Thursday, February 21, 2019

పౌరసంబంధ సలహాదార్లు : వనం జ్వాలా నరసింహారావు


పౌరసంబంధ సలహాదార్లు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (22-02-2019)
ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనేక ఆశలు, ఆశయాలు, అభిలాషలు, ఆకాంక్షలు, అవసరాలు, కోరికలు, సమస్యలు....ఇలా ఎన్నో వుంటాయి. వుండడం సహజం కూడా. ప్రభుత్వ పరంగా వివిధ పథకాల ద్వారా ఒక లబ్దిదారుడుగా పొందాల్సినవి కూడా ఎన్నో వుంటాయి. అవి కేంద్ర పథకాలు కావచ్చు, రాష్ట్ర పథకాలు కావచ్చు. వీటి నేపధ్యంలోనే ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఇవి నెరవేర్చగలరని భావించిన పార్టీనే ఎన్నుకుని అధికారం కట్టబెడతారు. వీటికి అదనంగా రాజకీయ పార్టీలు కూడా ప్రజలకు ఫలానా మంచి జరగాలని భావించి, ఎన్నికల మేనిఫెస్టోలో తదనుగుణమైన వాగ్దానాలు చేస్తారు. ప్రజలు ఓటు వేసేటప్పుడు ఇవికూడా పరిగణలోకి తీసుకుంటారు. తామెన్నుకున్న ప్రభుత్వం తమ అవసరాలను తీర్చే విషయంలో కానీ, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు నెరవేర్చే విషయంలో కానీ, ఉదాసీనత ఏమాత్రం కనపర్చకుండా ప్రతి పథకం అమలుకు ఎన్ని విధాల వీలుంటుందో, అన్ని విధాల చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు, ప్రభుత్వాన్ని అభినందిస్తారు. మళ్లీ-మళ్లీ గెలిపిస్తారు.

ఇటీవల కొందరు భావసారూప్యతకల రాజకీయ, అధికారస్వామ్య పెద్దలు తమదైన శైలిలో ఒక గోష్టి నిర్వహించి ఈ విషయాలపై కూలంకషంగా చర్చించారు. కోటి ఆశలతో ప్రజలు గెలిపించిన తెలంగాణ రాష్ట్ర సమితి, దాని అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మొదటి విడత ముఖ్యమంత్రి అయినప్పుడు ఎలా వారి ఆకాంక్షలకనుగుణంగా, అవసరాలను దృష్టిలో పెట్టుకుని పథకాల రూపకల్పన, అమలు చేశారో, అలానే, ఆ మోతాదులోనే పనిచేస్తే బాగుంటుందనీ, అలా తప్పక జరుగుతుందనీ, ప్రజల బాగోగులే పరమావధిగా ఈ విడత కూడా పాలన సాగుతుందనీ ఆ గోష్టిలో పాల్గొన్నవారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కాకపోతే ఎంత పకడ్బందీగా పథకాల అమలుకు ఎన్నిరకాల చర్యలు తీసుకున్నప్పటికీ అర్హులైన అందరూ వాటి ఫలాలను ఎంతమేరకు ఆస్వాదించగలుగుతున్నారనే విషయంలో చర్చలో పాల్గొన్న వారు వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ప్రభుత్వ ఉద్దేశం ఎంత మంచిదైనప్పటికీ, అమలు వరకు వచ్చేసరికి వుండాల్సిన సాంకేతిక, ఇతర సమస్యలు వుంటాయనే భావన గోష్టిలో వెల్లడైంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారూ-వీరూ అనే భేదం లేకుండా, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కొరకు, లక్షలాది ప్రజానీకం లబ్దిపొందే వందలాది పథకాలను ఒకటివెంట మరొకటి రూపకల్పన చేసి, ప్రవేశ పెట్టి, విజయవంతంగా అమలు చేస్తోంది. ప్రభుత్వం ప్రకటించి అమలుపరుస్తున్న ప్రతి పథకానికి చెందిన సమాచారం ఏదో ఒక మార్గాన, ముఖ్యంగా ప్రసార మాధ్యమాల ద్వారా, ప్రచారం పొంది, ప్రజలకు చేరువ, భవిష్యత్ లబ్దిదారుడికి కొంతమేరకు అర్థమై, దాని ఫలాలను వారు పొందే వీలుకలుగుతున్నది. అయినప్పటికీ, పలు కారణాలవల్ల, ప్రతి పథకం అర్హులైన ప్రతివారికి అర్థం కావడానికి, ఆ పథకం ద్వారా లబ్దిపొందాలంటే ఇమిడివున్న విధి-విధానాలు క్షుణ్ణంగా తెలుసుకోవడానికి, సరైన పద్ధతిలో దరఖాస్తు చేసుకోవడానికి కొంత ఇబ్బంది కలుగుతున్నదని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు. చాలా మంది ఆయా పథకాల ద్వారా ఎలా పూర్తిగా లబ్దిపొందాలో తెలియక వారినీ-వీరినీ అడిగి కొంతమేరకు తెలుసుకోగలిగినా చాలా మందికి అప్పుడప్పుడూ సమస్యలు తప్పడం లేదు. ఇది అధిగమించడం ఎలా అని చర్చ గోష్టిలో జరిగింది.
   
ఉదాహరణకు ఇటీవల ఒకనాడు మా ఇంట్లో పనిచేసే పనిమనిషి తనకొక రెండు పడక గదుల ఇల్లు ఇప్పించమని నన్ను కోరింది. నేను పనిచేస్తున్న ఉద్యోగ రీత్యా ఆమెకు నేను సహాయపడగలనని ఆమె భావనై వుండవచ్చు. సరే..ముందు దరఖాస్తు చేసుకోమని సలహా ఇచ్చాను. ఎలా దరఖాస్తు చేసుకోవాలని మళ్లీ ప్రశ్నించింది. బహుశా సంబంధిత ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకోవాలేమో అనుకుని అలా చేయమన్నాను. తానూ ఎన్నోసార్లు అలా ఇద్దామని ప్రయత్నం చేశాననీ, కానీ, అలా వీలుకాలేదని చెప్పింది. అంతేకాదు...ఎవరూ దరఖాస్తులు తీసుకోవడం లేదని కూడా చెప్పింది. సరేనని నేను సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడాను. మా పనిమనిషి చెప్పింది నిజమే అని అర్థమైంది. నిబంధనల ప్రకారం, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, సంబంధిత జిల్లా కలెక్టర్, ఫలానా గ్రామానికి చెందినవారు దరఖాస్తులు పెట్టుకోమని ప్రకటించిన తరువాతే ఇల్లు కావాల్సినవారు అలా చేయాలి. ఈ విషయం ఎంతమందికి తెలిసే వీలుంది? అందరికీ తెలియాలని కూడా లేదు. కానీ అలా తెలియని చాలామందికి ఇళ్ళ అవసరం మాత్రం వుంది. ఇలాంటివారికి ఎవరో ఒకరు సహాయం చేయాలికదా?


ఇలాంటిదే మరొక అభ్యర్ధన వచ్చింది. కళ్యాణలక్ష్మి పథకం కింద ప్రభుత్వ సహాయం కావాలని అడిగారొకరు. ఆమె అనుమానం దరఖాస్తు ఎలా చేసుకోవాలని. ఆన్ప్లైన్ దరఖాస్తు చేసుకోవాలని ఎవరో ఆమెకు చెప్పారు. కాదు నేరుగా ఎమ్మర్వోకి అప్ప్లై చేసుకోవచ్చని మరొకరు చెప్పారట. మొత్తం మీద ఎదో ఒక విధంగా అవసరమైన అర్హులు దరఖాస్తు చేసుకోవడం, చాలా సందర్భాల్లో పెళ్ళికి ముందే వారి చేతికి పైకం అందడం జరుగున్నప్పటికీ, కొందరి విషయంలో దరఖాస్తు చేసుకునే విధానం సరిగ్గా అర్థం కాక ఆలస్యం కావడమో, అసలు దరఖాస్తే చేసుకోలేక పోవడమో జరుగున్నది. సాంకేతిక కారణాల వల్ల కూడా ఒక్కొక్కప్పుడు ఆలస్యం జరగవచ్చు. అందరూ కాకపోయినా కొంతమంది సిబ్బంది అలసత్వం కూడా కారణం కావచ్చు. ఎలా జరిగినా ఇబ్బందికి గురయ్యేది లబ్దిదారులే కదా! ఇలాగే విదేశీ విద్య స్కాలర్ షిప్ విషయంలోనైనా, ఆసరా పించన్ల విషయంలోనైనా, కేసీఆర్ కిట్స్ విషయంలోనైనా, సాదాబైనామా క్రమబద్ధీకరణ విషయంలోనైనా, రైతు భీమా-రైతు బందు విషయంలోనైనా, లేదా మరే పథకం విషయంలోనైనా జరిగే అవకాసం వుంది. జనన-మరణ ధృవీకరణ పత్రాలకు కానీ, ఆదాయ సర్టిఫికేట్లకు కానీ, కుల ధృవీకరణ పత్రాలకు కానీ ఇలా సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. దాదాపు ప్రతి పౌరుడికీ ప్రభుత్వంతో ఎదో ఒక విధంగా అనునిత్యం అవసరం వుంటూనే వుంది. 
   
2011 జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణాలో సుమారు 2 కోట్ల మంది జనాభా పల్లెల్లో, 1.5 కోట్ల మంది జనాభా పట్టణాల్లో-నగరాల్లో నివసిస్తున్నారు. అదే లెక్కల ప్రకారం అక్షరాస్యుల శాతం 66.46%. దీనర్థం మిగతా మూడవ వంతు ప్రజలు నిరక్షరాస్యులు. అక్షరాస్యులలో కూడా కంప్యూటర్ నిరక్షరాస్యులు చాలా మంది వుండే అవకాశం వుంది. వీరికి నిరక్షరాస్యుల లాగానే ఐటీ సంబంధిత సేవలు అర్థం కావు. ఎంత గొప్పగా ప్రభుత్వం ప్రచారం కలిగించినా, ఎంత భారీ మోతాదులో ప్రజలను చైతన్య పరిచినా, ఇంకా-ఇంకా చాలా మంది ప్రభుత్వ పథకాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని వాటికి తామెంత మేరకు అర్హులమో నిర్ణయించుకుని, తదనుగుణగా దరఖాస్తు చేసుకుని ఫలితాలను పొందగలరనేది ఆలోచించాల్సిన విషయమే.

సరిగ్గా ఈ నేపధ్యంలోనే పథకాల లబ్దికి “పౌరసంబంధ సలహాదార్ల” ఆవశ్యకత అనే అంశం తెరపైకి వచ్చింది. వీళ్ళు ప్రజావసరాల విషయంలో ప్రతి పౌరుడికీ వారి-వారి అవసరాలకు తగ్గట్లు, అర్హత ఆధారంగా, ఏఏ పథకానికి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చో, ఎలా చేసుకోవచ్చో, ఎప్పుడు చేసుకోవచ్చో, ఎందుకు చేసుకోవచ్చో అనే విషయాల్లో అవగాహన కలిగించడం దగ్గరనుండి దరఖాస్తు చేసుకుని లబ్ది పొందేటంతవరకు సహాయకులుగా వుంటారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రవేశ పెట్తున్న నూతన పథకాలను ప్రజల్లోకి తీసుకు పోవడం దగ్గరనుండి, పాత పథకాల్లో చోటు చేసుకున్న మార్పులు-చేర్పుల గురించి కూడా అవగాహన కలిగిస్తారు. ఉదాహరణకు ఆసరా పించన్ల వయోపరిమితి తగ్గింపు, పించన్ మొత్తం రెట్టింపు లాంటివి. దరఖాస్తు చేసుకునేటప్పుడు ఎవరెవరిని కలవాలో విశదీకరిస్తారు. వీళ్లు ఒక రకమైన “చేంజ్ ఏజంట్లు”. వ్యవసాయయ విస్తరణాదికారులు ఎలాగైతే ప్రతి ఐదువేల ఎకరాకొకరున్నారో, ఎలాగైతే వాళ్ళు రైతులను చైతన్య పరుస్తున్నారో అలాగే రకరకాల ప్రభుత్వ పథకాల విషయంలో వీరిని నియమించవచ్చు.

ఈ రకమైన “పౌరసంబంధ సలహాదార్లు” లేదా “చేంజ్ ఏజంట్లు” ప్రభుత్వ పరంగా కానీ, అవుట్ సోర్సింగ్ విధానంలో కానీ పనిచేసే వీలు కలిగించవచ్చు. ఏ విషయంలోనైనా పౌరుడికి ఆద్యంతాలు అండగా వుంటారు. ఆయన లేదా ఆమె పౌరులకు, లబ్దిదారులకు ప్రభుత్వ పక్షాన ఒక కౌన్సిలర్ లాగా, ఒక గైడ్ లాగా, ఒక ఉపాధ్యాయుడిలాగా, ఒక పరిశోధకుడిలాగా, ఒక సలహాదారుడిలాగా, ఒక మధ్యవర్తిలాగా, ఒక అడ్వొకేట్ లాగా వ్యవహరిస్తారు. ప్రభుత్వానికీ, పౌరుడికీ మధ్య ఒక వారదిలాగా వుంటారు. ఒక్కోసారి ఏదైనా ఒక ప్రత్యేక వ్యక్తిగత అవసరం వుంటే తగు రీతిలో సలహా కూడా ఇవ్వడానికి వీలుంటుంది. ఒక మెంటార్లాగా, ఒక ఫెసిలిటేటర్ లాగా, వ్యక్తులకు సంబంధించిన ప్రతి వివరాల సంరక్షకుడి లాగా కూడా వ్యవహరిస్తారు. ప్రతి పౌరుడి వివరాల డేటా బాంక్ కూడా రూపొందించుకోవడానికి వీలవుతుంది.

గ్రామీణ ప్రాంతాలలో ప్రతి 2000  మందికి ఒకరు చొప్పున పదివేలమంది, పట్టణ-నగర ప్రాంతాలలో ప్రతి 3000 మందికి ఒకరు చొప్పున ఐదువేలమంది, మొత్తం (10,000+5,000) 15,000 మంది పౌరసంబంధ సలహాదార్లు కావాల్సి వుంటారు. వీరికి నెలకు సుమారు రు. 35,000 జీత భత్యాల కింద ఇస్తే మొత్తం నెలకయ్యే వ్యయం రు. 50 కోట్లు, సంవత్సరానికి అయ్యే వ్యయం కేవలం రు. 600 కోట్లు మాత్రమే. ఎందుకీ ఆలోచన చేయకూడదు? భావ సారూప్యత కల రాజకీయ, అధికారస్వామ్య పెద్దలు తమదైన శైలిలో నిర్వహించిన గోష్టిలో వెలువడ్డ అభిప్రాయం ఇదే!!! ఇది అవసరమనుకుంటే, ఆచరణ సాధ్యమైతే ఆలోచన చేస్తే మంచిదేమో!

No comments:

Post a Comment