Sunday, April 9, 2017

సీతా విలాపం ముముక్షువైన ప్రపన్నుడి విలాపమే .... ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

సీతా విలాపం ముముక్షువైన ప్రపన్నుడి విలాపమే
ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (10-04-2017)

          రాక్షస స్త్రీలు బెదిరిస్తుంటే, నీచ రాక్షస స్త్రీలకు, మనుష్య స్త్రీలకు పొత్తనేది కుదరదని వెక్కెక్కి ఏడుస్తూ  జవాబిస్తుంది సీతాదేవి. దీనర్ధం....రాక్షస స్థానంలో "ప్రకృతి", మనుష్య స్థానంలో "జీవాత్మ" వుందని గ్రహించడమే! మనుష్యులకు, రాక్షసులకు విజాతీయ భేదమున్నట్లే, అచేతనమైన "దేహాని"కీ, చేతనమైన "ఆత్మ"కు తారతమ్యం వుంటుంది. ఆ దుఃఖం లో, సీతాదేవి, మరిదినీ, అత్తగారినీ, తన మీద దయ లేదా అని దీనంగా ప్రశ్నిస్తుంది. అయినా అప్పటికప్పుడు ఏమీ జరగలేదంటే, దీనర్ధం, బంధువులెవ్వరూ, ఎంత ఆప్తులైనా, "ఆత్మ"ను వుధ్ధరించలేరనే!

          గొప్ప వ్రతం చేయబూని, పూర్తి చేయనందువల్ల, వ్రతఫలం దక్కకుండా పోయి, భర్తతో ఎడబాటు కలిగిందనీ, వ్రతం పూర్తి చేస్తే ఆ పుణ్యఫలం వల్ల, తన భర్త తనను రక్షించే వాడేమోనని అనుకుంటుంది సీత. దీన్నిబట్టి, స్త్రీల పాతివ్రత్యం, నోముల ఫలం, వారి భర్తలు తమను రక్షించేవిగా చేస్తున్నాయనీ, అట్టి ఫలం లేక పోతే, భర్తలున్నా రక్షించ లేరనీ అర్ధం చేసుకోవాలి. "ఆడదాని అదృష్టం"… అన్న నానుడి ఇందుకే ఏర్పడి వుండవచ్చు. ఆడది నిర్భాగ్యురాలైతే, మగవాడు ఎంత పుణ్యాత్ముడు, సమర్ధుడు అయినప్పటికీ, ఆ స్త్రీకి సుఖం లేదు. లోకంలో కొందరు దరిద్రులు గానూ, కొందరు ధనవంతులు గానూ, దుఃఖంతో కొందరు, సుఖిస్తూ కొందరు వున్నారు. ఇవి వారి-వారి పాప-పుణ్య ఫలాలు. బాగు పడటానికి, చెడిపోవటానికీ, వారి-వారి పూర్వ కర్మలే కారణం.

          సీతా విలాప రూపంలోని పై ఆలోచనలకర్ధం....భగవత్ సాక్షాత్కారమయ్యేంత వరకు సంసార బాధ తొలగదనే! ప్రకృతి బంధం మన ప్రయత్నంతో తొలగేది కాదు. భవదనుగ్రహం తోనే తొలగాలి. ఒక దేహంలో "జీవాత్మ-పరమాత్మ" లిరువురూ వుంటారు. జీవాత్మ సంసారంలో మునిగి, ఈశ్వరుడిని చూడలేక, మోహంతో దుఃఖిస్తుంది. ఎప్పుడైతే, జీవాత్మ, పరమాత్మను దర్శిస్తుందో, అప్పుడే దాని శోకం తొలగిపోతుంది. ఇందులో "ఆత్మగుణం, దేహగుణం" కలిపి చెప్పడం వల్ల, "సగుణ బ్రహ్మ"మే సేవించ తగినదనీ, అట్టి దానిని సాక్షాత్కరింప చేసుకొనగలవారే "పుణ్యాత్ములనీ, మోక్షార్హులనీ" అర్ధం చేసుకోవాలి. పూర్వ జన్మ పాపం వల్ల కూడా ఇలా అనుభవిస్తున్నానని సీత అంటుందో సారి. అంటే, ఆమె కర్మ వశాత్తు పుట్టిందని కాదు. ఆమాట రాక్షస స్త్రీలను ఉద్దేశించి చెప్పబడింది. భక్తుడు తన సర్వస్వం ధారపోసినా, భగవంతుడు కనపడకపోతే నాస్తికుడి లాగా భగవంతుడు లేడనుకోకూడదు. తనలోనే ఏదో లోపం వుందనుకోవాలి. మనుష్యులు సుఖమయినా, దుఃఖమయినా, "ప్రారబ్ధాన్ని" అనుభవించాల్సిందే కాని, బలాత్కార మరణంతోనో, ఇంకే విధంగానో దాన్ని తప్పించుకోలేరు. "యద్యద్భవ్యం భవతు భగవన్! ఫూర్వకర్మానురూపమ్"  అంటారు కులశేఖరాళ్వార్.

          రాక్షస స్త్రీలు పెట్టే బాధలను సహించలేని సీతాదేవి, శ్రీరాముడిని తల్చుకొని అదే పనిగా విలపిస్తుంది. నేలమీద పడి పొర్లాడుతూ, పిచ్చెత్తినట్లు, పిశాచం పట్టినట్లు, ఒళ్లు తెలీకుండా, మనస్సు దిగ్భ్రమ చెందిన దానిలాగా, ఏడ్చేది. ఇదంతా భక్త-ప్రపన్నుల స్తితి. భక్తి అమితంగా పెరిగిపొతే, భక్తుడు దేహాభిమానాన్ని విడిచి నేలపైపడి పొర్లాడుతాడు. పిచ్చి పట్టినట్లు, దయ్యం పట్టినట్లు, వంటిమీద గుడ్డలున్నదీ, లేనిదీ తెలీకుండా ప్రవర్తిస్తాడు. దీన్ని బట్టి భక్తుడి మనస్సు భగవంతుడి మీదుండాలికాని సుఖ-సౌఖ్యాల మీదకాదు.


శ్రీరాముడిని తల్చుకుని దుఃఖించిన సీత, ఆయన తనను ఉపేక్షించడానికి కారణం, ఆయనకు దయాగుణం లేకపోవడం కాదనీ, ఆయన దయ తన మీద రాక పోవడానికి తన దురదృష్టమే కారణమై వుండాలనీ అనుకుంటుంది. ఇలాంటి భావన నిజమైన భక్తుడికే కలుగుతుంది. భగవత్ కటాక్షం తనకు కలగలేదని భగవంతుడిని తప్పు పట్టడు. ఆ యోగ్యత తనకింకా కలగలేదనే అనుకుంటాడు. తనలోని లోపాలను సరిదిద్దుకొని, శాయశక్తులా అన్ని ప్రయత్నాలూ చేస్తాడు. అయినా తను పూర్ణభక్తి సంపాదించు కున్నానని గానీ, భగవంతుడే కఠినుడై అనుగ్రహించ లేదనిగానీ అనుకోడు. ఎవడు పూర్ణ భక్తుడనని అనుకుంటాడో, వాడు నిజమైన భక్తుడు కాదు. నిజమైన భక్తుడు, ఇంకా-ఇంకా, భాగవత సేవ ఏమీ చేయలేకపోయానే! అనుకుంటాడు. భగవత్ సేవ చేసినందుకు తృప్తి పొందడు. ఇంకా అలానే చేస్తూనే వుంటాడు. ఇది భక్తుడి స్వభావం. "జీవాత్మ"లు భగవంతుడిని సేవించడం తమ మేలుకొరకే గాని, ఆయన్ను వుధ్ధరించడానికి కాదు. "జీవాత్మ"లు సేవించనంత మాత్రాన ఆయనకు వచ్చిన లోటేమీ లేదు. జీవాత్మలు భగవంతుడి విశయంలో ఎన్ని అపచారాలు చేసినా, భగవంతుడట్లా చేయడు. అందుకే, పరమ భక్తులు, ప్రపన్నులు చేయాల్సిందల్లా, భగవత్ చరిత్ర తప్ప వేరేదాని పై దృష్టి నిలపకపోవటమే. దేహ సుఖాలు కోరకూడదు. భగవంతుడే రక్షిస్తాడన్న దృఢ విశ్వాసం కలిగి, తన యోగక్షేమాలకై, తాను పాటుపడకూడదు. స్వతంద్ర బుధ్ధి మానాలి.

          దేహం భగవంతుడుండే ఆలయమన్న భావనతో అలంకరించుకోవచ్చు. భగవదర్పణం అనుకుంటూ మంచి ఆహారం తీసుకోవచ్చు. స్వబుధ్ధి, స్వప్రయోజనం మటుకు నిశిధ్ధం. సన్యాసుల్లాగా దేహాన్ని శుష్కింప చేసుకుని, తపస్సు చేయడం కంటే, గృహస్థ మార్గమే వుత్తమం. అయితే, దానికంటే ఇది కష్టమైన పని. ఇలా వుండ లేనివాడే సన్యాసి అవుతాడు. సన్యాసులకు కలిగే బ్రహ్మలోక ప్రాప్తి కంటే వీరికి భగవత్ సాయుజ్య ప్రాప్తి తొందరగా లభిస్తుంది.

          సీతావిలాపం, ముముక్షువైన ప్రపన్నునిడి విలాపం, ఒకటేనని చెప్పుకున్నాం. సంసార సాగరాన్ని తరించే మార్గం తెలియక, నిర్వేదంతో తనను ఆశ్రయించిన జీవులను రక్షించడానికి, భగవంతుడు "ఆచార్యు"లను పంపుతాడని కూడా చెప్పుకున్నాం. ఇట్టి భగవత్సహాయం, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దేహాభిమానాన్ని పూర్తిగా వదిలిపెట్టి, తన కొరకే (భగవంతుడి) మాన-ప్రాణాలను పోగొట్టుకోటానికి సిధ్ధపడే పరతంత్రులకు మాత్రమే లభిస్తుంది. స్వప్రయత్నంతో, దేహంపై ఏ మాత్రం అభిమానమున్నా, ఆ సహాయం రాదుసీతాదేవి తనను, రాక్షసులు ఏం చేసినా, చేసుకోమని చెప్పి, దేహాభిమానాన్ని విడిచి, నిద్రాహారాలు మాని, ఏకాగ్రతతో, బుధ్ధి పూర్వకంగా, తన దేహాన్నీ-ప్రాణాన్నీ, రామచంద్రమూర్తికే సమర్పించాలనుకొని, నిరాశతో ఎప్పుడైతే మరణించాలనుకొని సిధ్ధపడిందో, అప్పుడే హనుమంతుడి ద్వారా "ఆచార్య" లాభ ప్రాప్తి కలిగింది.


      హనుమంతుడు (ఆచార్యుడు) తాను చూస్తున్న స్త్రీ, సీతాదేవేనని (శిష్యుడు) నిశ్చయించుకోవడానికి, స్వతంత్ర-పరోక్ష-ప్రత్యక్ష-పరస్పర సంబంధం లేని, సాక్ష్యాలు ఆధారంగా చేసుకుంటాడు. ప్రత్యక్ష సాక్ష్యం....శరీరం పైన కనిపించిన సాముద్రిక చిహ్నాలు. సాముద్రిక శాస్త్రంలో చెప్పబడిన ఉత్తమ స్త్రీ, లక్షణాలన్నీ ఆమెలో వున్నాయనుకొంటాడు. ఇన్ని విధాలైన ప్రత్యక్ష-పరోక్ష నిదర్శనాల వల్ల, ఈమే సీతనీ, రామచంద్రమూర్తి సందేశం వినే అర్హత ఈమెకే వుందనీ, హనుమంతుడు తీర్మానించు కుంటాడు. అదేవిధంగా "ఆచార్యుడు" కూడా, తన శిష్యుడిగా స్వీకరించ దలచిన వాడిని, ప్రత్యక్ష-పరోక్ష నిదర్శనాల ద్వారా, భగవత్తత్వ రహస్యం ఉపదేశించడానికి అర్హుడా-కాడా?అని పరీక్షించాలని దీనర్ధం.End

No comments:

Post a Comment