శ్రీరాముడిని శాంతింప చేసిన లక్ష్మణుడు
శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-75
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రభూమి
ఆదివారం సంచిక (25-08-2019)
సీతాదేవిని
అపహరించిన కారణాన కలిగిన దుఃఖంవల్ల బాధపడే రాముడిని,
శోకం వల్ల తపించే రాముడిని,
ప్రళయకాలాగ్నిలాగా లోకాలను సమూలంగా కాల్చివేద్దామన్న పరుషగుణం వహించిన రాముడిని,
ఎక్కుపెట్టిన విల్లు నీడ చూస్తున్న రాముడిని,
వేడి నిట్టూర్పులు విడుస్తున్న రాముడిని,
సర్వప్రాణి సంహారం చేయడానికి విజృంభించి ప్రళయకాల రుద్రుడిలాగా వెలుగుతున్న
రాముడిని, శత్రుసంహారం కొరకు తప్ప ఎప్పుడూ కోపం తెచ్చుకొని రాముడిని చూసి
లక్ష్మణుడు పెదవులు ఎండిపోతుంటే, ముఖం
వెల-వెలపోతుంటే, ఆయనతో ఇలా అన్నాడు.
“అన్నా! నువ్వు సర్వదా జగాలకు మేలుచేయడానికి ఇష్టపడే వాడివే. కోపం
లేనివాడివే. మృదుస్వభావుడివే. ఇలాంటి నువ్వు ఇప్పుడు కోపం తెచ్చుకుని నీ సహజగుణం
వదలవచ్చా? ఇది నీకు ధర్మమా? చంద్రుడిలో లక్ష్మి,
సూర్యుడిలో విశేషప్రభ, భూమిలో అమితమైన ఓర్పు,
వాయువులోని గమనించే గుణం, స్థలనం
లేకుండా స్థిరంగా వుండే నైజం....ఇవన్నీ వాటిలో ఒక్కొక్కటిగానే వుంటాయి. నీలో
ఇవన్నీ మరింత కీర్తితో శాశ్వతంగా కాపురం చేస్తున్నాయి. ఇలాంటి నువ్వు లోకాలను
బాధించడం న్యాయమా? శాంతించమనీ,
ఒర్చుకోమనీ అంటున్నానని ప్రశ్నిస్తావేమో? ఇంతసేపు
ఓర్చుకుంటే ఎవరైనా నీ స్థితి ఏమిటి అని కానీ,
ఎందుకు ఏడుస్తున్నావని కానీ, సీత
ఇక్కడ వున్నదని అన్నవాడు కానీ లేరు.....ఎంతకాలం ఓర్చుకున్నా ఫలితం ఇదేకదా అని
అంటావేమో?”
“అన్నయ్యా! అలాకాదు. ఉరు-పేరు తెలియనివాడు ఎవడో ఒక్కడు చేసిన
నేరాన్ని కనిపెట్టే శక్తిలేక లోకాన్నంతా నాశనం చేయడం న్యాయమా?
ఇలాంటి పని చేయకూడదని నువ్వే నాకు ఒకసారి చెప్పావు కదా?
విరిగిన ఈ రథం ఎవరిదో, ఎందుకు ఎవరివల్ల విరిగిందో అనే
విషయం మనం విచారించి తెలుసుకోవాలి. విరిగిన గుర్రపు గిట్టలను,
దొరలిన చక్రాల కమ్మలను, నేలబడ్డ
నెత్తురు బొట్లను, పరిశీలించి చూస్తే ఇవన్నీ ఒకడివే
అనిపిస్తున్నది కాని యుద్ధంలో రెండవవాడు వున్నట్లు లేదు. సైన్యం పోరాడినట్లు
కనిపించడంలేదు. అలా అయితే, ఒక్కడే
తన రథాన్ని తానే విరగగొట్టుకుని, తన
సారథిని, గుర్రాలను తానే చంపుకుంటాడా? కాబట్టి,
ఇవన్నీ నువ్వు ఆలోచించకుండా ఎవడో ఒకడి కోసమని లోకమంతా నాశనం చేయడం మంచిదా?
రాజైన వాడు మృదుత్వం, శాంతి కలిగి ఎప్పుడు-ఎవరిని-ఎలా
దండించాలో అలాగే చేయాలికాని ఇష్టం వచ్చినట్లు ఎవరిని పడితే వారిని కఠినంగా
దండించతగునా?”
“ఎవడో ఒకడు అపరాధం చేస్తే దాన్ని లోకమంతా ఒప్పుకున్నాడని భావించి,
ఆ లోకమంతా వధ్యమని నువ్వు అనుకోవడం పొరపాటు. ఎందుకంటే, తమ
రక్షణ కోరే సర్వభూతాలను రక్షించగలవాడివి నువ్వు ఒక్కడివే కాని వేరొకడు లేడు.
అలాంటివారు పొందదగిన, శ్రేష్టమైన,
కీర్తించతగిన పరమగతి కూడా నువ్వు తప్ప వేరొకరు కారు. ఇలాంటి నీకు
ఆపదవస్తే ఎవరైనా సంతోషిస్తారా? సహాయం
చేసే సామర్థ్యం లేక కొందరు, తెలియక
కొందరు వున్నారేమో కాని నీకు అపరాధం చేయతలచిన వారెవరూ వుండరు. యజ్ఞంలో ఋత్విక్కులు
దీక్ష తీసుకుని, యజ్ఞం చేసేవాడి కీడు కోరితే అది వాళ్ళకే నష్టం కాబట్టి అలా చేయరు.
మేలే కోరుతారు. అలాగే దేవతలు,
గంధర్వులు, దానవులు, కొండలు,
నదులు నీకు దుఃఖం కలిగించరు. నిబ్బరిమ్చుకుని ఆలోచించు”.
“చేతిలో విల్లు పట్టుకుని, నేను నీకు
తోడురాగా తపస్వుల సహాయంతో సీతను అన్నిచోట్లా వెతుకుదాం. పర్వతాలలో,
అడవుల్లో, గుహలలో, నదీతీరాలలో,
కలువల కొలనుల్లో, దేవతలుండే స్థలాలలో,
ఓర్పుగా, హెచ్చరికగా వెతుకుదాం. మనం చేయాల్సినదంతా చేసిన తరువాత. అప్పటికీ
దేవతలు మంచితనంగా సీతను సమర్పించకపోతే, అప్పుడు
ఏది ఉచితమో ఆ పని చేద్దాం. అప్పుడది చేస్తే న్యాయంగా వుంటుంది. నీమీద నింద పడదు.
మంచి మాటలవల్ల, మంచి నడవడి వల్ల, వినయం
వల్ల సీతాదేవి లభించకపోతే, సాదుమనస్సుకల
ఓ రాజనందనా, అప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు చేయి. వజ్రాలలాంటి కఠోరమైన బంగారు
పింజల బాణాలతో నీ ఇష్ట ప్రకారం లోకాన్ని భస్మం చేయి”, అని అంటాడు లక్ష్మణుడు
రాముడితో.
No comments:
Post a Comment