సీతదగ్గర రాక్షస స్త్రీలను కాపలా పెట్టిన రావణుడు
శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-66
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (23-06-2019)
ఇంకా ఇలా కొనసాగించింది సీత.
“నీచబుద్ధికల రాక్షసా! రామచంద్రమూర్తి కోపంతో మండుతున్న కళ్ళను
చూసినంత మాత్రానే, ఆ నిమిషంలో కాలి నేలపడవా?
కుక్కను కొట్టడానికి బచ్చెనకోల కావాల్నా? అలాగే,
నిన్ను చంపడానికి బాణ ప్రయోగం అవసరమా? నీ
పరాక్రమం గురించి నువ్వు చెప్పిన మాటలు దంభవాక్యాలు. వాస్తవం చెప్తా విను.
రామచంద్రమూర్తికి కోపం వస్తే,
చంద్రుడినైనా నేలపడవేస్తాడు. రూపం కనబడకుండా భుజబలంతో చేయగలడు. అలాంటి అసమాన
బలసంపన్నుడు ఈ తుచ్ఛ సముద్రాన్ని దాటి వచ్చి,
తనమీద అనురాగం వున్న తన ఇల్లాలిని చెరనుండి విడిపించలేడని అనుకుంటున్నావా?
రాక్షసా! అవశ్యం విడిపిస్తాడు. నీ ఐశ్వర్యం,
నీ గృహాలు, లంక నీకింకా వుందని నన్ను ఆశ పెట్తున్నావు. ఎప్పుడైతే నువ్వు
పరస్త్రీని కామ దృష్టితో స్ఫృశించావో అప్పుడే నీ సంపద నాశనమై పోయింది. ఆయుస్సు,
ఇంద్రియబలం, దేహబలం, సర్వం నాశనమైనదని భావించు. నీ
కారణాన లంకాపురం పతిలేనిదై పోయింది. అక్కడి స్త్రీలు విధవలై పోయారు. ఇంతమాత్రానికా
ఈ పొగరు? వినాశకాలం సమీపించినా పోగరువల్ల తెలుసుకోలేక పోతున్నావు. ఎంత మూర్ఖుడివిరా?”
“అల్పబలం కల నన్ను నా భర్త దగ్గరనుండి
విడతీసినందున పాపాత్ముడా, నీ పాపం
నీకు కొంచెం సుఖం కూడా ఇవ్వదు. చూస్తుండు. నా మగడికి దేహబలమే కాదు....దైవ బలం కూడా
వుంది. కాబట్టి ఆయన అమితమైన తేజస్సు కలవాడు. నీకు దైవబలం లేదు. కాబట్టి నీకు
తేజస్సులేదు. నువ్వు చెప్పిన దేబె, జోగి
నువ్వే కాని రామచంద్రుడు కాదు. ఆయన ధర్మయుక్తమైన నడవడి కలవాడు. మంచి మనస్సు
కలవాడు. భయం అంటే ఏమిటో తెలియనివాడు. అసమానమైన శౌర్యంలొ ఆయన్ను మించినవారు లేరు.
భయంకర మృగాలున్న అడవిలో ఉన్నాడాయన. నీ బలాన్ని,
నీ గర్వాన్ని బాణాల వర్షంతో కక్కిస్తాడు. మృత్యువు సమీపించిన వాళ్లు కాల మహిమ వల్ల
వాళ్లు చేయాల్సిన పనులు కాకుండా చేయకూడని చెడు పనులను అవే మంచివనుకుని చేస్తారు. ఆ
విధంగా నాశనమైపోయే కాలం నీకూ, నీ
రాక్షసమూకకు, నిన్ను కట్టుకున్న స్త్రీలకు,
నువ్వు నన్ను బలవంతంగా తేవడం వల్ల ఏకకాలంలో కలిగింది”.
“యజ్ఞశాల మధ్యలో వున్నా ఉపకరణాల పాత్రను,
వేదమంత్రాలతో పవిత్రంగా వుంచాల్సిన దాన్ని,
ఎవరైనా తాక వశమా? అలాగే పతివ్రతనైన నేను కూడా
పవిత్రమైన వేదినే. ధర్మం విడనాదని దశరథరాజు కుమారుడి భార్యనైన,
పతివ్రతనైన నన్ను రాక్షసాధముడా, పాపాత్ముడా,
దుష్ట చరితుడా, మూర్ఖుడా, నీకు తాక
సాధ్యమా? ఓరీ! నీ వల్ల నేను చెడిపోను. నాకా భయం లేదు. నా భర్త ఇక్కడికి ఎలాగూ
వస్తాడు. నిన్ను ఎలాగూ చంపుతాడు. లంకా నాశనం కాక తప్పదు. ఇది నిశ్చయం. నీకు నేను
భయపడను, వశపడను. నన్నిప్పుడే చంపుతానంటావా? ఈ
దేహం జడ పదార్ధం. దీన్ని కట్టేస్తావా?
కానివ్వు. తింటావా? తిను. దాని వల్ల నాకేం నష్టం
లేదు. ఈ శరీరం నేను రక్షించవలసిన అవసరం నాకు లేదు. వున్నా,
పోయినా ఒకటే. నా శరీరం చెడ్డా, నేను
చెడిపోను. నా మనస్సు చెడితే నేను చెడిపోయినట్లు. నా మనస్సు నా స్వాధీనంలో వుంది.
దాన్ని నువ్వేం చేయలేవు”. ఇలా అని ఊరుకుంది సీతాదేవి. కఠినంగా మాట్లాడి,
కోపంతో ఏమీ మాట్లాడకుండా సీతాదేవి వుండిపోవడంతో,
రావణుడు ఆమెకు భయం కలిగే విధంగా మండిపడుతూ,
ఇలా అన్నాడు.
“ఓసీ నవ్వు ముఖందానా! సీతా,
విను. ఇక్కడ నుండి పన్నెండు నెలల్లో నువ్వు నామీద విశ్వాసం కలిగి,
ప్రేమగా నన్ను కామించకపోతే, ఆ గడువు
ముగుస్తుండగానే, నా ఉదయం భోజనానికి, నా
వంటవాళ్లు నిన్ను ముక్కలుగా కోసి వండుతారు” అని చెప్పి,
ఆమెకు కాపలాగా వున్న రాక్షస స్త్రీలను చూసి తన కోపం తగ్గిపోయే విధంగా సీతాదేవి
కొవ్వు తీసేయండని చెప్తాడు.
(సీతాపహరణం జ్యేష్టమాసంలో జరిగింది.
రామ-రావణ యుద్ధం ఫాల్గుణ మాసంలో, కృష్ణ
పక్షంలో జరిగింది. హనుమంతుడు సీతాదేవిని సందర్శించింది ఫాల్గుణ మాసారంభంలో.
అప్పటికి పది నెలల గడువు అయింది).
రావణుడి మాటలకు రాక్షస స్త్రీలు అంగీకార
సూచనగా నమస్కరించారు. అప్పుడు రావణుడు నేలను గట్టిగా తన్నుకుంటూ,
సీతను అశోకవనానికి తీసుకు పొమ్మంటాడు. అక్కడ ఆమెను వుంచి ఎల్లప్పుడూ విడువకుండా
ఆమె చేష్టలను మిక్కిలి రహస్యంగా గమనించమని చెప్తాడు. “భయంకర చూపులు కలవారా...వికార
రూపాలు కలవారా....మాంసం, నెత్తురు
ఆహారంగా కలవారా....ఈ సీతను మంచిమాటలతో కాని,
బెదిరించి కాని, మచ్చిక చేసుకుని నాకు స్వాధీనం చేయండి” అని అంటూ రావణుడు
అక్కడినుండి పోతాడు. ఆ తరువాత రాక్షస స్త్రీలు సీతాదేవిని అశోకవనానికి తీసుకుని
పోయారు. ఇక అప్పటినుండి సీత రాకాసుల గుంపుల వశంలో వుండిపోయింది. కట్టివేయబడిన ఆడ
జింకలాగా అయిందామె పని. భయం కలిగించే పెద్ద కళ్ళ రాక్షస స్త్రీలు భయపెట్టుతుంటే,
తన ప్రియుడు, శ్రీకరుడు, దైవం
అయిన మగాడిని సర్వదా ధ్యానించ సాగింది.
No comments:
Post a Comment