ప్రశస్త
వాక్కు గల ఆంజనేయుడే హనుమంతుడు
ఆంధ్ర
వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య
దినపత్రిక (17-04-2017)
హనుమంతుడు
నిజంగా రామదూతే అయితే,
తనకు ప్రియమైన శ్రీరాముడి గుణ-గణాలు
వర్ణించమని సీతాదేవి హనుమంతుడిని అడుగుతుంది. భగవత్ గుణానుభవంలో
అభిలాష వుండి, భగవత్గుణాను సంధానం చేస్తూ, శిష్యుడికి, భగవత్ గుణాలను వర్ణించి చెప్పేవాడే
నిజమైన "గురువు-ఆచార్యుడు".
అట్లా చేయకపోతే వారిని నమ్మకూడదు. దగ్గరకు
రానీయ కూడదని దీనర్ధం. హనుమంతుడు ప్రత్యక్ష, పరోక్ష నిదర్శనాలతో, సీతాదేవిని పరీక్షించి (ఆచార్యుడు-శిష్యుడిని) చూసుకున్నట్లే,
సీతాదేవి కూడ హనుమంతుడుని (శిష్యుడు-ఆచార్యుడిని) ప్రత్యక్షంగా పరీక్షిస్తుంది మొదట.
అంటే శిష్యుడిని గురువు పరీక్షించినట్లే, గురువును
కూడా శిష్యుడు పరీక్షించాలి. వీధిన పోయే ప్రతివాడినీ నమ్మి "ఆచార్యుడి"గా రానీయకూడదు.
శ్రీరామ, లక్ష్మణుల చిహ్నాలేంటని సీతాదేవి హనుమంతుడుకి వేసిన
ప్రశ్న ఒక విషమ ప్రశ్న. అందులో రెండు భాగాలున్నాయి. చేతుల విషయం ఎవరైనా చెప్పొచ్చు...అందరికీ కనిపిస్తాయి కాబట్టి.
"తొడలెలా వుంటాయి?" అని కూడా
అడుగుతుంది సీత. అంటే మర్మాంగాలను గురించి ఆరా తీస్తున్నదన్న మాట. దీంట్లో గురువును పరీక్షించే తీరు కనిపిస్తుంది. జవాబు
చెప్పేటప్పుడు ఔచిత్యం కనబరుస్తాడా? లేదా? అని పరీక్షించ దల్చింది. దీనర్ధం..."ఆచార్యుడు", భగవత్ తత్వాన్ని ఆమూలాగ్రంగా,
రహస్యాలతో సహా తెలిసిన వాడై వుండాలని!
సీతమ్మ రాముడి తొడలు ఎలా వుంటాయనీ, లక్ష్మణుడి తొడలు
ఎలా వుంటాయనీ, అడగడమేంటి? తప్పుకదా!
అనిపించడం సహజం. విశేషించి పర పురుషుడుని, అందునా అసలే
పరిచయం లేని వాడిని అలా అడగడమేంటి? ఇదొక విషమ పరీక్ష
హనుమంతుడికి. ఆమెకు రామలక్ష్మణుల స్వరూపం తెలుసు. కాబట్టి అడిగింది. హనుమంతుడు
చెప్పేదానిలో ఆ వివరాలు సరిపోతే ఆమె నమ్మగలగుతుంది. అదలా వుంచుదాం. కంటికి
కనిపించే అవయవాలను వర్ణించి చెప్పవచ్చు. కంటికి కనిపించని మర్మావయాలను ఎలా
వర్ణించడం? తెలిసే అవకాశం లేదే? ఒకవేళ
చూడడం సంభవించినా, స్త్రీ ముందు వివరించి చెప్పడం ఔచిత్యం
కాదుకదా? హనుమంతుడు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు...సాముద్రిక
శాస్త్రవేత్త. ఆ శాస్త్రం వ్యక్తుల రూపురేఖా విలాసాలను చెప్పి, వాటి ఫలితాలను ఇస్తుంది. ఏ ఏ జాతులవారు ఎలా వుంటారనేది సర్వావయ పరిణామాలను
బట్టి విశ్లేషిస్తుంది. సాముద్రిక శాస్త్రజ్ఞాని హనుమంతుడైనందున, కంటికి కనిపించే అవయవాల పరిణామాలను బట్టి, పొందికను
బట్టి, కంటికి కనిపించని (మర్మ) అవయవాలను వర్ణించగలుగుతాడు.
సీతమ్మ ఉద్దేశ్యం కూదా అదేనేమో! రామలక్ష్మణుల ముఖాలనూ, బాహువులనూ,
వక్షస్థలాలనూ, గమనించిన వాడు, మిగిలినవాటిని చెప్పగలడా? లేదా? అని. అంటే, ఈ దూత చూసిందే వల్లిస్తాడా? లేక చూసిన దానిని బట్టి, ఇంగిత జ్ఞానంతో, తదుపరి ఆలోచన చేయగలడా? లేదా? అని
గ్రహించడానికే, హనుమంతుడుని ప్రశ్నించింది సీత. జయశీలుడైన
హనుమంతుడు పరీక్ష నెగ్గాడు. సీతకు విశ్వాసపాత్రుడైనాడు.
జవాబుగా హనుమంతుడు మొదలు శ్రీరాముడి ఆత్మ గుణాలను వర్ణించి, తర్వాత దేహ గుణాలను
వర్ణిస్తాడు. "తేజస్సు, యశస్సు,
శ్రీ" ల వల్ల వ్యాపించినవాడు శ్రీరాముడు
అంటాడు. బ్రహ్మచర్య నిష్ట గలవాడంటాడు. రాముడిని
వర్ణించిన హనుమంతుడు, ఆయన్ని గురించి చాలా నిగూఢంగా చెప్తాడు.
స్పష్టంగా చెప్పి వుండేవాడే కాని, అలా చెప్తే
చెప్పడం తెలియని వాడనీ, అడవి మనిషనీ, సీత
భావించి వుండేది. "లింగం, వృశణం"
గురించి కూడా చెప్పాడు. ఔచిత్యం పాటించక పోతే,
"ఇటువంటి వాడు రామ దూతగా వుండజాలడు" అని సీతాదేవి తీర్మానించేదే! అసలామె ప్రశ్న వేసింది
కూడా హనుమంతుడెలా చెప్తాడని తెలుసుకునేందుకే!
రామచంద్రమూర్తి దూతగా వచ్చానని చెప్పిన తర్వాత, ఆమె నమ్మిందని
నిర్ణయానికి వచ్చిన తర్వాత, తన జన్మ వృత్తాంతాన్ని, తనను గురించిన విషయాలనీ కూడా వివరించి చెప్తాడు హనుమంతుడు సీతాదేవికి.
ఇలా చెప్పటంలో కూడ ఎంతో అర్ధం వుంది. స్నేహం
చేయటానికి, కలసి మెలసి వుండడానికి, కులహీనుడితో,
ఆచార హీనుడితో, సదాశ్రయం లేనివాడితో కుదరదు
కాబట్టి, తన విషయం చెప్పుకొన్నాడు.
కులం, గుణం, ఊరు, నిజమైన పేరు, దాచేవాడు ఆచార్యుడిగా పనికి రాడు.
శిష్యుడు కూడా గురువు వంశాదులను, పుట్టు
పూర్వోత్తరాలను, విచారించాలని కూడా దీని భావన."ఆచార్య కృత్యం" కూడా హనుమంతుడి మాటల్లో
వ్యక్తమౌతుంది. శిష్యుడికి భగవంతుడి విశయమంతా వివరంగా చెప్పి,
భయపడొద్దనీ, భగవంతుడే స్వయంగా వచ్చి తీసుకో
పోతాడనీ, ఆ సమయానికై వేచి వుండాలనీ అంటాడు. శిష్యుడు మాత్రం సదాచారం, భక్తి విశ్వాసాలు కలిగి
వుండాలని కూడ ఆయన మాటల్లో స్ఫురిస్తుంది. గురు పరంపర కూడా
చెప్తాడు. శిష్యులు కాదల్చుకున్న వారు ఆచార్యులమని
వచ్చేవారిని, పరీక్షించు కోవాలనే అర్ధం కూడా వుంది.
సీతమ్మ
హనుమంతుడిని తన జన్మ వృత్తాంతం చెప్పమని అడగలేదు. రాముడి రూప విశేషాలను మాత్రమే
చెప్పమని అడిగింది. దాంతో పాటు తన జన్మ వృత్తాంతాన్నీ చెప్పాడు హనుమంతుడు. అడగందే
చెప్పడం దేనికి? అనిపించవచ్చు. కానీ హనుమంతుడు "ఆంజనేయుడు" కదా! అంటే ప్రశస్త
వాక్కు కలవాడని అర్థం. వ్యర్థంగా ఏదీ మాట్లాడడు. అసలు కారణమేంటంటే, తాను రామ దూతనననీ, సామాన్యమైన సగటు వాడిని కాదనీ,
సమర్థుడననీ సీతమ్మను నమ్మించ చేయడం ప్రధానం ఇక్కడ. నమ్మదగిన వాడినీ,
విశ్వాసపాత్రుడునీ, అని సీతమ్మకు రూఢి చేయాలని
భావించడం! తనను ఈ మహా కష్టం నుండి తప్పించగలవాడని, శ్రీరాముడిని
రప్పించి తనను ఆయనతో కూర్చగల సమర్థుడని విశ్వాసాన్ని పాదుకొల్పడానికే తన వైనం
చెప్పాడు హనుమంతుడు. రామాయణం "ధ్వని కావ్యం". అంతరాంతరాలలో దాగివున్న
పరమార్థాలను ఆంధ్ర వాల్మీకి ఎంతో సులభంగా, సుందరంగా మనకు
అందించాడాయన మన అదృష్టం వల్ల!
ఇవన్నీ అయిన తర్వాత, సీతాదేవికి తన మాటల్లో ఇంకా పిసరంత
సందేహముంటే, దాన్ని కూడా పోగొట్ట దల్చి, "శ్రీరామముద్రిక" ను ఇస్తాడు సీతమ్మకు. అంటే, సీతాదేవి సందేహం తీరిందని, శ్రధ్ధ కలిగిందని, నమ్మకం కలిగిన తర్వాతనే ఉంగరం ఇచ్చాడు హనుమంతుడు. దీన్ని
బట్టి సంశయంతో వున్నవారికి, శ్రధ్ధలేని వారికి,
"రామ మంత్రం" ఉపదేశించ కూడదని అర్ధం
చేసుకోవాలి. అదే విధంగా శిష్యుడు ఇది చెప్పమని అడగ కూడదు.
గురువనుగ్రహిన్చిందే స్వీకరించాలి. ఈ విధంగా "సీత-ఆంజనేయుల" చర్య వలన "శిష్య లక్షణం, గురు లక్షణం, ముముక్షు
హిత చర్య, భగవత్ మంత్ర ప్రాప్తం" చెప్పడం
జరిగింది.
"రామముద్రిక"ను చూసిన సీతాదేవికి, సాక్షాత్తు, శ్రీరామచంద్రుడే ఎదురుగా వచ్చినట్లు,
భావనాతిశయం వల్ల ఆయన ఆకారం స్పష్టంగా కనిపించింది. భగవన్మూర్తి ధ్యాన, సోపాన మార్గాన్ని తెలుపుతున్న
దీచర్య. ఇది శిష్యుడి ఉత్తర కార్యం. భగవన్మూర్తి
ఇలా ఎదురుగా వచ్చి నిల్చున్నట్లు అనిపించిందాకా భగవంతుడిని ఉపాసించాల్సిందే!
No comments:
Post a Comment