Sunday, June 2, 2019

సమస్త భూమండలం తిరిగిన సుగ్రీవుడు : వనం జ్వాలా నరసింహారావు


సమస్త భూమండలం తిరిగిన సుగ్రీవుడు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచికలు (26-05 & 02-06-2019)  
         సీతాదేవిని వెతకడానికి నలుదిక్కులకూ ఒక్కొక్క వానర నాయకుడి నేతృత్వంలో కోటానుకోట్ల వానర వీరులను పంపించే ముందర వాళ్ళు వెళ్లే దిక్కులో వున్న ప్రదేశాలను వివరంగా చెప్పాడు వాళ్లకు సుగ్రీవుడు. ఒక విధంగా ఆయన మాటల్లో అది సమస్త భూమండలమే! వానరులంతా ప్రయాణమై సీతాన్వేషణకు వెళ్లిపోయిన తరువాత సుగ్రీవుడితో రామచంద్రమూర్తి, ఈ సమస్త భూమండలం ఆయనకెలా తెలుసని ప్రశ్నించాడు. జవాబుగా సుగ్రీవుడు శ్రీరాముడికి....

దుందుభి అనే దైత్యుడు దున్నపోతు ఆకారంలో వాలిమీదకు యుద్ధానికి వచ్చిన సంగతి, వాలి అతడిని మలయ పర్వతం దాకా తరిమికొట్టిన సంగతి, వాడు భయపడి పర్వతం గుహలోకి ప్రవేశించిన సంగతి,  వాడిని చంపాలని వాలి కూడా గుహలోకి వెళ్ళిన విషయం, తాను వినయంగా గుహద్వారం దగ్గర వుండిపోయిన వ్యవహారం, ఒక్క సంవత్సరం గడిచినా అన్న రాలేదన్న విషయం, దరిమిలా నెత్తుటి వరదలు బిలమంతా నిండిన విషయం, అది చూసి వాలి చనిపోయాడని బాధపడడం, ఒక పెద్ద గుండును వాకిటికి అడ్డంగా పెట్టి కిష్కింధకు రావడం, అన్న చనిపోయాడని నిశ్చయించి రాజ్య భారాన్ని చేపట్టిన విషయం  అంతా చెప్పాడు.

ఆ తరువాత దానవుడిని చంపి వాలి నగరానికి రావడం, తాను అతడి కాళ్లకు మొక్కి రాజ్యాన్ని అప్పగించడం, అయినా వాలి కోపంతో తనను ఇల్లు వెళ్లగొట్టి చంపడానికి ప్రయత్నం చేయడం, వాలిని తప్పించుకోవడానికి తాను తన మంత్రులతో సహా రేయింబవళ్ళు వేగంగా పరుగెత్తడం, వాలి వెంటాడడం, భూమండలం అంతా తనకు కాళ్లవాపు వచ్చేదాకా పరుగెట్టడం వివరించాడు సుగ్రీవుడు. అప్పుడు స్పష్టంగా అద్దంలో చూసినట్లు భూమండలం అంతా చూశానంటాడు. తూర్పు దిక్కుగా పోయి, పెద్ద చెట్లు, సరస్సులు, నదులు, కొండలు, తూర్పు కొండ, పాలసముద్రం చూసి వెనక్కు తిరిగాడు. వాలి తరుముతుంటే దక్షిణ దిక్కుగా పరుగెత్తి, వింధ్య పర్వతాలలోని వృక్షాలను, చందనాలను చూశాడు. పశ్చిమంగా పోయి అస్తాద్రి మొదలైనవి చూశాడు. ఉత్తరంగా పోయి హిమాలయం, మేరువు, సముద్రం చూశాడు. ఆ విధంగా ఆనాడు భూమండలమంతా కళ్లారా చూశాను అంటాడు. తానూ చూసిన విధమంతా జ్ఞాపకం వుంచుకున్న సుగ్రీవుడు వానరవీరులకు ఆ వివరాలను చెప్పాడు. చెప్పి ఆ స్థలాలన్నింటిలో సీతను వెతకమంటాడు.

సీతను వెతకడానికి ముందుగా తూర్పు దిశకు వినతుడిని పొమ్మన్నాడు. ఆ దిక్కున వున్న ప్రదేశాలను వివరించాడు. సరయూ నది, గంగ, కౌశికిన, మనోహరమైన సింధు, యమున, సరస్వతి వున్నాయి. కొండలతో, వనాలతో కూడిన మహీనది, కాలమహి, బ్రహ్మమాల, విదేహం, మాలవం, కాశికాపురం, మగధదేశ గ్రామాలు, కోసలం వున్నాయి. ఇవి కాకుండా సముద్రమధ్యాన. ఏడు ఖండాలతో కూడిన యవద్వీపం, స్వర్ణరూప్యకమనే దీవులను దాటి పోతే ఆకాశాన్ని అంటే శిఖరంకల శిశిరం అనే పర్వటం వుంటుంది. అది దాటిపోతే, ఎర్రటి నీళ్లు, లోతు, మహా వేగంకల శోణ నాదం వుంటుంది. ఇది సముద్రానికి అవతలి ఒడ్డున వుంటుంది.

ఎర్రటి నీళ్లున్న సురాసముద్రాన్ని చూసుకుంటూ పోతే, బంగారం, మణులతో ప్రకాశిస్తూ కైలాసంతో సమానమైన, విశ్వకర్మ నిర్మించిన గరత్మంతుడి గృహాన్ని చూడవచ్చు. అక్కడ తెల్లటి మేఘంలాగా పాల సముద్రం వుంది. నిర్మలమైన పాల సముద్రం మధ్యలో ప్రసిద్ధమైన ఋషభ పర్వతం వుంది. అది తెల్లటి కాంతికలదై, దివ్యమైన పరిమళాలతో, పూలతో కూడిన బంగారి చాయకల చెట్లతో నిండి వుంటుంది. అక్కడే బడలిక పోయే సుందరమైన కొలను వుంటుంది. దాని పేరు సుదర్శనం.

ఆ కొలనులో తెల్లటి కింజల్కాలు కల తెల్ల కమలాలు వుంటాయి. వాటి కోసం కిన్నరులు, చారణులు, దేవతలు, వారి సమూహాలు, అప్సరసలు, జలకేళి కొరకు వస్తుంటారు. ఆ పాల సముద్రాన్ని దాటిపోతే, ప్రాణికోటికి భయం కలిగించే, యౌర్య మహర్షి కోపం మూలాన పుట్టిన గుర్రపు ఆకారంకల అగ్ని కనబడుతుంది. ఆ శుద్దోదక సముద్రాన్ని దాటి అటువైపు పోగా అక్కడ పదమూడు యోజనాలు కల బంగారు రాయికల బంగారు కొండ వుంది.

అటు పిమ్మట బంగారుమయమైన తూర్పు కొండ వుంది. ఆ పర్వత సమూహంలో ఆకాశాన్ని తాకుతూ, బంగారుమయమై, నూరామడల విస్తీర్ణం కల అందమైన అరుగు వుంది. అక్కడ మద్ది చెట్లు, తాటి చెట్లు, చీకటి మాకులు, కొండ గోగులు, సూర్యకాంతితో పూచి వుంటాయి. అక్కడ యోజనం వెడల్పున, పది ఆమడ ఎత్తున పర్వత శిఖరం వుంది. దాని పేరు సౌమనసం. సూర్యుడు జంబూద్వీపం ఉత్తర భాగంలో తిరుగుతూ ఆ కొండమీదకు వచ్చినప్పుడు మేరువు దక్షిణ దిక్కువారికి కనపడుతుంది. దాని పక్కదే సుదర్శనం. ఈ గొప్ప ద్వీపంలో సమస్త ప్రాణి సమూహాలకు నేత్ర కాంతి కలిగించే గొప్ప తేజంతో సూర్యుడు ప్రకాశిస్తుంటాడు.


బ్రహ్మ దేవుడు భూలోకానికి, తక్కిన లోకాలకు, ద్వారంగా చేసిన కారణాన, సూర్యుడు సంచరించడానికి మొదలు అక్కడి నుండే బయల్దేరడం వల్లా, దాన్ని పూర్వ దిశ అంటున్నారు. ఆ తూర్పుకొండకు ఆవల దేవతలు వుంటారు. అక్కడ చంద్ర-సూర్య కాంతులు లేవు. చీకట్లు వ్యాపించి వుంటాయి. అక్కడి దాకా పోవచ్చును కాని ఆ తరువాత పోవడం సాధ్యపడదు.

         దక్షిణ దిక్కుకు నీలుడిని, హనుమంతుడిని, జాంబవంతుడిని, అంగదుడిని, తదితర ప్రసిద్ధ బలులను పొమ్మన్నాడు. వీళ్లందరికీ దక్షిణ దిక్కున కల కొండల, గుట్టల, అడవుల గురించి చెప్పాడు.

         అనేక వృక్షాలు, లతలు, వేయి శిఖరాల పర్వత శ్రేష్టం వింధ్యము, పెద్ద-పెద్ద పాములు కల నర్మద, విశాలమైన గౌతమీ అనే పేరున్న నదీ తీరం, కృష్ణ, మహానది, వరద, మేఖల (ఇదే అమరటంక పర్వతం...ఇక్కడే నర్మద పుట్టుతుంది), ఉత్కలం, దశార్ణము, ఆశ్వవంతి, అవంతి, విదర్భ, మహిషి ఋషికాలు, వంగా, కాశీ, కళింగ, అంగ దేశాలుంటాయి. కొండలు, గుహలు, నదులున్న దండకారణ్యంలో గోదావరి నది వుంటుంది. ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ, దేశాలు, సహ్య పర్వతం వుంటాయి. కావేరి వుంటుంది. సముద్రాన్ని కలియబోయే తామ్రపర్నీనది వుంది.

         దానికి అవతల బంగారు రేకులతో ప్రకాశించే, శోభావిలసితమైన పాండ్యనగరి తలవాకిటి వుంది. సముద్రం లోపల, అగస్త్యుడు పూర్వం మహేంద్ర పర్వతం నిలిపాడు. అది నీళ్లల్లో మునిగీ-మునగనట్లు కనిపిస్తుంది. సముద్రం మధ్యలో మనుష్యులు పోలేని నూరామడల విస్తారంకల ద్వీపం వుంది. ఆ ద్వీపంలోనే రావణాసురుడు వుండే పట్టణం వుంది.

         దక్షిణ సముద్రం మధ్యలో అంగారక (దీన్నే సుందరకాండలో సింహిక అని పిలిచారు) అనే రాక్షసి వుంది. అది ఆకాశాన పోయే వారి నీడను పట్టుకుని నిలిపి బక్షిస్తుంది. ఆ ద్వీపం నుండి నూరామడ పోతే, అక్కడ సిద్ధులు, చారణులు వుండే, సూర్య-చంద్ర కిరణాలతో సమానమై, అందంగా వుండి, సముద్ర జలాలతో చుట్టబడ్డ, ఆకాశాన్ని తాకే శిఖరం కలిగిన పుష్పితకం అనే పర్వతం కనిపిస్తుంది. దాని బంగారు శిఖరాన్ని రాసుకుంటూ సూర్యుడు దక్షిణాయనంలో దాని వెండి శిఖరానికి వస్తాడు. దక్షిణాయనంలో దీనికి దక్షిణంగా సూర్యుడు పోడు.

         ఆ పర్వతాన్ని దాటి పద్నాలుగు ఆమడలు పోతే వైద్యుతమైన సూర్యవంతం అనే కొండ వస్తుంది. ఆ కొండలోనే విశ్వకర్మ అగస్త్యుడికి బంగారంలాగా ప్రకాశించే ఆమడ వెడల్పు, పది ఆమడ ఎత్తుకల, దివ్య రత్నాలతో విలసిల్లే ఇల్లు నిర్మించి ఇచ్చాడు. ఆ మహా పర్వతంలో సర్పాలతో రక్షించబడే భోగవతి అనే పేరుకల సర్పరాజైన వాసుకు నివాస స్థలం వుంది. ఆ పాముల నగరంలోపల అక్కడక్కడా రహస్య స్థలాలు వున్నాయి. అవన్నీ దాటి పోతుంటే, వృషభాకారం కలిగి, కాంతివంతమై, దేవతా సంబందమై, అగ్ని కాంతితో, గోరోచన కాంతితో వెలిగే ఋషభం అనే పర్వతం వుంటుంది. అది భూమికి పొలిమేర. అంటే ఆవల సముద్రం వుందని అనుకోవాలి.

         దాన్నీ దాటిపోతే ఆ పిమ్మట భయానకమైన యమలోకం వుంటుంది. కాబట్టి మనుష్యులకు ఆ యమలోకానికి పోవడం సాధ్యం కాదు. ఆ నగరాన్ని చుట్టుకుని భయంకరమైన చీకటి వ్యాపించి వుంటుంది. అక్కడి దాకా పోవచ్చు. ఆ తరువాత పోవడం అసాధ్యం.

         ఆ తరువాత సుగ్రీవుడు సుషేణుడిని పిలిచి, పశ్చిమంగా పొమ్మంటాడు.
         పశ్చిమ దిశగా పోతే, సురాష్ట్రం (ఇప్పటి సూరత్), బాహ్లికం, శూరము, భీమమనే దేశాలు విశాలంగా వుంటాయి. పడమటగా ప్రవహించే నదులు, మునులుండే అడవులు, కొండలు, నీరులేని ప్రదేశాలు, పెద్దరాల దేశాలను దాటిపోతే పశ్చిమ సముద్రం వస్తుంది. అది దాటిపోయి మురచీ పట్టణం, జతీపురం, అవంతిని, అంగలోప వుంటాయి. అక్కడి నుండి సింధు నది సముద్రంలో పడేచోటు వస్తుంది. అక్కడ దక్షిణలోయల వెంట వుండే హల పర్వతాన్ని చూడవచ్చు. అక్కడ పెద్ద మ్రాకులు, అనేక శిఖరాలు కలిగి ఆకాశాన్ని అంటే, రెక్కలుకల దానిలాగా ఎగిరే సింహాలుండే చరియలు కల హేమగిరి వుంది.

         ఆ పర్వతం దాటి నూరామడలు పోతే, చూడడానికే అసాధ్యమైన పారియాత్ర పర్వత (పశ్చిమ రాజపుత్ర స్థానంలో వున్న ఇప్పటి సోలేమాన్ రేంజ్ కావచ్చు) శిఖరాన్ని చూడవచ్చు. గంధర్వులు వుంటారక్కడ. వీరి దేశం గాంధార దేశం. ఇది ఇప్పటి ఆఫ్ఘానిస్తాన్. ఇందులోని గాంధారం అంటే కాందహార్. అక్కడ పవిత్రమైన వైడూర్యకాంతికలదై వజ్రాల దృఢమైన కొండ వుంది.

         ఆ కొండ పేరు వజ్రధరం. అందులో చిత్రమైన నూరామడల చదరమైన నేల వుంది. దానికి ఆవల సముద్రంలోని నాల్గవ భాగంలో చక్రవంతం అనే పెద్ద పర్వతం వుంటుంది. అక్కడ విశ్వకర్మ రచించిన సాహస్రార చక్రం వుంది. దానికి వేయి అంచులున్నాయి. దాన్ని రక్షించే హయగ్రీవుడిని, పంచ జనుడిని చంపి, విష్ణువు హయగ్రీవుడి చక్రాన్ని, పంచ జనుడి వెన్నెముక అయిన శంఖాన్ని తీసుకున్నాడు. పంచజనుడి వల్ల లభ్యమయింది కాబట్టే శంఖానికి పాంచజన్యమని పేరు వచ్చింది. ఆ తరువాత అరవై ఆమడలు పోతే సముద్రంలో విశాలమైన వెండి శిఖరంతో కూడిన వరాహ పర్వతం వుంటుంది. విశాలమైన ఆ  పర్వతంలో ప్రాగ్జ్యోతిషం (దీని ఇప్పటి పేరు అస్సాం) అనే పట్టణం వుంది.

         ఇవన్నీ కలయ చూస్తూ పోతుంటే సెలయేళ్లున్న సర్వసౌవర్ణం అనే పేరున్న కొండ వస్తుంది. ఆ పర్వతానికి మేఘవంతం అనే పేరు. అది దాటిపోతే అరవై వేల కొండలు వస్తాయి. ఆ పర్వతాల మధ్య ప్రదేశంలో ఉత్తర మేరుసావర్ణి అనే పర్వతం వుంది. విశ్వులు, ఆదిత్యులు, మరుత్తులు, వసువులు మొదలైనవారు ప్రసిద్ధులైన దేవతలను సాయంకాల సమయంలో భక్తితో బంగారు కొండమీద వున్న సూర్యుడిని సేవించడానికి వస్తారు. ప్రాణకోటికంతా కానరానివాడై లోకమంతా చీకటిలో మునిగేట్లు చేసి తానూ పడమటి కొండకు పోతాడు.

         గడియకు పదివేల ఆమడల వంతున పోయి సూర్యుడు పడమటి కొండకు చేరుకుంటాడు. ఆ పర్వత శిఖరం కొనలో సూర్యకాంతి కల మేడలతో నిండిన దివ్యమైన ఒక ఇల్లు వుంది. అది విశ్వకర్మ నిర్మితం. అక్కడ అస్తపర్వతానికి, మేరుపర్వతానికి మధ్యన బంగారుమయమై, చిత్రమైన అరుగు కలిగి, పది తలల తాల వృక్షం కళ్లకు ఆనందంగా కనపడుతుంది. సూర్యుడు ఉదయ సమయాన ఇంతదాకా తన తేజస్సుతో చీకట్లను తరిమి పడమటి కొండకు పోతాడు. ఆ తరువాత సూర్యరశ్మి వుండదు. కాబట్టి ఏమున్నదో తెలియదు. చీకట్లు వ్యాపించి వుంటాయి.

ఆ తరువాత సుగ్రీవుడు మహాబలవంతుడైన శతవలి అనే వాడిని ఉత్తర దిక్కుకు పొమ్మంటాడు.
         ఉత్తరాన హిమవత్పర్వతం వుంది. మ్లేచ్చ దేశంలో శూరసేన, పుళింద, ప్రస్థర, మద్రక, భారత (హస్తినాపుర), దక్షిణ కురుభూములు, కాంభోజ, యవన, శకదేశం, అరట్ట, బాహ్లిక, పౌరవ, టంకణ, ఋషిక దేశాలు, జీనా దేశం, పరమ చీన (మంచూరియా-మంగోలియా) దేశం, నిహార, దరద ప్రదేశాలు, హిమవత్పర్వత ప్రాంతం వుంటాయి. సోమాశ్రమం, కాలపర్వతం అవతలవైపున గుహలుంటాయి. ఆ పర్వతం దాటి పోగా సుదర్శనం అనే పర్వతం వస్తుంది. అది దాటిపోయిన తరువాత దేవసఖమనే పర్వతం వుంటుంది. దానికి అవతల కొండలు, నదులు, చెట్లు, జీవజంతువులు లేని నూరామడల పొడవున్న దేశం వుంటుంది. దీన్ని గోబి, శాము ఎడారి అంటారు. ఆ మరుభూమిని దాటిపోతే కైలాసపర్వతం కనబడుతుంది. (హిమాలయానికి ఉత్తరాన టిబెట్ దేశం వుందిప్పుడు). అక్కడ తెల్లటి మేఘంతో సమానమై, బంగారంతో అలంకృతమై, తెల్లటి కాంతికల కుబేరుడి ఇల్లుంది. దాన్ని విశ్వకర్మ నిర్మించాడు”.

         అక్కడ వస్వౌకసార అనే కొలను వుంది. కుబేరుడు ఎల్లప్పుడూ అక్కడ వినోదంగా క్రీడిస్తుంటాడు. ఆ ప్రదేశంలో పూర్వం కుమారస్వామి శక్తి ప్రయోగంతో నిర్మించిన శిబిరం వుంది. ఆ దారిలోనే హంసలు మానస సరస్సుకు పోయివస్తుంటాయి. ఆ బిలంలోకి పోవడం అంత సులభం కాదు. అక్కడ వృక్షం, కామశైలం, మానసం అనే పర్వతాలున్నాయి. దేవదానకులకు కూడా మాంసం అనే పర్వతం దగ్గరికి పోవడానికి సాధ్యంకాదు.

         క్రౌంచపర్వతం దాటిన తరువాత మైనాక పర్వతం వస్తుంది. ఆ పర్వతం మీద మయుడనే దానవుడు కట్టుకున్న సుందరమైన గృహం వుంది. అక్కడ సిద్ధులుండే ప్రదేశంలో వైఖానసం అనే సరస్సు వుంది. ఆ సరస్సుకు ఆవల సూర్యకాంతి, చంద్రకాంతి, నక్షత్రకాంతి లేదు. అక్కడ మేఘాలు లేవు. ఆకాశం శబ్దం లేకుండా వుంటుంది. మీరది దాటిపోతే శైలోదం అనే శిలానది వుంది. దానికి ఇవతల, అవతల కీచకాలు అనే పేరుకల వెదుళ్ల పొదలుంటాయి. ఆ ఏటి నీళ్లలో దిగినవారు రాళ్లుగా మారిపోతారు కాబట్టి ఆ నది దాటాలంటే, ఆ పొదల వెదుళ్ళు పట్టుకుని పోవాలి, రావాలి. ఆ దరిన, ఈ దరిన వెదుళ్ళు కలిసికొని అల్లుకుని వుంటాయి. ఆ ఉత్తర కురుభూములు పుణ్యం చేసిన పురుషులకు భోగస్థానాలై వుంటాయి”.

         అక్కడ అనేక నదులున్నాయి. వాటిల్లో వైడూర్యాలున్న ఆకులు కలిగిన బంగారు కమలాలుకల తామరతూండ్లు వున్నాయి. అక్కడ ఎర్రటి కలువల వనాలున్నాయి. అక్కడి సరస్సులు బంగారువన్నె, బాలసూర్యుడివన్నె కలిగి వుంటాయి. చూడడానికి చాలా సంతోషకరములై వుంటాయి. జాతినీలాల కాంతికల రేకులు, అపరంజి బంగారు కాంతికల కింజల్కాలున్న నల్లటి కలువలతో నిండిన సరస్సులు అక్కడ అందంగా వుంటాయి. అగ్నితో సమానంగా బంగారు కాంతితో కొండలక్కడ దండిగా వున్నాయి.

ఆ ఉత్తర కురు భూముల్లో కొన్ని పర్వతాలు అసమానమైన, ఆశ్చర్యకరమైన పీటలు, మంచాలు కాస్తాయి. దాన్ని దాటి ఉత్తరంగా పోతే, సముద్రంలో సోమశైలం అనే పేరున్న బంగారుమయమైన పర్వతం వుంటుంది. దాన్ని ఇంద్రలోక వాసులు, బ్రహ్మ లోకవాసులు కాపాడుతుంటారు.ఆ ప్రదేశంలో సూర్యకాంతి లేకపోయినా ఆ బంగారు కాంతి వల్ల వస్తువులు కనబడుతుంటాయి.

అక్కడ షాడ్గుణ్య పరిపూర్తికలిగి ప్రపంచ స్వరూపుడైన విష్ణువు, ఏకాదశ మూర్తులు ధరించి, మన్మథ విరోధి అయిన శివుడు, ప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మ కాపురం వుంటారు. ఉత్తర కురుభూములకు ఉత్తరంగా వున్న సోమపర్వతం చేరబోవడం సాధ్యపడదు. ఆవలి దేశం కట్టుపాటు లేనిది. సూర్యకాంతి వుండదు. అక్కడ ఏమున్నదో ఎవరికీ తెలియదు.
{ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారి ఆంధ్రవాల్మీకి రామాయణం ఆధారంగా}

No comments:

Post a Comment