తెలంగాణ సమగ్ర ఆర్ధిక, అభివృద్ధి ప్రస్తానం -3
జ్వాలాంతరంగం
సూర్యదినపత్రిక (22-03-2019)
కౌలు రైతులకు రైతు భీమా ఎందుకు వర్తింప చేయరని ప్రతిపక్ష
నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు చాలా సార్లు ప్రశ్నిస్తుంటారు. ఈ
నేపధ్యంలో కౌలు రైతుల గురించి వివరంగా చెప్పాలి. అసలు కౌలు రైతులేవరు? ఉదాహరణకు ఒక రైతు ఉన్నాడనుకుందాం. ఈ సంవత్సరం ఆయనకు ఆరోగ్యం, మిగతా అన్ని విషయాలు
అనుకూలంగా వుంటే అతడే స్వయంగా వ్యవసాయం చేసుకుంటాడు. వచ్చే సంవత్సరం ఆయనకు చేతకాక పోతే
ఒక వ్యక్తికి కౌలుకిస్తాడు. ఆ మరుసటి ఏడాది ఇంకొకరికి, మూడో సంవత్సరం మరొకరికి ఇవ్వచ్చు. ప్రతిఏడు ఒక్కరికే ఇవ్వాలని లేదు కదా? ప్రభుత్వానికి ఆ రైతు
ఏ సంవత్సరం ఎవరికీ కౌలుకు ఇస్తున్నాడని చూడడమే పనా? అతడు ఈ
సంవత్సరం తన భూమి ఎవరికి కౌలుకి ఇచ్చాడు, ఆ తర్వాతి సంవత్సరం ఎవరికిచ్చాడో రాసుకుంటూ కూర్చోవాలా? గవర్నమెంటుకి పనేమీ లేదా?
కరెక్టుగా ఆలోచిస్తే అర్థమవుతుంది. రైతులను ఎన్నోరకాలైన ఇబ్బందులకు గురిచేయడం
జరిగింది. పాసుబుక్ లో పట్టాదారు పేరు అనీ, అనుభవదారుడి పేరు అనీ
వుండడంతో ఆ నెపంతో ఒక్కోసారి ఉల్టా రాసి, వాడిమీద ఇంకొకడు వెళ్లి కేసు పెట్టడం జరిగేది. అసల్దారు కోర్టుల చుట్టూ తిరగాలి. ఇదేమి
పద్ధతి ? అనుభవదారుడి పేరు
రికార్డుల్లో రాయాల్సి వస్తే బంజరాహిల్స్, జూబ్లీ హిల్స్ లో ఉండే
బంగళాలు కిరాయికి తీసుకుంటే, అనుభవదారుని పేరు రాస్తారా? ఎందుకు రాయరు ? గవర్నమెంటుకి రెండు
పాలసీలు ఉండకూడదు కదా? హైదరాబాదులో కిరాయికి
ఇచ్చే ఇళ్లకి సంబంధించి అనుభవదారుని పేర్లు రాస్తున్నారా? రైతుల విషయంలోనే అలా జరగాలా? వాళ్లను పీడించవచ్చు, ఇష్టమొచ్చినట్లు ఉల్టా పల్టా చేయవచ్చు, వేలకు వేలు లంచాలు
తీసుకోవచ్చు, ఇదా పద్ధతి ? కాబట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఒక పాలసీ తీసుకుంది. ఎన్నికల ముందు
కూడా సీఎం కేసీఆర్ ఈ విషయంలో కుండబద్దలు గొట్టనట్లు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో
రైతు పక్షపాతిగా ఉంటాం అని ఆయన అన్నారు. రైతు మీద ఇంకొకడు సవారీ చేస్తామంటే
ఒప్పుకోం అని స్పష్టం చేసారు సీఎం.
రైతులు ఎంత కష్టపడి తమ భూములను కాపాడుకుంటారో సీఎంకు తెలుసు. ఆయనా రైతే. ఆయనకు
కూడా వ్యవసాయం వంశపారంపర్యంగా ఉంది. అవసరమైతే రైతులు రెండుపూటలు ఉపవాసం ఉంటారు
కానీ భూమి అమ్మరు. అంత కష్టపడి కాపాడుతారు. కాని జరుగుతున్నదేంటి? రైతుకి పదిమంది
భర్తలు. ఎంత భయంకరమైన టార్చర్, ఎన్ని రకాలైన బాధలు
రైతుకి. అందుకోసమే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రైతు పట్టాదారు పాసు
పుస్తకాలలో మూడు కాలమ్స్ మాత్రమే వున్నాయి. ఇంతకు ముందు 36 కాలమ్స్ ఉంటే, అందులో 33 కాలమ్స్ ఎత్తిపారేసింది ప్రభుత్వం. సాంప్రదాయ రెవెన్యూ ఆలోచన సరళి ఉన్నవారంతా
ఇది చాలా ప్రమాదకరం అని అన్నారు. మొత్తం మార్చేస్తున్నారని
అన్నారు. ఏమీ భూకంపం రాదు, ఎవ్వడూ చచ్చిపోడని చెప్పారు
ముఖ్యమంత్రి. ఇదంతా జరిగి ఏడాది అయింది, ఎవ్వడూ చచ్చిపోలేదు.
అందరూ సుభిక్షంగానే ఉన్నారు. రైతులు మాత్రం సంతోషంగా ఉన్నారు. ఆ కాలమ్స్ పోయాయి, అనుభవదారులు లేరు. పాట్టాదారులు మాత్రమే వున్నారు. కౌలుదారుకు ఏమన్నా
ఇవ్వాలంటే, అది రైతుకు, కౌలుదారుకు మధ్య జరిగే
ఒప్పందమే కాని ప్రభుత్వానికి నేరుగా సంబంధం లేదు.
ఈ ప్రభుత్వం రైతులను గురించి మాత్రమే పట్టించుకుంటుంది. రైతులకు
కౌలుదార్ల పట్ల మెర్సిఫుల్ గా ఉండండి అనీ, వాళ్లకు ఏమైనా సహాయం
చేయండి అనీ ముఖ్యమంత్రి శాసనసభలో అప్పీలు కూడా చేశారు. ప్రభుత్వం రైతుకు ఇస్తోంది
కాబట్టి, రైతు భూమి ఇతరులు సాగు
చేస్తున్నారు కాబట్టి, వాళ్లకు రైతు కూడా పెట్టుబడి సహాయం చేయండని సిన్సియర్ గా
అప్పీల్ చేస్తున్నాను అన్నారు. రైతులను మాత్రం గందరగోళంలో దింపి, అనుభవదారుల పేరు రాసి, రైతుల హక్కులకు వాళ్ల
భూములకు ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగనీయదీ ప్రభుత్వం. రైతుకు నిశ్చయాత్మక టైటిల్
వుండాలి. యాజ్మనాయ హక్కుండాలి. అంతా ఇష్టమొచ్చిన పద్ధతిలో ఉంది. కాబట్టి ఇష్టమొచ్చిన
పద్ధతిలో ఇతరులు ఆక్రమణలు చేస్తున్నారు. బలమైన వ్యక్తి బలహీనుడైన వాడి ఇంటికి
వెళ్లి, ఈ ఇల్లు నాది అని అతన్ని
బయటకి వెళ్లగొట్టే పరిస్థితి వస్తే చేసేదేమీ లేదు. నిశ్చయాత్మక టైటిల్ లేదు
కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. నిశ్చయాత్మక టైటిల్ పెడితే ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది.
అన్నీ అనుకూలించి ఆ నిశ్చయాత్మక టైటిల్ తెస్తే ప్రజలకు అద్భుతమైన రక్షణ
వస్తుంది. వ్యవసాయ భూమిగానీ, స్వంత గృహం గానీ, ఏవైనా ప్రాపర్టీస్ అన్నీ కూడా చాలా రక్షణగా ఉంటాయి. ఆ దిశగా, భూ రికార్డుల
ప్రక్షాళనలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఆరేడు మాసాల్లో
సమగ్రంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. కొన్ని భూములు పార్ట్–బిలో
ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఎవ్వరూ పట్టించుకోలేదు. దాదాపు పది లక్షల ఎకరాల భూమిపై
అటవీశాఖకు – రెవెన్యూశాఖకు వివాదం వుంది. ఆ రెండుశాఖలూ ప్రభుత్వానికి సంబంధించినవే.
ఇది మాదని ఈయన అంటాడు, ఇది మాదని ఆయన అంటాడు.
ఎన్నో ప్రాజెక్టులకు, ఎన్నో జాతీయ రహదారులకు, ఎన్నో రైల్వే లైన్లకు, ఎన్నో ప్రభుత్వ భవనాలకు
కొందరు వారి భూమిని డొనేషన్ ఇచ్చారు. ప్రభుత్వం అక్వైర్ చేసింది. ఒక్కటంటే
ఒక్కదానిమీద కూడా టైటిల్ మార్చలేదు. కానీ, ఇప్పుడు ప్రభుత్వం
మార్పిస్తున్నది. సబ్ స్టేషన్లు నిర్మించినా, ఒక్కదానిమీద కూడా
విద్యుత్ శాఖకు అధికారం లేదు. ఎవరైతే ఓనర్ డొనేషన్ ఇచ్చారో అతని పేరుమీదనే ఉంది.
భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా పవర్ స్టేషన్ ఉంటే, దానికి విద్యుత్ శాఖకు సంబంధించినదని, ప్రైమరీ హెల్త్ సెంటర్స్
ఉంటే దానిపై వైద్యశాఖకు చెందినదని రాశారు. ఇంత చిక్కిరిబిక్కిరిగా, ఇంత గందరగోళ పరిస్థితుల్లో భూముల యొక్క రికార్డులు ఉన్నాయి. సాగునీటి
ప్రాజెక్టు కింద తీసుకున్న భూములు కూడా సాగునీటి ప్రాజెక్టుల పేరు కింద లేవు.
భూములు స్వాధీనం చేసుకొని, భూములు తవ్వుకుంటూ
కాలువలు తవ్వారు. ప్రాజెక్టులు కట్టారు. కానీ భూమిని సాగునీటి ప్రాజెక్టు కిందకు
బదిలీ చేయలేదు. ఇలా లక్షల ఎకరాల్ని కూడా గుర్తించి వాటిని సంబంధిత శాఖల పేరుమీద
బదిలీ చేయించింది ప్రభుత్వం. చాలా వరకు అయినాయి. ఇంకా అవుతున్నాయి. మరికొద్ది
రోజుల్లో అవి కూడా పూర్తవుతాయి. ఒకసారి పూర్తవుతే శాఖలవారీగా ఒక్కొక్క శాఖ ఎంతెంత
భూమి కలిగి ఉందనే ఒక ఇన్వెంటరీ ఉంటుంది. ఒక లెక్క ఉంటుంది. కానీ గతంలో అంతా
అరాచకంగా ఉన్నది. సమైక్య పాలనలో జరిగిన జీవన విధ్వంసం అని ఊరికే బాధ్యతారహితంగా
అనరు సీఎం. వీటన్నింటినీ ప్రక్షాళన చేసే ప్రయత్నం జరుగుతున్నది.
పాస్ పుస్తకాల విషయంలో సభాముఖంగా రైతాంగానికి హామీ ఇచ్చారు
ముఖ్యమంత్రి. ఒక పార్ట్ ముందు ముగుస్తుంది. రెండవ పార్ట్ కి కొంత సమయం పడుతుంది.
ఒక పార్ట్ ఏమంటే, వ్యవసాయానికి సంబంధించిన
భూములు. దానిని పర్ ఫెక్ట్ గా చేయవచ్చు. చాలా వరకు అయింది. పోడు భూములు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇంకా కొంత మాత్రమే ఉంది. అలాగే, ఆర్ఓఎఫ్ఆర్ పట్టా
ఉన్న ప్రతి వాళ్లకు రైతుబంధు, రైతు బీమా కల్పించింది
ప్రభుత్వం. కాంగ్రెస్ వాళ్లు అధికారంలో ఉన్నపుడు ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలిచ్చిన
వారికి కూడా ఇచ్చింది ప్రభుత్వం. ఎవరైతే భూములుండి పట్టాలు దొరకలేదో అటువంటివి
లక్ష పైచిలుకు ఉన్నాయి. అలాగే కొత్తగా దరఖాస్తులు పెట్టుకున్నవారు కొంతమంది
ఉన్నారు. కాబట్టి ఏదో ఒక దశలో పోడు భూముల వ్యవహారం పూర్తి కావాలి. అక్కడి నుంచి ఇక
ఆపేయాలి. వున్న హ్యాబిటేషన్స్ ను, వారి వ్యవసాయభూమిని
గుర్తిస్తుంది ప్రభుత్వం. వారికి ఏదో రూపంలో ఒక సర్టిఫికెట్ ఇచ్చి అక్కడికి క్లోజ్
చేద్దామని చెప్పారు సీఎం. అతి తక్కువ కాలంలో అది జరగబోతున్నది. దాని గురించి ఎవరూ
ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
భూ రికార్డుల ప్రక్షాళన – దేశం మొత్తం ఇక్కడి నుండి
నేర్చుకొని పోయే విధంగా చేయాలని సంకల్పించిందే ధరణి వెబ్ సైట్. అది కొన్ని మాసాల
కాలంలోనే వస్తుంది. భూమి పొద్దున రిజిస్ట్రేషన్ అయితే ఆ రిజిస్ట్రేషన్ తాలూకు
వివరాలు గంట లోపలే సైట్ లో అప్ డేట్ అవుతుంది. ప్రతి గంటకు ఆర్ఓఆర్, ప్రతి గంటకు జమాబందీ ఉంటుంది. ఒక నిమిషం కూడా ఏదీ పెండింగ్ ఉండదు. కొన్నిచోట్ల
కొంతమందికి ఆదాయం పోతుందనే దుర్మార్గమైన ఆలోచన ఉంది. దుర్మార్గమైన ఆలోచనలు
జరుగుతున్నాయి. మనందరం సిగ్గుపడేటువంటి
సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో అవేర్
నెస్ వచ్చింది. కాబట్టి ఆ పీడ ప్రజలకు పోవాలి. ఆ పీడ పోవాలంటే ధరణి వెబ్ సైట్
రావాలి. గంట గంటకూ రికార్డు అప్ డేట్ కావాలి. అమెరికా గానీ, ప్రపంచంలో ఎక్కడున్న వారైనా ఏ భూమి ఎవరి పేరుమీద ఉన్నదో బటన్ కొడితే చూసే
పరిస్థితి వస్తుంది. సీఎం స్వయంగా కలిగించుకుని దానిని తయారు చేశారు. ఇంతకు ముందు
బ్యాంకర్స్ పాస్ పుస్తకాలు, పహణీ నకల్స్ తీసుకొని
రుణాలిస్తుండేవారు. కానీ ఇప్పుడు వారు వెబ్ సైట్ లో చూసే పంట రుణాలివ్వాలని స్పష్టం
చేసింది ప్రభుత్వం. ఎన్కంబరెన్స్ తో సహా వివరాలుంటాయి. పంట రుణాలు తీసుకున్న
వివరాలుంటాయి. షార్ట్ టర్మ్ లోన్లు తీసుకున్నా వివరాలుంటాయి. భూమి మార్టిగేజ్
చేసినా కూడా వివరాలుంటాయి. కాబట్టి వెబ్ సైట్ ఆధారంగానే రైతులకు రుణాలివ్వాలి.
రుణాలిచ్చినట్లుగా అగ్రిమెంట్ పత్రం రాయించుకోవచ్చు. పాస్ పుస్తకం, పహానీ నకలు అడగడం జరగదు.
కుల
ధృవీకరణ పత్రాన్ని కూడా ప్రతిసారీ ఎందుకు తీసుకోవాలి. కులం మారుతుందా? పుట్టిన నుండి చచ్చేదాకా అదే ఉంటుంది. మారితే మతం మారుతుంది. కానీ, కులం మారదు కదా. కుల దృవీకరణ పత్రం కావాలని అడగగానే పైసే దేవో, పైసే లావో అనడం బాధాకరం. మనిషి పుట్టిన నాడే కుల దృవీకరణ పత్రం ఇవ్వాలని
మున్సిపాలిటీలకు, పంచాయతీలకు ఖచ్చితంగా
నిబంధన పెట్టబోతున్నది ప్రభుత్వం. అదే కుల దృవీకరణ పత్రం ఆయన చనిపోయేవరకు ఉండాలి.
మార్చడానికి లేదు. మాటి మాటికీ కార్యాలయానికి వెళ్లు, ఆడికి పో, ఈడికి పో అనే బాధలు
తప్పాలి. ఆదాయ పత్రం కూడా వట్టిగా ఇవ్వరు. దానికో యాతన. దానిమీద కూడా చర్చ
జరుగుతోంది. ఈ సర్టిఫికెట్స్ విషయంలో ఈ టర్మ్ లో మొత్తానికి మొత్తం ఖచ్చితంగా
రిఫామ్స్ తీసుకొస్తుంది ప్రభుత్వం.
(ఇంకా వుంది...వచ్చే వారం)
--సీఎం కేసీఆర్ శాసనసభలో బడ్జెట్ సమావేశాల చర్చల ప్రసంగం ఆధారంగా
No comments:
Post a Comment