Thursday, October 18, 2018

ఇల్లెందు నుండి ఖమ్మం బదిలీ..ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు..బీఎల్లెస్సీ లో సీటు....జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు: వనం జ్వాలా నరసింహారావు


జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు
ఇల్లెందు నుండి ఖమ్మం బదిలీ..ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు..బీఎల్లెస్సీలో సీటు
వనం జ్వాలా నరసింహారావు
          ఇల్లెందు జూనియర్ కళాశాలలో గ్రాడ్యుయేట్ లైబ్రేరియన్ గా చేరాను ఆగస్ట్ 1971 సంవత్సరంలో. ఖమ్మంలో కాపురం. ప్రతిరోజూ ఉదయమే బయల్దేరి, ఆర్టీసీ బస్సులో 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇల్లెందు పోవడం, కాలేజీ అయిపోయినతరువాత మళ్లీ తిరుగు ప్రయాణం చేయడం నిత్యకృత్యమయిపోయింది. బస్సు చార్జీ ఆ రోజుల్లో రానూ-పోనూ నాలుగైదు రూపాయలే వుండేది. అంటే, నెలకు నా జీతంలో మూడో వంతు బస్సు ప్రయానానికే అయ్యేది. ఉదయం 7.30 కు బయల్దేరుతే, సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఒక్కోసారి ఏడు దాటేది. మొదట్లో అలసట అనిపించేది. కళాశాల ప్రిన్సిపాల్ గా కృష్ణమూర్తి గారు, వైస్ ప్రిన్సిపాల్ గా పీ కృష్ణయ్య వుండేవారు. పీ కృష్ణయ్య ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వర్ రావు గారి సోదరుడు. ప్రిన్సిపాల్ కు ఒక మోటార్ సైకిల్ వుండేది. ఆయన దానిమీదే రోజూ ఖమ్మం నుండి వచ్చి పోయేవాడు. సాధారణంగా ఆయన మధ్యాహ్నం నుంచే వెళ్ళిపోయేవారు. ప్రిన్సిపాల్ కాబట్టి ఆయన మాటకు ఎవరూ ఎదురు చెప్పలేక పోయేవారు. నేను కూడా మధ్యాహ్నం క్లాసులు లేకపోతే ముందుగా వెళ్లే ప్రయత్నం చేసేవాడిని కాని, వైస్ ప్రిన్సిపాల్ అంత సులభంగా అనుమతి ఇచ్చేవాడు కాదు. ఒక్కోసారి అంగీకరించేవాడు.

నేను చిన్నగా ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి గారితో స్నేహం చేసుకుని, ఆయనతో, ఆయన వెళ్లినప్పుడల్లా వెళ్లడం ప్రారంభించాను. కొన్నాళ్ళకు ఆయనతో రావడం, పోవడం కూడా జరిగింది. ఆ విధంగా ఇంటికి త్వరగా చేరుకోగలిగే వాడిని, ఆలస్యంగా ఇంట్లో బయల్దేరే వాడిని. అప్పుడు లీటర్ పెట్రోల్ ధర రెండు-మూడు రూపాయలలోపే. కృష్ణమూర్తి గారికి నేను భారం కాకూడదని భావించి ఒక ట్రిప్పుకు నేను పెట్రోల్ పోయించేవాడిని. మొత్తం మీద అలా నాలుగైదు నెలలు గడిచాయి. అనుకున్న ప్రకారం, నాకు డీయీఓ షాజాహానాబేగం ఇచ్చిన మాట ప్రకారం, సూపరింటెండెంట్ సంపత రావు, క్లార్క్ బారు సీతారామరావుల సహాయంతో, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కింద ఖమ్మం శాంతినగర్ మల్టీ పర్పస్ హైస్కూల్ కం జూనియర్ కాలేజీకి బదిలీ అయి వచ్చాను. అక్కడ పనిచేస్తున్న ఆదిరాజు సుబ్బారావును మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కు ఒప్పించారు సూపరింటెండెంట్ సంపత రావు, క్లార్క్ సీతారామరావులు.

నేను పనిచేసిన రోజుల్లో శాంతినగర్ హైస్కూల్-కం-జూనియర్ కాలేజీ హెడ్ మాస్టర్లుగా కొన్నాళ్ళు హెచ్ వీ శర్మ, కొన్నాళ్ళు టీవీ రాజయ్య, కొన్నాళ్ళు ఓవీ చలపతిరావు వుండేవారు. ఉపాధ్యాయులుగా దుర్గామహేశ్వర్ రావు, వెంకట్రావు, జక్కా సత్యం మొదలైన వాళ్ళుండేవారు. అంతా సరదాగే గడిచేది. అక్కడి లైబ్రరీ అత్యంత పురాతనమైన లైబ్రరీ. ఎప్పుడో మాంధాతల కాలం నాటి పుస్తకాలుండేవి. బహుశా అత్యంత విలువైన పాతకాలం నాటి పుస్తకాలు ఆ లైబ్రరీలో లభ్యమయ్యేవి. నేను అప్పటికింకా లైబ్రరీ సైన్స్ చదవలేదు కాబట్టి, శాస్త్రీయ పద్ధతిలో కాకుండా, నా ఊహ ప్రకారమే వాటన్నింటినీ ఒక క్రమంలో మొట్టమొదటి సారిగా అమర్చాను. ఇవి కాక లైబ్రరీలో పాఠ్య పుస్తకాలు కూడా వుండేవి. వాతి పంపిణీ బాధ్యత కూడా నాదే. మొత్తం మీద ఏదోలా నెట్టుకొచ్చాను. ఇంటి నుండి సైకిల్ మీద స్కూల్ కు వెళ్లివచ్చేవాడిని. మధ్యాహ్నం భోజనం సాధారణంగా తీసుకుపోయేవాడిని, లేదా, ఇంటికి వచ్చి తిని పోయేవాడిని. రానూ-పోనూ పెద్దగా టైం పట్టకపోయేది.

అవి జై ఆంధ్ర ఉద్యమం ఉదృతంగా వున్నా రోజులు. ముల్కీ నియామకాలు రాజ్యంగ విరుద్ధమని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో 1969 లో స్వర్గీయ డాక్టర్ మర్రిచెన్నారెడ్డి సారధ్యంలో మొదటి సారి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం బ్రహ్మాండంగా కొనసాగింది. అయితే 1972లో మరోకేసులో గతంలో ఇచ్చిన తీర్పును చెల్లుబాటు కాకుండా ముల్కీ నిబంధనలను అమలు చేయాలని అత్యున్నత న్యాస్థానం ఇచ్చిన తీర్పు పర్యవసానమే జై ఆంధ్ర పేరుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం. విద్యార్థులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. శాసనసభ స్పీకరు బి.వి.సుబ్బారెడ్డి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన అత్యధిక మంత్రులు రాజీనామా చేసారు. జై ఆంధ్ర ఉద్యమంలో కాకాని వెంకటరత్నం కీలకంగా వ్యవహరించి మంత్రిపదవికి కూడా రాజీనామా చేశారు. 1972డిసెంబరు 25 గుండెపోటుతో మరణించినప్పుడు జై ఆంధ్ర కోసమే మరణించాడని అనేవారు.

ఉద్యమం హింసాత్మకంగా జరిగింది. సమైక్యవాదులపై దాడులు కూడా జరిగాయి. జనవరి 10, 1973 న కాంగ్రెసు పార్టీ తమ ముఖ్యమంత్రిపి.వి.నరసింహారావు చేత రాజీనామా చేయించి రాష్ట్రపతి పాలన విధించింది. ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం దృఢంగా వ్యవహరించింది. ఉద్యమం ఆపివేయడానికి ఆరు సూత్రాల పథకాన్ని ప్రతిపాదించింది. 1973 డిసెంబర్లో పార్లమెంటు ఈ ప్రణాళికను రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చింది. కేంద్రం రాష్ట్రపతి పాలన తొలగించి జలగం వెంగళరావు నాయకత్వంలో తిరిగి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది. జై ఆంధ్ర ఉద్యమానికి నిరసనగా ఇటు తెలంగాణాలోనూ ఉద్యమం జరుగుతుండేది.

అటు ఆంధ్రలో, ఇటు తెలంగాణాలో వేర్వేరు కారణాల వల్ల ఉద్యమాలు సాగుతుంటే ప్రతిరోజూ శాంతినగర్ హైస్కూల్ దాదాపు పనిచేసేది కాదు. విద్యార్థులు స్కూల్ కువచ్చేవారు కాదు. ఉపాధ్యాయులం వెళ్ళాక తప్పేది కాదు. ఉదయం నుండి సాయంత్రం వరకు కబుర్లు, కాలక్షేపం చేసి ఇంటికి చేరుకునే వాళ్ళం.

సరిగ్గా అప్పుడే, ఆ రోజుల్లోనే డీఇఓ షాజహానా బేగం ప్రోత్సాహంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఎల్ఎస్సీ (లైబ్రరీ సైన్స్) కోర్సులో ఇన్ సర్వీస్ అభ్యర్థిగా చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించాను. నన్ను ఆమె అప్పట్లో విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ గా వున్న స్వర్గీయ ఐవీ చలపతిరావు దగ్గరకు తీసుకుపోయి నన్ను పరిచయం చేసి నాకు ఇన్ సర్వీస్ అభ్యర్థిగా బీఎల్ఎస్సీ లో చేరడానికి అనుమతి ఇవ్వమని నా పక్షాన అభ్యర్థించింది. ఆమె అభ్యర్ధనను ఆయన తోప్సిపుచ్చారు. ఆ విధంగా నాకు 1972-1973 బాచ్ లో సీటు దొరకలేదు. అయినా నా ప్రయత్నం మానలేదు. మరుసటి సంవత్సరం ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారిగా షాజహానా బేగం స్థానంలో శ్రీమతి శ్రీకంఠం వచ్చారు. ఆమె మా ఆవిడ సోదరుడు (మా బావ గారు) డాక్టర్ ఏపీ రంగారావుకు స్నేహితురాలు. తిరిగి ఆమె ద్వారా “థ్రు ప్రాపర్ చానెల్” బీఎలెస్సీ సీటు కొరకు మళ్లీ విద్యాశాఖ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నాను. వాళ్లు ఈ సారి దాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఫార్వార్డ్ చేశారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ మొత్తం మీద సీటు దొరికింది. అలా దొరకడానికి నాకు సహాయ పడ్డవారిలో ముందువరుసలో స్వర్గీయ బొమ్మకంటి సత్యనారాయణ రావు గారు, అప్పట్లో తాత్కాలిక వైస్ చాన్స్లర్ గా వ్యవహరించిన స్వర్గీయ దేవులపల్లి రామానుజరావు, అప్పటి రాష్ట్ర మంత్రి స్వర్గీయ అక్కిరాజు వాసుదేవరావు, విశ్వవిద్యాలయ విద్యార్ధి నాయకులు శ్రీధర్ రెడ్డి, పుల్లారెడ్డి, ప్రభాకర్ తదితరులు వున్నారు.
ఆ విధంగా మళ్లీ 1973-74 బాచ్ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి అయ్యాను.

1 comment: