Tuesday, April 25, 2017

మరపురాని మధురమైన రోజులు : వనం జ్వాలానరసింహారావు (ఆంధ్రజ్యోతి )

మరపురాని మధురమైన రోజులు
వనం జ్వాలానరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (26-04-2017)

ఖమ్మంలో బీఎస్సీ డిగ్రీ మొదటి ఏడాది చదువు పూర్తి చేసుకున్న నేను, మిగతా రెండేళ్లు హైదరాబాద్‌లో కొనసాగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాను. న్యూ సైన్స్ కాలేజీలో సీటివ్వడానికి ప్రిన్సిపాల్ సి. సుదర్శన్ అంగీకరించారు. అలా బీఎస్పీ (ఎం.పీ.సీ) రెండో సంవత్సరంలో 1964 జూన్‌లో న్యూ సైన్స్ కళాశాలలో చేరాను. నారాయణగూడలో వున్న ఆ కాలేజీలో అత్యంత నైపుణ్యం కల మేధావులైన విద్యావేత్తలెందరో పని చేసేవారు. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో వున్నప్పుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుల మధ్య, ఉపకులపతి (వైస్ ఛాన్సలర్) డి.ఎస్.రెడ్డి వ్యవహారంలో బాగా గొడవలు జరిగాయి. ఒక గ్రూపునకు మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి, కె. కేశవరావు (తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు) మార్గదర్శకత్వం వహించగా, మరొక గ్రూపుకు నాటి విద్యార్థి నాయకులు ఎం. శ్రీధర్ రెడ్డి, పుల్లారెడ్డి, (జనసంఘ్) నారాయణ దాస్, కమ్యూనిస్టు పార్టీ అనుబంధ విద్యార్థి సంఘ నాయకులు నాయకత్వం వహించారు. 1966లో నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, 1957 నుంచి ఉపకులపతిగా పని చేస్తున్న డి.ఎస్.రెడ్డిని పదవి నుంచి తప్పించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో గుంటూరు కాలేజీ ప్రిన్సిపాల్ ను నియమించడం కూడా జరిగింది. ఆయన ఛార్జ్ తీసుకోవడానికి రావడం, విద్యార్థుల ఆందోళన మధ్య వెనక్కు తిరిగిపోవడం నాకింకా గుర్తుంది.

  బ్రహ్మానందరెడ్డి చర్యకు మద్దతుగా జైపాల్ రెడ్డి, కేశవరావులు ఉద్యమించగా, వ్యతిరేకంగా విద్యార్థి నాయకులు ఉద్యమించారు. ఇంతకు, డి.ఎస్.రెడ్డి చేసిన తప్పేంటి అంటే... ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి కావాలని ప్రతిపాదించడమే! అది నచ్చని బ్రహ్మానందరెడ్డి ఉపకులపతిని తొలగించడానికి చట్టాన్ని సవరించే ప్రయత్నం కూడా చేశాడు. డి.ఎస్.రెడ్డి హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు న్యాయం కోసం వెళ్లాడు. చివరికి కోర్టులో ఆయన పక్షానే తీర్పువచ్చింది. 1969వరకు ఆయనే వైస్ ఛాన్సలర్‌‍గా కొనసాగారు. 1968లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి అంకురార్పణ జరుగుతున్నప్పుడు ఆయనే వైస్ ఛాన్సలర్‍. ఉద్యమం వూపందుకునే సరికి రావాడ సత్యనారాయణ ఆయన స్థానంలో వచ్చారు. డి.ఎస్.రెడ్డిని కొనసాగించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపధ్యంలో, డిగ్రీ విద్యార్థులకు పరీక్షల్లో “గ్రేస్ మార్కులు” ప్రకటించింది యూనివర్సిటీ. నేను పరీక్ష రాయకపోయినా, కేవలం హాజరైనందుకు నాకు అన్ని సబ్జెక్టుల్లో 15 మార్కులొచ్చాయి! అనంతరకాలంలో, బీఎస్సీ పూర్తి చేసుకున్న నేను, నాగ్‌పూర్‌లో ఎం.ఏ చదివి తరువాత లైబ్రేరియన్‌గా ఉద్యోగంలో చేరాను. ప్రొఫెషనల్ డిగ్రీ కొరకు మరోమారు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో, 1973లో లైబ్రరీ సైన్స్ కోర్స్ లో చేరాను. మా క్లాసులు కొన్ని ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో, కొన్ని లైబ్రరీ భవనంలో జరిగేవి. 1974 జులై నెలాఖరు పరీక్షల్లో నాకు యూనివర్సిటీ రెండోరాంక్ రావడం మరో విశేషం. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో చదివిన నాటి రోజులు, కాలేజీ ఆవరణ, ఆర్ట్స్ కాలేజీకి బస్సులో వెళ్లి రావడం, స్నేహితులతో సరదాగా గడపడం, కళాశాల గొడవలు, క్రికెట్ ఆట... ఇలా ఎన్నో... ఎన్నెన్నో. అవి మరపురాని మధురమైన రోజులు.

No comments:

Post a Comment