పార్టీలూ ఫిరాయింపులూ!
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (26-03-2019)
రాజకీయ సమీకరణలో
భాగంగానో,
లేదా, రాజకీయ పునరేకీకరణలో
భాగంగానో ఇటీవల కాలంలో వివిధ రాజకీయ పార్టీలనుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, మాజీలు, తాజాలు
పలువురు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నారు. ఇలా పార్టీలు మారడాన్ని
కొంతమంది నీతిబాహ్యమైనదిగా భావిస్తే, అవసరాన్ని బట్టి ఇలా మారడం
సబబేననే వారు కూడా లేకపోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్
రావు రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న కృషి, ఆయన ప్రభుత్వపు సంక్షేమ పథకాల, అభివృద్ధి కార్యక్రమాల పట్ల
అకర్షితులై పలువురు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారన్నది ఆ పార్టీ నాయకులు చేస్తున్న వాదన. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిబద్దతతో కూడిన ప్రతిపక్షంగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరించడంలో
వైఫల్యం చెందడం కూడా ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధపడేందుకు
మరో కారణం కావచ్చు. అలాగే, టీఆర్ఎస్‌లో ఉన్నవాళ్ళు ఏదో కారణంగా ప్రతిపక్ష
పార్టీలో చేరేందుకు ఆస్తకి చూపితే ఆ పార్టీలు బేషరతుగా చేర్చుకోవడం కూడా అందరికీ తెలిసిన విషయమే. అంటే చట్ట సభలో ఒక
పార్టీ నుంచి మరో పార్టీలో చేరడం సర్వ
సాధారణం అయిన తరుణంలో ఎదురయ్యే విమర్శలను పెద్దగా పరిగణించనవసరం లేదేమో!!
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలకు
క్రమశిక్షణ అత్యంత అవశ్యం. అది లోపించన నాడు ప్రభుత్వాలు పడిపోనూవచ్చు, ప్రతిపక్షాలు విల-విల్లాడ వచ్చు కూడా. ఫలానా రాజకీయ
పార్టీ క్రమశిక్షణ కోల్పోయిందనడానికి అసలు-సిసలైన ఉదాహరణ ఫిరాయింపులే. ఈ రకమైన
క్రమశిక్షణ ఉల్లంఘన ఏ ఒక్క రాజకీయ పార్టీకో పరిమితమైంది కానేకాదు. దాదాపు అన్ని
రాజకీయ పార్టీలకు ఈ దెబ్బ తగలడమో, భవిష్యత్ లో తగలబోవడమో తధ్యం. భారతదేశంలో ఇదొక
సహజమైన రాజకీయ క్రీడ. ఈ క్రీడ ఒక్కోసారి తీపిని పంచుతే, మరో సారి చెడు అనుభవాన్ని
మిగులుస్తుంది. సాధారణ ఎన్నికల ప్రకటన పూర్వరంగంలో, ఆ తరువాత గత కొద్దికాలంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు స్థంబాల ఆటలాగా చోటుచేసుకుంటున్న
రాజకీయ పార్టీ ఫిరాయింపుల పరిణామాలను గమనిస్తుంటే, కొంత జుగుస్పాకరంగా ఉన్నప్పటికీ, అదేదో సర్వసాధారణ విషయంలాగా కనిపిస్తున్నది. అక్కడి
కారణం ఒకటైతే, తెలంగాణాలో చెప్తున్న కారణాలు మరో రకం. ఫలితం మాత్రం
ఒకటే.
పార్టీ
ఫిరాయింపుల నేపధ్యాన్ని పార్లమెంటరీ
ప్రజాస్వామ్యానికి మాతృక అని పిలవబడే బ్రిటీష్ హౌజ్ ఆఫ్ కామన్స్ లో వెతుక్కోవచ్చు.
ఆ దేశంలో, ఒక పార్టీ గుర్తుమీద ఎన్నికై మరో పార్టీకి మారిన
వారిని “అవిదేయులు” గా సంబోధిస్తారు. అక్కడ ప్రభుత్వ పక్షం నుండి ప్రతిపక్షానికి, లేదా, ప్రతిపక్షం నుండి ప్రభుత్వ పక్షానికీ మారడం అరుదుగా
జరిగినప్పటికీ, అడప-దడపా జరుగుతూనే వుంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లో కూడా ఇది సహజంగా జరిగే విషయమే.
ఇక భారతదేశం విషయానికొస్తే ఎంత పకడ్బందీ ఫిరాయింపుల వ్యతిరేక, నిరోధక చట్టాలు వచ్చినా,
రకరకాల కారణాల వల్ల ఒక పార్టీ నుండి మరొక పార్టీకి నిరాటంకంగా మారడం దాదాపు అన్ని
పార్టీల ప్రతినిధులకు సహజమైన అలవాటుగా మారిపోయింది. దీన్నిప్పుడు ఎవరూ పెద్ద తప్పుగా
పరిగణించడం లేదు కూడా. కాకపోతే తమ పార్టీలోకి వేరే పార్టీ నుండి వలసలు వచ్చినప్పుడు
సంతోషించి చప్పట్లు కొట్టే రాజకీయ నాయకులు, అదే తమ పార్టీ నుండి వేరే పార్టీలోకి మారితే
తీవ్రంగా విమర్శిస్తుంటారు. తమకో నీతి, ఇతరులకో నీతి అనేది వారి వాదనగా కనిపిస్తుంది.
పార్టీ మారిన ఎన్నికైన ప్రజాప్రతినిధుల సభ్యత్వం రద్దు చేయాలా? వద్దా? అనే విషయంలో కూడా భిన్నాభిప్రాయాలున్నాయి.
పార్టీ
ఫిరాయింపుల నిరోధ చట్టం భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1960 దశకంలో ఆలోచనలోకి
వచింది. 1967 లో సాధారణ ఎన్నికలు జరిగిన 16 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి
ఎనిమిది రాష్ట్రాలలో మెజారిటీ రాలేదు. ఏడు రాష్ట్రాలలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది.
ఫలితంగా సంకీర్ణ ప్రభుత్వాల యుగం ప్రారంభమై, కనీస ఉమ్మడి కార్యక్రమం అన్న మాట ఆచరణలోకి వచ్చింది.
దీనికి అదనంగా పెద్ద ఎత్తున రాజకీయ వలసలు మొదలయ్యాయి. 1967-71 మధ్య నాలుగేళ్ల
కాలంలో పెద్ద ఎత్తున, పార్లమెంటులో 142 ఫిరాయింపులు, యావత్ దేశంలోని శాసనసభల్లో 1969 ఫిరాయింపులు చోటు
చేసుకున్నాయి. 32 ప్రభుత్వాలు కూలిపోగా పార్టీ ఫిరాయించిన 212 మందికి మంత్రి
పదవులు లభించాయి.
హర్యానా
రాష్ట్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫిరాయింపుల కారణాన పడిపోయింది. భగవత్ దయాళ్
నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, శాసనసభలో జరిగిన సభాపతి ఎన్నిక సందర్భంగా, అధికారిక అభ్యర్థి ఓటమి పాలవడంతో సభ విశ్వాసాన్ని
కోల్పోయి రాజీనామా చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ అసమ్మతి వాదులు పార్టీ ఫిరాయించి, హర్యానా కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ పెట్టి, ప్రతిపక్షంతో చేతులు కలిపి, కాంగ్రెస్ నుంచి పార్టీ ఫిరాయించిన రావు బీరేందర్
సింగ్ ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఒక పార్టీ
ఫిరాయింపుదారుడికి ముఖ్యమంత్రి పదవిని దక్కబెట్టిన మొదటి రాష్ట్రంగా హర్యానా
చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఆ రాష్ట్రానికే చెందిన గయాలాల్ అనే శాసనసభ సభ్యుడు
పక్షం రోజుల్లో మూడు సార్లు పార్టీ మారిన ఘనుడయ్యాడు. అప్పటి నుండే “ఆయారాం”,
“గయారాం” అనే పదాలు వాడుకలోకి వచ్చాయి. ఇలాంటి నేపధ్యంలోనే 1985 సంవత్సరంలో పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం వచ్చింది.
భారతదేశంలో
ఫిరాయింపు వ్యతిరేక చట్టంలోని అంశాలను ఏ విధంగా వ్యాఖ్యానించినా, స్పష్టమైన
సంప్రదాయాలు లోపించిన మాట వాస్తవం. అందువల్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్యం చట్టబద్ధమైన
సూత్రాల ప్రకారం కాలానుగుణంగా వస్తున్న ఆచార వ్యవహారాలపైనే ఎక్కువ అధారపడి
సాగుతుంది. ఆయారాం గయారాంల వల్ల, రాజకీయ ఫిరాయింపుల వల్ల
ఎదురవుతున్న దుష్పరిణామాలకు చెక్ పెట్టేందుకు రాజీవ్ గాంధీ హయాంలో 1985లో రాజ్యాంగం 52వ అధికరణాన్ని సవరించడం
ద్వారా ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని
రాజ్యాంగం 10వ షెడ్యూల కింద చేర్చారు. నిజానికి మన
దేశంలో 1973లో, 1985లోనూ,
2003లోనూ వేర్పేరుగా ఫిరాయింపు వ్యతిరేక చట్టాలని చేశారు.
ప్రభుత్వాలకు
ఈ చట్టం ద్వారా కొంత స్థిరత్వం కలిగే వీలున్నప్పటికీ, పార్లమెంటుకు ప్రభుత్వ జవాబుదారీతనంలో కొంత లోటు
జరిగే అవకాశం వుంది. ఎన్నికైన సభ్యులకు తమ-తమ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా
అసంతృప్తిని వెలిబుచ్చే అవకాశాలు కూడా వుండవు. కొందరు నిపుణులు సూచించినట్లు,
పార్టీ ఫిరాయింపుల నిరోధం కేవలం అవిశ్వాస తీర్మానానికో, లేదా, ద్రవ్య బిల్లుల విషయానికో పరిమితం చేసినట్లయితే
బాగుండేది. ఇతర విషయాల్లో సభ్యుల మనోభీష్టానికి అనుగుణంగా నడుచుకునే వెసలుబాటు
కలిగిస్తే మంచిది.
ఈ
నేపధ్యంలో చర్చించాల్సింది, అసలు, పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం అవసరం వుందా? పార్టీ ఫిరాయింపులు కేవలం భారత దేశానికే పరిమితమా? ఇతర దేశాలు ఫిరాయింపుల వ్యవహారాన్ని ఎలా
ఎదుర్కుంటున్నది? ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అభివృద్ధి చెందిన పలు ప్రజాస్వామ్య దేశాల్లో కూడా
ఈ సమస్య ఉన్నప్పటికీ, ఆ దేశాలు ఏవీ కూడా తమ చట్టసభల సభ్యులను నియంత్రించడానికి ఫిరాయింపుల వ్యతిరేక
చట్టాలను తేలేదు. బ్రిటన్ రాజకీయాల్లో, 1931 లో మొట్టమొదటిసారి లేబర్ పార్టీ
పక్షాన ప్రధాన మంత్రి అయిన రామ్సే మెక్డొనాల్డ్ పార్టీ ఫిరాయింపు వ్యవహారం
జగద్విదితం. దేశంలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం నేపధ్యంలో తన పార్టీ విధానాలతో
విభేదించిన మెక్డొనాల్డ్ పార్టీని వదిలాడు. అయితే మెక్డొనాల్డ్ కాని, ఆయనతో కలిసి పార్టీ ఫిరాయించిన మరో ముగ్గురు
మంత్రిమండలి సభ్యులు కానీ, బ్రిటీష్ పార్లమెంట్ (హౌజ్ ఆఫ్ కామన్స్) సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. చేయాల్సిన
అవసరమూ కలగలేదు. మళ్లీ ఎన్నికల జోలికి కూడా పోలేదు. ఆస్ట్రేలియా పార్లమెంటులో కూడా
పార్టీ ఫిరాయింపులు సహజమే. చట్ట సభ సభ్యులు తరచూ పార్టీలు మారడం, ప్రభుత్వాలు కూలిపోవడం, కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు కావడం చాలా సార్లు
జరిగిందక్కడ. అమెరికాలో తమ పార్టీకి వ్యతిరేకంగా ప్రతినిధుల సభ సభ్యులు ఓటేయడం, అది కూడా ప్రాముఖ్యత సంతరించుకున్న విషయాల్లో ఓటేయడం
తరచూ జరిగే వ్యవహారమే. కాకపోతే వీరెవరూ అధికారికంగా పార్టీనుండి ఫిరాయించరు.
భారత రాజ్యాంగ నిర్మాణ స్వరూపం చాలా వరకు, వెస్ట్ మినిస్టర్ నమూనా పార్లమెంటరీ పద్దతితోనే రూపు దిద్దుకుంది.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనుసరించే భారత, ఇంగ్లాండ్
దేశాలకు, దాదాపు ఒకే రకమైన సంప్రదాయాలు, ప్రక్రియలున్నాయి. వెస్ట్ మినిస్టర్ నమూనా పార్లమెంటరీ విధానంలో
ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్చుకునే విధానం అంతర్లీనంగా వుంటుందనాలి. అలాంటివి
ప్రజాస్వామ్యం బలపడ్డానికి దోహదపడతాయి. ఇంగ్లీష్ పార్లమెంటుకు ఒక సారి ఎన్నికైన
వ్యక్తికి, పదవీ కాలం పూర్తవకుండా-లేదా మళ్లీ ఎన్నిక
లొచ్చే వరకైనా, పదవి వదులుకునే అవకాశం లేనే లేదు.
పదిహేడవ శతాబ్దంలో, రాచరిక వ్యవస్థ నేపధ్యంలో, బ్రిటీష్ పార్లమెంటుకు ఎన్నిక కావడం, సభ్యులుగా
వుండడం అరుదైన గౌరవంగా, ప్రజలకు సేవ చేసే గొప్ప
అవకాశంగా భావించినందున ఎవరు పదవి వదులుకునేందుకు ఇష్టపడేవారు కాదు.
ఇంతకు ముందే చెప్పుకున్నట్లు ఫిరాయింపుల పర్వం, భారతదేశానికి సంబంధించినంతవరకు
1967 లో జరిగిన నాల్గవ సాధారణ ఎన్నికల అనంతరం మొదలైంది. ఇక ఆ తరువాత నిరాటంకంగా
కొనసాగింది. అంతకు ముందు అసలే లేవా అంటే,
అడపా-దడపా వున్నాయనే అనాలి. డాక్టర్ రఘు వీరా, అశోక్ మెహతా, టంగుటూరి ప్రకాశం పంతులు లాంటివారు పార్టీలు మారి పదవుల్లో కొనసాగారు.
కాకపొతే ఆ సందర్భాలు చాల తక్కువే అనాలి. 1967 ఎన్నికల తరువాత ఎప్పుడైతే కాంగ్రెస్
చాలా రాష్ట్రాలలో ఓటమి పాలై, ప్రతిపక్షాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసే స్థాయికి చేరుకున్నాయో, ఇక అప్పటి నుండి ఫిరాయింపులకు ప్రోత్సాహం మొదలైంది. ఫిరాయింపుల కారణాన
చాలా రాష్ట్రాలలో ప్రభుత్వాలు స్థిరంగా కొనసాగడమో, లేదా, పేకమేడల్లా కూలిపోవడమో తరచూ చోటుచేసుకుంది.
ఇలాంటి ఉదాహరణలు చెప్పుకోవాలంటే చాలా వున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ చరణ్ సింగ్, టీఎన్ సింగ్ ప్రభుత్వాలు; మధ్య ప్రదేశ్
జీఎన్ సింగ్ ప్రభుత్వం; హర్యానా రావు బీరేందర్ సింగ్
ప్రభుత్వం; పంజాబ్ గుర్నాం సింగ్,
ప్రకాశ్ సింగ్ బాదల్, లచ్మన్ సింగ్ గిల్ ప్రభుత్వాలు; బీహార్ ఎంపీ సిన్హా, బీపీ మండల్, దరోగా రాయ్, కర్పూరీ ఠాకూర్ ప్రభుత్వాలు; కేరళ నంబూద్రీపాద్ ప్రభుత్వం అలా మార్పులు జరిగిన వాటిలో కొన్ని. ఒక
విధంగా చెప్పుకోవాలంటే ఇలా జరిగిన ప్రభుత్వాల మార్పిడి అధికారస్వామ్యం మీద ప్రభావం
చూపడమే కాకుండా దాన్ని శక్తివంతంగా మార్చింది. రాజకీయ అస్థిరత్వానికి కూడా
దారితీసింది. ఈ తతంగం 1971 సాధారణ ఎన్నికల వరకూ
కొనసాగింది. ఆ తరువాత ఇందిరా గాంధీ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజారిటీతో
అటు కేంద్రంలోనూ, ఇటు చాలా రాష్ట్రాలలోనూ గెలవడంతో స్థిరమైన
ప్రభుత్వాల ఏర్పాటుకు దారితీయడమే కాకుండా చాలా మంది కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు
చూపడం కూడా జరిగింది. అయినప్పటికీ ఫిరాయింపుల పర్వం కొనసాగుతూనే వుంది ఏదో ఒక
రూపంలో. ఫలితంగా వచ్చిందే ఫిరాయింపుల నిరోధక చట్టం. అదెంత సత్ఫలితాలను ఇచ్చిందో
చెప్పనక్కర లేదు.
ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి, లేదా, పలువురు వ్యక్తులు పార్టీ మారక పోతే ఎప్పటికీ ఒకే ప్రభుత్వం అధికారంలో
వుంటుంది కదా! ప్రతి ఐదేళ్లకోక సారి ప్రభుత్వాలు మారుతున్నాయంటే ఒక పార్టీ నుండి
ప్రజలు (ఓటర్లు) మరో పార్టీకి మారుతున్నట్లే కదా!! అలాగే ఎన్నికైన ప్రజా
ప్రతినిధులు కానీ, ఎన్నిక కావాలనుకున్న ఆశావహులు కానీ,
అవకాశాల కొరకు పార్టీ మారితే తప్పేంటి అని కొందరి వాదన. భావ ప్రకటనా స్వేచ్చ
రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కు కనుక, గెలిచిన పార్టీ
నుండి ఆ పార్టీపైన అసంతృప్తి వెల్లడించడానికి మరొక పార్టీలోకి మారితే ఆక్షేపణ
ఎందుకని కూడా వారంటున్నారు. ఏదేమైనా ఈ మొత్తం వ్యవహారంలో చక్కటి సంప్రదాయాలు
నెలకొనాలికాని, చట్టాలు ఏమీ చేయలేవనేది వందశాతం నిజం.