లక్ష్మణుడిని చూసి సీతను తలచుకుని దుఃఖపడిన రాముడు
శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-67
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (30-06-2019)
ఇక్కడ సీతాదేవి వ్యవహారం,
సంగతులు ఇలావుంటే, అక్కడ దండకలో రాముడి సంగతి వేరే
విధంగా వుంది. కామరూపి, మాంస
భక్షకుడు, జింక రూపం ధరించిన వంచకుడు మారీచుడుని చంపిన రాముడు ఆశ్రమానికి
రావాలని త్వర-త్వరగా వస్తుంటే, వెనుక
పక్క నక్క కూత వినిపించింది. ఇది అశుభం తెలుపుతున్నది, దీనివల్ల
కీడు కలుగుతుంది, అని భావించిన రాముడు,
రాక్షసులు సీతను ఎత్తుకు పోయారేమో అని అనుమానిస్తాడు. దుష్టుడైన మారీచుడు తన గొంతు
లాంటి గొంతుతో గట్టిగా అరిచాడనీ, ఆ ధ్వనిని
సీత, లక్ష్మణుడు వింటే సీత తప్పక తన కోసం లక్ష్మణుడిని పంపుతుందనీ,
లక్ష్మణుడు తనను వెతుక్కుంటూ అడవిలో సీతను ఒంటరిగా వదులుతాడనీ,
ఆ తరువాత ఏమి కీడు జరుగుతుందోననీ శంకిస్తాడు రాముడు. తనలో తాను ఇలా
అనుకుంటాడు రాముడు:
“ఔరా! ఏమి విచిత్రం?
లోకంలో బంగారు జింక వుంటుందా? మారీచుడు
నన్ను ఈ విధంగా మోసం చేసి దూరంగా తెచ్చి, నా
బాణాలతో చస్తూ, వూరికే చావకుండా, సీతా...లక్ష్మణా...అని
అరుస్తూ చావాలా? ఇదంతా ఆలోచిస్తుంటే, నాకు
ప్రత్యక్షంగా కీడు చేయలేరు కాబట్టి రాక్షసులే మాయతో సీతకు కీడు చేయనున్నారా?
కాబట్టి ఒంటరిగా వున్నా కలికి సీతకు, నా చిన్న
తమ్ముడికి క్షేమం కలగుగాక! జనస్థానవాసం కారణాన రాక్షసులతో అంతంలేని విరోధం
కలిగింది. అపసకునాలు విస్తారంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా నక్కల అరుపులు
వినపడుతున్నాయి. ఏమి కీడు రానున్నదో? ఏ ఘోర
విషయం చూడడం తటస్థిందో? ఏమి
చేయగలం? సీతా లక్ష్మణులు ఏ గతి పట్టారో” అని వ్యసనపడ్డాడు రాముడు.
నడుచుకుంటూ వస్తున్న రాముడికి మృగాలు, పక్షులు,
కుడి నుండి ఎడమవైపుగా భయంకర ధ్వని చేసుకుంటూ పోవడం జరిగింది. ఇది చూసి,
లక్ష్మణుడిని, సీతను గురించి ఆలోచించుకుంటూ ఆలశ్యం చేయకుండా పోసాగాడు రాముడు.
ఇలా పోతున్న రాముడు ఆశ్రమాన్ని
సమీపించాడు. అక్కడే ముఖం వేలాడవేసుకుని, ఒంటరిగా
వస్తున్నా తమ్ముడి చూశాడు. వెంటనే ఏదో కీడు జరిగిందని శంకించాడు. తమ్ముడిని
సమీపించి, ఆయన ఎడమచేయి పట్టుకుని, విచారంగా
మొదలు పరుశంగాను, తరువాత మృదువుగాను,
ఇలా అన్నాడు. “అయ్యో లక్ష్మణా! ఏం పనిచేసావు? ఎందుకు
ఒంటరిగా సీతను అడవిలో విడిచి ఇక్కడికి వచ్చావు?
రాక్షసులు ఆ ఆడదాన్ని తిన్నారో? తీసుకుని
పోయారో? ఈ రెండింటిలో ఒకటి జరిగి వుండాలి. సందేహం లేదు. అశుభ చిహ్నాలు
కనపడుతున్నాయి. అన్నా! లక్ష్మణా! సీతాదేవి ప్రాణంతో వుండగా మనం చూడగలమా?
లేదనుకుంటా. ఎందుకంటావా? అదిగో
చూడు, విను. నక్కలు, పక్షులు,
పెద్ద మృగాలు, సూర్యుడికి ఎదురుగా పరుషపు ధ్వనులు చేస్తున్నాయి. ఆ అపశకునాలు
మనకెలా మేలు కలిగిస్తాయి? జింక
లాగా కనిపించిన ఈ దుష్ట రాక్షసుడు మోసంతో నన్ను చాలా దూరం తీసుకుని పోయాడు. వాడి
మోసపు ఆటలు అర్థంకాగానే చంపేశాను”.
“లక్ష్మణా! ఎడమకన్ను అదురుతున్నది. సంతోషం మనస్సులో ఏమాత్రం లేదు. నాయనా,
ఆశ్రమంలో సీత లేదు. పగ తీర్చుకోవడానికి రాక్షసులు ఆమెను పట్టుకుని పోయారో లేక వారి
బాధ పడలేక ఆమే చనిపోయిందో లేక మనల్ని వెతుక్కుంటూ వచ్చి దారి తెలియక వేరే తోవలో
ఎక్కడికైనా పోయిందో? ఇంట్లో సుఖం లేదని సాధారణంగా
స్త్రీలు బాధపడుతుంటారు. స్త్రీల బుద్ధి ఇలా ఉన్నప్పటికీ,
ఎవరూ చెప్పకపోయినా, బలవంతపెట్టకపోయినా,
సుఖపడడానికి కాకుండా వినోదం చూడడానికి, దండకారణ్యంలో
కాలినడకన తిరగడానికి నామీద భక్తితో సీత వచ్చింది. నేనెలాంటి వాడిని?
రాజ్యహీనుడిని. దుఃఖంతో తపించేవాడిని. నిలువనీడ ఇవ్వడానికి పిలిచేవారు లేని
ద్రిమ్మరిని. ఇలాంటి నేను నా కష్ట దశలో సహాయంగా వున్న, చేతనైన
సుఖం కలిగించిన, జనకరాజ పుత్రికను వదిలి వచ్చానే,
తమ్ముడా! నా భార్య ఏమైపోయిందో చెప్పవయ్యా?
ఊపిరితో వుందా? లేదా?”.
“నా ప్రాణాలు,
దేహం నిలబడడానికి ఎవరైతే సహాయ పడ్డారో ఆమెను ఎడబాసి ఈ దేహాన్ని రక్షించలేను.
అలాంటి ఆమె నా దగ్గర లేకపోతే సార్వభౌమత్వం కాని,
ఇంద్రత్వం కాని కోరను. అట్లాంటి సుమకోమల సీత ఏదిరా లక్ష్మణా?
అన్నా, లక్ష్మణా! నా ప్రాణాలకంటే నాకు ప్రియమైనది కావడం వల్లే నా ప్రాణం
ఇచ్చైనా, నేనెవరిని రక్షించాలో అలాంటి సీత దండకలో ప్రాణాలతో వుందా?
లేదా? అది ముందు చెప్పు. నేను పద్నాలుగు సంవత్సరాలు అరణ్యంలో కోరతలేకుండా
వుంటానని చెప్పాను. ఇప్పుడు సీత లేకపోతె నేను చెప్పిన మాట అసత్యం కాదుకదా?
దానివల్ల రాముడు సత్యప్రతిజ్ఞుడనే గొప్పతనానికి హానికలగాడు కదా?
నాయనా చెప్పరా! సీత మరణిస్తే, నేనూ
మరణించినట్లే. మేమిద్దరం లేకపోతే నీకు ఈ అడవిలో పనేముంది?
అయోధ్యకు వెళ్లు. నువ్వు అయోధ్యకు రావడం చూసి, నేను
అడవుల్లో చావాలనుకుంటున్న కైక తన కోరిక నెరవేరిందని సంతోషిస్తుంది కదా?”.
“లక్ష్మణా! సీతాదేవి ప్రాణాలతో వుంటే
ఆశ్రమానికి వస్తాను. లేకపోతె, అంతదూరం
రావడం ఎందుకు? ఇక్కడే చస్తాను. కాబట్టి, సీత
జీవించి వుందా, లేదా చెప్పు. నేను వెళ్లేటప్పుడు జీవించి వ ఉన్న ఆమె,
ముద్దులు ఒలుకుతూ, నవ్వుతూ,
నాకెదురుగా వచ్చి మంచి మాటలు చెప్పకపోతే నేను ఆశ్రమానికి రాను. దానిముందే
మరణిస్తాను. లక్ష్మణా! చెప్పు, సీత
ప్రాణంతో వుందా? రాక్షసులు ఏమన్నా మింగారా? రాక్షసులు
ఎత్తుకు పోయారా? అయ్యో ఆమె చిన్న వయసుది. మంచి స్వభావం కలది. విలాసంతో వున్నది.
ఎక్కడుందో? ఏమో? మారీచుడి అరుపుకు సీత మోసపోయినా,
నువ్వెలా మోసపోయావు? సీత పొమ్మన్నా రక్షించాల్సిన
వాడివి అబలను ఒంటరిగా వదలి ఎలా వెళ్లావు? అలా
వెళ్లి మనకు కీడు చేసే రాక్షసులకు అవకాసం ఇచ్చావు. రాక్షసులు ఆమెను చంపారో?
ఏమో? ఇలా జరగవచ్చని కొంచెమైనా ఆలోచించావా?
అయినా నిన్ను అని ప్రయోజనం లేదు. సముద్రంలో మునిగాను. చెడ్డాను,
చచ్చాను. ఇంతకంటే ఎక్కువ ఏమికావాలి? ఈ గతి
నాకు కలగాలని మీకీ బుద్ధి పుట్టించాడు.” అని సీతకొరకై రాముడు వెక్కి-వెక్కి
ఏడ్చాడు.
No comments:
Post a Comment