రాముడి బారినుండి తప్పించుకున్న వైనం రావణుడికి
చెప్పిన మారీచుడు
శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-47
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (10-02-2019)
“విశ్వామిత్ర
యాగ రక్షణ సమయంలో రామచంద్రుడు యుద్ధరంగంలో అందరినీ చంపి నన్ను ప్రాణాలతో ఎందుకు
విడిచాడో కారణం తెలియదు. బతికి వుండడం మాత్రం తెలసు. ఇది పాత సంగతి. కొత్తగా ఇటీవల
జరిగిన కథ చెప్తా సావధానంగా విను. రాముడితో దెబ్బతిన్న నేను దండకారణ్యంలో గర్వంతో
తిరుగుతూ క్రూరంగా ప్రవర్తించేవాడిని. తపస్వుల సమూహాలను తన్ని వాళ్ల నెత్తురు
తాగుతూ, వారి మాంసం
తింటూ, అధర్మ
మార్గంలో వళ్లు తెలియకుండా తిరుగుతుంటే ఒక నాడు, ముని వేషంలో
వున్న రామచంద్రుడు, పరమపతివ్రత అయిన సీత, లక్ష్మణుడు
ఒకే చోట కనిపించారు. అప్పుడు రామచంద్రుడిని పొడవడానికి పోయాను దగ్గరికి. ఆయన
నావైపు చూసి, చాపం
ఎక్కుపెట్టి, వజ్రం లాంటి
మూడు బాణాలను విడిచాడు. ఆ బాణం వేగం తెలిసన వాడినికనుక ముందే పరుగెత్తాను”.
“రామచంద్రుడి బాణాలు వెనుకవైపు నుండి
తగలవు కాబట్టి నేను బతికిపోయాను. నావెంట వచ్చిన వారిద్దరూ ఆ బాణాలు తగిలి
చనిపోయారు. రామచంద్రుడిని ఎదిరించి బతకడం ఎవరికీ సాధ్యం? అలా బతికి
పోయిన నేను, ఇంకా అలానే
తిరుగుతుంటే చంపుతాడనే భయంతో, ఆనాటి నుండి ఈ ప్రదేశంలో గర్వహీనుడనై, యోగాభ్యాసం
చేస్తూ, మునిలాగా
వున్నాను. ఆ శ్రీరాముడిని మనసులో అనుకున్నా నేను పడే పాట్లు నాకే తెలుసు. రావణా!
చెట్టు-చెట్టులో శ్రీరాముడే పెద్ద విల్లు పట్టుకొని, నారచీరెలు, జింక చర్మం
ధరించి, పాశం
పట్టుకున్న యముడిలా కనిపిస్తున్నాడు. ఎక్కడో చెట్టెక్కి కూర్చుని నాకు
కనిపిస్తున్నాడని అనుకుంటున్నావేమో? అలా కాదు. ఒక్క చోటే ఒక్క రాముడు కనిపిస్తే
అలా అనుకోవచ్చు. ఎల్ల వేళలా, వేలాది మంది రామచంద్రమూర్తులు, నాకు
కనిపిస్తుంటారు. అడవంతా రామమయంగా కనపడుతున్నది. ఇంద్రజాలం అంటావేమో? రాముడు లేని
దూర ప్రదేశానికి పోయి వుందామంటే అక్కడా ఆయనే కనపడుతున్నాడు. పగలు, రాత్రి, కళ్ళు
మూసుకున్నా, తెరిచినా
రాముడే కనపడుతుంటే అరుచుకుంటూ లేస్తాను. ఆ కారణాన నిద్ర అనేది లేకుండా పోయింది.
నేనేం చేయాలి?”
“రాముడిని చూసి భయపడడం అలా వుంచితే, ఆయన పేరు
వింటేనే భయం కలుగుతున్నది. రాముడి పేరే కాదు...’ర’ కారంతో
మొదలైన ఏ శబ్దం, రత్నం, రథం లాంటివి
విన్నా రాముడే వస్తున్నాడని భయం కలుగి మనసు కలవరపడుతున్నది. రావణా! రామచంద్రుడి
మీద విరోధం మానుకో. యుద్ధంలో నువ్వు ఆయనకు సమానుడివి కాదు. నీ శక్తి నాకు తెలుసు.
ఆయన శక్తీ నాకు తెలుసు. ఆయన ఎవరినైనా వధించగల శక్తిమంతుడు. నీకు శక్తి వుంటే, నువ్వే పోయి
ఆగ్రహంతో యుద్ధం చేయి. బలం లేకపోతే, అయిందేదో అయింది...ఏం చేయలేమని, బంధువుల మరణం
సహించి వూరుకో. మీ ఇద్దరిమధ్య నా ప్రాణం తీయాలని ఎందుకు ఆలోచిస్తావు? ఆ రెండిటిలో
ఒకటి చేయి కాని దొంగతనం చేయొద్దు. ఇంకా నేను కొన్ని రోజులు బతికి భూమ్మీద వుండడం
నీకు ఇష్టమైతే ఆ సీతాపతి కథ నాతొ చెప్పవద్దు.
నా తలపోయ్యే పనైతుంది. అనేకమంది సాధువులు వాళ్ళు ధర్మాత్ములైనప్పటికీ, ఇతరుల దోషం
వల్ల నశిస్తారు. అలాగే, నేను నువ్వు మతిమాలి చేసే పనివల్ల చెడిపోతాను.
ఇది నిజం. నీ వెంట రాను. ఈ విషయంలో నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. నన్ను
వదిలిపెట్టు”.
“రామచంద్రమూర్తి అసమాన బలాతిశయుడు.
దృడమైన తేజస్సు కలవాడు. అధికమైన గర్వం, మనోదార్ధ్యం, శరీర బలం
కలవాడు. ఇలాంటి వాడిని రాక్షసజన నాశకుడిగా ఎందుకు చేస్తావు? అడవిలో
వారంతట వారు ఒక ఆశ్రమాన్ని ఏర్పాటుచేసుకొని, ఒకరి పేరు
ఎత్తకుండా వుంటుంటే, మన శూర్పనఖ పొగరుబోతు తనంతో ఏమని బెదిరించడానికి పోయింది? అంతటితో
ఆగకుండా ఖరాడులను యుద్ధానికి పురికొల్పింది. వారంతా గుంపుగా పోయి యుద్ధం చేశారు.
రాముడి చేతిలో చనిపోయారు. దీంట్లో రామచంద్రమూర్తి నేరం ఏముందో చెప్పు? బంధువుల మేలు
కోరి, నేను చెప్పిన
మాటలు నీ చేదైతే, బంధువులతో, స్నేహితులతో, యుద్ధంలో
చస్తావు”.
న్యాయంగా, పనికొచ్చే
విధంగా చెప్పిన మారీచుడి హితవాక్యాలు, చావకోరేవాడు
వైరాగ్యంతో మందు నిరాకరించినట్లు, రావణుడికి రుచించలేదు. నీతియుక్తమైన, హితమైన
మారీచుడి మాటలకు జవాబుగా ఆయన్ను చూసి రావణుడు నిష్టూరంగా మాట్లాడాడు.
No comments:
Post a Comment