అభివృద్ధి కోసమే పార్టీ మార్పు
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (06-03-2019)
తెలంగాణ రాష్ట్ర సమితిలో, వారూ-వీరూ అనే తేడాలేకుండా,ఆ పార్టీ-ఈ పార్టీ
అనే భేదం లేకుండా, అను నిత్యం, ఎన్నికైన వివిధ స్థాయి
ప్రజాప్రతినిధులతో సహా, వేలాది మంది రాజకీయ కార్యకర్తలు
చేరడం రాజకీయ పునరేకీకరణ ఆవశ్యకత, వారి-వారి ప్రాంతాల,
మొత్తం రాష్ట్రం అభివృద్ధి పరచడమే
అనుకోవాలి. ఒక మహోన్నత ఉద్యమ నేపధ్యంలో, ఒక కొత్త రాష్ట్రం
ఏర్పడిన నేపధ్యంలో, ఆ రాష్ట్రం బంగారు రాష్ట్రంగా
అవతరించాల్సిన ఆవశ్యకత నేపధ్యంలో,ఒక పార్టీ టికెట్ మీద గెలిచి, మరో
పార్టీలో చేరడం సమంజసమే. ఇది అనైతికమనే వారికి రాజకీయ పునరేకీకరణ ఆవశ్యకత,
రాష్ట్రాభివృద్ధి ఆవశ్యకత అంతగా అర్థం కాదు. పార్టీ మారుతున్నవారి దృష్టిలో తాము
మరో పార్టీలో చేరుతున్నామనే భావన కన్న మిన్నగా, ఆ పార్టీ
అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్రాభివృద్ధికి అమలు
చేస్తున్న అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులు కావడమే. గతంలో వారు
ప్రాతినిధ్యం వహించిన పార్టీలు ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతిపక్ష పాత్ర
పోషించలేని దుర్గతిలో వుండడమే వారంతా ఆయా పార్టీలను వదిలి తెలంగాణ రాష్ట్ర సమితిలో
చేరడానికి కారణమనేది నిర్వివాదాంశం. ఇటీవల ఇతర పార్టీల టికెట్ల మీద గెలిచి తెరాసలో
చేరుతున్న కొందరు ఎమ్మెల్యేలు చెప్తున్న మాట కూడా అదేకదా?
తెలంగాణను అడ్డుకోవడానికి
అడుగడుగునా కుట్రలు జరిగినట్లే, సాధించుకున్న తెలంగాణను అస్థిర పరచడానికి కూడా వరుస
కుట్రలు జరిగాయని, వాటన్నింటినీ ఎదుర్కోవడానికి రాజకీయ పునరేకీకరణ అవసరమౌందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు
పదే-పదే చెప్తుంటారు. చెన్నారెడ్డి ఆధ్వర్యలో 1969లో జరిగిన మహోన్నత
ఉద్యమం నుంచి 2014 వరకు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా కుట్రలు జరిగాయి. ఏర్పడిన తరువాత కొత్త రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి కూడా కుట్రలు జరిగాయి. ఈ ఉద్యమాల నేపధ్యంలో లోతుగా ఆలోచిస్తే, రాజకీయ అవసరాల కోసం
ఆషామాషీగా చేరికలు జరగడం లేదని, తెలంగాణ గెలిచి నిలిచేందుకు అనుసరిస్తున్న వ్యూహంలో
భాగంగానే పునరేకీకరణ జరుగుతున్నదని స్పష్ఠంగా అర్థమవుతుంది.
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో కల్వకుంట్ల
చంద్రశేఖర్ రావు ఒక్కడే ఉద్యమ దిశగా బయలు దేరాడు. తర్వాత కొద్ది మంది
మిత్రులు ఆయనతో జమయ్యారు. తెలంగాణ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలనే
విషయంపై ప్రతీ ఒక్కరితో చర్చలు జరిపారు కేసీఆర్. 1969లో తెలంగాణ
ఉద్యమంలో పాల్గొన్న వారితో కూడా మాట్లాడారాయన. వారు వారి
అనుభవాలను కేసీఆర్ తో పంచుకున్నారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్య
బద్ధంగా, రాజకీయ చర్యల ద్వారా తెలంగాణ సాధించాలన్న తన వ్యూహాన్ని, తన మనసులో వున్న ఆలోచనలను వారికి వివరించారు. కానీ వారు ఈయన
వ్యూహాన్ని అంగీకరించలేదు. దాని వల్ల తెలంగాణ రాదని చెప్పారు. 1969 లాగానే ఉద్యమం
నడవాలని వారు కోరుకున్నారు. కానీ కేసీఆర్ వినలేదు.
“మీకు స్టేట్ ఫైట్ కావాలా? స్ట్రీట్ ఫైట్
కావాలా?” అని వాళ్లను ప్రశ్నించారు కేసీఆర్. తాను “స్టేట్ ఫైట్” చేస్తాను కాని “స్ట్రీట్ ఫైట్”
చేయలేను అని అంటూ, స్ట్రీట్ ఫైట్ కోసం తన అవసరం లేదని కూడా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కేవలం జై తెలంగాణ
నినాదాలతోనే తెలంగాణ రాదని అన్నారు. చాలా వ్యూహాత్మకంగా,డిప్లమాటిక్ గా
ముందుకుపోవాలని స్పష్టం చేసారు. తెలంగాణ ఉద్యమం ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదని
కూడా ఆనాడే స్పష్టం చేశారు. తాను నడిపే ఉద్యమంలో “ఆంధ్ర గో బ్యాక్” నినాదాలు
ఉండవన్నారు. “మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు మనకు దక్కడం కోసం తెలంగాణ కావాలి కానీ, ఎవరికో వ్యతిరేకంగా
కాదని” చెప్పారు. తన రాజనీతిజ్ఞతను ఆనాడే ఆయన ప్రదర్శించారు. అలా తన అభిప్రాయాలను, వ్యూహాలను ఒక్కొక్కరికీ విడమరిచి చెప్పారు. చర్చోపచర్చలు
సాగాయి. మూడు నాలుగు వేల గంటల చర్చలు సాగాయి. ఎంతో మేధో మథనం జరిగింది. తెలంగాణ ఎట్ల
వస్తదని అడిగినవారికి తెలంగాణ సాధన అనేది మన కన్విక్షన్ మీద ఆధారపడి ఉంటుందని
చెప్పారు. ఉద్యమం నడిపే తీరుపైనే తెలంగాణ సాధన ఆధారపడి ఉంటుందని కూడా వివరించారు. తెలంగాణ సమాజాన్నంత
ఒకవైపుకు తిప్పగలిగితే తెలంగాణ వస్తుందని అన్నారు. చివరకు తెలంగాణ
ఉద్యమంపై తనకున్న వ్యూహాన్ని వారు అర్థం చేసుకున్నారు. అప్పటి నుంచి
కేసీఆర్ వెంటే అందరూ నడిచారు.
తెలంగాణ ఉద్యమం ఓ రాజకీయ పార్టీగా ముందుకుపోతుండడంతో మొదట్లో ముఖ్యమంత్రిగా
ఉన్న చంద్రబాబు, ఆంధ్ర శక్తులు ఉద్యమాన్ని నీరు కార్చేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ఆ తరువాత వచ్చిన అకంగ్రేస్ ప్రభుత్వాలు అదే పని చేశాయి. రకరకాల పద్ధతుల ద్వారా ప్రయత్నాలు చేశారు. కుట్రలు చేశారు. వారు ప్రధానంగా
నాలుగు పద్ధతులు అవలంభించారు. మొదటిది: విభజించి పాలించు అనే
పద్దతిని పాటించి, తెలంగాణ సమాజాన్ని విడదీయడానికీ, ఐక్యత లేకుండా చేయడానికి ప్రయత్నాలు; రెండవది:
తెలంగాణ ఉద్యమ నాయకత్వ వ్యక్తిత్వ హననం, అంటే, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ద్వారా ప్రజల్లో ఉద్యమ నాయకత్వం పట్ల
విశ్వసనీయత లేకుండా చూడడం; మూడవది: మీడియా ద్వారా అబద్ధాలు
ప్రచారం చేయడం; చివరగా: ప్రభుత్వ అండతో ఉద్యమాన్ని అణచివేసే
చర్యలు చేపట్టడం. ఈ నాలుగు పద్దతుల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని నీరు
గార్చి,స్వరాష్ట్ర ఆకాంక్షను రూపుమాపాలని నిరంతర ప్రయత్నం జరిగింది. కేసీఆర్ కు కూడా
అనేక బెదిరింపులు వచ్చాయి. వెనుకంజ వేయాలని కలలు కన్నారు. అయినా సరే
వెనుకడుగు వేయవద్దని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఎన్ని ఇబ్బందులు కలిగినా, నిర్భంధం ఎదురైనా
ఉద్యమాన్ని కొనసాగించారు.
2004 ఎన్నికల తర్వాత కేసీఆర్ కేంద్ర మంత్రి అయ్యారు. ఢిల్లీలో ఎక్కువ
సమయం గడిపారు. కేంద్ర మంత్రిగా ఉన్నంత కాలం ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల చుట్టూ తిరిగారు. తెలంగాణ
ఏర్పడడానికి అనుకూలంగా 36 రాజకీయ పార్టీలను ఒప్పించారు. సిపిఐ బర్థన్ తో 30 సార్లు సమావేశమయ్యారు. మాయావతితో 19 సార్లు
సమావేశమయ్యారు. అప్పుడు తెలంగాణ పడుతున్న గోస గురించి, ప్రత్యేక రాష్ట్రం
కావాల్సిన అవసరం గురించి సిడి తయారు చేయించి, ఢిల్లీలో
నాయకులందరికీ చూపించారు. ప్రతీ ఎంపికి, ప్రతీ పార్టీకి
కొరియర్ చేశారు. అందరికీ తెలంగాణ గోస అర్థమయింది కానీ, తెలంగాణ వస్తుందనే
నమ్మకం చాలా మందికి లేకుండె. ఎంత చేసినా సరే తెలంగాణ రాదు అనే అపనమ్మకం
ఏర్పడడానికి గత అనుభవం కూడా ఓ కారణమే.
1969 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర
ఉద్యమానికి సారధ్యం వహించిన స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గొప్ప తెలంగాణ
బిడ్ద. ఆయన ఉద్యమాన్ని ఆకాశం ఎత్తుకు లేపారు. ఆనాటి ఆయన ఉద్యమమే మలివిడతగా
చేపట్టిన కేసీఆర్ సారధ్యంలోని ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందనాలి. 1970-1971 లో ఇందిరకు మాస్ లీడర్ గా మంచి పేరొచ్చింది. పాకిస్తాన్ తో యుద్ధానికి ముందు
ఇందిర 30-40 దేశాలకు వెళ్లి అక్కడి నాయకులతో మాట్లాడింది. తాను చేయబోయే బంగ్లాదేశ్
విమోచన గురించి చెప్పింది. చివరకు బంగ్లాదేశ్ ఏర్పాటైంది. దరిమిలా ఎన్నికల్లో ఘన
విజయం సాధించింది. దేశమంతా ఇందిర పార్టీ గెలిచినా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో
చెన్నారెడ్డి నాయకత్వంలోని ప్రజాసమితి, ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా పోటీ చేసి 11 లోక సభ
స్థానాలను గెలుచుకుంది. వీళ్లందరినీ తీసుకుని చెన్నారెడ్డి ఇందిరా గాంధీ దగ్గరకు
వెళ్లారు. ఆమె ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అని, ప్రజల కోరిక
మన్నించి,తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
ఇందిరాగాంధీ కొందరి సలహా
తీసుకుంది. ఒక్క కొత్త రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఇలాంటి డిమాండ్లు ఎన్నో వస్తాయని, తెలంగాణ ప్రజలు
అడిగిందేదైనా ఇవ్వొచ్చు కాని ప్రత్యేక రాష్ట్రం మాత్రం ఇవ్వొద్దని సలహా ఇచ్చారు వారు.
ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం రావడం లేదని తెలిసిపోయిందో అప్పుడే నాయకత్వాన్ని
తిట్టడం మొదలైంది. కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నం చేశారు.
అందరం కలిసి చేరుదామని చెప్పిన చెన్నారెడ్డి, ఇందిర నుంచి కొన్ని
సేఫ్ గార్డ్స్ కు అంగీకరించేలా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలోని కొందరు
చెన్నారెడ్డిని ద్రోహిగా చిత్రీకరించడం వెనుక కూడా ఆంధ్రా వాళ్ల కుట్ర వుంది.
ఆంధ్ర పత్రికల పాత్ర కూడా వుంది.
చెన్నారెడ్డి రోజులనుంచి నేటి దాకా ఆంధ్రా వాళ్ల కుట్రలు కొనసాగుతూనే
వున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కూడా దీన్ని అస్థిరపరిచే కుట్ర
జరిగింది. తెలంగాణ బతికి బట్ట కట్టదని ప్రచారం జరిగింది. మనుగడ సాగదని అన్నారు.
రాష్ట్రపతి పాలన విధించే ప్రయత్నాలు కూడా జరిగాయి. టీఆరెస్ కు స్నేహంగా వుండే
మజ్లీస్ పార్టీ ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా వుంటామని ప్రకటించిన తరువాత తోలి శాసన
సభలో పార్టీ బలం 63 నుంచి 70 కి చేరింది. అలా..అలా.. ప్రభుత్వానికి అండగా వుండాలని
భావించి చాలా మంది టీఅరెస్ తో కలిసారు అప్పట్లో. శాసన సభలో సంఖ్య 90కు చేరుకుంది.
రాజకీయ స్థిరత్వం పూర్తిగా వచ్చింది.
2018
లో జరిగిన ఎన్నికల్లో ఆశించనట్లే తెలంగాణ రాష్ట్ర సమితి అఖండ విజయాన్ని
సాధించింది. 88 అసెంబ్లీ స్థానాలను గెల్చుకుంది. మజ్లీస్ పార్టీ తన ఎదు స్థానాలతో
తెరాసకు మద్దతు ప్రకటించింది. ఎన్నికలైన వెంటనే ఇండిపెండెంట్లుగా గెలిచిన ఇద్దరు
ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. నిన్న-మొన్న జరిగిన రాజకీయ పరిణామాల్లో మరో ముగ్గురు
వేరే పార్టీవాళ్లు కూడా తెరాసలో చేరారు. ఈ సమాఖ్య ఇంకా దాటినా దాటవచ్చని పత్రికలు
రాస్తున్నాయి. చేరినవారందరూ, చేరబోతున్న
వారూ, తమ నియోజకవర్గ, రాష్ట్ర
అభివృద్ధికి తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల
చంద్రశేఖర్ రావు అమలుపరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల
పట్ల ఆకర్షితులమైనామని ప్రకటించారు. వారు ఆకారనాన పార్టీ మారితే తప్పేంటి?
ఇతర పార్టీలనుండి వచ్చిన వారి
చేరికతో పార్టీ-ప్రభుత్వం మరింత బలపడుతున్నది. తెలంగాణ అన్ని రకాల బాగుపడాలి. ఇతర
పార్టీలనుండి వచ్చిన వారిని చిల్లర రాజకీయాల కోసం టీఆరెస్ లో చేర్చుకోవడం లేదు.
తెలంగాణ నిలిచి గెలవాలి. ఈ రోజు తెలంగాణ వున్న పరిస్థితుల్లో తెలంగాణ అభివృద్ధిని
కాంక్షించే శక్తులన్నీ ఏకమై, తెలంగాణాను అభివృద్ధి చేయాలి. తెలంగాణలో రాజకీయ
సుస్థిరత, ఆర్థిక సుస్థిరత సాధించడం జరిగింది.
ఇదే పంథా కొనసాగాలి. అందుకోసమే పునరేకీకరణ అవసరమైంది. ఆద్యతన
భవిష్యత్ లో మరికొందరు పార్టీ మారినా ఆశ్చర్యం లేదేమో!!!
No comments:
Post a Comment