ఇందిరకు
బాసటగా జగ్జీవన్
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి
దినపత్రిక (05-04-2017)
ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా రాజకీయాలలో తనదంటూ
ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటున్న1969-1971 మధ్య కాలం భారత రాజకీయాల్లో అత్యంత ప్రాముఖ్యత
సంతరించుకున్నది. సిండికేట్ గా ముద్రపడిన కాంగ్రెస్ పార్టీ అతిరథ-మహారథులైన రాజకీయ ఉద్దండ పిండాలను ఇందిర మట్టి కరపిస్తున్న రోజులవి. భారతదేశ చరిత్రలో మొట్ట మొదటిసారి, చివరిసారి కూడా, ప్రధాన మంత్రిగా, దేశంలోని అత్యున్నత (రాష్ట్రపతి) పదవికి, తన పార్టీ పక్షాన తానే ప్రతిపాదించిన వ్యక్తికి, తానే వ్యతిరేకంగా ప్రచారం చేసి, తన పార్టీవారినే అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయవలసినదిగా
ఇందిరాగాంధీ ప్రోత్సహించిన రోజులవి.
ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలకు ఎంతో
విలు వుంది. నిర్ణయాలు మెజార్టీ సభ్యుల ఆమోదంతో
తీసుకున్నవైనప్పటికీ, సంఖ్యా పరంగా అతి కొద్దిమంది ఆలోచనలను, సూచనలను గౌరవించినప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపిస్తుంది. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం జరిగినప్పటినుంచి పార్టీలోని భిన్నాభిప్రాయాలవారందరు కలివిడిగా జవహర్ లాల్ నెహ్రూ
నాయకత్వంలో పనిచేశారు. వారిలో అతివాద, మితవాద
భావాలవారున్నారు. అతివాద సిద్ధాంతాలకు దగ్గరైన సమసమాజ నిర్మాణమే
ధ్యేయంగా పాలన చేసిన నెహ్రూ, పార్టీలోని మితవాద భావాల వారినుండి అడపాదడపా
ఎదురైన ప్రతిఘటనలను అధిగమించుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకుపోయారు. పార్టీని నడిపించారు. నాటి పరిస్థితుల్లో పార్టీపరంగా ఆయన అవలంబించిన
మధ్యేమార్గం చక్కగా పనిచేసింది. ఆయన మరణానంతరం, పార్టీలోని బలీయమైన
మైనార్టీ మితవాద శక్తులు, అభివృద్ధి మార్గాన్ననుసరిస్తున్న నాటి ప్రధాన
మంత్రికి అడ్డంకులు-అవరోధాలు కలిగించడంతో, భారత జాతీయ కాంగ్రెస్ లో చీలి కొచ్చి, దరిమిలా కాంగ్రెస్ (ఐ) ఆవిర్భవించి, దేశ రాజకీయాల్లో
చాలాకాలం పాటు సుస్థిర స్థానం సంపాదించుకొని, కేంద్రలోనూ, రాష్ట్రాలలోనూ పాలనాపగ్గాలు చేపట్టింది.
భారత జాతీయ కాంగ్రెస్‌లో అంతకు ముందు
చీలికలు లేవని అనలేము. 1907 లో నాగపూర్‌లో
జరగవలసిన అఖిల భారత కాంగ్రెస్ సభలు వాయిదాపడి, తర్వాత, సూరత్‌లో జరిగాయి. అతివాద భావాల వారికి నాయకత్వం వహిస్తున్న
బాలగంగాధర తిలక్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎంపిక కావడం ఇష్టపడని మాడరేట్లు, సభలను సూరత్‌కు
మార్చి, రాష్‌బిహారీ ఘోష్‌కు నాయకత్వం అంట గట్టారు. రెండు వర్గాలుగా పార్టీ చీలిపోయింది. 1951 లో సంభవించిన నాసిక్ సంక్షోభంలో అధ్యక్ష పదవికి
జరిగిన పోటీలో, ఆచార్య జె. బి. కృపలానీని ఓడించిన పురుషోత్తమ దాస్‌టాండన్, దరిమిలా చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చీలికను నివారించారు. 1969లో ఇందుకు విరుద్ధంగా నాటి అధ్యక్షుడు నిజలింగప్ప
వ్యవహరించడంతో చీలిక అనివార్యమయింది. కాంగ్రెస్
చీలిపోవడానికి ప్రధాన కారణం, జులైలో బెంగుళూర్‌పార్టీ సమావేశంలో తలెత్తిన
వివాదమే.
అప్పట్లో
జరుగనున్న రాష్టప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం
కుదరలేదు. నాలుగో సాధారణ ఎన్నికల అనంతరం, ముఖ్యంగా 1969లో జరిగిన మధ్యంతర ఎన్నికల తర్వాత, దేశ రాజకీయ పరిణామాల నేపథ్యంలో, కాంగ్రెస్
పార్టీలోపలా-వెలుపలా, తరచూ, అతివాద-మితవాద శక్తుల-వ్యక్తుల ప్రస్తావన
రావడం ఆరంభమయింది. ఆ రోజుల్లో సిండికేట్‌గా పేరు పొందిన కాంగ్రెస్ నాయకులైన మొరార్జీ దేశాయ్, ఎస్. కె. పాటిల్, అతుల్య ఘోష్, నిజలింగప్ప (పార్టీ అధ్యక్షుడు) వంటి వారితో, పార్టీలో అతివాదులుగా ముద్రపడిన వారు బహిరంగంగానే విభేదిస్తుండేవారు. బ్యాంకుల
జాతీయీకరణకు అతివాదులు మద్దతిస్తే, సిండికేట్‌వర్గం
వారు వ్యతిరేకించారు. బెంగుళూర్ సమావేశంలో ప్రభుత్వరంగ సంస్థల పనితీరుపై వచ్చిన విమర్శల
లాంటివి ఇరువర్గాల మధ్య తీవ్ర అభిప్రాయభేదాలకు దారితీశాయి. ప్రధానమంత్రి ఇందిరాగాంధి నాయకత్వాన్ని పూర్తిగా బలపరుస్తున్న ఒక వర్గం, సిండికేట్ వర్గం వారు "సామ్యవాద-లౌకికవాద" విధానాలకు వ్యతిరేకులనే భావనకొచ్చారు.
ఇందిరా గాంధీ తీసుకున్న బాంకుల జాతీయం
నిర్ణయాన్ని బలపరుస్తూనే, నీలం సంజీవరెడ్డి పేరును రాష్టప్రతి పదవికి
కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించాడు సిండికేట్‌కు చెందిన
నిజలింగప్ప. ఇందిరాగాంధీ సూచించిన వి.వి. గిరి పేరును గానీ, జగ్జీవన్‌రామ్ పేరును గానీ పరిగణనలోకి తీసుకోలేదు. ప్రధాన మంత్రిగా తాను సూచించిన అభ్యర్థిని కాకుండా
వేరే వ్యక్తిని పార్లమెంటరీ బోర్డు ఎంపిక చేయడాన్ని తప్పుబట్టింది ఇందిరాగాంధీ. రాష్టప్రతి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం ముఖ్యమని తేల్చిచెప్పిం దామె. దెబ్బకు దెబ్బగా మొరార్జీ దేశాయ్‌ని ఆర్థిక శాఖనుంచి తొలగిస్తూ నిర్ణయం
ప్రకటించింది. భవిష్యత్‌లో తాను తీసుకోదలచిన ఆర్థికపరమైన విధానాల
అమలు బాధ్యతను మొరార్జీ మీద మోపలేనంటూ తన అభిప్రాయాన్ని వెల్లడిచేసింది. వేరే శాఖను నిర్వహించడానికి ఇష్టపడని మొరార్జీ రాజీనామా చేశాడు. 1969 జులై 19 న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం, 14 భారీ వాణిజ్య బ్యాంకులను
జాతీయం చేయాలని నిర్ణయించింది.
ఇందిరాగాంధీ
నాయకత్వంలో తీసుకున్న ఈ నిర్ణయం కాంగ్రెస్‌పార్టీలో విభేదాలకు దారితీస్తే, వామపక్షాల సంపూర్ణ మద్దతు లభించిందామెకు. వి. వి.గిరి స్వతంత్ర అభ్యర్థిగా, వామ పక్షాల మద్దతుతో రాష్టప్రతి పదవికి పోటీకి దిగాడు. 1969 ఆగస్ట్ 13 న ఆత్మ ప్రబోధం మేరకు, రాష్టప్రతి ఎన్నికల్లో ఓటేయమని, కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ శాసనసభ సభ్యులకు పిలుపునిచ్చింది
ఇందిరాగాంధీ. కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్ప, తమ పార్టీ ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తున్న స్వతంత్ర, జనసంఘ్ పార్టీల నాయకులకు, సంజీవరెడ్డి
అభ్యర్థిత్వానికి మద్దతు కోరుతూ లేఖ రాయడాన్ని తప్పుపట్టింది ఇందిరాగాంధీ. ఆమె పక్షాన ఫకృద్దీన్ అలీ అహ్మద్, జగ్జీవన్‌రామ్
కాంగ్రెస్ ఓటర్లకు ఆత్మ ప్రబోధం మేరకు ఓటు చేయవలసినదిగా పిలుపునిచ్చారు.
రాష్టప్రతి
ఎన్నికల్లో ఓటుహక్కు ఉన్న కాంగ్రెస్ పార్టీ వారందరికీ ఆమె 1969 ఆగస్ట్ 18 న లేఖ పంపుతూ
అందులో, సరళీకృత, సామ్యవాద, ఆర్థిక సంస్కరణలను
తేవాలని, అమలుచేయాలని అనుకున్నప్పుడల్లా స్వప్రయోజన పరులు
వాటిని వ్యతిరేకిస్తుంటారు అని పేర్కొని, వారందరి మద్దతు
కోరింది ఇందిరా గాంధీ. పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా పని చేశారని
ఆరోపణ చేస్తూ, జగ్జీవన్ రామ్, ఫకృద్దీన్‌అలీ
అహ్మద్‌లకు కాంగ్రెస్‌అధ్యక్షుడు నోటీసులు పంపాడు. అయితే, పార్టీ విధానాలను పాటించని వారికి క్రమశిక్షణ గురించి మాట్లాడడంలో
అర్థంలేదని ఇందిరాగాంధీ పేర్కొంది. వివిధ రాష్ట్రాలలో
కొందరు కాంగ్రెస్‌నాయకులు తమ స్వప్ర యోజనాల కోసం అవలంబించిన విధానాల వల్ల, ఎలా అభిమానులు పార్టీని వీడిపోయారో వివరించారామె.
జగ్జీవన్‌రామ్, ఫకృద్దీన్‌అలీ అహ్మద్‌లు తామే నిజమైన కాంగ్రెస్ వాదులమని, ప్రజలు తమ వెంటే ఉన్నారని అధ్యక్షుడిచ్చిన
నోటీసును సవాలు చేశారు. పార్టీకి చెందిన మెజారిటీ పార్లమెంట్, శాసన సభ సభ్యులు ఇందిరాగాంధీకి మద్దతు పలకడంతో, వి.వి. గిరి రాష్టప్రతిగా
ఎన్నికయ్యారు. పార్టీపై ఆమెకున్న ఆధిక్యత రుజువైంది.
ఇందిరాగాంధీ
తమిళనాడు పర్యటనకు కొద్దిరోజుల ముందు, కాంగ్రెస్
అగ్రనాయకుడు, నిజలింగప్ప అనుకూలవాది కామరాజ్ నాడార్‌తో వచ్చిన
విభేదాలవల్ల, రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి
ఇందిరాగాంధీ మద్దతు దారుడైన సి. సుబ్రహ్మణ్యం రాజీనామా చేశాడు. దాన్ని సాకుగా చూపి, ఆయనను వర్కింగ్ కమిటీ సభ్యుడుగా కొనసాగించే విషయంలో పేచీ పెట్టాడు అఖిల
భారత కాంగ్రెస్‌అధ్యక్షుడు నిజలింగప్ప. ఇరువర్గాలు
కొద్దిరోజుల కింద కుదుర్చుకున్న ఐక్యతా ఒప్పందానికి నిజలింగప్ప తీసుకుంటున్న
చర్యలు విరుద్ధమైనవని పేర్కొంటూ, ఇందిరాగాంధీ, వై.బి. చవాన్, జగ్జీవన్‌రాం, ఫకృద్దీన్‌అలీ
అహ్మద్, ఉమా శంకర్‌దీక్షిత్, సి. సుబ్రహ్మణ్యంలు సంయుక్తంగా లేఖను అధ్యక్షుడికి పంపారు. లేఖలో, గతంలో పార్టీ చేసిన తీర్మానాన్ని ఉదహరిస్తూ, సామ్యవాద-లౌకిక-అభివృద్ధికర
విధానాలను ప్రభుత్వం పటిష్టంగా అమలు జరిపేందుకు పార్టీ ప్రజల మద్దతు
కూడగట్టుకోవాలనీ, అందుకు పార్టీకి కొత్త అధ్యక్షుడు కావాలనీ, అందుకే అధ్యక్ష ఎన్నిక జరగాలనీ స్పష్టం చేశారు.
ఇందిరాగాంధీ, నిజలింగప్ప మద్దతు దారుల మధ్య విభేదాలు ముదిరిపోవడంతో 1969 అక్టోబర్ 18న గడువుకంటే ముందే
నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి అఖిల భారత కాంగ్రెస్‌కమిటీ సమావేశాన్ని ఏర్పాటు
చేయాలని పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వర్కింగ్ కమిటీకి విజ్ఞప్తిచేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగడానికి ఒకరోజు ముందర, 1969 నవంబర్ 1న సి. సుబ్రహ్మణ్యం, ఫకృద్దీన్ అలీ అహ్మద్‌లను
సభ్యులుగా తొలగిస్తూ నిజలింగప్ప నిర్ణయం తీసుకోవడంతో, ఇందిరాగాంధీ మద్దతు దార్లు సమావేశానికి హాజరు కాలేదు.
ఎ. ఐ. సి.సి. సమావేశం జరపాలని
లేఖ పంపిన వర్కింగ్‌కమిటీ సభ్యులందరు ఇందిరాగాంధీ ఇంట్లో సమావేశమయ్యారు. మెజారిటీ సభ్యుల అభ్యర్థన మేరకు 1969 నవంబర్ 22, 23లలో ఢిల్లీలో అఖిల
భారత కాంగ్రెస్‌పార్టీ సమావేశాలను నిర్వహించాలని తీర్మానం చేశారు. నవంబర్ 12న నిజలింగప్ప ఇందిరా గాంధీని పార్టీనుంచి బహిష్కరించే చర్యలు చేపట్టడంతో
చీలికకు రంగం పూర్తిగా సిద్ధమయింది. అత్యధిక
సంఖ్యాకులైన ఇందిరాగాంధీ మద్దతుదారులు నవంబర్ చివరి వారంలో అఖిల భారత కాంగ్రెస్‌పార్టీ
సమావేశాలను నిర్వహించి సి. సుబ్రహ్మణ్యంను తాత్కాలిక అధ్యక్షుడుగా ఎన్నుకోవడంతో
భారత జాతీయ కాంగ్రెస్ చీలిపోయింది. ఇందిరాగాంధీకి
ప్రధాన మంత్రిగా తాను అమలు పరచాలనుకున్న విధానాలను పటిష్ఠంగా అమలు పరిచే అవకాశం
లభించింది.
ఈ
మొత్తం వ్యవహారంలో ఆదినుంచీ చివరి వరకూ ఇందిరా గాంధీకి అండగా నిలిచి, ఆమెను విజయపథాన నడిపించిన వ్యక్తి బాబూ జగ్జీవన్‌రామ్. (నేడు జగ్జీవన్
రామ్ జయంతి)
No comments:
Post a Comment