సీతారామలక్ష్మణుల వృత్తాంతం ఖరుడికి చెప్పిన
శూర్పణఖ
శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-31
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రభూమి
ఆదివారం సంచిక (21-10-2018)
దేహమంతా నెత్తురుతో
తడిసి నేలమీద పడి, వికార రూపంతో ఏడుస్తున్న శూర్పనఖను చూసి ఖరుడు ఇలా
అన్నాడు. “ఎవరినీ తరుమకుండా, బెదిరించకుండా,
బుసకొట్టకుండా, తనంతట తాను
బుట్టలో కదలకుండా వుండే మహా భయంకర, విషంకల నల్ల త్రాచుపామును ఎవడు వేలితో
పొడిచాడు? ఎవడీ విషం
తాగింది? ఎవడు తనంతట
తానే మృత్యుపాశాన్ని తన కంఠానికి తగిలించి బిగించుకున్నాడు? చెప్పు.
నేనిప్పుడే వేగంగా పోయి వాడిని చంపి నెత్తురు తాగుతా. నువ్వు బలం, పరాక్రమం
విశేషంగా వున్నదానివి. కాబట్టి సామాన్య బలవంతులు నిన్ను పరాభవం చేయలేరు. నువ్వు
కోరిన చోట, కోరిన రూపంతో
తిరగగలిగే దానివి. నిన్ను అడ్డగించగలవారు లేరు. అలాంటి నిన్ను ఎవడే దీర్ఘకాలం
బతకడానికి ఇష్టపడక ఇలాంటి కష్టాల పాలు చేశాడు? దేవతలలో కాని, గంధర్వులలో
కాని, పరమర్షులలో
కాని, దౌర్జన్యంగా
ఇలాంటి పెద్ద అపకారం చేయడానికి తెగించిన వాడు ఎవడో చెప్పు. వాడిని చంపుతా”.
“దేవతలలో బాకాసురుడిని చంపిన వేయికళ్ల
ఇంద్రుడైనా, నాకు
అప్రియమైన పని చేయడానికి భయపడతాడు. మరి ఎవరు నాకు ఈ విధమైన అప్రియమైన పనిచేశాడు? నీళ్లలో
వున్నా పాలను హంస తాగినట్లు శీఘ్రంగా ఇదిగో, ఇప్పుడే నా
బాణాలతో అతడి భూమిని కూల్చి, వాడి ప్రాణ వాయువులు తాగుతా. అయ్యో! నా
ముద్దుల అక్కా! యుద్ధ భూమిలో ఎవడిని చంపి వాడి నెత్తురును నురుగుతో సహా, నా బాణాలు
తాగాలని కోరుకుంటున్నావు? నా పదునైన బాణాలతో చీల్చబడిన ఎవడు గద్దల్లాంటి
పక్షిజాతికి ఆహారంగా కావాలని కోరుకుంటున్నావు?
ముద్దు-ముద్దుగా ముక్కర పెట్టుకోకుండా ఎవడు నిన్నిలా బాధ పెట్టాడు? అలాంటి
వారిని రక్షించడానికి దేవతలు సమర్ధులు కారు. రాక్షసులూ కారు. నా బాణాల దెబ్బలకు
వాడికి చావు తధ్యం. కాబట్టి బడలిక తీర్చుకొని నిన్నీ ప్రకారం చేసిన వాడి గుర్తులు
చెప్పు”. అని ఖరుడు అడగ్గా, తోడ బుట్టిన వాడి మాటలు విని విస్తారంగా
కన్నీళ్లు కాల్వలుగా కారుతుంటే, ఈ విధంగా చెప్పింది శూర్పణఖ.
“నన్నీ
ప్రకారం చేసింది ఎవరని అంటావా? చెప్తా విను రాక్షసుడా! వారు యౌవనవంతులు.
చక్కటివారు. మునుల వేషంలో వున్నారు. కోమల దేహం కలవారు. మహాబల సంపన్నులు. వికసించిన
తామర పూల లాంటి కళ్లున్న వారు. నార చీరెలు, కృష్ణాజినం
వస్త్రాలుగా వున్న వారు. అడవిలో లభించే పళ్ళు తింటారు. ఇంద్రియ నిగ్రహం కలవారు. ధర్మ
మార్గంలో వుండేవారు. అన్నదమ్ములు వాళ్ళు. దశరథరాజ కుమారులు....శ్రీరామలక్ష్మణులు
అనే పేర్లు కలవారు”.
(తనను
విరూపను చేసినవారెవరు? అని ఖరుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా శూర్పణఖ దశరథ
రాజకుమారులు శ్రీరామలక్ష్మణులు అని చెప్పే బదులు, వారి
సౌందర్యాన్ని ఎందుకు వర్ణించాలి? ఆమెలో కామం విఘ్నమై కోపంగా మారిందేకాని, కామం
చావలేదు. వైరాగ్యం ఇంకా పుట్టలేదు. గాఢంగా శ్రీరామలక్ష్మణ రూపాలలో మనస్సు నాటుకొని
వుండడం వల్ల, వారి
మూర్తులే దానికి కళ్ళ ఎదుట కనపడుతున్నాయి. అలా కామమోహిత అయినందువల్ల దాన్ని
నిగ్రహించుకోలేక తమ్ముడి ఎదుట ఆ భావాన్నే బయట పెట్టింది. “కామాతురాణాం నభయం
నలజ్జా” అనే నానుడి వుంది. అంటే, కామాతురులకు భయం, సిగ్గు
వుండదు. ఈ కారణం వల్లే రామలక్ష్మణుల సౌందర్య వర్ణన చేసింది శూర్పణఖ. ఇలా చేయడం
స్త్రీ అయిన శూర్పణఖ గొప్ప కాదు. శ్రీరామచంద్రమూర్తిని చూసిన వారందరూ, అనుకూలమైనా, ప్రతికూలమైనా
ఇలానే మాట్లాడుతారు).
శూర్పణఖ తన
జవాబును కొనసాగిస్తూ...”తాము దశరథ రాజకుమారులమని చెప్పారేకాని, వారి తేజస్సు
చూస్తే, వాళ్ల మాట
నమ్మడం కష్టంగా వుంది. అయినా, వారు అసత్యమాడేవారిలాగా లేరు. కాబట్టి వారి
మాట ప్రకారం వాళ్లు మనుష్యులో, నా ఆభిప్రాయం ప్రకారం దేవతలో చెప్పలేను.
చూడడానికి రాజచిహ్నాలున్నా గంధర్వరాజుతో సమానంగా వున్నారు. ఆ ఇద్దరిమధ్య ప్రాయంలో
వున్నా ఒక పడుచును, సమస్తాభరణాలు ధరించిన దానిని, సన్నటి
నడుముకల దానిని, తామర
రేకుల్లాంటి కళ్లున్న దానిని చూశాను. అలాంటి సుందరిని నేనింతవరకు చూడలేదు. ఆ పడుచుకోసం
నన్ను వారిద్దరూ ఒక్కటై, రంకుటాలిలాగా దిక్కులేని దాన్ని చేసి దురవస్థల
పాలు చేశారు” అని అంటుంది.
శూర్పణఖ
చెప్పిన మాటలు విన్న ఖరుడు కోపంతో క్రూరులు, యముడితో
సమానమైన వారు, అయిన
పద్నాలుగురు రాక్షసులను చూసి, “దండకారణ్యంలో ఒక చెడునడవడి కల ఆడదానితో
ఇద్దరు మనుష్యులు, కోదండ ధరులు, కృష్ణాజినం
కట్టినవారున్నారు. వారిని చంపితె, ఆ నెత్తురు తాగాలని మా అక్క కోరుతున్నది.
కాబట్టి మీరు మా అక్క కోరిక నెరవేర్చండి” అని అనగానే, శూర్పణఖ దారి
చూపిస్తుంటే,
దండకారణ్యానికి పోయారు వాళ్ళు. మేఘాల్లాగా వచ్చిన వారంతా సీతతో కూడి ఆశ్రమంలో
కూర్చున్న తేజోవంతులైన అన్నదమ్ములను శూర్పణఖ చూపించగా చూశారు. శ్రీరామచంద్రమూర్తి
రాక్షసులతో వచ్చిన శూర్పణఖను చూసి కోపంతో లక్ష్మణుడితో ఇలా అన్నాడు. “లక్ష్మణా!
కాసేపు నువ్వు సీతను రక్షిస్తూ వుండు ఇక్కడే. వీళ్ళను చంపి నేను వస్తా” అని అనగా
లక్ష్మణుడు అంగీకరించాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి విల్లెక్కుపెట్టి, బాణాలు
తీసుకొని, రాక్షసులను
చూసి ఇలా అన్నాడు.
“ఓ
రాక్షసులారా! మీము అన్నదమ్ములం. రామలక్ష్మణులు అంటారు. ప్రసిద్ధుడైన దశరథ మహారాజు
కొడుకులం. దండకారణ్యంలో ఈ సీతతో సంచారం చేయడానికి వచ్చాం. కందమూలాలు తింటాం.
తపస్సు చేసుకుంటాం. ధర్మం అంటే ఆసక్తి కలవాళ్ళం. ఇంద్రియ నిగ్రహం కలవాళ్ళం.
కాబట్టి మావల్ల ఎవరికీ ఏ కీడు జరగదు. మా ఇష్టప్రకారం మేం సర్వజన సాధారణమైన దండకలో
నివసిస్తాం. మీ ఇళ్లకు ఎప్పుడూ రాలేదు. మిమ్మల్ని బాధపెట్టలేదు. ఇలాంటి మామీద
నిష్కారణంగా మీరెందుకు కోపంతో ఇక్కడికి వచ్చారు? ఇంత
దండకారణ్యం వుందికదా? ఎక్కడికైనా పోకూడదా అని అంటారేమో? మునుల ఆజ్ఞతో
దుష్టవర్తనులైన రాక్షసులను యుద్ధంలో చంపడానికి వచ్చాం. మీకు ధైర్యం వుంటే నిలిచి
యుద్ధం చేయండి. బతకాలనుకుంటే పారిపోండి....మిమ్మల్ని బాధించను”.
శ్రీరాముడి
మాటలకు ఆ పద్నాలుగు మంది రాక్షసులు కోపంతో చేతిలో పదునైన బాణాలు పట్టుకొని, “రామా! మేం
వచ్చిన పని చెప్తాం విను. పూర్ణ పరాక్రమవంతుడైన మా ఖర మహారాజుకు మీరు కోపం
కలిగించారు. అలాంటప్పుడు శరీరంతో ఎలా వుంటారు? ఎక్కడికి
పోతారు? మరణించాల్సిన
వారే. ఇక్కడికి వచ్చిన మా పద్నాలుగు మంది రాక్షసుల ఎదుట ఒంటరిగా నిలువగలవా? నీకది
సాధ్యమా? అది
అసాధ్యమైనప్పుడు మమ్మల్ని ఎదిరించి యుద్ధం చేయడం కూడా అసాధ్యమే” అని అన్నారు.
తాము
ప్రయోగించే బాణాలు గుదియలు, శూలాలు అనీ, అవి రాముడిని
తాకగానే ఆయన తన వీర్యం, విల్లు, బాణాలు అన్నీ
వదులుతాడనీ, అని అంటూ ఆ
పద్నాలుగు మంది రాక్షసులు ఒక్కసారిగా సూలాలను రాముడిమీదకు విసిరారు.
శ్రీరామచంద్రుడు తన బంగారు చెక్కడపు బాణాలతో వాటన్నిటినీ చిన్నచిన్న తునకలుగా చేసి,
నేలరాలకొట్టాడు. అంతటితో ఆగితే ప్రమాదమని భావించి వారిమీద పదునైన పిడుగులుకల
పద్నాలుగు బాణాలను ప్రయోగించాడు శ్రీరాముడు. అవి వాళ్ల రొమ్ముల్లో దూరి వీపులోంచి
బయటకు వచ్చి నేలమీద పడ్డాయి. ఆ రాక్షసాధములు వేళ్ళు తెగిన చెట్లలాగా నెత్తురుతో
తడిసి, దేహాలతో
ప్రాణాలు పోయినవారై, భూమ్మీద పడ్డారు. అది చూసి శూర్పణఖ పరుగెత్తింది.
No comments:
Post a Comment