Tuesday, March 19, 2019

జాతికి నూతన దిశా నిర్దేశం : వనం జ్వాలా నరసింహారావు


జాతికి నూతన దిశా నిర్దేశం
వనం జ్వాలా నరసింహారావు
మనతెలంగాణ దినపత్రిక (20-03-2019)
స్వాతంత్యం సిద్ధించిన గత 70 ఏళ్లలో దేశ పరిపాలనా రంగంలో గుణాత్మక మార్పు రాలేదని, ఆ మార్పు రావలసిన అవసరం ఉందని గత ఏడాది మార్చి మొదటి వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మొట్టమొదటిసారిగా చెప్పారు. అంతేకాదు అలాంటి ప్రత్యామ్నాయానికి తానే నాయకత్వం వహించబోతున్నట్లు కూడా ఆయన ఆ సందర్భంగా సూచనప్రాయంగా తెలియజేశారు. దేశంలో జాతీయ స్థాయిలో ఇప్పుడున్న రాజకీయ పార్టీల ఆలోచనల్లో, పని తీరులో కొత్తదనం, వినూత్న ఆలోచనా ధోరణి కొరవడిందని కూడా ఆయన ఆ సందర్భంగా అన్నారు.

ప్రజలు మెరుగైన భవిష్యత్తు కోసం మార్పును కోరుకుంటున్నారని, గతంలో వచ్చినట్లుగానే అలాంటి గుణాత్మకమైన మార్పును తీసుకు వచ్చే నాయకత్వం వారిలోనుంచే వస్తుందనేది ఆయన ప్రగాఢ విశ్వాసం. అయితే జాతీయ స్థాయిలో ఎలాంటి ప్రత్యామ్నాయం ఏర్పడుతుందనేది ముఖ్యం కాదని, ఎందుకంటే ప్రధాన జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల పట్ల ప్రజల్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా రగులుతూ ఉందని కూడా ఆయన ఆ సందర్భంగా అన్నారు. ఏడాది గడిచిన తర్వాత15వ ఆర్థిక సంఘం చైర్మన్ గత ఫిబ్రవరిలో హైదరాబాద్ సందర్శించిన సందర్భంగా కెసిఆర్ జాతీయ స్థాయి పరిస్థితులపై తన ఆలోచనలను ఆయనతో పంచుకోవడమే కాకుండా ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తన ఎన్నికల ప్రచార ధోరణి ఏ విధంగా ఉండబోతుందో కూడా స్పష్టంగా తెలియజేశారు కూడా.

అనేక సమకాలీన దేశాలతో పోల్చుకున్నప్పుడు ఒక దేశంగా తన స్థానమేమిటో భారత దేశం ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. వ్యవస్థాగతంగాను అధికారిక పనితీరులోను సమూలమైన మార్పురావలసిన అవసరం ఇప్పుడు ఉంది. ఉదాహరణకు దేశంలో ఇప్పుడు అందుబాటులో ఉన్న 70,000 టిఎంసిల జలాల్లో కేవలం 40,000 టిఎంసిల జలాలను ఉపయోగించుకున్నట్లయితే దేశంలో సాగుకు యోగ్యంగా ఉన్న మొత్తం 40 కోట్ల ఎకరాల భూమి సాగుకు అవసరమైన నీటిని సంప్రదాయ పద్ధతిలోనే అందించవచ్చు. బిందు , తుంపర, పైపుల ద్వారా సాగు నీరు అందించడం లాంటి సమర్థవంతమైన సాగునీటి పద్ధతులను పాటించినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం సాగు భూమికి నీటిని అందించాలన్న లక్షాన్ని సాధించవచ్చు. ప్రస్తుతం కాలువల ద్వారా సాగు నీరు మొత్తం వ్యవసాయ భూమిలో కేవలం 14 శాతం అంటే 5.5 కోట్ల ఎకరాలకు మాత్రమే అందులోంది. దీన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచాల్సిన అవసరం ఉంది.

సాగు నీటి రంగానికి సంబంధించిన అంతర్రాష్ట్ర వివాదాలు, న్యాయపరమైన అడ్డంకులు, భూసేకరణలో జాప్యాలు, పునరావాసం, వారికి ఉపాధికల్పన, ప్రాజెక్టుల ప్రణాళికల రూపకల్పన, వాటి అమలులో లోపాలు లాంటి ప్రధాన అడ్డంకులను అధిగమించాల్సిన అవసరం ఉంది. అంతర్రాష్ట్ర జలవివాదాలపై తీర్పులు ఇవ్వాల్సిన ట్రిబ్యునల్స్ తమ తీర్పులు ఇవ్వడానికి ఇప్పుడు దశాబ్దాలు పడుతోంది. సత్వర తీర్పులు ఇవ్వడానికి వీలుగా ఆ ట్రిబ్యునల్స్ మరింత సమర్థవంతంగా పనిచేసేలా చూడాల్సిన అవసరం ఎంతయినా ఉంది. అంతేకాదు జల వివాదాల పరిష్కారానికి ఒక శాశ్వత జలవివాదాల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి. ఒక వేళ న్యాయప్రక్రియ వల్ల కాలయాపన జరిగేటట్లయితే, న్యాయస్థానాలు ప్రయోజనాలను పట్టించుకోని పక్షంలో ప్రత్యామ్నాయ పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా సంబంధిత రాష్ట్రాలు సమస్యలను చర్చించుకొని పరస్పర ప్రయోజనకరంగా ఉండే ఒక పరిష్కారానికి వచ్చే విధంగా సంస్థాగతంగా చొరవ తీసుకోవలసిన అవసరం ఉంది. దీనికి తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టే ఉదాహరణ అని ముఖ్యమంత్రి చెప్పారు.

మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలతో నదీ జలాలకు సంబంధించిన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకొని ఒప్పందాలను కుదుర్చుకోవడం ఫలితంగానే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రాజెక్టులను అడ్డుకోవడం కోసం దురుద్దేశపూరితంగా న్యాయస్థానాల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు( పిల్స్) దాఖలు చేయకుండా నిరోధించాల్సిన అవసరాన్ని కూడా ప్రణాళికా సంఘం అధ్యక్షుడితో చర్చలు సిఎం ప్రధానంగా ప్రస్తావించారు.


భారత దేశ ఆర్థిక వ్యవస్థ, సంపద, అంతర్గత శక్తులను సమన్వయపరచాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి నొకి చెబుతూ ఇందుకు చైనాను ఉదాహరణగా పేర్కొన్నారు. క్రియాశీలకంగా వ్యవహరించడం, దూరదృష్టితో కూడిన నిర్ణయాల కారణంగా చైనా1979నుంచి కూడా నిలకడగా అధిక వృద్ధి రేటును సాధిస్తూ వస్తోంది. దక్షిణ కొరియా, సింగపూర్, తైవాన్ లాంటి తూర్పు ఆసియా దిగ్గజాలు, మలేసియా, ఇండోనేసియా, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్‌లాంటి ఏసియాన్ దేశాలు అద్భుతమైన అభివృద్ధిని సాధించాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సర్వనాశనమైన జపాన్ తిరిగి కోలుకొని ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన దేశాల్లో ఒకటిగా ఎదగగలిగింది. దేశం స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు గడిచిపోయినప్పటికీ ప్రజలు కూడు, గూడు,గుడ్డలాంటి కనీస మౌలిక అవసరాలకోసం ఇబ్బందులు పడుతూ ఉన్నారని, అందువల్ల దేశానికి సరికొత్త దిశానిర్దేశం అవసరమని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి ఏటా సమర్పించే బడ్జెట్‌లు, మామూలు పద్ధతులు, బూజుపట్టిన సంప్రదాయ ఆలోచనల కారణంగా ఎలాంటి మార్పూ సిద్ధించలేదని, అందువల్ల జాతీయ ప్రాధాన్యతల అజెండాలో మార్పు రావలసిన అవసరం ఉందని కూడా ఆయన అన్నారు. ఆలోచనారాహిత్యంనుంచి దేశం బయటపడి గొప్పగా ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ‘ ఔట్‌ఆఫ్ బాక్స్’ (సంప్రదాయానికి భిన్నమైన) ఆలోచన ఇప్పుడు అవసరం అని కూడా ఆయన స్పష్టం చేశారు.

అభివృద్ధే ప్రధానమైన జాతీయ అజెండాను నిర్దేశించడం ద్వారా రాష్ట్రాలకు సాధికారికత కల్పించాలి. అంతేకాదు, అధికారాలన్నీ కేంద గుప్పెట్లో ఉంచుకునే ధోరణి మారాలి. రాష్ట్రాలు ముందు వరసలో ఉండే సరికొత్త ఆర్థిక విధానం భారత దేశానికి అవసరం. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. దేశం అభివృద్ధి చెంది తన పూర్తి సామర్థాన్ని సాధించాలంటే ప్రతి రాష్ట్రమూ తన వనరులను, సామర్థాన్ని సమన్వయ పరుచుకుని అభివృద్ధి చెందాలి. రాష్ట్రాలు తమ ప్రాధాన్యతలను తామే నిర్ణయించుకే స్వేచ్ఛ వాటికి ఇవ్వాలి. రాష్ట్ర జాబితా కింద ఉండే అంశాలను లెక్కలేకుండా ఉన్న కేంద్ర ప్రతిపాదిత పథకాల్లో చేర్చే తీరు మారాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి జాబితా విషయంలో కేంద్రం మరో కేంద్ర జాబితా ఉందేమోననే రీతిలో ఏకపక్షంగా, గుత్తాధిపత్య ధోరణిలో వ్యవహరిస్తోందన్న భావనలో రాష్ట్రాలు ఉన్నాయి.

నేర చట్టాలు, అడవులు, దివాలా, కార్మిక సంఘాలు, కార్మిక సంక్షేమం, లీగల్, మెడికల్ తదితర వృత్తులు, విద్య, విద్యుత్ లాంటి ఉమ్మడి జాబితాలోని అంశాలపై చట్టాలు చాలావరకు పార్లమెంటే చేస్తుంది. ఇంతకు ముందు రాష్ట్రాల జాబితాలో ఉన్న విద్య, అడవులు, తూనికలు, కొలతలు, వన్యప్రాణులు, పక్షుల సంరక్షణ, న్యాయపాలన లాంటి అంశాలను కూడా 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలోకి తీసుకు రావడం జరిగింది. దీంతో రాష్ట్రాల పరిధిలో ఉండే అంశాలు మరింతగా తగ్గిపోయాయి. సర్కారియా కమిషన్ సిఫార్సు చేసినట్లుగా ఉమ్మడి జాబితాలోని ఒక అంశంపై చట్ట చేయాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలతో విడిగా, అంతర్రాష్ట్ర మండలిలో ఉమ్మడిగా చర్చించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, గృహవసతి(హౌసింగ్), తాగు నీరు, పారిశుద్ధం(శానిటేషన్), మహిళా, శిశు సంక్షేమం లాంటి అంశాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న అంశాలుగా ఉన్నాయి.

అయితే కేంద్ర రంగంలోని, కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్వహిస్తున్న పథకాలు, ఉప పథకాలను చాలావరకు స్థానిక ప్రాధాన్యతలకు అనుగుణంగా రాష్ట్రాలే నిర్వహించాలి. కేంద్రం వసూలు చేసే మొత్తం పన్నుల్లో 42 శాతం పన్నులను రాష్ట్రాలకు ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ వాస్తవంలో అలా ఎప్పుడూ జరగడం లేదు. మొత్తం పన్ను వసూళ్ల్ల (జిటిఆర్)లో దాదాపు మూడో వంతు మాత్రమే రాష్ట్రాలకు ఇస్తున్నారు. వసూళ్లయ్యే పన్నుల్లో అధిక శాతం సెస్సు( సుంకాల) రూపంలో ఉండడం, వాటిని విభజించడానికి వీలు లేకపోవడమే దీనికి కారణం.

సులభతర వాణిజ్యం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, వృద్ధికి అడ్డంకిగా ఉండే సమస్యల పరిష్కారానికి దేశంలో సంస్కరణలు రావలసిన అవసరం ఉంది. ఉదాహరణకు రేవులలో కంటైనర్ హ్యాడ్లింగ్ సామర్థాన్ని మెరుగుపర్చడం, సరకుల లోడింగ్, అన్‌లోడింగ్ సమయాన్ని తగ్గించడం, జాతీయ రహదారులపై సగటు వేగాన్ని, రైళ్లలో సరకు రవాణాను మెరుగుపర్చడం, కస్టమ్స్ అనుమతులు పొందడానికి పట్టే సమయాన్ని తగ్గించడం లాంటి చర్యలు వల్ల వ్యాపార రంగంలో వాతావరణం గణనీయంగా మెరుగుపడుతుంది. భారత దేశంలో మౌలిక సదుపాయాల రంగం పరిస్థితి ఎంతమాత్రం సంతృప్తికరంగా లేదు. ప్రతి ఏటా మన మౌలిక సదుపాయాల రంగంలో స్థూల జాతీయ ఉత్పత్తి (జిడిపి)లో కనీసం 3 4 శాతం అదనంగా ఖర్చు చేయడం ద్వారా మన మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది.

దీన్ని సాధించాలంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) భారీగా రావడం కోసం వ్యవస్థాగతమైన సంస్కరణలు దేశానికి అవసరం. చైనాలాగా ప్రత్యేక ఆర్థిక మండలులు(సెజ్‌లు) అభివృద్ధి చేయడం, నిలకడయిన పన్నుల విధానం, చట్టాల్లో తరచూ మార్పులు చేయకపోవడం లాంటివి అవసరం. విదేశాలకు తరలి వెళ్లిన నల్లధనాన్ని తిరిగి తీసుకురావడానికి, మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడి పెట్టడానికి ఆకర్షణీయమైన, ఆచరణ యోగ్యమైన ‘టాక్స్ ఆమ్నెస్టీ స్కీమ్’ దేశానికి అత్యవసరం. ప్రతి భారతీయుడు తాను సక్రమంగా పన్ను చెల్లిస్తున్నానని, జాతి నిర్మాణంలో భాగస్థ్థుడినని సగర్వంగా చెప్పుకునేలా ఉండాలి. ఒక్క రూపాయి అయినా సరే పన్నును అతను స్వచ్ఛందంగా చెల్లించేలా ఉండాలి.

ఇక తెలంగాణలో ఖరీఫ్, రబీ సీజన్‌లు రెండింటిలో సీజన్‌కు ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి ప్రోత్సాహం కింద రైతుకు అందిస్తున్న్తారు. వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని అధిగమించడానికి ఇదే పద్ధతిలో రైతుకు సాయం అందించడం సరయిన చర్య అవుతుంది. అలాగే ఇప్పుడున్న కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కన్నా రూ. 500 లేదా మూడో వంతు కనీస మద్దతు ధరలను పెంచాలి. ఆ తర్వాత ప్రతి ఏటా ఉద్యోగుల కరవు భత్యం పెంచడానికి ధరల సూచీతో అనుసంధానం చేసినట్లుగా కనీస మద్దతుధరను కూడా ధరల సూచీతో అనుసంధానం చేయడం ద్వారా ఎంఎస్‌పిని ప్రతి ఏడా పెంచాలి. అంతేకాక ప్రతిప్రాంతంలో భౌగోళిక, వాతావరణ పరిస్థితలు ఆధారంగా నిర్దిష్ట పంటలను పండించడానికి ప్రాంతాల వారీగా పంట కాలనీలను ఏర్పాటు చేయాలి.

No comments:

Post a Comment