ఆర్ధిక వివేకం అర్థం
చేసుకోవాలి
తెలంగాణ సమగ్ర ఆర్ధిక, అభివృద్ధి
ప్రస్తానం-1
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(01-03-2019)
మొదటి విడత
నాలుగున్నర సంవత్సరాలు అధికారంలో వున్న కేసీఆర్ సారధ్యంలోని ప్రభుత్వాన్ని
అహర్నిశలూ విమర్శించడంతో పాటు, వారి-వారి ఎన్నికల హామీలలో ఏదేదో చేస్తామని చెప్పిన
ప్రతిపక్ష పార్టీల మాటలను నమ్మని ప్రజలు-ఓటర్లు మళ్లీ తెరాస పార్టీకే పట్టం
కట్టారు. అఖండ విజయం చేకూర్చి పెట్టారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర శాసనసభకు,
శాసనమండలికి వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమర్పించడం,
దాన్ని ఉభయ సభలు ఆమోదించడం, ద్రవ్య వినియోగ బిల్లుకు ఉభయ సభలు
ఆమోదం తెలపడం జరిగింది. ఈ యావత్తు ప్రక్రియలో పసలేని ప్రతిపక్షాల విమర్శలకు
ముఖ్యమంత్రి ధీటైన-ఆసక్తికరమైన సమాధానం చెప్పడం కూడా జరిగింది. బడ్జెట్ చర్చకు
ఇచ్చిన సమాధానంలోను, ఆ తరువాత ద్రవ్య వినియోగ బిల్లుపై
జరిగిన చర్చకు ఇచ్చిన సమాధానంలోను, పలు అంశాలను ముఖ్యమంత్రి
సందర్భోచితంగా లేవనెత్తారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలకు సంబంధించి ఆయన
చెప్పిన మాటలు ఆ దిశగా ఒక విజ్ఞాన సర్వస్వం లాంటివనవచ్చు.
సభలకు సమర్పించి
ఆమోదం పొందింది వోట్ ఆన అకౌంట్ బడ్జెట్ మూడు నెలలకా?
నాలుగు నెలలకా? ఆరు నెలలకా? అనే
ప్రతిపక్షాల విమర్శకు అర్థం లేదు. ఎన్ని నెలలకు తీసుకోవాలనేది పూర్తిగా ప్రభుత్వ
పరిధిలోనే వుంది. అసలు బడ్జెట్ గుణాత్మకమా? కాదా? అనేదే చూడాలికాని, ఎంతమేరకు గణాత్మకం అనేది అప్రస్తుతం.
తెలంగాణ ప్రభుత్వం
ఏనాడూ “ఎఫ్ఆర్బీఎం” పరిధులు దాటలేదు. అదే ఈ ప్రభుత్వానికున్న విశ్వసనీయత, గౌరవం.
దీన్నే తెలంగాణ భాషలో చెప్పాలంటే “పతారా” అంటారు. ప్రభుత్వాలు స్వంతంగా మార్కెట్
కు పోయి డబ్బులు తీసుకునిరాదు. అటు కేంద్రానికైనా,
ఇటు రాష్ట్రానికైనా రిజర్వ్ బాంక్ నోడల్ ఏజన్సీగా వుంటుంది. ఏ ఒక్క రూపాయి అప్పు
తీసుకున్నా ఆర్బీఐ ద్వారానే తీసుకుంటుంది ప్రభుత్వం. ఎంత అవసరం వుంటుందో అంత
మొత్తానికి రాతపూర్వకమైన ప్రతిపాదన ఇస్తుంది ప్రభుత్వం. అప్పుడు ఆర్బీఐ ఆ
అభ్యర్థనను వివిధ ఆర్ధిక సంస్థలకు, అది ఎల్ఐసీ కావచ్చు,
వాణిజ్య బాంక్ కావచ్చు, లేదా మరే ఇతర సంస్థ అన్నా కావచ్చు, వారికి పంపుతారు. ఇది ప్రతినెలా
రిజర్వ్ బాంక్ బిజినెస్. ఫలానా రాష్ట్ర, లేదా, కేంద్ర ప్రభుత్వం ఇంత మొత్తం కావాలంటూ అడుగుతున్నదని మార్కెట్ లో
పెడతారు. పతారా వున్న తెలంగాణ రాష్ట్రాల లాంటి వాటికి తొందరగా లభిస్తుంది. తెలంగాణ
రాష్ట్రం గొప్పతనం ఏంటంటే, ఇది కొత్త రాష్ట్రం అయినప్పటికీ,
25 సంవత్సరాల బాండ్స్ కూడా హాట్ కేకుల్లాగా అమ్ముడుపోతాయి. తెలంగాణ బాండ్స్ ను
బాంకులు పోటీ పడి కొనుక్కున్నాయి. అది రాష్ట్ర ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనం.
వాస్తవానికి
ఐఎమ్ఎఫ్, నాబార్డ్ లాంటి సంస్థల తీరుతెన్నులకూ, మన పల్లెల్లో వున్న అప్పులు ఇచ్చేవాళ్ళకు పెద్ద తేడాలేదనాలి. వీళ్లు ఇంకా
హుషారుగా వుంటారు. క్లిష్టమైన విశ్లేషణ చేసిగాని అప్పులివ్వరు. ప్రభుత్వం అడిగిన
అప్పుకు లక్షా తొంభై పత్రాలు అడుగుతారు. ప్రభుత్వ ఆర్ధిక శాఖ వాళ్లు అవన్నీ
సమర్పించడానికి నానా ఇబ్బంది పడతారు. వాళ్ళు చాలా నిశితంగా ప్రభుత్వ పనితీరును, లెక్కలను, ఖర్చుల వివరాలను నిశితంగా పరిశీలించి
మర్చిపోయిన అంశాలను గుర్తుచేస్తారు, తప్పొప్పులను ఎత్తి చూపిస్తారు. పన్నుల
వసూళ్లను, ప్రభుత్వ సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకున్న తరువాతే
ప్రభుత్వానికి అడిగిన డబ్బు సమకూరుస్తారు తప్ప అలా వూరికే ఇవ్వరు. కొన్ని రాష్ట్ర
ప్రభుత్వాలు ఎంత పనిచేసినా, ఎంత వేడుకున్నా వారికి
ఋణాలివ్వరు కానీ తెలంగాణాకు ఇస్తున్నారు.
“విజ్డం ఆఫ్
ఎకానమీ” (ఆర్ధిక వివేకం) అంటే అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రయివేట్ బడ్జెట్ కు చాలా తేడా వుంది. ప్రభుత్వాలు చేసే
అప్పులు ప్రయివేట్ అప్పుల మాదిరిగా వుండవు. ఇది అర్థం చేసుకోవడం చాలా అవసరం. అసలు
దీన్ని అప్పుగా పరిగణించకూడదు. అప్పు తెచ్చి ఎందుకు, ఎక్కడ, ఎలా ఉపయోగిస్తున్నామనేది ముఖ్యం. అది కాపిటల్ (మూలధన) వ్యయమా? మరొకటా? అనేది కూడా చూడాలి. వాటిమీద ఆధారపడి మాత్రమే
సమకూర్చేవారు సమకూరుస్తారు. లేకపోతే లేదు. కేసీఆర్ ప్రభుత్వం రెండవసారి
అధికారంలోకి వచ్చిన తరువాత ఐదారు రోజుల్లోనే పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, రూరల్ ఎలెక్ట్రికల్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, మరికొన్ని సంస్థలు ఋణం
ఇవ్వడానికి సిద్ధంగా వున్నట్లు ప్రభుత్వానికి తెలిపాయి.
కాళేశ్వరం
ప్రాజెక్ట్ చివరి భాగం పనులు పూర్తికావడానికి కావాల్సిన నిధులు తెచ్చే ప్రయత్నంలో
ఆర్థికశాఖ అధికారులున్నారు. ఇది అప్పులు చేయడం కిందికి రాదు. అలా ప్రతిపక్ష
నాయకులు విమర్శించడం కూడా సబబు కాదు. ప్రయివేట్ వాళ్ళు తీసుకునే అప్పులు వేరు, ప్రభుత్వం చేసే అప్పులు వేరు. బడ్జెట్ తయారీలో నిధుల కూర్పు
అని వుంటుంది. అది రాజ్యాంగం, భారత మంత్రిత్వ శాఖ ఏర్పాటు
చేసిన అనేక నిబంధనలు, పద్ధతులకు లోబడి వుంటుంది. దానికి
మించి ప్రభుత్వం పోలేదు. భారత దేశంలో రాష్ట్రాలకు ఇవ్వాల్సినంత స్వయంప్రతిపత్తి
ఇవ్వలేదు. 15 వ ఆర్ధిక సంఘం రాష్ట్రానికి వచ్చినప్పుడు సీఎం ఈ విషయాలను చాలా
గట్టిగా, నిర్మొహమాటంగా చెప్పడం జరిగింది. వాళ్లకిచ్చిన
వివరణలో తన ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన కూడా వుంది. దురదృష్టం ఏంటంటే, మన దేశంలో మనం
అనుకున్నంత ప్రజాస్వామ్యం లేదు. అభివృద్ధి, ప్రజల జీవిక
లాంటి ప్రాథమికతలు పోయి దురదృష్ట వశాత్తూ రాజకీయ ప్రాధాన్యతలు ముందుకొస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వాలు ఓట్ల కోసం చిలిపి దృక్పధాన్ని అమలు చేస్తున్నాయి. అది యూపీఏ
కావచ్చు, లేదా, ఎన్డీయే కావచ్చు.
కేంద్రంలో ఏ
ప్రభుత్వం వచ్చినా విధానాల కేంద్రీకృతం ఎక్కువైంది. దురదృష్టం ఏంటంటే రాష్ట్రాల
పరిధిలో వుండే అనేక శాఖలను, అనేక అంశాలను, గతంలో
కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటి-అప్పటి ఎన్డీయే ప్రభుత్వం
ఇద్దరూ కంకరెంట్ (ఉమ్మడి) జాబితాలో పెట్టాయి. ఈ జాబితా ఒక పెద్ద మాయ. అదొక తమాషా.
విచిత్రమైంది. వాస్తవానికి రాష్ట్రాల జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా అని మూడు జాబితాలు రాజ్యాంగంలో వున్నాయి. ఉమ్మడి జాబితా
అంటే రాష్ట్ర ప్రభుత్వాల మెడమీద కత్తిలాంటిది. ఉమ్మడి జాబితాకు సంబంధించి కేంద్రం
జోక్యం లేకపోతే ఏదైనా అంశం విషయంలో రాష్ట్రాలు చట్టం చేసుకోవచ్చు. అలాకాకుండా
కేంద్రం చట్టం చేస్తే అదే అమలవుతుంది. ఉదాహరణకు రాష్ట్రాల జాబితాలో వున్న
వ్యవసాయాన్ని ఉమ్మడి జాబితాలో పెట్టారు. అంటే దానికి సంబంధించి కేంద్ర చట్టానికి
ప్రాధాన్యత వుంటుంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రధాని
నరేంద్ర మోడీకి ఈ విషయాలమీద గంటల తరబడి చెప్పారు. సీఎంకు నిర్భయంగా, నిర్మొహమాటంగా మాట్లాడే అలవాటుంది కాబట్టి, చాలా దురుసుగా ఇవే విషయాలను నీతీ ఆయోగ్ లో కూడా చెప్పారు. కాకపొతే అవన్నీ
చెవిటివాడి ముందర శంఖం వూదినట్లుగానే వుంది. ఉదాహరణకు, ఎక్కడో
ఒక గ్రామంలో వున్న ఒక ప్రాథమిక పాఠశాల నడపడానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం
వుండాలా? ఒక మారుమూల మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంచి
చెడ్డలు కేంద్రం చూడాలా? ఒక మారుమూల గ్రామంలో పనిచేసే దినసరి
కూలీ వేతనాలను కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషీ చేయాలా? ఇలాంటి
పరిస్థితులు కొనసాగితే ఇక ఈ ముఖ్యమంత్రులు ఎందుకు? రాష్ట్ర
మంత్రిమండలి ఎందుకు? రాష్ట్ర సచివాలయంలో కార్యదర్శులు ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత పెద్ద అట్టహాసం ఎందుకు?
ఇంత దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను తన గుప్పిట్లో
పెట్టుకోవాలా? విత్త విధానాన్ని కూడా అదే పద్ధతిలో చాలా ధృఢంగా
నిర్వహిస్తున్నది కేంద్రం. విస్తృత విత్త విధానం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో
వుంటుంది. రాష్ట్రాల పరిధిలో లేదు. జీఎస్డీపీలో మూడు శాతం మించి రాష్ట్ర ప్రభుత్వం
ఋణం తీసుకోవాలంటే ఆర్ధిక శాఖ కార్యదర్శి కనీసం ముప్పై-నలబై సార్లు కేంద్రం చుట్టూ
ప్రదక్షిణ చేయాలి.
ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రి తెలంగాణ రాష్ట్ర
ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఇది కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటా (సెంట్రల్
డెవోల్యూషన్) కు సంబంధించినది. వాస్తవానికి దీనికి సంబంధించి ఎవరి దయా
దాక్షిణ్యాలు అవసరం లేదు. ఇది రాజ్యంగబద్ధంగా తెలంగాణకు రావాల్సిన డబ్బు.
కేంద్రంలో గతంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికికంటే ముందున్న ఏ ప్రభుత్వమైనా
తప్పకుండా, ప్రతినెలా ఒకటో తేదీనాడు సెంట్రల్
డెవోల్యూషన్ నిధులు రాష్ట్రానికి వచ్చేవి. దీనిమీద ఆధారపడి రాష్ట్రాలు జీతభత్యాలు, ఇతరత్రా ఖర్చులు చెల్లించేవారు. ఈ నేపధ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి పంపిన
లేఖకు ప్రాధాన్యత వుంది. ఆయన చెప్పింది....రాష్ట్రాల నుండి వివిధ రకాల పన్నుల
మొత్తం కేంద్రానికి 15, 16 తేదీలకు మాత్రమే వస్తున్నాయి
కాబట్టి, రాష్ట్రాలకు ఒకటో తేదీన ఇస్తే ప్రతినెలా ఒకటి నుండి
18 వ తేదీ వరకు వడ్డే పడుతుంది.....అందువల్ల ఒకటో తేదీన సెంట్రల్ డెవోల్యూషన్
ఇవ్వలేమని. ఇలా, కేంద్రం నుండి రాష్ట్రాలకు హక్కుగా వచ్చే
నిధులను కూడా వారు అదిమిపట్టి ఇబ్బంది కలిగించే వ్యవహారం చేస్తున్నారు.
కేంద్రంలోని పెద్దలకు ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందనేది భగవంతుడి దయ. భారత ప్రజానీకం
తిరుగుబాటు చేసే స్థితి కలగవచ్చు. గుణాత్మకమైన మార్పు రాకపోవడం దురదృష్టకరమైన
విషయం.
15వ ఆర్ధిక సంఘం ఇటీవల రాష్ట్రానికి వచ్చి, ఫిబ్రవరి 17
నుండి 20వ తేదీవరకు పర్యటించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను
సమీక్షించింది. ఒకరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతోను, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతోనూ సమావేశమైంది. ఆ సమావేశంలో
కేసీఆర్ చాలా గట్టిగా ఆర్ధిక సంఘం చైర్మన్ కు, సభ్యులకు తన
వాదనను వినిపించారు. ఆయన చెప్పిన పలు విషయాలను కొన్ని పత్రికలు ప్రచురించాయి, కొన్ని అంతగా కవర్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వాలు ఒక విధంగా మొద్దు నిద్రలో
పనిచేస్తున్నాయి అనాలి. విదేశీ మారక ద్రవ్య విలువలను బాలెన్స్ చేయడానికి కొన్ని
నిధులు అవసరం కాబట్టి రిజర్వ్ బాంక్ లో కొన్ని నిధులు రిజర్వులో వుండాలి. కాని
కేంద్రం దగ్గర వున్న నిల్వలు ఘోరంగా వున్నాయి. ప్రస్తుతం అవి రు.13,00,000 కోట్లున్నాయి. గతంలో నవరత్నాలుగా వున్నవి
ఇప్పుడు మహారత్నాలయ్యాయి. వీళ్ళ దగ్గర కూడా సుమారు రు.11,00,000 కోట్లు రిజర్వులో వున్నాయి. వాళ్ళు ఆ డబ్బును ప్రతి పది-పదిహేను
రోజులకొక సారి వేలం వేసి ఒక బాక్ నుంచి మరొక బాంకుకు, అక్కడి
నుండి ఇంకో బాంకుకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ విధంగా సుమారు రు.24,00,000 కోట్లు ఈ బాంకుల మధ్యనే తిరుగుతుంది. ఈ
మొత్తం దాదాపు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కు సమానం. అభివృద్ధిచెందుతున్న
భారతదేశానికి ఈ నిధులు ఇంత పనిలేకుండా వృధాగా పడివుండడం అవసరమా? ఇది పెద్ద నేరమనాలి.
(ఇంకా వుంది...వచ్చే వారం)
--సీఎం కేసీఆర్ శాసనసభలో బడ్జెట్ సమావేశాల చర్చల ప్రసంగం
ఆధారంగా