Sunday, June 2, 2019

సీతతో లంక చేరిన రావణుడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-63 : వనం జ్వాలా నరసింహారావు

సీతతో లంక చేరిన రావణుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-63
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (02-06-2019)
         పాపాత్ముడు రావణాసురుడు సీతాదేవిని అలా తీసుకుపోతుంటే అప్పటిదాకా ఒక్కడైనా కనపడలేదు. అలా జరిగినందుకు బాధపడుతున్న సీతాదేవికి ఒకచోట కొండశిఖరం మీదున్న ఐదుగురు వానరులు కనిపించారు. వీరన్నా తన స్థితిని రాముడికి చెప్పకపోతారా అని భావించిన సీత తన సొమ్ములను తీసి కొంగులో ముడివేసి, వారిముందర పడేట్లుగా ఆ మూటను కిందకు జారవిడిచింది.

(రావణుడు సీతను చంకలో ఇరికించుకుని పోయాడు. ఆమె కుదురుగా వుండలేదు. ముందు-వెనుకలకు వాలుతూ వుంది. ఎవరెప్పుడు అడ్డం తగులుతారో అన్న భయంతో త్వరగా లంకకు చేరాలన్న  తపన రావణుడిది. రామలక్ష్మణులు రాకపోతారా అని సీత ఆశ. ఇలా చంకలో పొర్లడం వల్ల వెనుకపక్కగా వాలి సీత సొమ్ములను ఉత్తరీయంలో ముడికట్టి కిందకు పడేసింది. సీత పైటకొంగు చింపలేదు. సీతకు ఇప్పటి స్త్రీలలాగా పైటలేదు. కట్టుకున్న వస్త్రం ఒకటి, కప్పుకునే వస్త్రం ఉత్తరీయం ఒకటి వున్నాయి. ఇలా కప్పుకున్నదానిలో సొమ్ములు మూటకట్టి పడేసింది).

సీతాదేవి సొమ్ములు మూట కట్టి కిందపడేయడం వేగంగా పోతున్న రావణుడు గమనించలేదు. చూసే వ ఉన్నట్లయితే దాని ఆనవాలు లేకుండా చేసేవాడు. ఇక వానరులు, “రామా! రామా!” అని ఏడుస్తున్న సీతను చూశారు. ఎత్తుకుని పోతున్నవాడు రావణుడని సుగ్రీవాదులు గుర్తించారు కాని ఆమె ఎవరో తెలుసుకోలేక పోయారు. ఇలా వాడెందరినో ఎత్తుకుపోవడం వారికి తెలసు. మనకెందుకు అనవసర కలహం అని వాళ్లు వూరకే వుండిపోయారు. బలవిద్వోరధం ఎందుకనుకున్నారు. అదీకాక రావణుడికి, వాలికి స్నేహం వుందని వాళ్లకు తెలుసు. ఈ వార్త తెలియగానే ఇదే సమయమని వాలి, తమ్ముడు సుగ్రీవుడిని, చంపడానికి బయల్దేరుతాడు. ఇవన్నే ఆలోచించి వానరులు ఊరకే వుండిపోయారు.

ఇదిలా వుండగా రాక్షసరాజు రావణాసురుడు అమిత వేగంగా సీతను చంకలో వుంచుకుని, బలాత్కారంగా పర్వతాలు, తటాకాలు దాటి అవలీలగా, అదుపూ-అడ్డం లేకుండా సముద్రాన్ని సమీపించాడు. మొసళ్లు, పాఠీనాలు, తిములు, తిమింగలాలు వున్న సముద్రాన్ని చేరగానే తన గడ్డమీదకు వచ్చాననీ, ఇక తనకు భయం లేదనీ రావణుడు సంతోషిస్తూ వుంటే ఇక వాడు చచ్చినట్లే అని సిద్ధులు అనుకున్నారు.

         లంకానగరం చేరిన రావణుడు, పూర్వం మయుడు మాయతో తాను నిర్మించిన గుహలో హేమను వుంచిన తరహాలో, తన అంతఃపురంలో సీతను వుంచి, పిశాచ స్త్రీలను పిలిచి స్వర్వకాల సర్వావస్థలలో సీతమీద కావలిగా వుండమని ఆదేశించాడు. సీత వున్న చోటుకు స్త్రీలను కానీ, పురుషులను కానీ రానివ్వద్దని చెప్పాడు. ఆమె కోరినవి, అవి బంగారమైనా, రత్నాలైనా, వస్త్రాలైనా ఏదైనా సరే అది తెచ్చి ఇవ్వమన్నాడు. తెలిసికాని, తెలియకకానీ సీత విషయంలో కఠినంగా మాట్లాడవద్దని హెచ్చరించాడు. ఇలా ఉత్తర్వులు ఇచ్చి ఆ రాక్షసుడు రావణాసురుడు అంతఃపురం విడిచి, ఆ తరువాత తనేం చేయాలో ఆలోచించి, తనకు బ్రహ్మ వరం కలదు కనుక తనకేం కాదని గర్వపడ్డాడు.


         రావణుడు అంతఃపురం వదిలిన తరువాత గొప్పబలం కల ఎనిమిదిమంది రాక్షసులును పిలచి, సందేహం లేకుండా, విశిష్టమైన ఆయుధాలన్నీ తీసుకుని దండకారణ్యానికి పొమ్మని వారిని ఆదేశించాడు. ఆ తరువాత ఇలా అన్నాడు వాళ్లతో: “దండకలో ఖరాదులు చంపబడ్డ స్థలంలోనే మీరు వుండండి. అది పూర్వం ఖరుడున్న స్థలం. మీకు భయం లేదు. పౌరుషంగా వుంటూ, శత్రువుల రాక-పోకలను గమనించండి. పూర్వం నేనక్కడ వుంచిన ఖరాదులైన రాక్షస నాయకులను రాముడు చంపాడు. దాంతో నాకు ఆయనతో విరోధం కలిగింది. ఆ పగ తీర్చుకోవడానికి ఉపాయం ఆలోచిస్తున్నాను. ప్రత్యక్షంగా పోయి యుద్ధం చేయడానికి ధైర్యం చాలడం లేదు. అలా అని ఊరకే వుండడం కుదరదు. కోపం వస్తున్నది. ఏ విధంగానైనా రాముడిని రణంలో చంపి కాని నిద్రపోను”.

         “కాబట్టి, ఖరుడిని చంపినవాడిని ఎలా చంపాలా అని నేను ఆలోచిస్తున్నాను. రాముడిని చంపికాని సుఖపడను. మీరక్కడికి పోయి రాముడి చర్యలన్నీ కనిపెట్టి రాత్రనక, పగలనక ప్రతిదినం హెచ్చరికగా తిరగండి. ఒక్కచోటే వుండవద్దు. ఎప్పటికప్పుడు ఆ రాముడి వృత్తాంతం, విశేషాలు నాకు చెప్తుండండి. మీరు ఆ రాజకుమారులను చంపడానికి కూడా ప్రయత్నం చేయండి. ఇంతమంది వుండగా మీ ఎనిమిది మందినే ఎందుకు పంపుతున్నాను అని అడుగుతారేమో? మీ బలం, శౌర్యం నేను అనేక యుద్ధాలలో చూశాను కాబట్టీ, మీ విషయం బాగా తెలసు కాబట్టీ, ఈ మహాకార్య భారాన్ని మీమీద వుంచుతున్నాను. ఇతరులు ఇంత పని చేయలేరు”.

         ఈ విధంగా సంతోషం కలిగించే మాటలను రావణుడు చెప్పడంతో విన్న ఆ ఎనిమిదిమంది రాక్షసులు రావణుడికి నమస్కారం చేసి, అతడి ఆజ్ఞానుసారం కనబడనంత వేగంగా ప్రయాణం చేసి దండకకు చేరారు. ఈ విధంగా రావణుడు రాముడిమీద పగబట్టి, సీతను తెచ్చి, అజ్ఞానంతో “కృతకృత్యుడనయ్యాను, సీత దక్కింది, రాముడు చచ్చాడు” అని సంతోషించాడు.

No comments:

Post a Comment