లంకకుకుపోయి వచ్చిన విధం కపులకు చెప్పిన హనుమ
ఆంధ్రవాల్మీకి
వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (22-10-2018)
సీతాన్వేషణకు లంకకు వెళ్లి వచ్చిన హనుమంతుడు, ఆ వృత్తాంతమంతా, తోటి వానరులకు
వివరించిన దానిని, ఒక సుదీర్ఘ "దండకం" రూపంలో రాశారు వాసు దాస కవి. ఆ దండకం ఇలా
సాగుతుంది.
దండకం: ఆద్యంత వృత్తాంత
మాలింపఁ గా నింపు పెంపార నా జాంబవంతుండు వాతాత్మజుం జూచి యో యంజనానందనా! ముందుగాఁ
బొందుగాఁ దెల్పుమే రీతి నా నాతిని న్నీవు గన్గొంటి? వాల్గంటి దా నొంటి నెట్లున్న? దా యన్నుమిన్నన్ దశాస్యుండు క్రూరుండు దా నే విధిం జూచెడిన్? మీది కార్యంబు
ఱేనంచునన్ సంచుగా జెప్ప నౌ చెప్పఁ గా రాని యవ్వాని భాశింపు మన్నన్, హనూమంతుఁ డత్యంత సంతుష్టుడై హృష్టుడై జానకిన్ లోన
ధ్యానించి మూర్ధంబుచే మ్రొక్కి యిక్కై వడింబల్కె; వారాశియా ప్రక్కతీరంబుఁ
జేరంగ లో నెంచి నే నీ నగాగ్రంబునందుండి కుప్పించి దాఁ టంగ మీరెల్లఁ గన్నారఁ
గన్నార కాదే? యటేనేగ నంబోధిమధ్యంబునన్ హేమశృంగాంచితంబైన శైలంబు నాత్రోవకడ్డంబు రా వచ్చె రా
విఘ్న మం చెంచి రోషించి భేదించి పోవంగ లోనెంచి దానిన్ ఢికీలంచు నే దాఁ కితిన్, దోఁ కతో దాచితిన్, దాచినన్ దాని శృంగంబు
వేభంగులన్ భంగ మై రాలెఁ , దఛ్చైలమో మామకీ నాశయం బెంచి హర్షంబుగా నాయనా! నీకు జిన్నప్ప నే, గాడ్పుమిత్రుండ, మైనాకుఁ డన్, వార్ధిలో
చుండుదున్, మున్ను పక్షంబు లుండన్ ధరాధ్రంబు లెల్లన్ యధేచ్ఛంబుగాఁ గ్రుమ్మరన్ లోకభీదానదక్షంబు లౌ వాని వీక్షించి
పక్షంబులం ద్రుంచె వజ్రహతిన్ శక్రు, డగ్గోడు తప్పింప నీ తండ్రి నన్దెచ్చి యీ యంబుధిం ద్రోచెఁ జూ, ధర్మభృద్వర్యుఁ
డున్ శక్రవీర్యుండు నౌ రాము కార్యంబున న్నాదు సాహాయ్యముం గొమ్ము నా, సమ్మతిన్ నాదు
కర్జంబు చందంబు బోధించి కార్యైకసక్తాత్మతన్ శైలరాజాజ్ఞ నేఁ బోయితిన్, గ్రావమున్ మానుషాకారమున్
మాని శైలాకృతింబూని వారాశిమధ్యంబునన్ నిల్చె, నే నెచ్చు వేగంబునన్ బోవ బోవంగ నాగాంబ వేగంబ నాకడ్డమైనిల్చి
యోక్రోతిఱేఁ డా! మదాహారముం గమ్ము,
వేగమ్మ రారమ్ము, దేవాళి యేర్పాటురా సుమ్ము నా; నమ్మహాదేవికిన్ మ్రొక్కి దిక్కేమియుం దోఁ ప కిట్లంటి నో
దేవి! భూదేవి జామాత శ్రీరాముఁ డారణ్య దేశంబునన్ జానకీ లక్షణాన్వీతుడై! క్రుమ్మరం
బంక్తికంఠుండు శుంఠుండు తద్దేవినిన్ మ్రుచ్చిలించెన్, దదన్వేశణార్ధంబు
రామాజ్ఞచే బోవుచున్నాఁ డ, దద్దేవిదేశంబునం దుంట శ్రీరాము కార్యంబునందోడు కారాదె? కాదేని వైదేహినిన్
రామునిం జూచి వే వచ్చి నే నిచ్చి నీ మెచ్చుగా జొచ్చువాఁ డన్ భవద్వక్త్రమం దన్న న
య్యన్ను హా! యేటిమాటల్ బళా దాఁ టి పోనీయ, నాకీ వరం బిచ్చి రా దేవతావల్లభుల్, పొల్లుగాదన్న, మే న్వెంచితిన్
యోజనంబుల్ పది న్నిడ్పు లం దర్ధవిస్తారముం గల్గనాదేవి నాయంత వాక్రంత దావిచ్చె నే
నంత హ్రస్వుండనై యొక్క యంగుష్ట మాత్రంబు గాత్రంబుగా జివ్వునన్ దాని వక్త్రంబునం
జొచ్చి వెల్వడ్డ నన్ జూచి నైజాకృతిం దాల్చి యా యంబ, యోవానరంబా! సుఖంబార బోపొమ్ము, నీకార్యముల్ చక్కనౌఁ , గూర్పుమీ సీత శ్రీరాముతో, మెచ్చితిన్ నీయెడన్, భద్రమౌ నన్న నన్నంతటన్ భూతముల్ ప్రీతముల్ మేలు మేలంచు శ్లాఘించె, దర్వాత నిర్భీతి
బక్షీశురీతిన్ మొగుల్ త్రోవ నేఁ బోవ, నాచాయనేదో గ్రహింపంగ నేచాయ గన్గొన్న నాకేమియుం దోఁ ప
దాత్మీయ వేగంబు సంకుంఠితం బైన నే నాత్మలో నే మహా! నా మహావేగమాచిక్కె, నే ప్రక్క
నేయొక్కరిం గాన, గార్యంబు వార్యంబుగా నోపునో?
యంచు దుఃఖాకులాత్ముండ నై క్రిందు చూడంగ, మున్నీట ఘోరాకృతిం
బండి రాకాసి యొక్కర్తు నన్ చూచి గర్జించి తర్జించి పెన్నవ్వుతోఁ గ్రొవ్వుతోఁ
గీడుగా నాడె, నో పెద్ద దేహంబువాడా! బలే యెందురా యేగవే వేగ? నే నెన్నియో నాళ్ళుగాఁ
గూడు లేకుంట నాఁ కంట నే జిక్కి స్రుక్కంగ నిందుండ నా దండిభాగ్యాన నాకంటికిం
దోఁ చి తిప్పట్ల, నాకడ్పులోఁ గుడ్పుగా జొచ్చి యానంద మొందింపరా
యన్నఁ గా నిమ్మటం చేను నామేను వేదాని వాకంటె బల్ పెద్దగాఁ బెంప, నా టక్కు నూహింపఁ గా లేక నన్మింగ నోర్విచ్చె, నేనో నిమేశంబునన్ గుజ్జువేశంబునన్ దాని పెన్బొట్టలో దిట్టనై
యట్టెవేచొచ్చి ప్రేవుల్ వెసం గొంచుఁ జివ్వాలునం బైకి లంఘించితిన్, హస్తముల్ వ్రేల
రాకాసి వారాశిలోఁ గూలె, మింటన్ నభశ్చారు లౌ చారణుల్ సింహికా రాక్షసిం ద్రుంచె సామీరి యం చాడగా వింటి, నే నత్యయం
బెంచుచున్ వింటిమార్గంబునం బోయి శాఖిప్రతానావృతంబౌచు లంకాపురం బుండు నాయొడ్డు
గన్గొంటి, నా పిమ్మటన్ సూర్యుఁ డస్తాద్రిఁ జేరంగ
ఘోరాసురస్తోమముల్ గాన కుండంగ లంకాపురిం జొచ్చితిం, జొచ్చుచుండంగ నొక్కర్తు కల్పాంత ధా రా ధ రా కా
రఘోరాట్టహాసాననోపేతజాజ్వల్యమానాగ్ని కేశాలితో నన్నుఁ జంపన్ సమీపింప డా కేల నేఁ
బెద్ద పెట్టొక్కటిం బెట్టితిన్,
దానితో ఱోలుచుం గూలి, నన్ చూచి యో వీర! లంకాపురిన్ నేను, నన్గెల్చి తీవింక గెల్వంగ నేర్తీసురారాతి సంఘంబుఁ బొమ్మంచు
నచ్చేడె నన్నాడె, నేనా ప్రదోశంబునన్ లంకలో జొచ్చి రేయెల్ల సీతాసతిన్ రోసితిన్, దైత్యునంతః
పురాంతస్థ్సలిం గానరాదయ్యె, నేనయ్యెడన్ శోకసంతాప మేపారఁ
బ్రాకారముం దాఁ టి, యుద్యానముం గాంచి, యందే యశోకావనీజాతమొం డెక్కి బంగారసంటుల్ విరాజిల్లు తోఁ టొక్కటిన్
శింశుపాభూరుహోపాంతదేశంబునన్ శ్యామనీ రేజిపత్రాంబకన్ నిట్రుపాసంబులం జిక్కి
యేకాంశుకాన్వీతయై, ధూళిసంలగ్న కేశాంతయై, శోకసంతాపదీనాంగియై, నాధు ధ్యానించుచున్ బెబ్బులుల్ చుట్టఁ గా లేడిచందాన దుఃఖించుచున్ భూమిపై
వ్రాలి పెన్మంచునం దమ్మివోలెన్ వివర్ణాకృతిం దాల్చి దైత్యేశభీతిన్ మృతిం జెందఁ గా
గోరు సీతాసతిం గాంచు చా చెట్టుపై నుంటి, నే నింతలోఁ బంక్తి కంఠాలయంబందు ఝాళం ఝుళీరావముల్ వింటి, నద్దాన నే
నివ్వెఱన్ గొంటి, సంక్షిప్త గాత్రుండనై పక్షివోలెం గుజంబందు నే నుంటి, దైత్యేశు
డిల్లాండ్రతో వచ్చె నచ్చోటికిన్,
జానకీదేవి యారాక్షసాధీశునింజూచి మోఁ కాళులన్ ఱొమ్మునంజేర్చి
హస్తంబులం జుట్టి విత్రస్తయై దిక్కు లేకందు నల్దిక్కు లీక్షించుచున్ వేపమానాంగియై
యుండ వాఁ డంగనం జేరి ధాత్రీస్థలిన్ వ్రాలి నన్నేలవే గోల! యో బేల! రెన్నెల్లలో
నన్నుఁ గైకోక గర్వించి తేనిన్ భవచ్ఛోణితం
బేను ద్రావంగ నుంకితుఁ జుమ్మన్న నన్నీచు వాక్యంబు లాలించి రోశంబునన్ సీత భాషించె
నో నీచుడా! దుర్మతీ! నన్నెవ్వతెంగాఁ
గనుంగొంటిరా! నీవు; శ్రీరాము నిల్లాల, నిక్ష్వాకువంశేశ్వరుండైన యయ్యాజికిం గోడలన్, నన్నురా నీవు నీచోక్తులాడంగ! నీనాల్క తుత్తున్కలై కూలదా? క్రూరుఁ డా!
శూరుడా నీవు? చోరుండవై నాదు నాధుండు లేనప్డు నన్దెచ్చి ముచ్చట్లు వాక్రువ్వగా వచ్చితా? రామచంద్రుండు
సంగ్రామశూరుండు సత్తోక్త్యుదారుండు యజ్ఞప్రచారుండు నీ వా మహాభావు దాసుండగా నైన
నర్హుండవా? కావు కావన్న నన్నాతివాక్యంబు లాలించి కోపించి యంతం, జితాస్థాగ్ని
చందంబున న్మండి పెన్గ్రుడ్డులం ద్రిప్పి నద్దేవినిం గ్రుద్ది చంపంగఁ గేలెత్తనయ్యో యయో యయ్యయో యంచు దైత్యాంగనల్ గూయ
స్త్రీ మధ్యమందున్న మండోదరీ నామ్ని దానడ్డమై శూరుఁ డా! యేమి ఈ సేఁ త? యీసీత నీకేల
నేనుండగా? లేరె యీయక్ష దేవాంగనల్? చాలరే వీరు? లీలావిలాసంబులం దేలఁ గా రాదె,
రమ్మంచువారెల్లఁ గోపంబు చల్లార్చి యా రాక్షసుం దోడు కొంచేగి
ర ట్లేగ సీతాసతిం గాచు ఘోరాస్యలౌ రాక్షసస్త్రీలు తద్దేవినిం జూచి గర్జించి
భర్జించి, తర్జించి కర్జంబుగా నెన్నియో దారుణాలాపముల్ పల్కఁ గా వాని నా చానయున్ గడ్డిపోఁ
చంబలెం జూచె, నా యింతి స్థైర్యంబు నారక్కెసల్ గ్రక్కునం బోయి దేవారికిం జెప్పి యా యంగనన్
లొంగఁ గాఁ జేయ దుస్సాధమం చెంచి యందంద నిద్రించిరా మైథిలీ దేవియున్ రామ! రామా! యటం
చేడ్చుచుండం ద్రిజాటాఖ్య దా నిద్దురన్ లేచి రక్షస్సతీసంఘముం గాంచి మీరేటికే జానకిం
జూచి బక్షింతుమా తిందుమా యంచుఁ దర్జింపగా? మ్రింగుడీ నన్ను మీరే, ధరాపుత్రి నాశంబు గా దెన్నఁ , డా యాజికిం గోడ లై రాము నిల్లాలు నౌ సాధ్వి మీచేతికా
చిక్కెడిన్? దారుణమ్బైన స్వప్నంబునం దీ దశగ్రీవునాశంబు శ్రీరాము గెల్పుం గనుంగొంటి, మీ తర్జనల్ చాలు, మిమ్మెల్ల నీదేవి
శ్రీరాముతోఁ చెప్పి రక్షింపఁ జాలున్, నమస్కారమాత్ర ప్రసన్నన్ గృపావాల, వే వేఁ డుకోరే, మదీయాశయం బిద్ది, నిక్కంబు
దుఃఖంబులం బాపు నీదేవి, యో తల్లిరో! నీవ మాదిక్కు మా మ్రొక్కుఁ
గైకొంచు రక్షింపుమన్నన్ దయాలోల సీతామహాదేవి తా నెవ్వరిం గాచు, నన్నంత నా యింతియుం
గాంతు జేతృత్వ మాలించి లోసిగ్గునం బల్కె, మీ మాట సత్యంబ యే నట్ల రక్షింతు నం చీ గతిం బల్క, నా కల్కి యాపద్దశం
జూడ లేనైతి నాధైర్యమోవమ్ముగాఁ బోయె. నేనంత నాకాంతతో భాశణోపాయముం జక్క భావించి
యిక్ష్వాకు వంశస్తవం బారఁ గా జేయ నామాట లాలించి యాదేవి కన్నీటితో వానరశ్రేశ్ఠ
యెవ్వండవయ్యా! నినుం బంపె నెవ్వం డ దేలా య దేలాగునన్ వచ్చితీ విందు? నే విందుగా విందు, శ్రీరాముతోఁ
జెల్మి నీ కెట్లు చేకూరె? భాషింపవే యన్న నా యన్నుతో విన్నపం బిట్లు నేఁ జేసితిన్, దేవి! నీ నాధు
మిత్రుండు మిత్రాత్మజుండుండు సుగ్రీవనాముండు, నే నా మహాశూరుబంటన్ హనూమంతుఁ డన్పేరివాడన్, నినుం గాన నా ఱేఁ డు శ్రీరాముఁ డంపెజుమీ, నీ
కభిజ్ఞానమాత్మాంగుళీయంబు దా నిచ్చెఁ గైకొమ్ము, నా కిమ్ము నీవానతిన్, రామ సౌమిత్రులన్
డాయ ని న్గొంచు నేఁ బోయెదన్ వచ్చెదే? యన్న నాగోలలన్
మిన్న యోయన్న శ్రీరాముడే రావణుం జంపి నన్గొంచుబో వత్తు నన్నన్ సతీ! నాకు
జిత్తప్రమోదావహంబైన గుర్తేమియే నిచ్చెదే? యన్నఁ గానిమ్మటం
చింద మీ దివ్యచూడామణిం గొమ్ము,
నా ప్రాణనాధుండు నిద్దాని వీక్షించినంతన్ నిజం బెచ్చుగా
నిన్ను మన్నించు నం చిచ్చి తా వెండియుం గొన్ని సందేశవాక్యంబులం జెప్పె, నే నా సతీరత్నమున్
మ్రొక్కి నే నిందురాఁ జూచుచుండంగఁ , దా వెండియున్
నన్ను వీక్షించి యో యంజనానందనా! యెట్లు వ్రాకుచ్చినన్ రామసౌమిత్రి సుగ్రీవు
లిచ్చోటికిన్ వేగ రాఁ జూతురో యట్లు
భాశింపు, మిం కేను మాస ద్వయంబే చుమీమేనఁ
బ్రాణంబులం దాల్తు నీలోన శ్రీరామచంద్రుండు న న్జూడ రాఁ డాయెనా నాయనా! నే నా
యనాథాకృతిం జత్తు, మీయిష్ట మం చన్న నాకన్నె దీనోక్తు లాలింపఁ గాఁ గింక యంకూర మెత్తెం జుఁ డీ, యంత గొండంత
దేహంబుతో యుద్ధకాంక్షన్ వనంబెల్లఁ
జీకాకుగాఁ బీకి నిర్మూలముం జేయ యారద్దునన్ నిద్దురన్ లేచి యద్దైత్యకాంతల్
మదిన్ భీతి గొల్పంగ నల్దిక్కులం బాఱి యిం దారినిం జేరి యోవైరివిద్రావణా రావణా!
క్రోతి యొక్కండు యుష్మన్నహాశూరతాజ్ఞాని దుష్టాత్ముఁ డై తోఁ టయెల్లన్ సపాటంబుగా
నేలతో పాటు గావించె, నా క్రించు రప్పించి ఖండింపుమీ, యన్న నా రాక్షసుం డుగ్రులంగింక రాఖ్యాతశూలాయుధాశీతిసాహస్ర
సఖ్యాకులం బంచె, నే లౌడిచేఁ ద్రుంచితిన్ వారలం జావగా, దక్కియున్నట్టి
దైత్యుల్ వెసంబారిదేవారితోఁ జెప్పి, రే నింతలో నూర కేలుండగా నంచుఁ దోఁ పంగ నాచైత్య ప్రాసాదమున్
ధ్వస్తముం జేసి యచ్చోటిరక్షస్తతిన్ స్తంభఘాతంబులం గూల్చితిన్ నూర్వురన్, వచ్చెఁ దా నంతలోనం బ్రహస్తాత్మసంభూతుఁ డౌ
జంబుమాల్యాఖ్య విఖ్యాత శూరుండు ఘోరాసురవ్యూహసం యుక్తుఁ డై, వాని
సేనాసమేతంబుగా లౌణిచేఁ జంపితిం, బిమ్మటం బంచె నాపై
మహామాత్ర పుత్రాష్టకం బేను నద్దాననే వారిఁ గాలాలయావాసులం జేసితిం, బంచసంఖ్యాకసేనాను
లుద్దండత న్వెండి పై రా విదారించితిన్ సేనతో, వెన్క నప్పంక్తి
కంఠాత్మజుం డక్షుఁ డన్వాఁ డు సైన్యంబుతో వచ్చె, నే నా కుమారున్ మహావీరు మందోదరీసూనునిన్ మింటికిన్వాఁ డు
లంఘించుచోఁ గాళ్ళు లీలన్ బిగంబట్టి గి ర్గిఱ్ఱునన్ నూఱు మాఱుల్ వడిం ద్రిప్పి
పెన్ముద్దగా జేసి ధాత్రీస్థలి న్మోఁ దితిన్, వానిపా టా దశాస్యుండు నాలించి వేరొడు పుత్రున్
మహాగాత్రునిన్, శక్రజిం బంపె; నవ్వాని నవ్వాహినిం గూడఁ దేజం బఱంజేసి
మోదించితిన్, వాడు నన్గెల్చున న్నమ్మకం బూనిరక్షోవిభుం డంపె, నన్నెట్టులుం గెల్వరాదంచు నూహించి వాఁ డంత
బ్రహ్మాస్త్రపాశంబులన్ నన్ను బంధించె, రక్షోవరుల్ త్రాళ్లతో నన్ను బంధించి కొంపోయి దైత్యేశు
మ్రోలన్ నిలంబెట్ట వాఁ డుగ్రుఁ డై యేలరా వచ్చితీలంక! కీ వేలరా చంపితా సోఁ కులం? జెప్పరా యన్న
సీతార్ధ మై సర్వముం జేసితిన్,
నిన్నుఁ జూడంగ నీయింటికిన్ వచ్చితిన్ రాక్షసేంద్రా! హనూమంతు
డన్వాఁ డ, నేఁ బావమానిన్ రఘూత్తంసుఁ డౌ రామదూతుండ, సుగ్రీవు మంత్రిన్, ననుంబంప రాముండు నీయొద్దకు న్వచ్చితిన్ దూతనై, సూర్యపుత్రుండు నీ
సేమముం ప్రశ్న గావించె, ధర్మార్ధకామానుషక్తంబు పథ్యంబు వాక్యంబు నీకున్ వచించెంజుమీ, ఋశ్యమూకంబునన్
రాముతో మైత్రిఁ గావించి యున్నాఁ డు, తద్వీరు వాక్యంబు
లాలింపుమా, రామదేవుండు దేవారి నా నారినిన్ మ్రుచ్చిలించెన్ వనీభూమి, నీవిందు సాహాయ్యముం
జేయుమా, యంచు నన్వేఁ డ నే నట్టులే చేయుదుంగాని యవ్వాలినిం జంపఁ గా బాసఁ గావింపు మీ యంటి, సూర్యాన్వయుండట్లు గావించి యవ్వాలినిన్ బాణమొక్కంటనే చంపి
కీశాధిపత్యంబు నా కిచ్చె, నే హవ్యభుక్సాక్షికంబైన స్నేహంబు గావించితిన్, రామసాహాయ్య మే నెట్టులుం జేయుదున్, జానకీదేవి
శ్రీరామభూనేత కి మ్మీయకున్నంత వీరుల్ వనాటుల్ భవచ్ఛౌర్య నిర్మూలనం బెట్లుఁ గావింతు, రెవ్వారు! మావారి శౌర్యంబు లోకంబునం గానరో? పోవరో మున్ను
దేవాళికిం దోడుగా? నంచు నీతో వచింపన్ ననుం బంచె నన్నన్ రుషాశోణితం బైన నేత్రంబులం జూఁ డున
ట్లుగ్రతం జూచి నా విక్రమం బా దురాత్ముం డవిజ్ఞాతుడై యంత నన్ జంప నాజ్ఞప్తి
గావింపగా వానితమ్ముండు ధీశాలి రక్షోవరు న్నానిమిత్తంబుగా వేఁ డె నో సోఁ కు ఱేఁ డా!
కనన్ రాజశాస్త్రవ్యపేతంబు నీ యాజ్ఞ శాస్త్రంబునం దూత వధ్యుండుగాఁ , డిచ్చమైఁ దథ్యముం బథ్యముం బల్కు వాఁ డెట్టి నేరంబు గావించినన్ రూపుమార్పన్ వికారంబుగాఁ జెల్లుగా, కెప్పుడుం జంపగా రా దనం, దోఁ కఁ గాల్పంగఁ
బంచెన్ దశాస్యుండు, రక్షోవరుల్ వాల్క వారంబులన్ జీర్ణ కార్పాసవస్త్రంబులం దోఁ కకుం జుట్టి నన్
గట్టెలం గొట్టుచున్, గింకచే దిట్టుచున్, బైపయిన్ ఱొప్పుచుం, వీథులం ద్రిప్పుచున్, బోవ సంక్షిప్తగాత్రుండనైతట్టులండుల్చి నే వెండియున్ ఘోరరూపంబుఁ గైకొంచుఁ
బెన్ లౌడిచే వారలం జంప ద్వారంబునన్ జేరి లంకాపురిం గొంప లన్నింటికిం జిచ్చు
సంధించి యామంటలో సీతయుం ద్రుంగెనో? పోయెఁ గా పట్టనం బంతయుం బాడుగాఁ, దన్విమాత్రంబు దా
నెట్లు జీవించెడిన్? రామకార్యంబు నిర్మూలముం జేసితిన్ బుధ్ధిహీనుండనై యంచు శోకించుచున్ సీత భద్రంబ
యం చంభ్రమార్గంబునం జారణుల్ పల్కనాలించి భావించి సర్వంబునుం గాల్చు నా
యాశ్రయాశుండు నాతోఁ క గాల్పండ,
నా చిత్తమా సంప్రహృష్టంబు, సౌరభ్య సంభారుఁ డై గంధవాహుండు నున్ వీచె, సీతామహాదేవి
నావీతిహోత్రుండు దాఁ గాల్పఁ గానోపు? నంచాత్మ మోదించి
యా యించుబోణిన్ మఱిం గాంచి నే నామెకుం జెప్పి తత్రస్థమౌ నా యరిష్టంబుపై నెక్కి
మిమ్మెల్ల దర్శించు పెన్మక్కువన్ గ్రక్కునన్ వారిధిం దాఁ టి చంద్రార్కసంసేవితంబైన
మార్గంబునన్ వచ్చితిన్, మిమ్ముఁ గన్గొంటి, శ్రీరామచంద్ర ప్రభావంబునన్ యుష్మదీయోరుతేజంబునన్ నేను సుగ్రీవు కార్యంబు
నీమట్టు గావించితిన్ లంకలో, నింకఁ గాఁ గల్గు కార్యం
బవార్యంబుగాఁ జేయ మీరెల్లరున్నారుగా.
(హనుమంతుడు సముద్రం దాటి లంకకు పోయి సీతను చూసి, సంభాషించి, మరలి వచ్చే ముందర
లంకాదహనం చేసి, తిరిగి వచ్చి తన వానర మిత్రులను కలిసేంత వరకూ జరిగిన సుందరకాండ వృత్తాంతం ఇది.
ఇంతవరకూ జరిగిన సుందరకాండంతా ఇందులో వుంది. ఇందులోని విషయమంతా హనుమంతుడు వక్తగా, సంగ్రహంగా వానర
మిత్రులకు చెప్పాడు. ఇది చదివి ఇక ముందుకు సాగితే సుందరకాండ అంతా చదివినట్లే కద!
మహాద్భుతమైన, రసరమ్య రంజితమైన శ్రీవాసుదాసస్వామి శ్రీ లేఖిని నుండి జాలువారిన ఈ దండకం
సర్వదోషహారం. సర్వ క్లేశ నివారణం. శ్రీరామానుగ్రహ ప్రసాద కారణం)