కపులకు సీతాదేవి పరిస్థితిని తెలిపిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి
వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (29-10-2018)
లంకకు పోయివచ్చిన విధమంతా క్షుణ్ణంగా కపులకు వివరించిన
హనుమంతుడు, తన వానర మిత్రులతో ఇలా అంటాడు:
"శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహంచేత, మీ అందరి
ప్రోత్సాహం వల్ల, నావన్తుగా మీరు నాకు అప్పగించినపని, లంకకు
వెళ్లి సీతను చూసి రావడం పూర్తయింది. ఇక తక్కినకార్యం మీవంతు. సుగ్రీవుడు
సీతాన్వేషణకోసం చూపిన ఉత్సాహం, రామచంద్రుడి ప్రయత్నం, ఈ రెండూ, సీతాదేవి
మహాపాతివ్రత్య మహిమవల్ల ఫలించాయి. వారివురు అనుకున్నవి నెరవేరాయి. వికసించిన
తామరపూవును విడిచి తుమ్మెద రాలేనట్లే, నా మనసు లంకలో వున్న సీతాదేవిని విడిచి ఇక్కడకు రాలేక
పోతున్నది. ఇలా నా జన్మ సఫలమయింది. ఉన్న విషయాన్ని యదార్ధంగా చెప్పాను".
"నేను చెప్తున్నదాన్నిబట్టి రావణుడు అల్పుడనీ,
సులభ సాధ్యుడనీ, భావించవద్దు. వాడి తపోబలంతో,
లోకాలను నిల బెట్టగలడు. సంహరించనూ గల సమర్ధుడు. జానకిని
తగిలినా వాడింకా దగ్ధమై పోలేదంటే,
అది వాడి తపోబలమే! వాడి తపోమహిమ సీతాదేవి పాతివ్రత్యం కంటే
గొప్పదనడంలో అర్థం, వాడిని రాముడు, సుగ్రీవుడు ఏమీ చేయలేరని కాదు. రావణుడు
దగ్ధమైపోకుండా వున్నాడంటే అది వాడి తపోబలంవల్ల కాదు. వాడు ఆమెను తాకినప్పుడు ఆమె
కోప్పడలేదు. ఆమె నిజంగా కోపమే తెచ్చుకుంటే, ఆ కోపాగ్ని, నిజమైన అగ్నిహోత్రుడి అగ్నికంటే తీవ్రమయిందవుతుంది.
అగ్నిహోత్రుడు రావణాసురుడి కొంపకాల్చగలిగాడు కాని, సీతాదేవి వున్న చెట్టుకాల్చగలిగాడా? సీత తనంతట తానుగా
రావణుడిని నాశనం చేయ సంకల్పించలేదు కనుకనే వాడింకా జీవించి వున్నాడు".
"లంకలో జరిగిందంతా చెప్పాను. ఇక జరగాల్సింది మీరు ఆలోచించండి. సీతాదేవిని
తీసుకొచ్చి, రామచంద్రమూర్తి దగ్గరకు పోతే మంచిదని నా అభిప్రాయం. జాంబవంతుడితో సహా
మీరంగీకరిస్తే అలానే చేద్దాం. ఆమె అక్కడ ఏడుస్తూ వుండడం, ఆ వార్త చెప్పగానే రామచంద్రమూర్తి దుఃఖపడడం, ఈ సన్నివేశం మనం కళ్లప్పగించి చూడడం నాకు నచ్చలేదు. రావణుడిని, వాడి బలగాన్నీ,
నేనొక్కడినే చంపగలను. మీరుగూడా నావెంట వుంటే చెప్పాల్సిన
పనేలేదు. కార్యం సులభమైపోతుంది. మనం రావణుడిని చంపి సీతను తెస్తే, రాముడికేమీ
అపకీర్తి రాదు. మనం ఆయన సేవకులం. సేవకులు చేయాల్సినపనికూడా ప్రభువే చేయాలా? సేవకులకు సాధ్యపడకపోతేనే ప్రభువు చేయాలి. అన్నీ ప్రభువే
చేసుకుంటే సేవకులతో పనేమిటి?"
"ఈ కార్యం మనవలన అవుతుందా, కాదా? అన్న సందేహం లేదు.
మీరంతా శూరులు, అస్త్రజ్ఞానమున్నవారు, వీరాధివీరులు, బుధ్ధిమంతులు,
జయం మీద కోరికున్నవారు, ఎదిరించలేని బలవంతులు, సముద్రాన్ని దాటే శక్తిగలవారు. ఇలాంటి మీరు తోడైవస్తే, లంకానాశనం జరగదా? రావణుడిని
కొడుకులతో, తమ్ములతో, సైన్యంతో సహా నేనొక్కడినే చంపగలను. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం, ఇంద్రాస్త్రం, రుద్రాసత్రం, వారుణాసత్రం, అన్నింటినీ నేనొక్కడినే నాశనం
చేస్తాను. దీనికి మీ సమ్మతి కావాలనీ, మీ అంగీకారం లేదనీ, ఆగాను. నేను
రాళ్లవాన కురిపిస్తే దేవతలైనా చస్తారు,
రాక్షసులొక లెక్కా? సముద్రం చెలియలికట్ట దాటితే దాటవచ్చు, మందర పర్వతం వణకొచ్చు, కాని జాంబవంతుడిని యుద్ధంలో కదిలించగల శత్రు సమూహం
లేనేలేదు".
"ఆ రాక్షసుల్లో ప్రసిధ్ధమైన వారందరినీ ఒక్క అంగదుడే చంపగలడు. పనసుడి, నీలుడి వేగానికి మందరం కూడా పాడైపోతుంది. మైంద, ద్వివిదులతో పోరి, గెలవగలవారు యక్షులలో, గంధర్వులలో, పన్నగులలో కూడా లేరు. వీరు
బ్రహ్మవరప్రసాదితులు, అమృతాన్ని త్రాగినవారు, అశ్వినీ దేవతల గౌరవార్థం వీరికి చావులేకుండా బ్రహ్మ వరం ఇచ్చాడు. మిగిలిన
బలవంతుల సంగతి అటుంచి,
వరగర్వంతో,
దేవతా సమూహాలను గెల్చి అమృతం తాగిన వీరు రాక్షసులను లక్ష్య
పెట్తారా?"
"నిర్భయంగా లంకా నగరమంతా తిరిగి బూడిదయ్యేంతవరకూ కాల్చాను. రామచంద్రుడి పేరు, సుగ్రీవుడి పేరు, లక్ష్మణుడి పేరు, మహా పరాక్రమవంతులైన మీ అందరి పేర్లూ, అన్నిచోట్లా
అదేపనిగా చెప్పాను. నేను రామచంద్రమూర్తి దాసుడననీ,
పేరు హనుమంతుడనీ, వాయుపుత్రుడననీ, అందరూ వినేటట్లు
చెప్పాను. రహస్యంగా ఏపనీ చేయలేదక్కడ".
"శీలవతి, గుణవతి, రూపవతి, పతివ్రతాశిరోమణి,
ఒక దుష్టుడికి చెందిన అశోకవనంలో, ఓ ఇరుగుడు
(శింశుపావృక్షం) చెట్టు నీడ కింద దుఃఖించే దృశ్యాన్ని జప్తికి తెచ్చుకుంటే, మనస్సు
మండిపోతున్నది. సీతను ఆస్థితిలో మీరందరూ చూస్తే ఏమైపోయేవారో! ఎంతో రాతిగుండె
వున్నవాడినైనందున నేను నిబ్బరించుకున్నాను. రాక్షసస్త్రీల మధ్య బందీగా వున్న సీత, మబ్బుల్లో
మరుగునపడ్డ చంద్రకాంతిలా, కాంతిహీనమై శోకిస్తున్నప్పటికీ, రావణుడినేమాత్రం లక్ష్యపెట్టడం లేదు. ఇంద్రుడిమీద శచీదేవి
మనసుంచినట్లే, భర్తమీద ఏకాగ్రమైన మనసుంచి,
అనురాగంతో,
ఎల్లవేళలా శ్రీరామచంద్రమూర్తినే ధ్యానిస్తున్నది
సీతాదేవి".
"మాసిపోయిన ఒకే ఒక్క చీరెతో,
వంటిమీద ఉత్తరీయంకూడా లేకుండా, దుమ్ములో మునిగి
దుఃఖిస్తున్న సీత, భర్తను చూస్తానన్న ఆశతో రాక్షసస్త్రీల మాటలు,
బెదిరింపులు లెక్కచేయడంలేదు. ఆమె శోకించే దృశ్యాన్ని తలచుకున్నప్పుడల్లా కడుపు
మండుతున్నది. చూడటానికే వికారంగా వుండే రాక్షసస్త్రీలు, ఆమెను ఎల్లప్పుడూ
భయపెడ్తున్నారు. అయినా ఆమె ఎల్లవేళలా నాధా అంటూ, అతని క్షేమం కోరి దుఃఖిస్తూ, వెల వెల్లాడిన ముఖంతో, నేలపైన కూర్చుని వుండడం చూస్తుంటే, ఆమె, శీతాకాలంలోని
తామరతూడులాగా కనిపించింది. రామచంద్రమూర్తి తనదగ్గరకు వచ్చేమార్గం కనపడలేదనుకుని, రావణుడిని
నమ్మలేని సీత, వాడిచేతుల్లో చచ్చేకంటే,
తనంతట తానే మరణిద్దామని నిశ్చయించుకున్నప్పుడు, ఆపతివ్రతా
శిరోమణికి నచ్చచెప్పి, ఏదోవిధంగా ఆ పని మానిపించాను".
"మా ఇద్దరిమధ్య జరిగిన సంభాషణలోని అన్నివిషయాలనూ, ఆమె అడిగినవన్నీ తెలియచేసాను. వానరరాజు సుగ్రీవుడికి, శ్రీరామచంద్రమూర్తికి
స్నేహం కుదిరిందన్న సంగతివిని ఎంతో ఆనందించింది. సీతాదేవి మహాత్మ్యం చేత, ఆమె అసమానమైన
పాతివ్రత్యంచేత, తమోగుణంకల రావణుడు ఇంతవరకూ దుర్మరణం పాలుకాలేదంటే వాడుగొప్పవాడనే అనాలి. అయితే
భర్త చేతులతోటే రావణుడిని చంపించి, ఆ కీర్తి
ఆయనకు దక్కేలాచేసి వీరపత్నిననిపించుకోవాలన్న ఆమె వ్రతమే ఆ రావణుడినింతవరకూ
కాపాడింది. వాడందుకే ఇంకా శాపగ్రస్తుడు కాలేదు. సహజంగా సన్నగా వుండే సీత, భర్తను విడిచి
వుండడంవల్ల ఇంకా క్షీణించిపోయింది. వీటన్నిటికీ ప్రతిక్రియగా ఏది న్యాయమని తోస్తే
అదేచేద్దాం. ఆలోచించండి" అని హనుమంతుడనగా, అంగదుడు తన అభిప్రాయం చెప్పసాగాడు.
శౌర్యమందు సమర్ధుడు, దేవదానవ
పన్నగులకు అసమానుడు, హనుమంతుడు, సీతను చూసివచ్చాడే
కాని, పిలుచుకుని రాలేదనడం బాగుంటుందేమో ఆలోచించమని అంటాడు అంగదుడు. ఇట్టివాడు ఉత్త
చేతులతో రాముడి వద్దకు పోతే మంచిదికాదేమో నని తన అభిప్రాయమంటాడు అంగదుడు.
"వీరుడు హనుమంతుడు లంకలోని వీరులందరినీ చంపి వచ్చాడు. ఇక మనం అక్కడకు పోయి
సీతను తేవడమే మిగిలుంది, సీతను తెద్దాం" అంటాడు అంగదుడు. అయితే
అంగదుడి ఆలోచన బాగున్నప్పటికీ, రామచంద్రమూర్తి అభిప్రాయం తెలుసుకుని, ఆయన చెప్పినట్లు
చేస్తే బాగుంటుందని జాంబవంతుడు సలహా ఇస్తాడు.
No comments:
Post a Comment