వాగ్దానాల అమలు దిశగా బడ్జెట్
వనం జ్వాలా నరసింహారావు
మనతెలంగాణ దినపత్రిక (23-02-2019)
2019-20 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం వోట్ ఆన్
అకౌంట్ బడ్జెట్ ను ఉభయసభల్లో ప్రవేశపెట్టింది. శాసనసభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల
చంద్రశేఖర్ రావు స్వయంగా ఆర్థికమంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టి, ప్రసంగ పాఠాన్ని సుమారు గంట
సేపు చదివారు. బడ్జెట్ అంటే ఇదీ, ఇలా వుండాలని, ఒక “రోల్ మోడల్” బడ్జెట్ తయారుచేయడం
జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే, ప్రజల ఆశయాలను,ఆకాంక్షలను, కోరికలను ప్రతిబింబించే అసలు-సిసలైన
బడ్జెట్ ఈ వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. కేసీఆర్ రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చిన
తరువాత ప్రవేశపెట్టబడిన మొదటి బడ్జెట్ కూడా ఇది. ఎన్నికల్లో ఆయన చేసిన
వాగ్దానాలన్నీ అమలుచేసే ప్రక్రియ తుచ తప్పకుండా తన బడ్జెట్ ప్రసంగంలో
ప్రతిబింబించేలా సాగింది ఆయన బడ్జెట్ ప్రసంగం. దీనికి తోడు గత ఐదేళ్లలో ప్రభుత్వం
అమలుపరుస్తున్న అభివృద్ధి-సంక్షేమ పథకాలు ఇక ముందు కూడా కొనసాగే తీరుతెన్నులను
సవివరంగా ప్రస్తావించారు సీఎం.
టీఆరెస్ ప్రభుత్వం మొట్టమొదట ఐదేళ్ళ క్రితం అధికారంలోకి
వచ్చిన వెనువెంటనే కేసీఆర్, ఆయన సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం “ఒకటి వెంట
మరొకటి” అనేలా పెనుసవాళ్లను ఎదుర్కొని, ఒక్కొక్కదాన్నే అధిగమించుకుంటూ
అభివృద్ధిపథాన దూసుకుపోతుంది. జూన్ 2, 2014 న ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం, ఆ తరహాలో తెలంగాణ మున్నెన్నడూ లేదన్న
భావనతోనూ, దీన్ని పూర్తిగా ఒక కొత్త రాష్ట్రంగా చూడాలన్న ఉద్దేశంతోనూ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, సంక్షేమానికి
ఒక చారిత్రకమైన ఆరంభం జరగాలన్న పట్టుదలతో, నిబద్ధతతో అభివృద్ధికి బీజాలు వేయడం జరిగింది.
రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుండి, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండీ, చేపట్టి అమలు పరుస్తున్న అనేకానేక పథకాలు
ఈ లక్ష్య సాధన దిశగానే వున్నాయి. అదే పరంపర 2019-20 బడ్జెట్ లోనూ కొనసాగింది.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరానికి, అంటే, 2014-2015 కు, బడ్జెట్ రూపొందించడానికి కేసీఆర్
ప్రభుత్వానికి ఎలాంటి రకమైన ఆధారాలు మొదట్లో లభించలేదు. అదో పెద్ద సవాల్ ప్రభుత్వానికి.
రాష్ట్ర ఆదాయ వనరుల విషయంలో కానీ, వ్యయానికి సంబంధించి కానీ, ఏ మాత్రం అంచనా ప్రభుత్వం దగ్గర లేదు. ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ విధానాల
కల్పనకు దర్పణం పట్టే విధంగా బడ్జెట్ ప్రతిపాదనలు వుండాలి కానీ, కేవలం ఆదాయ-వ్యయ లెక్కల పట్టికగా ఉండరాదని
ప్రభుత్వ ఉన్నత అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు స్పష్టం చేసారు. అన్ని
రంగాలలో ధర్మమైన, సమధర్మ-న్యాయ సమ్మతమైన అభివృద్ధిని చేకూర్చి, సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి బాటలు
వేయడం నాటి ప్రభుత్వం ముందున్న సవాల్. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం, వికేంద్రీకరణ నమూనా అభివృద్ధికి పీటవేసి, “మన వూరు-మన ప్రణాళిక” కార్యక్రమం ద్వారా, గ్రామీణ స్థాయిలో అట్టడుగు వర్గాల ప్రజల
అవసరాలెలా వుంటాయో అనే విషయంలో సూచనలు-సలహాలు రాబట్టింది.
బడ్జెట్ తయారీకొరకు, ఒక్కో రంగంలో
ప్రాదాన్యతాంశాలను గుర్తించడానికి, వనరుల సమీకరణకు అవలంభించాల్సిన
విధానాల రూపకల్పనకూ, 2014-2015 బడ్జెట్ రూపకల్పనలో సూచనలు-సలహాలు ఇచ్చేందుకు 14
టాస్క్ బృందాలను ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. వీటన్నింటి నేపద్యంలో, టాస్క్
బృందాల సిఫార్సుల మేరకు, మొట్టమొదటి తెలంగాణా రాష్ట్ర
బడ్జెట్ ను నవంబర్ 5, 2015 న రాష్ట్ర శాసనసభకు
సమర్పించడం జరిగింది. అదొక చారిత్రాత్మక ఘట్టం. ఆ విధంగా, రాష్ట్ర
ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన సమగ్ర సమాచారం సరిగ్గా లేకుండానే, గతంకంటే
పూర్తి భిన్నంగా, అందుబాటులో వున్న అంశాల ఆధారంగా, మొట్టమొదటి
తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ రూపొందించడం జరిగింది. 2014-15 బడ్జెట్ వాస్తవానికి రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్
ప్రభుత్వం శాసనసభకు సమర్పించిన వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగింపు మాత్రమే. అంటే, ఆ ఏడాది 12
నెలల ఆదాయ-వ్యవ వివరాల అంచనాలు పూర్తిస్థాయిలో లేని నేపధ్యంలో ఆ తరువాతి సంవత్సరం
అంటే 2015-16 బడ్జెట్ తయారుచేయాల్సి వచ్చింది.
2015-20 మధ్యన ఐదేళ్ళ కాలానికి 14 వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల
డివిజబుల్ పూల్ కింద రాష్ట్రాల వాటాను 32 శాతం నుండి 42 శాతానికి పెంచినప్పటికీ, ఆ లాభం
తెలంగాణాకు చేకూరలేదు. దీనికి కారణం జాతీయ సగటు తలసరి ఆదాయంకంటే తెలంగాణా తలసరి
సగటు ఆదాయం ఎక్కువగా వుండడమే! తలసరి ఆదాయానికి సంబంధించి జిల్లాలకు-జిల్లాలకు
మధ్యనున్న భారీ వ్యత్యాసాలు కూడా రాష్ట్ర తలసరి సగటు ఆదాయంలో భాగమే. కేంద్ర
పన్నుల్లోనుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా తగ్గినప్పటికీ (2014-15 లో వాటాగా ఇచ్చిన 2.893శాతం నుంచి 2015-20 మధ్య ఐదేళ్ళ కాలంలో 2.437 శాతానికి తగ్గుదల) రాష్ట్రం విత్త సంబంధమైన ప్రమాణాలను పటిష్టంగా
నిలబెట్టుకోగలటమే కాకుండా, అదనంగా జీఎస్డీపీ మీద 0.5% ఎఫ్ఆర్బీఎం
పొందగలిగి, అప్పుతెచ్చుకోగల సామర్థ్యం సంపాదించుకోగలిగింది.
2016-17 బడ్జెట్
రూపొందించుకునే సమయానికల్లా, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై, ఆదాయ-వ్యయాలపై, ప్రభుత్వానికి ఒక
సమగ్రమైన-సంపూర్ణమైన అవగాహన వచ్చింది. 31 మార్చ్ 2015 నుండి 31 మార్చ్ 2016 వరకు, ప్రణాళిక, ప్రణాలికేతర
పథకాల కింద ఆదాయ-వ్యయ లెక్కలు ఖచ్చితంగా తెలవడంతో, తెలంగాణ బడ్జెట్
రూపకల్పనకు అసలు-సిసలైన ప్రాతిపదిక దొరికి,బడ్జెట్ తయారీకి
మార్గం సుగమమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత రూపొందించిన మొదటి
బడ్జెట్-అడహాక్ లెక్కల మీద, గతంలో సమర్పించిన బడ్జెట్ల మీద ఆధారపడిందైతే, అంతో-కొంతో
కుస్తీపట్టి ఆ తరువాతి సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్ తయారు చేయడం జరిగింది.
క్రమేపీ, పూర్తీ అవగాహన కలగడమే కాకుండా,ఒక్కో పథకం, ఒక్కో
శాఖకు సంబంధించి లోతుగా అధ్యయనం చేయడం, పూర్తి
అవగాహనకు రావడం జరిగింది. 2016-17 సంవత్సరం శాసనసభకు సమర్పించిన బడ్జెట్ మూడో బడ్జెట్ అయినప్పటికీ, వాస్తవంగా
ఆలోచిస్తే, ఒక సమగ్ర-సంపూర్ణ అవగాహనతో, పూర్తి
స్థాయి సమీక్ష ఆధారంగా, అన్ని రకాల ఆదాయ-వ్యయాల వాస్తవ
అంచనాల ప్రాతిపదికగా, వనరులకు సంబంధించి అసలు-సిసలైన
లెక్కల ఆధారంగా, తయారుచేసిన మొదటి బడ్జెట్ అనాలి.
రాష్ట్ర ఆవిర్భావం తరువాత అనేకానేక అభివృద్ధి-సంక్షేమ పథకాల కోసం విరివిగా
నిధులను వ్యయం చేస్తున్నప్పటికీ, ఆర్థికంగా ఆరోగ్యకరమైన, పటిష్టమైన
పరిస్థితిలో కొనసాగగలగడం ఎంతో తృప్తినిచ్చే అంశం అనాలి. ఇలా వుండడానికి ప్రధాన
కారణం,పన్నులేవీ అదనంగా విధించకుండానే రెవెన్యూ వసూళ్లను మెరుగుపరుచుకోగలగడమే. 2015-16 సంవత్సరంతొ పోల్చి చూస్తే, 2016-17 లోరాష్ట్ర స్వయం పన్నుల రెవెన్యూలో 21.1% వృద్ధి రేటు
సాధించగలిగింది. ఇది దేశంలోని మిగాతా అన్ని రాష్ట్రాలకంటే అధికం.
ఈ నేపధ్యంలో, ఈ క్రమంలో, 2017-2018 లో రాష్ట్రం ప్రవేశపెట్టిన బడ్జెట్, ఎ విధంగా
చూసినా ఒక రకమైన ప్రేరణ కలిగించేదిగా, సందేశాత్మకంగా
వుందని చెప్పాలి. ప్రభుత్వ ఆశయానికి, ఆలోచనకు, ఉద్దేశ్యానికి
అనుగుణంగా సమాజంలోని అన్ని వర్గాలకు, కులవృత్తుల
వారికి, అన్ని మతాల వారినకి, వివిధ
రంగాలలో నిమగ్నమై వున్న వారికి, అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను
అమలు చేసే అన్ని ప్రభుత్వ శాఖల వారికి,అల్పాదాయ-మధ్య
తరగతి వారికి, సమాజంలో వారూ-వీరూ అనే తేడా లేకుండా అందరికీ చేరువయ్యే
విధంగా బడ్జెట్ రూపకల్పన జరిగింది.
ఇక 2018-19 లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అంతకు ముందు 45 నెలల్లో
రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసి అమలు పరుస్తున్న కార్యక్రమాలను ఏ విధంగా
ప్రమాణీకరణం చేయవచ్చు, ఏ విధంగా స్థిరపర్చవచ్చు, ఏ విధంగా పటిష్టం చేసుకోవచ్చు అనే విషయాలు
స్పష్టంగా కనిపిస్తాయి. రాష్ట్ర స్థూల ఆర్ధిక పరిస్తి ఎలా మెరుగునపడిందో
తెలియచేస్తుందీ బడ్జెట్. జీఎస్టీ అమలు, పెద్దనోట్ల రద్దు తదనంతర పరిణామాల నేపధ్యంలో కూడా రాష్ట్ర సాధించిన
ఆర్ధికాభివృద్ధి స్పష్టం చేయడం జరిగింది. అదనంగా, 2017-2018
ఆర్ధిక సంవత్సరంలో రూపకల్పన
చేసిన పథకాలను వర్తమానంలో-భవిష్యత్ లో ఎలా అమలు చేస్తున్నారు-చేయబోతున్నారు అనే
విషయాలు కూడా ఆ బడ్జెట్లో స్పష్టం చేయడం జరిగింది.
ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గత ఐదేళ్ళలో ఏం
జరిగిందీ, రాబోయే
ఐదేళ్ళలో ఏం జరగబోతుందీ స్పష్టమవుతుంది. నూతనంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం
తరువాత ఇది ఆరవ బడ్జెట్. ఆర్ధిక నిపుణుల సలహాలతో, సహకారంతో ప్రయాణం ప్రారంభించిన
తెలంగాణ రాష్ట్రానికి భగవంతుడు, ప్రకృతి దీవెనలు, ప్రజల సహకారం లభించింది. అందుకే అనుకున్న పంథాలో కార్యక్రమాలు అమలుజరిపి, అద్భుత విజయాలను సాధించగలిగింది ప్రభుత్వం. సమైక్య రాష్ట్రంలో జరిగిన
జీవన విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకుని పలు సంక్షేమ పతకాలను ఇంత తక్కువ కాలంలో
అమలు చేయగలిగింది కేసీఆర్ ప్రభుత్వం. ఇది బడ్జెట్ లో ప్రస్ఫుటమైంది.
ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాల ద్వారా సంపద ఎలా వృద్ధి
చెందుతుందో వివరంగా చెప్పడం జరిగింది. దేశం ఆశ్చర్యపడే విధంగా నీటిపారుదల
ప్రాజెక్టులు ఎలా పూర్తవుతున్నాయో, విద్యుత్ రంగంలో ఎలా పురోగతి సాధించడం జరిగిందో
ఈ బడ్జెట్ లో వుంది. పారిశ్రామీకరణ జరిగిన విధానం, ఐటీ రంగ అభివృద్ధి కూడా చెప్పడం జరిగింది. అవినీతి
రహితమైన పాలన పునాదులపైన అద్భుతమైన అభివృద్ధి, దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరే పథకాల
వివరణ, అల్పాదాయ వర్గాల వారికి చేకూరే లాభం, కళ్యాణాలక్ష్మి, షాదీముబారక్,
కేసీఆర్ కిట్స్, పథకాలద్వారా లభించే లబ్ది తెలియచేయడం
జరిగింది. ఉదాహరణకు కేసీఆర్ కిట్స్ ద్వారా ఎలా మాతా-శిశు మరణాలు తగ్గాయి, కళ్యాణాలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఎలా
బాల్య వివాహాలు ఆగిపోయాయి వివరించడం జరిగింది. సంక్షేమంలో సంస్కరణల మూలాన్నే
ప్రజలు అద్భుతమైన ఘన విజయాన్ని మరో మారు టీఆరెస్ పార్టీకి కట్టబెట్టిన సంగతి
తెలియచేయడం జరిగింది. గత పునాదులమీద, అనుభవాలమీద రాబోయే ఐదేళ్లలో నిర్దుష్టమైన
పంథాలో పనిచేస్తామన్నారు సీఎం.
రైతు సంక్షేమానికి చెందిన దీర్ఘకాల, స్వల్పకాల పథకాల వివరణ
వుంది. ప్రభుత్వం మానవీయ కోణంతో రైతుసంక్షేమానికి కృషి చేస్తుందని, కోటి 25 లక్షల ఎకరాల భూమికి సాగి నీరు అందిస్తామని చెప్పారు సీఎం. రైతు
సంక్షేమం ప్రధాన ధ్యేయంగా, రైతు పక్షపాత ప్రభుత్వంగా తన
ప్రభుత్వానికి పెద్ద పేరు వచ్చిందన్నారు ముఖ్యమంత్రి. రైతు సంక్షేమమే దేశ సంక్షేమం
అన్న సీఎం, పెంచిన రైతు బందు మొత్తాని ప్రస్తావించారు.
సమైక్య రాష్ట్రంలోని 23 జిల్లాలకంటే గడచినా ఐదేళ్లలో తెలంగాణాలో వ్యవసాయానికి
వ్యయం చేసింది ఎక్కువని అన్నారు కేసీఆర్. లక్షరూపాయల వరకు మళ్లీ రుణమాఫీ విషయం
కూడా ప్రస్తావించారు.
నూతన పంచాయితీరాజ్ చట్టం గురించిన ప్రస్తావన వివరంగా వుంది.
మాగూడెం, మా తండా, మారాజ్యం....విషయం చెప్పి ఎలా ఇటు మైదాన ప్రాంతంలోను, అటు షెడ్యూల్డ్ ప్రాంతంలోను అనేకమంది గిరిజనులు సర్పంచులు కాగలిగారో
వివరించారు. గ్రామ పంచాయితీలకు 14 వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు డివొల్యూషన్ కింద
సంక్రమించే ఆదాయ వనరులకు అదనంగా, రాష్ట్ర ఆర్ధిక సంఘం సూచన మేరకు అంతే మొత్తాన్ని
రాష్ట్రం సమకూర్చాలని నిర్ణయించినట్లు చెప్పిన సీఎం, ఆ
మొత్తానికి మన్రేగా నిధులు, పన్నుల నిధులు కలిపి మొత్తం
రాబోయే ఐదేళ్ళలో గ్రామాలను ప్రగతిశీల గ్రామాలుగా,
మహాత్మాగాంధీ కలలు కన్నా గ్రామాలుగా మలుస్తామన్నారు.
తెలంగాణకు హరితహారం గురించి, అడవుల సంరక్షణ విషయంలో
కఠినంగా వుండడం గురించీ, రాజీలేని విధంగా అటవీ దుర్మార్గుల
ఆటకట్టించే విషయం గురించీ, ఆసరా పించన్ల పెంపు గురించీ, రుణమాఫీ గురించీ, నిరిద్యోగ భృతి గురించీ, రెండు పడక గదుల ఇళ్ళ గురించీ, భూ రికార్డుల ప్రక్షాళన గురించీ, ధరణి వెబ్ సైట్
గురించీ, పంట కాలనీల గురించీ, రైతులకు
గిట్టుబాటు ధరల గురించీ, ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ గురించీ
తదిర అభివృద్ధి-సంక్షేమ పథకాల గురించీ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావన వుంది. ప్రజలు
తమకిచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తామని ప్రజలకు ముఖ్యమంత్రి హామీ
ఇచ్చారు.
No comments:
Post a Comment