Tuesday, April 25, 2017

నన్నింత వాణ్ణి చేసింది! .....వనం జ్వాలా నరసింహారావు

నన్నింత వాణ్ణి చేసింది!
వనం జ్వాలా నరసింహారావు
సీపీఆర్వో టు సీఎం తెలంగాణ
ఆంధ్రప్రభ దినపత్రిక (26-04-2017)

ఖమ్మం రికాబ్ బజార్ హైస్కూల్ విద్యార్థిగా, హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ (హెచ్.ఎస్.సీ) పరీక్షల్లో, హయ్యర్ సెకండ్ క్లాస్ లో పాసై, లెక్కల్లో, సైన్స్ సబ్జెక్టులలో మంచి మార్కులు తెచ్చుకున్న నేను, ఎం.పీ.సీ (లెక్కలు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం) గ్రూపు తీసుకుని ఖమ్మం ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాలలో ప్రీ-యూనివర్సిటీ (పి.యు.సి) కోర్సులో 1962-1963 అకడమిక్ సంవత్సరంలో చేరాను. ఆ విధంగా మొట్టమొదటిసారి ఉస్మానియా విశ్వ విద్యాలయం విద్యార్థినయ్యాను. ఆ మూడు సబ్జెక్టులే కాకుండా, ఇంగ్లీష్, తెలుగు, జనరల్ స్టడీస్ సబ్జెక్టులు కూడా వుండేవి అప్పట్లో. లెక్కలు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం సబ్జెక్టులను ఐచ్చికం (ఆప్షనల్) అని, మిగతా వాటిని కంపల్‌సరీ అని పిలిచే వాళ్లం. హెచ్.ఎస్.సీ వరకు తెలుగు మీడియంలో చదువుకున్న మాకు, మొట్ట మొదటిసారిగా పి.యు.సి లో చేరగానే, ఆంగ్ల మాధ్యమంలో అభ్యసించాలంటే మొదట్లో కొంత ఇబ్బందికరంగా వుండేది. పోను-పోను అలవాటై పోయింది. భౌతిక, రసాయన శాస్త్రాలకు థియరీ క్లాసులే కాకుండా ప్రాక్టికల్స్ కూడా వుండేవి. అంతా కొత్తగా వుండేది.
ఖమ్మం పట్టణంలో మొట్ట మొదటి ప్రయివేట్ కళాశాలగా ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాలను స్థాపించారు. నిజాం సంస్థానం నుంచి విముక్తి పొంది, భారత దేశంలో విలీనమైన హైదరాబాద్ రాష్ట్రంలో, ఒకప్పుడు, ఒక్క హైదరాబాద్‌లో తప్ప ఇంకెక్కడా కళాశాలలు లేవు. దరిమిలా, వరంగల్ జిల్లాలో వున్న ఖమ్మం ప్రాంతాన్ని వేరు చేసి, 1956 లో ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేసింది  ప్రభుత్వం. అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు, ప్రతి జిల్లాలో కనీసం ఒక్క కళాశాలన్నా వుండాలని ఒక నిర్ణయం తీసుకున్నారు.
కాలేజీ విద్యార్థిగా పి.యు.సి లో చేరడంతో ఒక పెద్దరికం వచ్చిన అనుభూతి కలిగింది. బహుశా నా క్లాస్ లో వున్న వాళ్లందరిలో నేనే వయసులో చిన్నవాడిననుకుంటా. ఇంగ్లీష్, తెలుగు, జనరల్ స్టడీస్ అన్ని గ్రూపులకు అంటే-ఎం.పీ.సీ, బై పీసీ (జీవ శాస్త్రం, భౌతిక-రసాయన శాస్త్రాలు), కామర్స్ (ఎకనామిక్స్, కామర్స్, అకౌంటింగ్), సివిక్స్ (చరిత్ర, భూగోళం, సాంఘికం)-కలిపి చెప్పేవారు. భౌతిక, రసాయన శాస్త్రాల క్లాసులు ఎం.పీ.సీ, బై పీసీ గ్రూపులకు కలిపి తీసుకునేవారు. లెక్కల క్లాస్ ప్రత్యేకంగా ఎం.పీ.సీ గ్రూపుకు మాత్రమే వుండేది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ ప్రోజ్, పోయెట్రీ, గ్రామర్ విభాగాలుగా వుండేవి.
నాకు గుర్తున్న కొన్ని ఇంగ్లీష్ పాఠాలలో "ఆన్ ఫర్ గెట్టింగ్", "ఆన్ సీయింగ్ పీపుల్ ఆఫ్", "ఆన్ అదర్ పీపుల్ జాబ్స్" లాంటివి చాలా ఆసక్తికరంగా వుండేవి. అలానే విలియం వర్డ్స్ వర్త్, షేక్స్ పియర్ పోయెట్రీ కూడా ఆకట్టుకునేది. ప్రాక్టికల్స్ క్లాసులను తీసుకునేవారిని ఆ రోజుల్లో "డిమాన్ స్ట్రేటర్" (లెక్చరర్ కంటే ఒక గ్రేడ్ తక్కువ) అనే వాళ్లం. ప్రాక్టికల్స్ లో ఉపయోగించే కామన్ బాలెన్స్, పిప్పెట్, బ్యూరెట్ట్ లాంటివి ఇంకా గుర్తుకొస్తున్నాయి.
పి.యు.సి పరీక్షలొచ్చాయి. ఫలితాలు నేను ఊహించినట్లే వచ్చాయి.... థర్డ్ క్లాస్ లో పాసయ్యాను. ఎం.పీ.సీ గ్రూపులో మంచి మార్కులు వచ్చినప్పటికీ, ఇంజనీరింగులో సీటు లభించే స్థాయిలో రాలేదు. బొమ్మకంటి సత్యనారాయణ గారి సిఫార్సుతో, అప్పటి కాంగ్రెస్ పార్టీ మంత్రి టి. హయగ్రీవా చారి గారి ద్వారా ఎంత ప్రయత్నించినా ఇంజనీరింగులో సీటు దొరక లేదు. బెంగుళూరు ఎమ్మెస్ రామయ్య కాలేజీలో ప్రయత్నం చేశాం కాని ఫలితం లేకపోయింది. బి. ఎస్సీ  డిగ్రీ మొదటి సంవత్సరంలో ఎం.పీ.సీ గ్రూప్ తీసుకుని ఖమ్మం కళాశాలలో చేరాను.
ఆ రోజుల్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్లను ఏం చేస్తున్నావని అడుగుతే ఫలానా డిగ్రీ, ఫలానా ఇయర్ అని సమాధానం ఇవ్వక పోయే వాళ్లు. "ఫస్ట్ ఇయర్...రెస్ట్ ఇయర్" అని క్లుప్తంగా చెప్పే వాళ్లు. దానికి కారణం డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పబ్లిక్ పరీక్షలు లేకపోవడమే. చదివినా-చదవక పోయినా రెండో సంవత్సరానికి ప్రమోట్ అయ్యే వాళ్లు. సెకండ్ ఇయర్లో లాంగ్వేజెస్ (ఇంగ్లీష్, తెలుగు), జనరల్ స్టడీస్ లో పరీక్షలుండేవి. మొత్తం ఆరు పేపర్లుండేవి. థర్డ్ ఇయర్లో ఆప్షనల్ సబ్జెక్టులలో (ఎం.పీ.సీ గ్రూప్) పరీక్షలుండేవి. భౌతిక శాస్త్రంలో మాడరన్ ఫిజిక్స్ లో నాలుగు పేపర్లతో సహా మొత్తం పది పేపర్లుండేవి. పరీక్ష-పరీక్షకు మధ్య ఇప్పటి లాగా దినం విడిచి దినమో, మధ్య మధ్య శెలవులో వుండక పోయేది. సోమవారం పరీక్ష మొదలవుతే మధ్యలో వచ్చే ఒక్క ఆదివారం మినహా వరుస వెంట పది రోజులు పరీక్షలు జరిగేవి. మూడు సంవత్సరాలు చదివింది గుర్తుంచుకుని రాయాల్సి వచ్చేది. అదే విధంగా లాంగ్వేజెస్ పేపర్లు రెండేళ్లు చెప్పింది గుర్తుంచుకుని రాయాలి.
ఖమ్మంలో బిఎస్సీ డిగ్రీ మొదటి ఏడాది చదువు పూర్తి చేసుకున్న నేను, మిగతా రెండేళ్లు హైదరాబాద్ లో కొనసాగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాను. డి. వి. ద్వారక గారు ఉస్మానియా యూనివర్సిటీలో మాథమాటిక్స్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారప్పుడు. న్యూ సైన్స్ కాలేజీలో సీటివ్వడానికి ప్రిన్సిపాల్ సి. సుదర్శన్ అంగీకరించారు. అలా బీఎస్పీ (ఎం.పీ.సీ) రెండో సంవత్సరంలో 1964 జూన్ లో న్యూ సైన్స్ కళాశాలలో చేరాను. ఆ కళాశాలను జులై 17, 1956 , నూతన విద్యా సమితి యాజమాన్యం కింద, సి. సుదర్శన్ గారు, జి.ఎస్. మెల్కోటే గారు స్థాపించారు. నారాయణగూడలో వున్న ఆ కాలేజీలో అత్యంత నైపుణ్యం కల మేధావులైన విద్యావేత్తలెందరో పని చేసేవారు. నేను చేరేటప్పటికే ఫస్ట్ ఇయర్ లో చేరిన వారి సంఖ్య 150 దాటింది. నా రోల్ నంబర్ "150 X" గా కేటాయించారు. న్యూ సైన్స్ కాలేజీ, బీ ఎస్సీ (ఎం.పీ.సీ) క్లాస్‍లో 150 మందికి పైగా విద్యార్థులుండే వారు. ఎప్పుడూ, సందడిగా, సరదాగా, గలగలా పారే సెలయేరులా వుండేది మా క్లాస్. బయటేమో ఎప్పుడూ..ఏదో ఒక నిర్మాణం జరుగుతుండేది మా కాలేజీలో. కాలేజీకి వున్న మంచి పేరు వల్ల, విద్యార్థుల తాకిడి బాగా వుండేది.


మా కాలేజీ లెక్చరర్ల విషయానికొస్తే, బహుశా, అంత నైపుణ్యం కల అధ్యాపకులు, మరే కాలేజీలోను వుండరంటే అతిశయోక్తి కాదేమో! మాకు తెలుగు పాఠ్య పుస్తకంగా "ఆంధ్ర మహాభారతోపన్యాసాలు", నాన్-డిటేల్‍గా "పురుషోత్తముడు", నాటకంగా "హాలికుడు" వుండేవి. ఇంగ్లీష్ పాఠ్య పుస్తకం-వాచకంగా ఇ.ఎఫ్. డాడ్ సంపాదకీయంలోని వ్యాసాల సంకలనం వుండేది. . జి. గార్డినర్ రాసిన వ్యాసం ఒకటుంది. . ఎం. ఫార్ స్టర్ రాసిన "పాసేజ్ టు ఇండియా" నాన్-డిటేల్ గా వుండేది. లెక్కల సబ్జెక్టులో మేం ఫైనల్ ఇయర్ పరీక్షల్లో మూడు పేపర్లు రాయాలి. ఒకటి "బీజ గణితం", రెండోది "రేఖా గణితం", మూడోది "త్రికోణమితి". బీజ గణితాన్ని "షఫీ ఉల్ హక్", రేఖా గణితాన్ని "భాస్కర రావు", త్రికోణమితిని డాక్టర్ కుప్పుస్వామి బోధించేవారు. భౌతిక శాస్త్రాన్ని "హరి లక్ష్మీపతి", "ప్రభాకర్" బోధించేవారు. భౌతిక శాస్త్రంలో "మాడరన్ ఫిజిక్స్" అనే నాలుగో పేపర్ కూడా వుండేది. రసాయన శాస్త్రం థియరీలో మూడు భాగాలుండేవి. "ఆర్గానిక్", "ఇన్-ఆర్గానిక్", "ఫిజికల్" అనే ఆ మూడింటిని ముగ్గురు లెక్చరర్లు బోధించేవారు. "వై. సూర్యనారాయణ మూర్తి" ఆర్గానిక్ సబ్జెక్టు చెప్పేవారు. ఇప్పటికీ ఆయన బోర్డు మీద వేసిన "బెంజిన్ రింగ్" కళ్లలో మెదులుతుంది. ఇన్-ఆర్గానిక్ అంశాన్ని ప్రిన్సిపాల్ సుదర్శన్ చెప్పేవారు. ఫిజికల్ కెమిస్ట్రీని కూడా వై.ఎస్.ఎన్ గారు చెప్పినట్లు గుర్తు.
నేను డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో వున్నప్పుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుల మధ్య, ఉపకులపతి (వైస్ ఛాన్స్ లర్) డి. ఎస్. రెడ్డి వ్యవహారంలో బాగా గొడవలు జరిగాయి. ఒక గ్రూపుకు మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి, కె. కేశవరావు (ఒకనాటి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు...ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి, రాజ్య సభ సభ్యుడు) మార్గదర్శకత్వం వహించగా, మరొక గ్రూపుకు నాటి విద్యార్థి నాయకులు ఎం. శ్రీధర్ రెడ్డి, పుల్లారెడ్డి, (జన సంఘ్) నారాయణ దాస్, కమ్యూనిస్టు పార్టీ అనుబంధ విద్యార్థి సంఘ నాయకులు నాయకత్వం వహించారు. 1966 లో, నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, 1957 నుంచి ఉపకులపతిగా పని చేస్తున్న డి. ఎస్. రెడ్డిని పదవి నుంచి తప్పించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో గుంటూరు కాలేజీ ప్రిన్సిపాల్ (పేరు గుర్తుకు రావడం లేదు) ను నియమించడం కూడా జరిగింది. ఆయన ఛార్జ్ తీసుకోవడానికి రావడం, విద్యార్థుల ఆందోళన మధ్య వెనక్కు తిరిగిపోవడం నా కింకా గుర్తుంది. బ్రహ్మానందరెడ్డి తీసుకున్న చర్యకు మద్దతుగా జైపాల్ రెడ్డి, కేశవరావులు ఉద్యమించగా, వ్యతిరేకంగా విద్యార్థి నాయకులు ఉద్యమించారు. ఇంతకు, డి. ఎస్. రెడ్డి చేసిన తప్పేంటి అంటే...ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి కావాలని ప్రతిపాదించడమే!
అది నచ్చని బ్రహ్మానందరెడ్డి ఉపకులపతిని తొలగించడానికి చట్టాన్ని సవరించే ప్రయత్నం కూడా చేశాడు. డి.ఎస్. రెడ్డి హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు న్యాయం కోసం వెళ్లాడు. చివరికి కోర్టులో ఆయన పక్షానే తీర్పు వచ్చింది. 1969 వరకు ఆయనే వైస్ ఛాన్స్ లర్‍గా కొనసాగారు. 1968 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి అంకురార్పణ జరుగుతున్నప్పుడు ఆయనే వైస్ ఛాన్స్ లర్‍. ఉద్యమం వూపందుకునే సరికి రావాడ సత్యనారాయణ ఆయన స్థానంలో వచ్చారు. వైస్ ఛాన్స్ లర్‍గా డి.ఎస్. రెడ్డి కొనసాగించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపధ్యంలో, డిగ్రీ విద్యార్థులకు పరీక్షల్లో "గ్రేస్ మార్కులు" ప్రకటించింది యూనివర్సిటీ. నేను పరీక్ష రాయకపోయినా, కేవలం హాజరైనందుకు నాకు అన్ని సబ్జెక్టుల్లో 15 మార్కులొచ్చాయి!     
నా డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు మార్చ్-ఏప్రిల్ 1966 లో జరిగాయి. నేను లెక్కల పేపర్ రాసిన తరువాత మంచి మార్కులు రావని భావించి, మిగతా పేపర్‌లకు కేవలం హాజరవడం (పరీక్ష పేపర్లు తెచ్చుకోవడానికి) తప్ప రాయలేదు. ఫలితాలు ఊహించినట్లే ఫెయిలయ్యాను. కాకపోతే రాసిన ఒక్క లెక్కల సబ్జెక్టులో పాసయ్యాను. ఆ తరువాత సప్లిమెంటరీ పరీక్షలు రాయలేదు. మొత్తం మీద రెండు-మూడు ప్రయత్నాల తరువాత, మార్చ్ 1968 లో లెక్కలు, భౌతిక శాస్త్రం, సెప్టెంబర్ 1968 లో రసాయన శాస్త్రం కంపార్ట్ మెంటల్ గా డిగ్రీ పాసయ్యాను. అలా నా హైదరాబాద్ చదువు-నివాసం ప్రధమ ఘట్టం పూర్తయింది.
మొదటి దశలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థిగా బీఎస్సీ పూర్తి చేసుకున్న నేను, నాగ్ పూర్ లో ఎం ఏ చదివిన తరువాత, లైబ్రేరియన్ గా ఉద్యోగంలో చేరడం, ప్రొఫెషనల్ డిగ్రీ  కొరకు మరోమారు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో, జులై-ఆగస్ట్ 1973లో లైబ్రరీ సైన్స్ కోర్స్ లో చేరడం జరిగింది. మా క్లాసులు కొన్ని ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో, కొన్ని లైబ్రరీ భవనంలో జరిగేవి. అదో మరపురాని అనుభూతి.1974 జులై నెలాఖరులో పరీక్షలు జరిగి నాకు యూనివర్సిటీ రెండో రాంక్ ఆగస్టులో రావడం మరో విశేషం. అలా 42 ఏళ్ల క్రితం ఉస్మానియా విశ్వవిద్యాలయంతో నా అనుబంధం ముగిసింది.  
ఉస్మానియా విశ్వ విద్యాలయంలో చదివిన నాటి రోజులు, కాలేజీ ఆవరణ, అడపదడప ఆర్ట్స్ కాలేజీకి బస్సులో వెళ్లి రావడం, అక్కడి స్నేహితులతో సరదాగా గడపడం, కళాశాల గొడవలు, క్రికెట్ ఆట...ఇలా ఎన్నో...ఎన్నెన్నో ఎప్పటికీ గుర్తొస్తుంటూనే వుంటాయి. అవి మరపురాని మధురమైన రోజులు.End


No comments:

Post a Comment