తన సౌధాన్ని సీతకు చూపించిన రావణుడు
శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-64
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (09-06-2019)
పరాక్రమవంతులు,
బలవంతులైన ఎనిమిదిమంది రాక్షసులను దండకారణ్యానికి పొమ్మని ఆజ్ఞాపించిన రావణుడు,
ఇక తనకు రాముడివల్ల భాయంలేదని తన జ్ఞానహీనత వల్ల భావించాడు. ఇలా అనుకున్న రావణుడు,
మన్మథ బాణాలకు లోని, సీతాదేవిని తలచుకుంటూ,
వెంటనే ఆమె వున్న ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ రావణుడు తన ఆజ్ఞానుసారం రాక్షస
స్త్రీల కాపలాలో వుండి,
కలతచెందిన సీతను, తనకు ముఖం చాటేస్తున్న దానిని,
చూసాడు. రేచు కుక్కలు చుట్టుముడితే భయపడే ఒంటరి ఆడ జింకలాగా,
ఆడ తాచుపాములాగా నిట్టూర్పులు విడుస్తున్న సీతను,
తన నగర సౌందర్యం చూపించడానికి, రావణుడు,
బలాత్కారంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు.
వేలాదిమంది స్త్రీలను,
నిగ-నిగాలాడే రత్నాలుగల అందమైన మేడలను, మిద్దెలు,
పక్షులు కల ఇంటిలో బంగారు వాకిలిలో ఒక సోపానం ఎక్కి సీతతో రావణుడు ఇలా అన్నాడు.
“ఓ సీతా! ఈ వైపు చూడు. బంగారం,
దంతంతో కూడి నిర్మలంగా వున్నా కిటికీలు ఎన్ని ఉన్నాయో! ఎట్లా వున్నాయో! ఆ పక్కన,
మనోజ్ఞంగా, కాంతిగా కల గృహాలెన్ని వున్నాయో! ఓసీ ముద్దరాలా! ఆ పక్కన మనోహర
క్రీడల్లో ఆసక్తికల ఆడ హంసలు ఎలా వున్నాయో చూడు. ఈ పక్కన ఇంపు-సోంపు కలుగు
పూజ్యమైన కొత్త-కొత్త ప్రమదావనాలు ఎలా వున్నాయో చూడు. కొలకుల సోంపు ఆధిక్యత ఎలా
వుందో చూడు. చిలుకల గుంపుల కలకల ధ్వనులు ఎలా వున్నాయో చూశావా?
పూచిన చెట్లన్నీ సంతోషంగా వున్నాయి. చూసావుకడా! ఇకనైనా నీ మైకాన్ని వదిలిపెట్టు”.
ఇలా దేవతలా ఇళ్ల లాంటి తన ఇళ్లను చూపించి
ఇంకా ఆమెను మోసం చేయడానికి మళ్లీ ఇట్లా అన్నాడు.
“శ్రేష్టమైన ఈ గృహాలు,
అసమాన గౌరవార్హమైన ఈ రాజ్యం, వేలాది
మంది నా రాణులు, నా బతుకు, ఇవన్నీ
నీస్వాదీనం చేస్తాను. ఇప్పుడు నువ్వు వీటన్నిటికీ పట్టపు రాణివి. ఎందుకు ఏడుస్తావు?
నన్ను భర్తగా స్వీకరించు. సంతాపంతో ఏడుస్తుంటే,
నీ ఏడుపుకు అంతం వుండదు. యావజ్జీవం నువ్వు ఇలా ఏడ్వాల్సిందే. అలాకాకపోతే సుందరీ!
నీ యోగ్యతకు తగ్గ మంచిమార్గాన్ని చెప్తా విను. నా మాటలు ఆదరించి విను. ఇంకా రాముడు
వస్తాడు....నన్ను తీసుకు పోతాడు....ఆయనతో అడవిలో అల్లాడుతాను....అని ఆశలు
పెట్టుకోవద్దు. నామాట ఇంక ఏమాత్రం ఉపేక్ష చేయొద్దు. కామ బాణాలతో పీడించబడుతున్న
నన్ను తోసిపుచ్చడం నీకు తగునా?”
“నా మగడు ఎందుకు రాడు?
నావి వ్యర్థాశలు ఎలా అవుతాయి అంటావేమో? విను.
నూరామడల వైశాల్యం కలిగి, వేలాది
భయంకర రాక్షసులు వున్న లంకను గురించి నువ్వేమనుకుంటునావు?
నీ వూరు లాంటిదే అనుకుంటున్నావా? ఇంద్రుడు
మొదలైన దేవతలు కాని, రాక్షసులు కాని సమీపానికైనా
రాలేరు. ఇక రాముడు లంకలోకి రావడం ఎలా సాధ్యపడుతుం ది?
సముద్రాన్ని ఎలా దాటుతాడు? కోటలను
ఎలా భేదిస్తాడు? ఇంతమంది రాక్షసులు ఉరకే చూస్తూ వుంటారా?
ఒకవేళ వచ్చాడనుకో....యుద్ధంలో యక్ష-దేవతా సమూహాలు కూడా బలంలో నాతొ సమానం కాదే. ఇక
ఒంటరిగాడు, మనుష్యుడు, వచ్చి,
నాతో యుద్ధం చేసి,
గెల్వగలడా? కాబట్టి నీకోరికలు గొంతెమ్మ కోరికలే!”
“రాజ్యం లేనివాడిని,
దీనుడిని, బతికే మార్గం లేనివాడిని, కొంచెమే
తేజం కలవాడిని, రాముడు-రాముడని పదే-పదే తలచి-తలచి ఎందుకేడుస్తావు?
అలాంటివాడు నీకు తగిన భర్త కాడు. నీకు తగిన భర్తను నేనే. కాబట్టి నన్ను పొందు. ఓసీ
పిరికిదానా! యవ్వనం శాశ్వతమా? కాదు.
వృథాగా వయస్సు పోతే ఆ తరువాత ఏం సుఖపడతావు?
కాబట్టి ఇప్పుడే నాతో సుఖంగా వుండు. రాముడిని చూస్తానని ఇంకా ఎందుకు ఆశపడుతున్నావు?
శరీరంతో రావడం సంగతి అటుంచు....మనసుతోనైనా ఇక్కడికి రాగలడా?
నువ్విక్కడ వున్నసంగతి తెలిసేదెలా? తెలిసినా
రావడం ఎలా? అగ్నిజ్వాలలను చేత్తో పట్టుకోవడం సాధ్యమా?
చలించే కళ్ళదానా! విను. నా భుజబలంతో కాపాడబడుతున్న నిన్ను పరాక్రమంతో నన్ను గెలిచి
తీసుకుపోయేవాడు లోకంలో లేడు. నన్ను రాజ్యసంపదతో ఏలుతే దేవతలు,
చరాచర భూతసంఘాలు నీ సేవ చేస్తాయి”.
“నువ్వెందుకు సందేహిస్తున్నావు?
ఎవరికీ భయపడుతున్నావు? లంకా రాజ్యానికంతా పట్టాభిషిక్తవై
ఏలుకో. నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను. కష్టాలు అనుభవిస్తే పాపాలు తగ్గుతాయి.
కాబట్టి నువ్వు గతంలో చేసిన పాపాలు కారడవుల్లో కష్టపడడం వల్ల నశించాయి. పూర్వం
నువ్వు చేసిన పుణ్యాలు అనుభవించే కాలం వచ్చింది. ఈ చందనాన్ని మనమిద్దరం
పూసుకుందామా? పూల సరాలు ధరించుదామా? బంగారు
ఆభరణాలు ధరిద్దామా? సీతా పుష్పకం అని పేరున్న ఈ
విమానం నలుదిక్కులా వ్యాపించే సూర్యకాంతి లాంటిది. దీన్ని మా అన్న కుబేరుడి నుంచి
యుద్ధంలో జయించి తెచ్చాను. ఇది చాలా మనోజ్ఞమైంది. దీంట్లో మనిద్దరం సుఖభోగాలను
అనుభవిద్దామా? కమలం లాంటి కాంతికల నీ ముఖం నువ్వు ఏడవడం వల్ల సహజ విధం చెడింది. ఈ
వ్యాకులత్వం వదిలి నన్ను దయతో ఏలుకో”.
ఇలా రావణుడు అనడంతో,
సీతాదేవి వాడికి తన ముఖం కనబడకుండా చీరే కొంగులో కప్పి,
కళ్ళ వెంట నీళ్ళు కారుతుంటే భయపడసాగింది. సీతాదేవి అలా ముఖం కప్పుకోవడం చూసిన
రావణుడు ఇలా అన్నాడు. “సతీ! పతివ్రతా ధర్మం చెడుతుందని అభిప్రాయంతో సిగ్గు
పడుతున్నావు. చాలు-చాలు. సిగ్గుపడాల్సిన పని లేదు. ఏడవాల్సిన పనీ లేదు. ధర్మానికి
లోపం కలిగించే కార్యం ఇందులో ఏముంది? జానకీ!
నీ పాదధూళి నా శిరస్సు మీద ధరించి నిన్ను ప్రార్థిస్తున్నాను. నేను నీ దాసుడిని.
దయతో నన్ను ఏలుకో. మన్మథ తాపంతో నీచపు మాటలన్నాను. నీ పాదాలకు నా పదితలలు
నమస్కరించాను”.
ఇలా సీతతో పలికిన రావణుడు తనకీ
స్త్రీరత్నం దక్కెననుకుంటాడు.
No comments:
Post a Comment