యతివేషంలోని రావణుడిని సత్కరించి తన వృత్తాంతం
చెప్పిన సీతాదేవి
శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-54
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (31-03-2019)
బిక్షాపాత్ర, కమండలాలు
ధరించి, బ్రాహ్మణ
సన్న్యాసి వేషంలో వున్న రాక్షసుడిని, తనకు కీడుచేసే
ఆలోచనలో వున్నవాడిని, విరోధించినా తాను గెలవలేనివాడిని, రాక్షసుడని
తెలిసీ,
బ్రాహ్మణుడిని పూజించిన విధంగానే ఆయననూ పూజించింది సీతాదేవి. “ఇదిగో
దర్భాసనం..ఇక్కడ కూర్చో. ఇదిగో అర్ఘ్యం...ఇదిగో బాద్యం...సర్వం సిద్ధం. ఇదిగో నీ
ఆహరం కొరకు అడవిలోని పండ్లు....తృప్తిగా భుజించు” అని శాస్త్ర ప్రకారం చెప్తున్న
సీతను, రాముడి
భార్యను, భూపుత్రిని, తన చావుకోరకు
రావణుడు బలాత్కారంగా అపహరించాలనుకున్నాడు. అడవిలో మాయా మృగాన్ని వేటాడడానికి పోయిన
రామచంద్రుడు లక్ష్మణుడితో కలిసి వస్తాడేమోనని అడవివైపు నాలుగు దిక్కులా చూశాడు
కాని వాళ్ళు కనపడలేదు. యథాప్రకారం అడవి చెట్లు మాత్రం కనబడ్డాయి. అది చూసి సీత
మనస్సు భయంతో కలవరపడింది.
(సీతారామలక్ష్మణులు
వున్న పర్ణశాలకు ఉత్తరాన పర్వతాలు, తూర్పున గోదావరి నది వుంది. దక్షిణాన, పడమర అడవి
వుంది. మారీచుడు రామచంద్రమూర్తిని పడమటగానే తీసుకుపోయాడు. రావణాసురుడు పోవాల్సింది
దక్షిణ మార్గాన కాబట్టి ఆ తోవలో రామచంద్రమూర్తి వుండకూడదు కదా?)
తనను
బలాత్కారంగా తీసుకుపోదలచి రావణుడు ఆ విధంగానే ప్రశ్నించాడని సీత భావించింది. అయినా, అతిథులను, అభ్యాగతులను
ఆడరించాల్సిన విధానం చక్కగా తెలిసిన సీత, ఇంగిత జ్ఞానం వున్నది
కాబట్టి, రావణుడి
మాటలు, వాడి ఆర్భాటం
విని-చూసి, వీడు నిజమైన
సన్న్యాసి కాదనుకుంటుంది. ఉదర నిమిత్తం సన్న్యాసి వేషం ధరించిన బ్రాహ్మణుడు
అనుకుని, అతిథితో
అబద్ధం ఆడకూడదని, బ్రాహ్మణుడితో అసత్యం ఆడరాదని, అతిథి
బ్రాహ్మణుడైతే అసలే అసత్యం ఆడకూడదని అనుకుంటుంది. వీడు దొంగ సన్న్యాసి కాబట్టి
వంచకులకు వంచనతో సమాధానం చెప్పాలి అనీ, అలా చెప్పడం దోషం
కాదనీ, అల్ప కాలం
ఆలోచన చేసి వాడికిలా చెప్పడం ప్రారంభించింది.
“మిథిలా
రాజు, మహాత్ముడు, జనకరాజు
కూతుర్ని. నా పేరు సీత అంటారు. నీకు మేలు కలగాలి. నేను శ్రీరాముడి భార్యను సుమా!
సర్వ విధాల భోగోపకరణాలు కలదాన్ని. మనుష్య సుఖాలతో పన్నెండు సంవత్సరాలు మామగారి
ఇంట్లో నా భర్తతో కూడి, ఎలాంటి కొరతలేకుండా గడిపాను. ఆ తరువాత మా
మామగారు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని పదమూడో సంవత్సరంలో ఆలోచన చేశాడు. దానికి
కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడు. అప్పుడాయన ప్రియమైన భార్య కైక, నా భర్త
దేశాన్ని వదిలి పోవాలని, తన కొడుకు రాజ్యానికి పట్టాభిషిక్తుడు కావాలని, రెండు వరాలు
తన భర్తను కోరింది. తన మాట అంగీకరించకపోతే ప్రాణాలు విడుస్తానని బెదిరించింది. నా
మామగారు ఆమెను ఎంత ప్రార్థించినా ఆయన విన్నపం చెవిన పెట్టలేదు. ఆ పట్టాభిషేక
విఘ్నకాలానికి నా భర్తకు ఇరవై అయిదు సంవత్సరాల వయసు. నాకు పద్దెనిమిదేళ్ల వయసు.
ఇంత లేత వయసువారు అడవుల్లో ఎలా తిరగ గలరో కూడా మా అత్త కైకేయి ఆలోచించలేదు”.
(రామచంద్రమూర్తి
విశ్వామిత్రుడితో అరణ్యానికి పోయేటప్పుడు ఆయన వయసు పన్నెండేళ్ళు. ఆ సంవత్సరమే సీతా
వివాహం. తరువాత పన్నెండేళ్ళు అయోధ్యలో సుఖంగా వున్నాడు. ఆ తరువాత సంవత్సరం
పట్టాభిషేక ప్రయత్నం కాబట్టి అప్పటికి రాముడికి పాతిక సంవత్సరాలు. అరణ్యావాసం
ఆరంభమైన తరువాత ఋశ్యాశ్రమాలలో పదేళ్లు గడిపాడు. పంచవటిలో మూడేళ్లు వున్నాడు.
వనవాసారంభం మొదలు పెట్టి ఇప్పటికి పద్నాలుగవ సంవత్సరం కాబట్టి, సీతాపహరణ
సమయానికి శ్రీరాముడికి ముప్పై ఎనిమిదవ ఏడు. సీత జనకుడికి దొరికింది మొదలు ఆరు
సంవత్సరాలు మిథిలలో వుంది. వివాహం తరువాత అయోధ్యలో పన్నెండేళ్ళు వుంది. పదమూడో
సంవత్సరం అరణ్యాలకు ప్రయాణం కాగా, వనవాసానికి బయల్దేరి అప్పటికి సీతాదేవికి
పద్దెనిమిది సంవత్సరాలు గడిచాయి. కాబట్టి, ఇప్పటికి
సీతకు, ముప్పై ఒక్క
ఏళ్లు గడిచాయి. ఇది ముప్పై రెండో ఏడు”.
సీత
రావణుడికి ఇంకా ఇలా చెప్పింది. “లోకంలో రాముడు, రాముడు, రాముడు అని
స్మరిచని వాళ్లుండరు. అంత గొప్ప ఆయనకెలా కలిగిందంటావా? ఆయన అసత్యం
చెప్పడు. సద్గుణాల రాశి. తప్పుపట్టడానికి ఒక్క దోషమైనా దొరకదు. స్త్రీల విషంయంలో
కానీ, ధన విషయంలో
కానీ, నిష్కల్మషమైన
హృదయం కలవాడు. సర్వ భూతాలకు మేలుచేసే గుణాలుకలవాడు. ఈ గుణాలన్నీ ఈయనలో కలవని
చాటిచెప్పే విధంగా ఆయనకు కమలాల లాంటి పెద్ద కళ్ళు, మోకాలినంటే
చేతులు కలవాడు. కళ్ళు, చేతులు చూడగానే ఈయన మహానుభావుడనే భావన కలుగుతుంది. ఇలాంటి
నా భర్తకు తన భార్య ముద్దు తీర్చడానికి దశరథ మహారాజు పట్టాభిషేకం చేయలేదు. తండ్రి
దగ్గరున్న రాముడితో, ఆయన ఆజ్ఞప్రకారం రాజ్యాన్ని భరతుడికి ఇచ్చి,
పద్నాలుగేళ్లు అరణ్యాలకు పొమ్మని, తండ్రిని సత్యవాదిని చేయమని కైక చెప్తుంది.
తండ్రిని సత్యవచనుడిని చేయడానికి, దేనికీ భయపడని రాముడు, అరణ్యాలకు
వచ్చాడు”.
“నా భర్త
సవతి తమ్ముడు, శూరుడు, లక్ష్మణుడు
అన్నకు సహాయంగా విల్లు-బాణాలు ధరించి మాతో అడవులకు వచ్చాడు. కైక కారణాన రాజ్యాన్ని
పోగొట్టుకుని మేం ముగ్గురం అడవుల్లో తిరుగుతున్నాం. కొంచెం సేపు నువ్వు ఇక్కడ
వుంటే నా భర్త వస్తాడు. నీకు వనఫలాలు ఇస్తాడు. బ్రాహ్మణుడా! నీ పేరేంటి? నీ గోత్రం
ఏమిటి? నువ్వే కులం
వాడివి? ఏ జాతివాడివి? వివరంగా చెప్పు.
ఎక్కడైనా ఆశ్రమంలో వుండకుండా ఈ అరణ్యాలలో ఎందుకు తిరుగుతున్నావు?”
సీతాదేవి
ప్రశ్నలకు క్రూరపు నడవడికల ఆ రాక్షసుడు తన చరిత్ర చెప్తా వినమని అంటూ, పరుషంగా
మాట్లాడాడు.
No comments:
Post a Comment