కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి
ఆర్నెల్ల పూర్వరంగం
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(21-06-2019)
తెలంగాణను
సస్యశ్యామలంచేసే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును ఈ రోజున (జూన్ 21, 2019) అత్యంత వైభవంగా ప్రారంభించుకుంటున్నాం. ప్రపంచంలోనే అతి
పెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కాళేశ్వరం ప్రాజెక్టు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్
రాష్ట్రాలతో తెలంగాణ స్నేహసంబంధాలు కొనసాగిస్తున్నదానడానికి ఈ ప్రాజెక్టు ఒక మంచి
ఉదాహరణ. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మహారాష్ట్ర సహకారం మరువలేనిది. యావత్
భారతదేశంలో 45 లక్షల ఎకరాలకు సాగునీటిని,
80శాతం తెలంగాణకు తాగునీటితోపాటు, పారిశ్రామిక
అవసరాలు తీర్చే బృహత్తర ప్రాజెక్టు ఏ రాష్ట్రంలోనూ లేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణం
అతి తక్కువ సమయంలో చేసింది ప్రభుత్వం.
ప్రారంభోత్సవ
నేపధ్యంలో రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొని వుంది. ప్రపంచమే అబ్బురపరిచే
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించుకొనే సమయం ఇది. ప్రాకెక్టు పూర్తి సత్ఫలితాలు ఇవ్వడానికి
మరికొంత సమయం పడుతుంది. ఇంత చక్కగా పనులు జరగడానికి మహారాష్ట్ర ప్రభుత్వం
అందిస్తున్న ప్రోత్సాహమే కారణం. చివరి దశలో మొన్న కూడా 15 ఎకరాల ప్రైవేటు
భూమి, 25ఎకరాల అటవీభూమిని ఇప్పించింది ఆ ప్రభుత్వం. కరకట్టలు కట్టడానికి అవసరమైతే వారు
ఉదారంగా వ్యవహరించారు. పర్యావరణ అనుమతులూ ఇప్పించారు. స్నేహపూర్వకంగా ఉండటం మూలాన
ఇది సాధ్యమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా సాగుకాబోయే 45 లక్షల ఎకరాలలో రెండు పంటలు పండుతాయి. మొదటి దశలో 25 లక్షల ఎకరాలకు, శ్రీరాంసాగర్
ఆయకట్టు, ప్లస్ సిరిసిల్ల్ల దాని తాలుకా పరిసరాలు, హుస్నాబాద్ తాలుకా దాని పరిసరాల్లో ఉండే ప్రాంతాలు.. కొత్త, పాత కలిపి సుమారు 25 లక్షల ఎకరాలకు
నీళ్లొస్తాయి. ఆపైన సిద్దిపేట జిల్లా, ప్రస్తుతం మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌కు వచ్చేనాటికి, మరో 20 లక్షల ఎకరాలకు, అంటే దాదాపు 45 లక్షల ఎకరాలకు
సాగునీరు, తెలంగాణ పారిశ్రామిక అవసరాలతోపాటు తెలంగాణకు సమృద్ధిగా నీరు అందించే మహత్తరమైన
ప్రాజెక్టు కాళేశ్వరం ఇంత త్వరగా పూర్తి కావడంపట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు.
నీటి పారుదల
రంగానికి అపరిమితమైన ప్రాధాన్యం ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో
నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించేందుకు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అనేకసార్లు స్వయంగా ప్రాజెక్టుల సందర్శన చేశారు. అనేకసార్లు
సమీక్షలు నిర్వహించారు. అందులో ప్రధానమైంది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. ఆర్నెల్ల
క్రితం ఈ ఏడాది జనవరి మొదటి తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మాణంలో వున్న కాళేశ్వరం
ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజి, కన్నెపల్లి పంపుహౌజులను
సందర్శించారు. పనుల పురోగతిని పరిశీలించారు.
మర్నాడు కన్నేపల్లి పంప్ హౌజ్ నుండి అన్నారం బ్యారేజి వరకు నీటిని తరలించే
కాలువ పనులను చూశారు. సుమారు 15 కిలోమీటర్లు అన్నారం
బ్యారేజీ వరకు రోడ్డు కాలువ వెంబడి
ప్రయాణిస్తూ అనేక చోట్ల ఆగి
క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని చోట్ల కాలువ సైడ్ స్లోప్స్ కూలిపోతున్నాయని , అటువంటి రీచెస్ లో కాంక్రీట్ గైడ్ వాల్స్ కడితే క్షేమంగా ఉంటుందని, వెంటనే వాటిని
నిర్మించడానికి ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. అన్నారం బ్యారేజి వద్ద పనులను, సుందిళ్ళ బ్యారేజి, అన్నారం పంప హౌజ్, సుందిళ్ళ పంప హౌజ్ పనులని కూడా సి ఎం పరిశీలించారు. పంప హౌజ్ ల వద్ద
ట్రాన్స్కో వారు నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్లను వాన నీటి నుంచి రక్షించడానికి
తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. అనంతరం శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం లో
భాగంగా రాజేశ్వర్ రావు పేట వద్ద నిర్మాణం
అవుతున్న రెండవ పంప హౌజ్ నిర్మాణ పనులను పరిశీలించారు.
తన
పర్యటన ముగిసిన మూడు రోజులకు సాగునీటి ప్రాజెక్టులపై రిటైర్డు ఇంజనీర్లు, వివిధ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు, ప్రభుత్వ ముఖ్య అధికారులతో సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. సాగునీటి
ప్రాజెక్టుల నిర్మాణం,
నిర్వహణ కోసం విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి
అధికారులను ఆదేశించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా
గోదావరి,
కృష్ణా బేసిన్లలో రాష్ట్రానికున్న నీటి వాటాను
వినియోగించుకునే వ్యూహం అమలు చేయాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెట్లో
నిధులు కేటాయించడంతో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి కూడా నిధులు సేకరిస్తామని
చెప్పారు. ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత కూడా వాటి నిర్వహణ కోసం అవసరమైన నిధులను
బడ్జెట్లో కేటాయిస్తామని వెల్లడించారు.
గోదావరి నదిలో
తెలంగాణకు 950 టిఎంసిల నీటి వాటా ఉందనీ, అందులో భాగంగానే గోదావరిపై
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మిస్తున్నామనీ, ఆ ప్రాజెక్టు
ద్వారా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్,
వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాలకు సాగునీరు అందించాలనీ, మేడిగడ్డ, అన్నారం,
సుందిళ్ల బ్యారేజిలు, కన్నెపల్లి, అన్నారం,
సుందిళ్ల పంపుహౌజుల నిర్మాణం పూర్తి కావాలనీ, ఎల్లంపల్లి, మిడ్ మానేరు దాకా నీళ్లు రావాలనీ, వచ్చిన
నీటిని వచ్చినట్లు పంపు చేసి చెరువులకు మళ్లించాలనీ అన్నారు సీఎం.
అలాగే, ఎల్లంపల్లి దాకా వచ్చిన నీటిలో ఒక టిఎంసిని మిడ్ మానేరు
ద్వారా శ్రీరాం సాగర్ కాల్వలకు మళ్లించాలనీ, మరో టిఎంసి
నీళ్లను మల్లన్న సాగర్ వైపు మళ్లించాలనీ, మల్లన్న సాగర్
ద్వారా ఆలేరు,
భువనగిరి నియోజకవర్గాల్లో నిర్మించే బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్ కు తరలించాలనీ, మల్లన్న
సాగర్ ద్వారానే హైదరాబాద్ మంచినీళ్ల కోసం నిర్మిస్తున్న 10 టిఎంసిల రిజర్వాయర్ కు నీళ్లు పంపాలనీ, హల్ది
వాగు ద్వారా నిజాంసాగర్, ఘనపురం ఆయకట్టుకు
సాగునీరు అందించాలనీ, గండిపేట, హిమాయత్ సాగర్ చెరువులు నింపాలనీ, వాటి ద్వారా క్రమం తప్పకుండా నీటిని విడుదల
మూసీనదికి, చివరికి మూసీ నది నీళ్ల ద్వారా పాత నల్గొండ
జిల్లా పొలాలకు నీరు చేరాలనీ ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాలను
వివరించారు.
ప్రాజెక్టుల
ద్వారా వచ్చే నీటితో ముందుగా చెరువులు నింపాలని సిఎం ఆదేశించారు. గొలుసుకట్టు
చెరువుల వ్యవస్థను ఉపయోగించుకుని చెరువులను నింపేందుకు చర్యలు చేపట్టాలని
ఆదేశించారు. మరో సమీక్షా సమావేశంలో, ఈ ఏడాది
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అటు మిడ్ మానేరు నుంచి ఎస్.ఆర్.ఎస్.పి వరకు, ఇటు మల్లన్న సాగర్ వరకు నీరు అందుతుందన్నారు. అలా వచ్చిన నీటిని మొదట
చెరువులను మళ్లించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ప్రాజెక్టు కాల్వలపై
తూములు నిర్మించి,
చెరువులకు నీరు మళ్లించాలన్నారు. ఏదైనా చెరువుకు ఫీడర్
ఛానల్ లేకుంటే,
కొత్తగా కాల్వ తవ్వాలని ఆదేశించారు. ఎస్.ఆర్.ఎస్.పి. రెండో
దశ వరకు చెరువులు నింపాలని చెప్పారు.
ప్రాజెక్టు పనుల
పురోగతిపై కేసీఆర్ మార్చ్ నెల 30 వ తేదీన ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
మేడిగడ్డ,
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపుహౌజుల నిర్మాణాలపై సమీక్షించారు. మేడిగడ్డ నుంచి మిడ్ మానేరు వరకు నీటిని
తరలించడానికి నిర్మిస్తున్న కాలువ పనులపై
చర్చించారు. అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్,
కొండపోచమ్మ, గంధమల్ల, బస్వాపూర్ తదితర రిజర్వాయర్ల పనులు, కాల్వల పనులు, టన్నెల్ పనులపై కూలంకశంగా సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా
నిర్మిస్తున్న బ్యారేజీలు,
పంపుహౌజుల నిర్మాణం పూర్తవుతున్నందున, గోదావరి నీటిని ఎత్తిపోసి చెరువులు నింపాలని సిఎం చెప్పారు. వర్షాకాలంలో
చెరువులన్నీ నింపాలని,
దీనికోసం కాలువలకు ఎక్కడెక్కడ తూములు తీయాలో నిర్ణయించి, పనులు చేపట్టాలని కోరారు.
ప్రాజెక్టు కాలువల
ద్వారా వచ్చే నీరు,
వర్షం నీళ్లు, పడబాటు నీళ్లు అన్నీ
చెరువులకు మళ్లాలనీ, దీనికోసం కావల్సిన కాల్వలను సిద్ధం చేయాలనీ, తెలంగాణలోని చెరువులు, కుంటలతో పాటు కాల్వలు, వాగులు,
వంకలపై పెద్ద ఎత్తున నిర్మించిన చెక్ డ్యాముల్లో కూడా నీరు
నిల్వ ఉండాలనీ, తెలంగాణ భూభాగమంతా నీటితో కళకళ లాడాలనీ ఆ
సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. ప్రాజెక్టుల
నిర్మాణం పూర్తి చేయడంతోనే నీటి పారుదల శాఖ బాధ్యత పూర్తికాదని, ఆ ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించాలని చెప్పారు. ప్రాజెక్టుల నిర్వహణకు
అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఇప్పటికే నడుస్తున్న ప్రాజెక్టులకు
అవసరమైన బ్యారేజీలు,
రిజర్వాయర్లు, కాలువలు తదితర వ్యవస్థ
సిద్ధంగా ఉందని,
కానీ కాళేశ్వరంతో పాటు ఇతర కొత్త ప్రాజెక్టులకు అవసరమైన
వ్యవస్థలను అంతా కొత్తగా రూపొందించుకోవాల్సి ఉంటుందన్నారు. కొత్త వ్యవస్థలకు రూపకల్పన
చేసే క్రమంలోనే జాగ్రత్తగా,
వ్యూహాత్మకంగా వ్యవహరించాలని, ఎక్కువ ఆయకట్టు కవర్ అయ్యే ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.
ఏప్రిల్ నెలలో కాళేశ్వరం
ఎత్తిపోతల పథకం మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడం పట్ల ముఖ్యమంత్రి హర్షం
వ్యక్తం చేశారు. 124.4 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులతో 105 మీటర్ల ఎత్తుకు
నీటిని ఎత్తిపోసే పంపింగ్ అనుకున్నది అనుకున్నట్లు విజయవంతంగా జరగడం అత్యంత
ఆనందకరమైనదిగా సిఎం అభివర్ణించారు. ఇంతటి భారీ సామర్థ్యం కలిగిన పంపులను
విజయవంతంగా వినియోగించడం ద్వారా ఆసియా ఖండంలోనే ఈ ఘనత సాధించిన ఏకైక దేశంగా భారత్, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ
చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి చెప్పారు.
‘‘తెలంగాణ ప్రజలు
ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను పరిష్కరించదానికి కాళేశ్వరం దగ్గర మాత్రమే నీటి
లభ్యత ఉందని నిర్ధారించుకున్నాం. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి తెలంగాణలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్ ప్రణాళిక తయారు చేయడానికి నెలల తరబడి
కసరత్తు చేశాం. లైడార్ సర్వే నిర్వహించి, పక్కా అంచనాతో కాళేశ్వరం
ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. గోదావరి నుంచి నీటిని తోడడానికి గతంలో ఎన్నడూ లేని
విధంగా 139 మెగావాట్ల భారీ సామర్థ్యం కలిగిన పంపుసెట్లను వినియోగించడానికి డిజైన్
చేశాము. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కోపంపు గరిష్టంగా 120 మీటర్ల ఎత్తు వరకు నీటిని పంపింగ్ చేసే ప్రణాళిక ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు
తెలంగాణ రైతుల తలరాత మార్చే అదృష్టం’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
కాళేశ్వరం
ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రియల్ 30 న మరో సమీక్ష
నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపుహౌజుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, వాటి నిర్వహణకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. బ్యారేజీల
వద్ద నది ప్రవాహం ఎంత ఉధృతంగా ఉన్నప్పటికీ, ఎంత భారీ వర్షం
కురిసినప్పటికీ ప్రాజెక్టు నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగని రీతిలో హై ఫ్లడ్ లెవల్ కు
చాలా ఎత్తులో వాచ్ టవర్,
సిబ్బంది క్వార్టర్లు ఉండాలని సిఎం చెప్పారు. ప్రస్తుతమున్న
హెచ్ఎఫ్ఎల్ కాకుండా ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత వచ్చే హెచ్.ఎఫ్.ఎల్. ను పరిగణలోకి
తీసుకోవాలన్నారు.
కాళేశ్వరం
ప్రాజెక్టులో నీటిని లిఫ్టు చేయడానికి అవసరమయ్యే విద్యుత్ సరఫరా చేసే అంశంపై
ముఖ్యమంత్రి మే నెల 16 న విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది జూలై చివరి నుంచే కాళేశ్వరం నుంచి నీటిని
ఎత్తిపోయడానికి అవసరమైన విద్యుత్ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి
అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది నుంచి 2 టిఎంసిలు, వచ్చే ఏడాది నుంచి 3 టిఎంసిల నీళ్లను గోదావరి నుంచి ఎత్తిపోయాలని నిర్ణయించినట్లు ఆ సమీక్షలో సిఎం
చెప్పారు. ఈ ఏడాది రోజుకు రెండు టిఎంసిల చొప్పున నీటిని ఎత్తిపోయడానికి 3,800 మెగావాట్లు,
వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి రోజుకు మూడు టిఎంసిల నీటిని లిఫ్టు
చేయడానికి మొత్తం 6,100 మెగావాట్ల విద్యుత్ అవసరమని ముఖ్యమంత్రి చెప్పారు. కావాల్సినంత విద్యుత్ ను
సమకూర్చుకుని,
గోదావరిలో నీటి ప్రవాహం ఉండే ఆరు నెలల పాటు నిర్విరామంగా 24 గంటల పాటు సరఫరా చేయాలని చెప్పారు. ప్రతీ ఏడాది దాదాపు 540 నుంచి 600 టిఎంసిల నీళ్లను ఎత్తిపోసి 45 లక్షల ఎకరాల్లో రెండు
పంటలకు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సిఎం వివరించారు. ఎత్తిపోతల
పథకాలకు వినియోగించే కరెంటు కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సిఎం
వెల్లడించారు.
మే నెల 18, 19 తేదేలలో కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలన లో బాగంగా
కుటుంబ సమేతంగా,
ఉన్నతాధికారులతో కలిసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని, పార్వతి మాతని దర్శించుకున్నారు దర్శించుకున్నారు. స్వామి దర్శనం తర్వాత
కన్నేపల్లి పంప్ హౌజ్ నిర్మాణ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి కెసిఆర్, మేడిగడ్డ
కు చేరుకుని అక్కడ పూర్తి కావచ్చిన
బ్యారేజ్ పనుల పరిశీలించారు. వ్యూ పాయింట్ వద్ద పనుల పురోగతిని సంబంధిత అధికారుల ద్వారా ఆరాతీసి, మరింత త్వరిత గతిన పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు. అక్కడనుంచి
బ్యారేజ్ మీద నుంచి ప్రయాణిస్తూ, నడుమ ఆగిన ముఖ్యమంత్రి బ్యారేజ్ నిర్మాణాన్ని
గేట్ల బిగింపు,
తదితర పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. గోదావరి నీటి కోతను
తట్టుకునేందుకు అంచులకు నిర్మిస్తున్న కరకట్టల
నిర్మాణ పనులను పరిశీలించారు.
అనంతరం కాళేశ్వరం
ప్రాజెక్ట్ లో కీలకమైన కన్నేపల్లి పంప్ హౌస్ పనులకు క్షుణ్నంగా పరిశీలించారు.
పంపుహౌస్ లోనికి లిఫ్ట్ ద్వారా దిగి మోటార్ల పంపింగ్ పనితీరు గురించి ఇంజనీర్లను, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు
నుంచి నీటిని ఎత్తిపోయడం ప్రారంభిస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై
ముఖ్యమంత్రి కేసీఆర్ మే నెల 25 న మరో సమీక్ష నిర్వహించారు. ఇప్పటిదాకా కరువు ప్రాంతంగా ఉన్నతెలంగాణలో ఇకపై
నిరంతర నీటి ప్రవాహం ఉంటుందని, దీనికి తగినట్లుగానే
కాల్వల నిర్వహణ కోసం సమగ్ర వ్యూహం రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు
అధికారులను ఆదేశించారు. బ్యారేజిలు, రిజర్వాయర్లు, కాల్వలు,
డిస్ట్రిబ్యూటర్లు, తూములను నిర్వహించడానికి
సర్వసన్నద్ధం కావాలని చెప్పారు.
ఈ
నెల నాలుగో తేదీన మరో మారు కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ద్వారా ఈ ఏడాదే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నింపుతామని ఆ
సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందుకోసం
జగిత్యాల జిల్లా రాంపూర్ వద్ద నిర్మిస్తున్న పంపుహౌజ్ పనులను త్వరితగతిన పూర్తి
చేయాలని సిఎం ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని శ్రీరాంసాగర్ పునరుజ్జీవ
పథకం పనులను ముఖ్యమంత్రి పరశీలించారు.
రాంపూర్ వద్ద నిర్మిస్తున్న ఎనిమిది పంపు హౌజ్ పనులను సందర్శించారు. పనుల
పురోగతిపై సమీక్ష జరిపారు.
కాళేశ్వరం
ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని పట్టుదలతో వున్న ముఖ్యమంత్రి
కె.చంద్రశెఖర్ రావు కేవలం 15రోజుల వ్యవధిలోనే రెండొసారి నిర్మాణ
ప్రాంతాలను సందర్శించారు. మే నెల 19న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంపుహౌజ్ లను సందర్శించారు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలంటే దశాబ్దాలు పట్టే దేశంలో రెండు మూడేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో
భాగంగా పలు బ్యారేజీలను అత్యంత క్లిష్టమైన ఎత్తిపోతల నిర్మాణాలను విద్యుత్ సబ్
స్టేషన్లను పూర్తిచేస్తుండడంతో ప్రపంచం తెలంగాణ వైపు చూస్తున్నదని, వలసపాలనలో నత్తనడకన నడిచిన తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పనులు స్వయంపాలనలో
యుద్దప్రాతిపదికన పూర్తికావస్తుండడం గొప్ప విషయమని సిఎం అన్నారు.
తొలుత రాంపూర్
ఫంప్ హౌజ్ నిర్మాణం పనులను పరిశీలించిన
ముఖ్యమంత్రి అక్కడనుంచి మేడిగడ్డ బ్యారేజీ పనులను పర్యవేక్షించినారు. హెలీకాప్టర్ లో ఏరియల్ వ్యూ నిర్వహించిన అనంతరం ప్రాజెక్టుపక్కన వ్యూపాయింట్ నుంచి
మేడిగడ్డ పనుల పురోగతిని పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేసినారు. అక్కడనుంచి బ్యారేజీ మీదుగా ప్రయాణించి, ప్రాజెక్టుకు బిగింపును పూర్తి చేసుకున్న 85 గేట్లను అక్కడక్కడ ఆగి
పరిశీలించినారు. ఆ తర్వాత బ్రిడ్జిదిగి కాఫర్ డ్యాం మీదుగా గేట్లు నిర్మాణమవుతున్న
ఐదు ప్రదేశాల్లో అక్కడక్కడా ఆగి
పరిశీలించినారు.
ఇలా ఎప్పటికప్పుడు
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను ఉన్నత స్థాయిలో సమీక్షిస్తూ, స్వయంగా అక్కడ పర్యటించి పనుల పురోగతిని పరిశీలిస్తూ, ఆ చారిత్రాత్మక నేపధ్యంలో ఈ నెల 21 న అంగరంగ వైభోగంగా, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రుల సమక్షంలో, “నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ”
దిశగా ప్రారంభోత్సవం చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్
రావు. ఆయన ఆశయం నేరవేరుతున్న ఈ శుభ సందర్భంలో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు
శుభాకాంక్షలు.