జస్టిస్ రామస్వామి సమతా
తీర్పు
వనం జ్వాలా నరసింహారావు
మనతెలంగాణ దినపత్రిక
(08-03-2019)
గిరిజన
ప్రాంతాల్లో వారు అనుభవిస్తున్న భూముల పై హక్కులను సమర్ధిస్తూ ‘సమత’ కేసులో ఒక
సంచలన తీర్పు ఇచ్చి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన జస్టిస్ కె రామస్వామి ఈ నెల
ఆరవ తేదీన మృతి చెందారు. ఆయనకు పూర్తీ అధికార లాంచనాలతో అంత్యక్రియలు జరిపించాలని
తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.
రాజ్యాంగంలోని ఐదవ
షెడ్యూ లు ప్రకారం మాత్రమే కాకుండా వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలకు విరుద్ధంగా షెడ్యూల్డు ప్రాంతాల్లో గిరిజనులకు
చెందిన భూములను గిరిజనేతరులు దోచుకుంటున్నారని, చివరకు గిరిజనులు వారి
హక్కులను కోల్పోతున్నారని ‘సమత’ అనే స్వచ్ఛంద సంస్థ ఆ హక్కుల కోసం చాలా కాలంగా పోరాడుతోంది.
దీర్ఘకాల పోరాటం తర్వాత ఆ సంస్థ కోర్టుల్ని ఆశ్రయించిది. 1993లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక
పిటిషన్ దాఖలు చేసింది. అయితే దాన్ని కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో
స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలుచేసింది. నాలుగేళ్ళ పోరాటం తర్వాత సమత ఆ కేసులో
విజయం సాధించింది. 1980 నాటి అటవీ పరిరక్షణ చట్టం ప్రకారం షెడ్యూలు ప్రాంతాల్లో, రిజర్వు అటవీ ప్రాంతాల్లో భూములను ప్రైవేటు మైనింగ్ అవసరాల కోసం లీజుకు ఇవ్వడం
నిషేధమంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గిరిజన ప్రాంతాల విషయంలో రాష్ట్ర
ప్రభుత్వాలు కూడా ఒక వ్యక్తి (పర్సన్) తరహాలోనే చట్టాలకు కట్టుబడి ఉండాలని
సుప్రీంకోర్టు ఆ తీర్పులో స్పష్టం చేసింది.
“గవర్నర్ తన వ్యక్తిగత
బాధ్యత ప్రకారం షెడ్యూల్డు ప్రాంతాల్లో శాంతి స్థాపనకు కృషి చేయాలి. సుపరిపాలన
అందేందుకు చొరవ తీసుకోవాలి. గిరిజనులు, గిరిజనేతరులు, స్థానిక వ్యక్తుల మధ్య భూముల కేటాయింపు క్రమబద్ధీకరణకు సంబంధించి
రాజ్యాంగంలోని ఐదవ అధికరణంలో కొన్ని అధికారాలను కల్పించింది. షెడ్యూల్డు
ప్రాంతాల్లోని భూములను బదలాయించడంపై నిషేధాజ్ఞలు విధించింది. ‘క్రమబద్ధీకరణ’ అంటే
‘నిషేధం’ కూడా అనే అంశాన్ని అన్వయించడానికి సంబంధించి స్పష్టమైన వివరణ ఇచ్చింది.
‘వ్యక్తుల’ అంటే సహజ వ్యక్తులతో పాటు న్యాయ వ్యవహారాలతో సంబంధం కలిగిన వ్యక్తులు, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాలు కూడా” అని జస్టిస్ కె. రామస్వామి, జస్టిస్ సాగిర్ అహ్మద్‌లు వారి తీర్పులో పేర్కొన్నారు. పైవేటు వ్యక్తులు, సంస్థలు,
పారిశ్రామికవేత్తలకు అటవీ భూములను కేటాయించడం చెల్లదని
సుప్రీంకోర్టు ఆ తీర్పులో స్పష్టం చేసింది.
అయితే
ఖనిజాభివృద్ధి సంస్థ,
గిరిజన సహకార సంస్థ లాంటి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు
మాత్రం అటవీ భూములను బదలాయించడాన్ని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం
అనుమతించింది. కానీ కొన్ని షరతులు విధించింది. ఆ సంస్థలు ఆర్జిస్తున్న నికర
ఆదాయంలో కనీసంగా ఇరవై శాతం మొత్తాన్ని ఒక శాశ్వత నిధిగా నిర్వహించాలని, ఆ నిధిని గిరిజనులకు ఉపయోగపడేలా పాఠశాలలు, ఆసుపత్రులు, రవాణా సౌకర్యాలు,
పారిశుద్య అవసరాలు తదితరాల కోసం ఖర్చు చేయాలని ఆ షరతులో
పేర్కొనింది.
గిరిజనుల ఆర్థిక
వనరుల్లో ఒకటి వారి ప్రాంతాల్లో లభిస్తున్న విలువైన ఖనిజాలు. గిరిజనులు నివాసం
ఉంటున్న ప్రాంతాల్లో భారీ స్థాయిలోనే ఖనిజ (సహజ) వనరులు నిరుపయోగంగా ఉన్నాయి.
కొన్ని సందర్భాల్లో ఆశించిన స్థాయిలో, పూర్తి స్థాయిలో
ఉపయోగించుకోలేక వృథాగా వదిలేసిన పరిస్థితుల్లో ఉన్నాయి. నిజంగా వాటిని సమర్ధవంతంగా
వినియోగించుకున్నట్లయితే మైనింగ్ పరిశ్రమ లేదా ఖనిజ ఆధార పరిశ్రమలు గణనీయంగా
వృద్ధి చెందుతాయి. ఫలితంగా గిరిజనులకే ఆ పరిశ్రమల్లో ఉపాధి కల్పన లభించే అవకాశం
ఉంటుంది. మొత్తం గిరిజన ఆవాసాల్లోనే నాణ్యమైన లోహ సంబంధమైన ఖనిజాలే కాకుండా ఇతర
రకాల ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. వీటిని వాణిజ్య అవసరాలకు
వినియోగించుకోవచ్చు. గిరిజనులను భాగస్వాములను చేసి అనేక రకాలుగా విలువను జోడించే
ఖనిజ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలను నెలకొల్పి అభివృద్ధి చేయవచ్చు. ఇదే చేసినట్లయితే
గిరిజనుల అభివృద్ధి కోసం శాశ్వతంగానే ఒక ‘రాయల్టీ అభివృద్ధి డివిడెండ్ ఫండ్’ను
నెలకొల్పడానికి పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. మైనింగ్ వ్యాపారంలో గిరిజనులకు కూడా
నిర్దిష్ట వాటాను కేటాయించడం ద్వారా వారిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయవచ్చు.
విలువైన ఖనిజాల ప్రాధాన్యత గురించి గిరిజనులు తెలుసుకునేందుకు, అవగాహన చేసుకోడానికి దోహదపడుతుంది. ఖనిజ ఆధార వ్యాపార, వాణిజ్య రంగాల్లో మాత్రమే కాక వ్యాపార నిర్వహణలో సైతం వారు రాణించేలా చైతన్యం
కలిగించవచ్చు. అంతిమంగా ఇది వారి జీవన ప్రమాణాలు పెరగడానికి ఉపయోగపడుతుంది.
గిరిజనుల చేతి
బ్రహ్మాస్త్రం 1/70 చట్టం: షెడ్యూల్డు ప్రాంతాల్లో గిరిజనేతరుల స్వాధీనంలో ఉన్న భూములు
గిరిజనులకే చెందేలా 1970లో ‘భూ బదలాయింపు క్రమబద్ధీకరణ చట్టం’ (వన్ ఆఫ్ సెవెంటీ) ఉనికిలోకి వచ్చింది.
షెడ్యూల్డు ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూమి ఉన్నట్లయితే, ఏదేని నిర్దిష్టమైన ఉత్తర్వులు లేదా అనుమతి ఉంటే తప్ప, అది గిరిజనుల నుంచి స్వాధీనం చేసుకున్నదేననే ఒక స్పష్టమైన (ముందస్తు అంచనాతో
కూడిన) సెక్షన్ ఈ చట్టంలో ఉంది. గిరిజనేతరులు ఈ ప్రాంతాల్లో ఏ స్వల్ప స్థాయిలో
భూమిని కలిగి ఉన్నా దాన్ని మరో గిరిజనేతరుల పేరు మీద బదలాయించడానికి కూడా వారికి
అధికారం లేదు. షెడ్యూల్డు ప్రాంతాల్లోని భూమి (స్థిరాస్తి) బదలాయింపుకు ఈ చట్టంలో
చాలా స్పష్టత ఉంది. 1964 నాటి సహకార సొసైటీల చట్టం కింద రిజిస్టర్ అయిన సొసైటీలోని సభ్యులు లేదా
గిరిజనులకు తప్ప మరెవ్వరికి ఈ ప్రాంతంలోని భూమిని బదలాయించడం వీలు పడదు.
బదలాయించాలనుకుంటున్నవారు గిరిజనులైనా, సొసైటీలో సభ్యులైనా
తీసుకుంటున్నవారు గిరిజనులు కానప్పుడు, సొసైటీలో సభ్యులు
కానప్పుడు ఆ బదలాయింపు చెల్లుబాటు కాదు.
ఈ చట్టం
షెడ్యూల్డు ప్రాంతాల్లోని భూమిపై గిరిజనులకు హక్కు కల్పించింది. తొలుత ఈ చట్టాన్ని
రూపొందించినప్పుడు సంబంధిత అధికారుల నుంచి ముందస్తు లిఖితపూర్వక అనుమతి ఉంటే తప్ప
గిరిజనులకు చెందిన భూమిని గిరిజనేతరులకు బదలాయించడం సాధ్యంకాదు. ప్రారంభంలో ఈ చట్టం
పరిధి ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైనప్పటికీ ఆ తర్వాత తెలంగాణ ప్రాంతానికి
కూడా అన్వయించేలా సవరణ జరిగింది. గిరిజనుల నుంచి గిరిజనేతరులకు భూమి బదలాయింపు
జరుగుతున్నట్లయితే ఈ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకునే అధికారం జిల్లా
కలెక్టర్లకు అప్పగించబడింది. అలాంటి సందర్భాల్లో ఆ భూమి గిరిజనులకు లేదా వారి
వారసులకు మాత్రమే చెందుతుంది తప్ప గిరిజనేతరులకు చెల్లదు.
ఈ చట్టం అమలులోకి
వచ్చిన తొమ్మిదేళ్ళ కాలంలో (1979 వరకు) షెడ్యూల్డు
ప్రాంతంలో గిరిజనేతరుల ఆధీనంలో ఉన్న విస్తారమైన భూములు పరిరక్షించబడినాయి. 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరుల ఆధీనంలో ఉన్న లక్షలాది ఎకరాల భూములు
రక్షించబడినట్లు ట్రైబల్ కల్చరల్ రీసెర్చి అండ్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్
పేర్కొనింది. అయితే ఇలా పరిరక్షణకు గురైన భూములు మళ్ళీ గిరిజనుల చేతికి వెళ్ళింది
కేవలం నాల్గవ వంతు మాత్రమేనని, వివిధ రకాల ఉత్తర్వులతో
ఇంకా లక్షలాది ఎకరాలు గిరిజనేతరులే అనుభవిస్తున్నారని కూడా పేర్కొనింది. ఇలాంటి
పరిస్థితుల్లో 1197 జూలై 11న (దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం) దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో జస్టిస్ కె
రామస్వామి,
జస్టిస్ సాగిర్ అహ్మద్, జస్టిస్ జిబి పట్నాయక్‌ల
నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన తీర్పులోని అంశాలను పరిశీలించడం
అవసరం.
‘వ్యక్తి’ అంటే
కేవలం వ్యక్తులు మాత్రమే కాదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా
అని ఆ తీర్పు నొక్కి చెప్పింది. షెడ్యూల్డు ప్రాంతంలోని భూమిని బదలాయించేటప్పుడు
‘వ్యక్తి’ అని పేర్కొన్నప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం కూడా అవుతుందని, మైనింగ్ అవసరాల కోసం భూమిని గిరిజనేతరులకు లీజుకు ఇస్తున్నప్పుడు లేదా
బదలాయిస్తున్నప్పుడు ఇది వర్తిస్తుందని, అలాంటి బదలాయింపు / లీజు
నిషిద్ధమని ఆ తీర్పు స్పష్టం చేసింది. ఒకవేళ ప్రభుత్వమే ఆ భూమిని మైనింగ్ అవసరాల
కోసం ఒక సంస్థకు బదలాయిస్తుంటే అది కూడా నిషేధిత చర్యే అవుతుందని స్పష్టం చేసింది.
ఆ తర్వాతి పరిస్థితుల్లో రాష్ట్రపతి ఒక ప్రకటనలో ‘గవర్నర్లతో ఏర్పాటైన కమిటీ’
ఏర్పాటవుతుందని,
చట్టం అమలులో జరుగుతున్న పొరపాట్లను, లోపాలను,
ఉల్లంఘనలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని, షెడ్యూల్డు కులాలు,
షెడ్యూల్డు తెగలకు సంబంధించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సైతం
పలు సిఫారసులతో కూడిన తీర్పు ఇచ్చినా ఆ తదనంతర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నాయో స్పష్టం కావడంలేదు.
No comments:
Post a Comment