స్మరణ మాత్ర
సంతుష్టుడు రాముడు....ప్రణతి ప్రసన్న జానకి
ఆంధ్ర
వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా
నరసింహారావు
సూర్యదినపత్రిక
(03-04-2017)
సీతాదేవి వున్న స్థితికి దు:ఖించిన హనుమంతుడు, అందరిలాగ
కర్మానుభవానికై పుట్టని సీతకే కష్టాలొస్తే, ఇతరుల సంగతేంటనుకుంటాడు.
అయినా, సర్వం కాలాధీనమనుకొని, అదే నీతిని మనస్సులో వుంచుకొని, దుఃఖ-సంతోషాల పాలు పడకూడదనుకుంటాడు. సీతకే యిన్ని
కష్టాలొచ్చాయి, మనమెంతనుకుని, మనస్సు
పరితాప పడ్డా, బుధ్ధి వ్యాకుల పడనీయ కూడదనుకుంటాడు హనుమంతుడు.
సీతారాములిద్దరూ సమానంగా సేవించాల్సిన వారేనని హనుమంతుడు
గ్రహిస్తాడు. దాన్నీ తర్కించి నిర్ధారించుకుంటాడు. సీత-రాముడు వయస్సులో ఎలా ఈడూ-జోడో,
శీలం లోనూ, ప్రవర్తన లోనూ, వంశాధిక్యత లోనూ అంతే. సాముద్రికం ప్రకారం, సార్వభౌమత్వ చిహ్నాలు రాముడికున్నాయి. అట్టి వాడికి
భార్య కాగల దానికి ఏ చిహ్నాలుండాలో అవన్నీ సీతకున్నాయి. సూర్యవంశంలో
ప్రసిధ్ధికెక్కిన వాడి కొడుకు రాముడైతే, చంద్రవంశంలో
జగత్ప్రసిధ్ధికన్న జనకుడి కూతురు జనని-జానకి. "స్మరణ మాత్ర సంతుష్టుడు"… రాముడు. అంటే స్మరణ చేస్తే సంతోషించి అనుగ్రహించే వాడు రాముడు. "ప్రణతి ప్రసన్న జానకి"…ప్రణామం చేతనే ప్రసన్నమయ్యేది
మైథిలి. అంటే ఒక్క నమస్కారం చేస్తే చాలు సంతోషించేది సీత.
ఇలాంటి అపురూప దాంపత్యం లోకంలో ఎక్కడైనా వుందానని ఆశ్చర్య పోతాడు
హనుమంతుడు. భక్తులకు సీత-రాములిరువురూ
సేవ్యులే. జగన్మాత "శ్రీదేవి"- జగన్నాయకుడు "విష్ణువు". ఒకరున్న చోటే రెండోవారు కూడా ఉంటారు. వీరిరువురి
తోనే ప్రపంచమంతా వ్యాపించి వుంది. ఈశత్వం ఇద్దరిలో సమానమే.
సర్వదా ఏకశేశులే! (ఒకేమాటలో ఇరువురినీ
తెలిపేదే ఏకశేశం). ఇలా "సర్వకారణత్వం,
సర్వవ్యాపకత్వం, సర్వనియంతృత్వం" లక్ష్మీనారాయణుల్లో, సీతా-రాముల్లో
వుంది. ఇరువురిలో, "ఉపాయత్వం,
ఉపేయత్వం" వున్నాయి. అందుకే సీతారాములిరువురూ సమానంగా సేవించాల్సిన వారే. అయితే, రామచంద్రమూర్తి చేసే కార్యాలన్నింటికీ
మూలకారణం సీతాదేవే! చేసేవాడు రాముడు...చేయించేది సీత.
నిగ్రహానుగ్రహాల రెండింటి లోనూ ఇదే నియమం.
భగవంతుడు అనేక కోటి బ్రహ్మాండ నాయకుడు. అఖిలాండ కోటి
బ్రహ్మాండాలకు నాయకి లక్ష్మీదేవి. ఈ అనంత కోటి బ్రహ్మాండాలు
ఆమె మూలాన్నే నామరూపాలై, స్థితిగలవై వున్నాయి. అట్టి ఈమెకు ముల్లోకాలు ఒక లెక్కేగాదు. అయితే
లక్ష్మీదేవి (సీతాదేవి), భగవంతుడి
సహధర్మచారిణిగా, భగవత్ సంకల్పానుసారంగా, తదాజ్ఞానవశవర్తియై, ఆయనకు పరతంత్రగా వుంటుంది.
సీతాదేవి వృత్తాంత మంతా ఏకమై, అనన్యమై,
భగవత్ ప్రాప్తి ఎప్పుడా, ఎప్పుడా అని ఎదురు
చూస్తుండే పరమ భక్తురాలి, ప్రపన్నురాలి చరిత్రే!
లంకలో స్త్రీలు నాలుగు రకాలు. ఈ లోకంలోనూ ఇలాంటి నాలుగు తెగల (రకాల) మనుష్యులే కనపడ్తారు. వారు:
·
పాపంలో పుట్టి, పాపంలో పెరిగి ఇంద్రియ పరమార్ధమదేనని నమ్మి
వాటికి దాసులై పరలోక చింత లేనివారు
·
ఉత్తమ వంశంలో పుట్టికూడా, స్వధర్మాన్ని వీడి, కామానికి
దాసులై, ఇంద్రియ సుఖాలకు అలవాటు పడ్డవారు
·
ఉత్తమ జన్మెత్తినప్పటికీ, సంసార సుఖంలో పడి, కామంలో
ఇరుక్కుపోయి, దారీ-తెన్నూ తెలుసుకోలేక,
సంసారం నుండి తప్పించుకొనే మార్గం కానరాక, రక్షించే
నాధుడు లేక పరితపించే వారు
·
ఏదో చిన్న పాపం చేసి, సంసారంలో పడ్డామనుకుంటూ, నిర్వేదంలో పడి, దీన్నుండి తప్పించే వాడు భగవంతుడే
తప్ప, వేరేవాడులేడని విశ్వసించి, తక్కిన
ఉపాయాలన్నీ వదిలి, పరమ భక్తినీ-ప్రపత్తినీ
ఆశ్రయించే వారు.
సీతాదేవి తాను చెరనుండి తప్పించుకోవటమే కాకుండా, తన లాగా
దుఃఖిస్తున్న ఇతర స్త్రీలను (దేవ-గంధర్వ-నాగ) కూడా విడిపించింది. నాలుగో
రకంవారు (పైనచెప్పిన) తాము తరించి
ఇతరులను తరింప చేస్తారు. సీతాచర్య నేర్పేదిదే! ఇతర ఉపాయాలను వెతక్కుండా, దేహాభిమానం, స్వాతంత్ర్యం వదిలి, స్వరక్షణాభారం భగవంతుడి మీద
వేసి, "అన న్యార్హ శేశత్వం-అనన్య
శరణత్వం-అనన్య భోగత్వం" అనే
అకారత్రయ సంపూర్తిని కలిగి, సంసారంలో వుండే తరించేందుకు "ప్రపత్తితోనో, పరమ భక్తితోనో" సాయుజ్యాన్ని పొందవచ్చని, సీతాదేవి చరిత్ర వలన మనం
తెలుసుకోవచ్చు. అంటే, భగవత్ప్రాప్తి
కోరేవాడు, ఆయన అనుగ్రహం కొరకు, సీతాదేవి
లాగా, సర్వకాల సర్వావస్థలందు భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ,
స్వధర్మాన్ని వదలకుండా వుండటం తప్ప వేరే మార్గం లేనే లేదు. సీతాదేవి చర్య వలన మనం నేర్చుకున్న విషయాలను, ఆచరణలో
పెట్టితే, జన్మాంతరంలోనే ముక్తి లభిస్తుందనడంలో సందేహం లేదు.
సీతాదేవి శ్రీరాముడినొక్కడినే చూడాలనుకుంటుంది. ఆయనొక్కడిపైనే ధ్యాస వుంచింది. అంటే "ఏకాగ్ర భక్తి-ఏక భక్తి-అనన్యత్వాన్ని"
గురించి చెప్పడమే ఇది. అలానే, భక్తుడు దేవతలెందరున్నా, తన ఇష్ట దైవాన్నే నమ్మి,
"ఏక భక్తి-ఏకాగ్ర భక్తి" కలవాడై వుంటాడు. భక్తులు, ప్రపన్నులు, తమ
కెన్ని కష్టాలొచ్చినా, విశ్వాసం వదలకుండా, భగవంతుడు రక్షించే దాకా, తమ "భక్తి, ప్రపత్తులే" తమకు
రక్ష అని భావిస్తారు. భగవంతుడి పైనే భారం వేసి, అతడొక్కడే తమను రక్షించగల సమర్ధుడని గట్టిగా విశ్వసిస్తారు.
యాచకులు లేని దాతలు, రోగులు లేని వైద్యులు లేనట్లే, ప్రపంచం
లేకపోతే భగవంతుడు లేనేలేడు. ప్రకృతి వల్ల తప్ప, భగవంతుడిని తెల్సుకునే మరో మార్గమే లేదు. ఆ భగవంతుడి
శక్తే "లక్ష్మి". ఆమే "మాయ". ఆమే "ప్రకృతి".
ఆమె చిద్విలాసమే ప్రపంచం.
భగవంతుడు, ప్రపంచం, వేరు-వేరు కాదు. లక్ష్మి
అనుగ్రహిస్తేనే ప్రపంచాన్ని దాటుతాం. భగవదనుగ్రహానికి
నోచుకుంటాం. ఆమెను వశపర్చుకోవడానికీ, అనుగ్రహాన్ని
పొందడానికీ నమస్కారమే సాధనం కాని, బలాత్కారమో, ధన, విద్యాబలాలో మాత్రం కానే కాదు. ఎప్పుడెప్పుడు విష్ణువు అవతారమెత్తుతాడో, అప్పుడన్ని
సమయాల్లో శ్రీదేవి ఆయనకు సహాయంగా రావాల్సిందే. ఆయన దేవతలందు
అవతారమెత్తితే, ఈమె దేవత్వాన్ని, మనుష్యుల్లో
ఎత్తితే మనుష్య స్త్రీగా అవతరిస్తుంది. విష్ణు దేహానికి
అనురూపమైన దేహాన్ని ధరిస్తుంది. అందుకే శ్రీదేవి
నిత్యానపాయిని. ఆమె "అనన్య".
అంటే, చీకటి-వెలుతురు
లాగా అన్యం కాకుండా వుంటుంది. ఇంతే "జీవాత్మ-పరమాత్మ"ల
అనన్యత్వం. జీవుడు "పరమాత్మ"
అంశ. ముముక్షువగు బధ్ధ జీవుడు (సీతాదేవి శ్రీ
రాముడి పట్ల ఎటువంటి అభిప్రాయం కలిగి, ప్రవర్తించి, లంక నుండి విముక్తు రాలైందో) పరమాత్మ విషయంలో
విశ్వాసం వుంచి, ప్రవర్తించి విముక్తుడు కావాలి.
లంకలో వున్న సీతాదేవి రాక్షస స్త్రీలతో పడ్డ బాధల్లాంటివే, దేహంలోని "బధ్ధజీవుడు" సంసారమనే ఇంద్రియాలలో పడేటి బాధలు
కూడా. రావణుడు కానీ, రాక్షస స్త్రీలు
కానీ, సీతను బెదిరించారే కాని, చంప లేక
పోయారు. అదే విధంగా, "జీవాత్మ"ను ఏవీ చంప లేవు. బాధించ గలుగుతాయి. సీతాదేవి లాగా బధ్ధ జీవులు"ప్రారబ్ధ" మని, దృఢ చిత్తంతో, భగవంతుడే
రక్షిస్తాడని అమిత విశ్వాసంతో వుండాలి. సీతాదేవి ఇంద్రియాలకు
లోబడలేదని, భగవంతుడి మీదే విశ్వాసం వుంచిందని ధృవ పడుతోంది.
తర్వాత జీవుడు చేయాల్సిన భగవధ్యానం, సీతా
విలాప రూపంలో మున్ముందు విశదమౌతుంది.
No comments:
Post a Comment