ప్రశాంత జీవితం గడుపుతున్న ఆయన జీవితం అందరికీ ఆదర్శ ప్రాయమే.

No comments:

Post a Comment