మరిన్ని శాంతివచనాలు చెప్పిన లక్ష్మణుడు
శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-76
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రభూమి
ఆదివారం సంచిక (01-09-2019)
శ్రీరాముడిని
శాంతింప చేసే ప్రయత్నంలో లక్ష్మణుడు అన్నగారితో మరిన్ని విషయాలను చెప్తాడు. ఆయన
పాదాలమీద పడి నమస్కరించి, ఇలా
అంటాడు. “అన్నా! పూర్వజన్మలోనే కాకుండా ఈ జన్మలోనూ విస్తారంగా తపస్సు చేసి,
ఎన్నో అశ్వమేధయాగాలను చేసి, మరెన్నో
గొప్ప పుణ్యకార్యాలను చేసి, మన
తండ్రి అతి కష్టంతో దేవతలు అమృతాన్ని సంపాదించినట్లు నిన్ను కన్నాడు”.
(శ్రీరామచంద్రమూర్తిని అమృతంతో పోల్చడం అంటే, అమృతం
వల్ల దానికేమీ లాభం లేదు కాని, దాన్ని
అనుభవించిన దేవతలకే లాభమని అర్థం. అలాగే శ్రీరాముడు దేవతలకు,
లోకులకు భోగ్యుడై వారికి మేలు చేయడానికి పుట్టాడని అర్థం. లోకాన్ని ఉద్ధరించడానికి
పుట్టిన శ్రీరాముడు లోకాలను నాశనం చేయడం తగదని లక్ష్మణుడు అంటున్నాడు. అలాగే,
అమృతాన్ని సంపాదించడం కోసం ముప్పైమూడు కోట్ల దేవతలు కష్టబడ్డారు కానీ,
రాముదికోరకు ఒక్క దశరథుడే కష్టపడ్డాడని భావన. అమృతం ఎలా రాక్షసుల వినాశనానికి
కారణమైందో అలాగే రాముడు కూడా రాక్షస సంహారం చేయాలని చెపుతున్నాడు లక్ష్మణుడు.
అందుకే, దేవతలమీద, ఇతర
భూతాల మీద కోపం చూపకుండా,
అమృతంలాగా ఎల్లప్పుడూ నిర్మలంగా వుండాలని సూచన ఇచ్చాడు లక్ష్మణుడు).
లక్ష్మణుడు ఇంకా ఇలా చెప్పాడు రాముడికి. “నీలో తప్ప ఇతరుల్లో లేని నీ
కళ్యాణగుణాలకు సంతోషించి మన తండ్రి నిన్ను ఎడబాసిన కారణాన మరణించాడని భరతుడు
చెప్పాడు కదా? అలాంటి కళ్యాణగుణాలను వదిలి ఇలాంటి హేయగుణాన్ని చేపట్టి,
లోకానికి ఉపద్రవం కలిగిస్తే, మన
తండ్రి నీవిషయంలో ఏమని భావిస్తాడు? రాముడు
సౌమ్యుడు, సాధువు, జితేంద్రియుడు,
శాంతుడు అనుకున్నానే? ఇంతటి క్రూరుడా,
అని అనుకోడా? నువ్వు
చేయాలనుకున్న లోకోపద్రవం తండ్రికి కూడా చేసినట్లే కదా?
తన నాశనానికా తండ్రి నిన్ను కన్నది?
కకుత్థ్సుడి వంశంలో పుట్టిన వాళ్లలో శ్రేష్టుడివైన నువ్వు, మహాశుద్ధసత్త్వం
కల నువ్వు, అప్రాకృతుడవైన నువ్వు,
కకుత్థ్సుడిలాగా దేవతలను, లోకులను
రక్షించాల్సిన నువ్వు, శోకంతో సహించలేని విధంగా
పరితపిస్తుంటే, ప్రకృతిబద్ధులైన ఇతరులందరూ దుఃఖం సహించగలరా?
అలాంటి వారిలోనే దుఃఖం అణచుకునేవారు
కనిపిస్తుంటే నువ్వు దుఃఖపడడం శోచనీయం”.
“జగాలను పుట్టించే భారం బ్రహ్మదేవుడిది. సంహరించే భారం రుద్రుడిది.
రక్షించే భారం నీది. అలాంటి నువ్వు ధర్మాన్ని వదిలి లోకులను సంహరించాలనుకుంటే
భూప్రజలకు రక్షకుడెవరు దొరుకుతారు? పైరును
రక్షించడానికి వేసే కంచే పైరును మేయడానికి సిద్ధపడితే ఇక దాన్ని రక్షించే ఉపాయం
ఏమిటి? లోకంలో నువ్వొక్కడివే దుఃఖమనుభవించుతున్నానని అనుకోవద్దు. నీకున్నంత
దుఃఖం ఎవరికీ లేదనుకోవద్దు. ఇంద్రుడుగా వున్నా నహుషుడి కొడుకు స్వర్గానికి పోయికూడా,
అవివేకం వల్ల, అహంకారం
వల్ల, మళ్లీ భూమ్మీదకు రాలేదా? మన
పురోహితుడైన వశిష్టుడి కొడుకులు వందమంది ఒకేసారి నశించలేదా?
సమస్త భూతాలను సర్వాడా మోసే భూదేవి ఒక్కోసారి గడ-గడలాడ లేదా?
లోకాలకు కళ్లలాంటి సూర్యచంద్రులు రాహుకేతు గ్రహాల వాత బడలేదా?
ఎంత మహాత్ములైనా, దేవతా శ్రేష్టులైనా,
దైవ సంకల్పాన్ని దాటగలరా? ఎవరైనా
కష్టాలను ఎదుర్కోకుండా కాలమంతా సుఖంగా గడుపుతారా?
లేరుకదా? కాబట్టి ప్రాణులకు మేలు-కీడు స్వభాసిద్ధంగా వస్తాయి”.
“సీతాదేవి రాక్షసుల చేతిలో చచ్చినా కూడా అందుకోసం నువ్వు గుండెలు
పగిలేలా ఏడవవద్దు. అది జ్ఞానంలేనివాడు చేయాల్సిన పని. ఏడ్వడం వల్ల రాగల లాభం ఏమిటి?
నువ్విలా ఏడుస్తుంటే సీతాదేవి వస్తుందా? ఏడ్వడం
వల్ల దేహం, మనస్సు చెడడమే తప్ప మరేం లాభం లేదు. జ్ఞానంకలవాడు దేనికీ దుఃఖపడడు.
అనఘా! జీవకోటుల యథార్థస్థితి అయిన జననమరణాలు,
సుఖదుఃఖాలు, శోకసంతోషాలు,
సంయోగవియోగాలు లాంటివి నిత్యం జరిగేవి కావు. రావడం,
పోవడం వాతి స్వభావగుణాలు. కాబట్టి వాటికి
పరితాపపడడం మంచిదికాదు. నీచమైన హృదయ దౌర్బల్యం వదిలి, గొప్ప
మనస్సు చేసుకుని, ఇలా వ్యసనపడడం నీకు తగునేమో
ఆలోచించు. జ్ఞానం కలవారు స్వభావసిద్ధమైన బుద్ధిబలంతో మేలు-కీడులను పరీక్షిస్తారు”.
“పూర్వం చేసిన పుణ్యపాపకర్మల గుణాలు కానీ,
దోషాలు కానీ, మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూడలేం. మనం ఈ కర్మ చేశాం....మనకీ ఫలం
కలుగుతుంది....అని నిశ్చయంగా చెప్పడం ఎవరికీ సాధ్యపడదు. ఈ కర్మ ఈ విధంగా చేయడం
వల్ల ఈ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం అని కర్మ చేసిన విధం చెప్పడం కూడా
సాధ్యపడదు. కాని, కారణం లేకుండా ఏదీ జరగదు. ఫలితం
ఇప్పుడు అనుభవిస్తున్నాం కాబట్టి, దీనికి
కారణమైన కర్మ ఎదో, ఎప్పుడో చేశాం అని మాత్రం
చెప్పగలం. అలాంటి కర్మ చేయడం వల్లే ఈ ఫలం కలిగిందని చెప్పవచ్చు. మనకు కారణం
తెలిసినా, తెలియకున్నా, అనుభవించడం
తప్పదు. కాబట్టి సుఖం అనుభవానికి వచ్చినప్పుడు మనం చేసిన పుణ్యం వల్లే ఇది
కలిగిందని కాని, దుఃఖం కలిగినప్పుడు మనం పూర్వం ఏదో పాపం చేశామని అందుకే ఇది
కలిగిందని భావించరాదు. సుఖం కలిగినందువల్ల పుణ్యమే చేయాలని కాని,
దుఃఖం కలగడం వల్ల పాపం చేయరాదని అనుకుని మనస్సు ధృడ పరచుకోవాలి. సంతోషానికి పొంగక,
దుఃఖానికి బాధపడక వుండాలి”.
“రామచంద్రా! నువ్వు మూర్ఖుడివి కాదు. కార్యాకార్య,
ధర్మాధర్మ విషయంలో నీకుకల స్థిరజ్ఞానం దేవతలకు కూడా లేదు.
అయినప్పటికీ దుఃఖాతిశయం వల్ల నీ జ్ఞానం నివురుగప్పిన నిప్పులాగా నిద్రబోతున్నది.
మనుష్యులను చూద్దామా, వాళ్ళు నీదగ్గరకు వచ్చి తమ మీద
కోపం ఎందుకని అడిగే సాహసం కూడా చేయలేరు. దేవతలేమో నీమూలాన బాగుపడేవారు. కాబట్టి
నీకు అపరాధం చేయరు. కాబట్టి వాళ్ళను ఎందుకు బాధించాలి?
వ్యర్థ కోపం వల్ల, వ్యర్థ శోకం వల్ల ఏ పనీ కాదు.
మనకపకారం చేసినవాడు ఎవడో కనిపెట్టి శూరుడివైన నువ్వు వాడిని దండించు. దానివల్ల
నీకు సీత మళ్లీ లభిస్తుంది. కీర్తీ కలుగుతుంది”.