Thursday, August 22, 2019

సచివాలయ పునాదుల్లో నిధి నిక్షేపాల నిజానిజాలు : వనం జ్వాలా నరసింహారావు


సచివాలయ పునాదుల్లో నిధి నిక్షేపాల నిజానిజాలు
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (23-08-2019)
తెలంగాణ రాష్ట్రం నూతన సచివాలాయాన్ని నిర్మించాలని తలపెట్టి, ప్రస్తుతమున్న పురాతన భవనాలను కూల్చే ప్రయత్నంలో వుంది. ఇది పురాతన కట్టడమనీ, వారసత్వ భవనాల లెక్కలోకి వస్తుందనీ కొందరు అభ్యంతరాలు పెట్టడం కూడా జరిగింది. ఇదంతా ఒక ఎత్తైతే, సచివాలయ భవనం పునాదుల్లో గుప్తనిధులున్నాయన్న వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. నిజాం నవాబులు సచివాలయ నేలమాళిగలలో అంతులేని నిధులు భద్రపరిచారానీ, సచివాలయం కూల్చి వేస్తే అవన్నీ బయటపడతాయనీ కొందరంటున్నారు. నిజానిజాలు కూల్చిన తరువాత కానీ బయటపడవు. కనీసం నిధుల అన్వేషణ కొరకైనా పురాతన భవనాలను కూల్చి వేస్తే మంచిదేమో! 
  
ఇదిలా వుండగా, హైదరాబాద్ నగరం నడి బొడ్డులో, రాష్ట్ర సచివాలయానికి కూత వేటు దూరంలో, విద్యారణ్య పాఠశాల ఆవరణకు ఆనుకుని వున్న నిజాం (నేటి ప్రభుత్వ) భూమిగానే రికార్డులలో వుందని భావించిన ఒకానొక స్థలంలోని ఒక సొరంగంలో నిధి-నిక్షేపాలున్నాయన్న నమ్మకంతో తవ్వకాలు సాగాయి కొంతకాలం క్రితం. ఎప్పుడో, ఎవరో నిర్మాణ కూలీకి, అక్కడ సొరంగ మార్గం కనిపించడంతో, ఆసక్తి చంపుకోలేని ఆ వ్యక్తి ద్వారా ఆ నోటా-ఆ నోటా బడి ఆ సమాచారం బయటకు పొక్కడంతో, చివరకు పురావస్తు శాఖ అధికారులు, అధికారికంగా, తవ్వకాలు చేసే వరకూ పోయింది అప్పట్లో ఆ వ్యవహారం. ఈ నేపధ్యంలో అప్పుడు వినిపించిన కథ కూడా ఆసక్తికరంగానే వుంది. ఆ కథ నిజమైనా కావచ్చు లేదా అల్లికా కావచ్చు.

ఆ నిర్మాణ కూలీ తాను కనిపెట్టిన సొరంగ మార్గం గుండా వెళ్లినప్పుడు అతనికి ఇనుప తలుపొకటి కనిపించిందనీ, దాని రంధ్రంలోంచి చూస్తే బంగారు-వెండి నిక్షేపాలు, నగలూ-నాణాలూ కనిపించాయని, దాంతో కళ్లు చెదిరిపోయిన ఆ వ్యక్తి వాటిని తవ్వి తీసే మార్గం తెలియక సహచరులను సంప్రదించాడని, అంతా కలిసి కోల్ ఇండియాలో పనిచేసే ఓ అధికారికి విషయం చెప్పారని, ఆయన, వాళ్లు కలిసి పురావస్తు శాఖ అధికారులకు తెలియచేశారని, దరిమిలా తవ్వకాలు ఆరంభమైనాయనీ పత్రికలలో కథనాలు వచ్చాయి అప్పట్లో. వీటిలో నిజానిజాలెంతవరకున్నా, తవ్వకాలు జరిగింది మాత్రం వాస్తవం. ఏదో ఒకటి బయట పడ్డట్లు సమాచారం. అవి నిధులో కాదో నిర్ధారణ మాత్రం కాలేదు. ఇక ఇప్పుడు సచివాలయ తవ్వకాలలో నిధినిక్షేపాలుంటాయా? వుండవా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న! ఒకవేళ వుంటే అవి ఎవరికి చెందాలనేది మరో యక్షప్రశ్న.

ఈ కథలో అంతర్లీనంగా వున్న మరో కథ, పోనీ, వాస్తవం: నిజాం నవాబు, ఆయన ఇచ్చిన భూమిలో పాఠశాల నిర్మించిన మహబూబ్‌నగర్ జిల్లా వాసి  రాజా రామేశ్వర రావు గత స్మృతిగా నిలిచిపోయిన అలనాటి (నేటి విద్యారణ్య) పాఠశాల భవనం. నిజాం సంపదగా చెప్పుకుంటున్న నిధులున్నది ఇక్కడే! ఇంతకీ తవ్వకాలు జరుగుతున్న భూమి రాజా రామేశ్వర రావుకి చెందుతుందా? లేక నిజాం ఫర్మానాల ఆధారంగా అదింకా నిజాందేనా? ప్రస్తుతానికి నిజాం లేడు కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వానిదా? భూమి ఎవరిదైనా నిధి నిక్షేపాలను, బంగారం లాంటి లోహాలను పకడ్బందీగా పసిగట్టే టెర్రెస్ట్రియల్ స్కానర్లు, ఇతర పరికరాలతో సర్వే చేసి మరీ నిధిని బయటకు తీసే ప్రయత్నం చేసింది అలనాటి ప్రభుత్వం. నిజాం నగలు అక్కడుండడానికి కొన్ని కారణాలనూ బయటపెట్టారు కొందరు పురావస్తు శాఖ అధికారులు. వారి దగ్గర వున్న ఆధారాల ప్రకారం విద్యారణ్య పాఠశాల సమీపంలో బయటపడింది  రెండో స్ట్రాంగ్ రూమ్ అనీ, మొదటిది హోం సైన్స్ కాలేజీలో ఉందనీ, దాన్ని ఏడాది క్రితం తవ్వి తీశామనీ, ఈ రెండూ కాకుండా మరో రెండు కూడా ఉన్నాయనీ, రికార్డుల ఆధారంగా చూస్తే కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు వీటిలో ఉంటాయనీ ఒకరిద్దరు పురా శాస్త్ర అధికారులు పేర్కొన్నారు. ఇంతకీ అంతుచిక్కని ప్రశ్న "హోం సైన్స్ కాలేజీ" లో బయటపడ్డ స్ట్రాంగ్ రూమ్‌లో దొరికిన నిధుల విలువ ఎంత? ఆ నిధులేమయ్యాయి? ఎవరూ మాట్లాడలేదు. ఒకవేళ బయటపడితే ఎవరి అధీనంలోకి పోయాయో తెలియదు.

ఈ నేపధ్యంలో, అప్పుడు హైదరాబాద్‌లో తవ్వకాలు జరిగిన విద్యారణ్య పాఠశాల ఆవరణ యజమాని రాజా రామేశ్వర రావు స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఎదురైన ఒక స్వానుభవం గురించి చెప్పాలి. అచ్చు ఇలానే, నిధులున్న సంగతి ఒక కూలీ ద్వారా బయటకు పొక్కడం, ఆ విషయం మా దాకా చేరడం, అవేంటో కనుక్కుందామని వెళ్ళిన మాకు అవి (నిధులో-కావో కాని అలానే బంగారపు పోతను పోలి వున్న పోత విగ్రహం) కనిపించడం, ఏం చేయాలో తోచని మేము మీడియా ద్వారా ప్రభుత్వ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయడం, అవేవీ ఫలించక పోవడం, ఇంకా అ మిస్టరీ అలానే వుండడం (మాకు తెలిసినంతవరకు), ఈ విషయాలన్నీ పాఠకులతో పంచుకోవాలనేదే ఈ ప్రయత్నం.

ఎవరికైనా " స్వానుభవం" అనేది ఒక రకమైన "కిక్కు లాంటిదే"! అది పొందిన వారికి మాత్రమే అర్థం అవుతుంది. చంద్రమండలం మీద కాలు మోపే అనుభవం-అవకాశం అందరికీ కలగక పోవచ్చు! అందరూ ఎవరెస్టు శిఖరం అధిరోహించక పోవచ్చు! కాకపోతే, వారి-వారి పరిధుల్లో అంతో-ఇంతో కొన్ని స్వీయ అనుభవాలు కలగవచ్చు. అలాంటిదే సరిగ్గా సుమారు నలబై ఏళ్ల క్రితం, అక్టోబర్ 1980 లో మాకు కలిగింది. ఫలానా చోట నిధి నిక్షేపాలున్నాయని మా దాకా వచ్చిన వార్తలో నిజా-నిజాలు అవగాహన చేసుకోవడానికి ఔత్సాహిక బృందంగా బయలుదేరి, దట్టమైన కొల్లాపూర్ (మహబూబ్‌నగర్ జిల్లా) అడవిలో ఒక మినీ సాహసయాత్ర చేశాం. ప్రకృతి సహజంగా ఏర్పడిందో, లేక, మానవ నిర్మితమైందో అర్థం కాని రీతిలో వున్న ఒక సొరంగ మార్గంలోకి ప్రవేశించ గలిగాం. ముందుకు మాత్రం సాగే ధైర్యం చేయలేకపోయాం.
 
ఆ విషయం మాదృష్టికి  రావడానికి కొన్ని రోజుల క్రితం, మహబూబ్‌నగర్ జిల్లా, అచ్చంపేట అటవీశాఖ డివిజన్‌లోని కొల్లాపూర్ రేంజ్‌లో వున్న అడవి ప్రాంతంలో పనిచేస్తున్న ఒక కూలీ, ఒక "అడవి పందిని" వేటాడుతూ, తనకు తెలియకుండానే, ఒక గుట్టలోని చిన్న గుహలోకి జొరబడ్డాడు. ఒక్క క్షణ కాలంపాటు తనకేం జరిగిందో అర్థం కాలేదతనికి. భయభ్రాంతుడైన ఆ కూలీ, తనను ఏవో మానవాతీత శక్తులు అక్కడికి తరుముకొచ్చాయని భ్రమపడ్డాడు. వచ్చిన దారిలోనే తక్షణం వెనుతిరిగాడు. తన అనుభవాన్ని తోటి కూలీలకు వివరించి, తాను ఆ ప్రదేశంలో, రకరకాల బంగారు విగ్రహాలను చూశానని చెప్పాడు. తిరిగి ఆ గుహలోకి పోతే, మానవాతీత శక్తుల వల్ల తమకు, తమ కుటుంబాలకు ఆపద కలుగుతుందని భావించిన ఆ కూలీలు, ఆ విషయాన్ని అంతటితో మర్చిపోదామనుకున్నారు. కాకపోతే, వారిలో ఒకడు, ఆ వార్తను, అప్పట్లో అచ్చంపేట అటవీ రేంజర్‍గా పనిచేస్తున్న (స్వర్గీయ) కె. ఎస్. భార్గవకు చేరవేశాడు.


కొల్లాపూర్ అటవీ ప్రాంతం అచ్చంపేట రేంజ్‌లోకి వస్తుంది. ఏం జరిగిందో పూర్తి వివరాలతో తెలుసుకోవాలనుకున్నాడు మాకు మంచి స్నేహితుదైన భార్గవ. ఆ విషయాన్ని మాకు చెప్పాడు. అందరం కలిసి అక్కడకు వెళ్లి విషయం స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నాం. మా బృందంలో నాతో పాటు, భార్గవ, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి జంధ్యాల హరినారాయణ్, విశ్వవిద్యాలయంలో హిస్టరీ-ఆర్కియాలజీ అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఆయన భార్య శ్రీమతి కామేశ్వరి, ప్రముఖ పాత్రికేయులు ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేక విలేకరి స్వర్గీయ జి. కృష్ణ, అప్పట్లో ఆకాశవాణి విలేకరిగా పనిచేసి దూరదర్శన్ న్యూస్ ఎడిటర్‌గా పదవీ విరమణ చేసిన పాత్రికేయుడు భండారు శ్రీనివాసరావు, ఇండియన్ రెడ్‌క్రాస్ ఆంధ్ర ప్రదేశ్ శాఖ కార్యదర్శిగా పనిచేసిన స్వర్గీయ డాక్టర్ ఏ. పి. రంగారావు వున్నారు. మేమంతా కలిసి అక్కడకు అక్టోబర్ 1980 లో వెళ్లాం.

హైదరాబాద్ నగరానికి 160 కిలోమీటర్ల దూరంలో, నాగర్ కర్నూల్‌కు 40 కిలోమీటర్ల దూరంలో, కొల్లాపూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో, దట్టమైన అడవిలో, ఆ కూలీ చూసిన గుహలున్న ప్రాంతం వుంది. కొల్లాపూర్ నుంచి తూర్పుగా, చింతపల్లి గ్రామం దాటి, దట్టమైన అడవిలో సుమారు రెండున్నర గంటలు ప్రయాణం చేస్తే వస్తుందా ప్రాంతం. మా వెంట ఒకే ఒక్క జీపు వుండడంతో, రెండు బృందాలుగా విడిపోయి, ఒక రోజు ముందరే అక్కడకు చేరుకుని ఆ రాత్రి గడిపాం అక్కడ.

అటవీశాఖలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగుల సహాయ సహకారాల వల్ల, అక్కడ పనిచేస్తున్న కూలీల సహాయం వల్ల, గుహలోకి వెళ్లడానికి, మాకు మార్గం సులభతరమైంది. మధ్యాహ్నానికల్లా బాచ్‍ల వారీగా లోపలికి వెళ్లడం ఆరంభించాం. చిన్న గుట్టలాగా వున్న ఆ ప్రాంతంలో వున్న గుహలోకి ప్రవేశించడం అంత సులువైందే మీ కాదని అర్థం ఐంది. ఒకటిన్నర అడుగుల వ్యాసం మాత్రమే వున్న చిన్న మార్గం గుండా పది-పదిహేను అడుగుల దూరం పాకుకుంటూ పోయి, ఆ తరువాత కొద్ది దూరం, కూర్చున్న భంగిమలో ముందుకు సాగి, కొంచెం తలఎత్తి-దించి వంగుకుంటూ పోతే అసలైన గుహలోకి ప్రవేశించగలిగాం. థ్రిల్లింగ్‍గా వున్నప్పటికీ, అంత చిన్న ఇరుకైన మార్గంలో ప్రయాణం చేయడం కాస్తంత ఇబ్బందిగానే వుంది. లోపలికి చేరుకోగానే, సుమారు ఆరేడు అడుగుల వెడల్పు, ఎనిమిది-తొమ్మిది అడుగుల ఎత్తు వున్న గుహ మార్గం కనిపించింది. ఇంకొంచెం ముందుకు సాగితే, అన్ని వైపుల మరికొంత వెడల్పుతో-ఎత్తుతో గుహల మార్గాలు కనిపించాయి. అలా 50-60 గజాల దూరం ప్రయాణం చేయగలిగాం. ఉక్క పోయ సాగింది. ముందుకు సాగడం కష్టమైంది. మేం ప్రవేశించిన ప్రదేశంలో, కొంచెం దూరంలో, మరికొంత దూరంలో, గదుల లాంటి నిర్మాణాలు కనిపించాయి. ప్లాట్ ఫాం లాగా, వేదిక లాగా కొంత ఎత్తైన ప్రదేశాలు కూడా కనిపించాయి. ఒక ప్రదేశంలో, ఎత్తైన వేదిక వెనుక భాగంలో, విగ్రహాన్ని పోలిన సున్నపు పోత ఆకారం కనిపించింది. చీకటిలో అక్కడ బాటరీ ఫోకస్ వేసి చూచినప్పుడు, అదంతా బంగారం లాగా కళ్లకు కనిపించింది. బహుశా అది "లైమ్ స్టోన్ ఫార్మేషన్" కావచ్చు. ఉక్క పోత తీవ్ర తరం కావడంతో ఎక్కువ సమయం అక్కడ వుండలేకపోయాం. లోపల కొన్ని విరిగిపోయిన మట్టి కుండ ముక్కలు కూడా కనిపించాయి.

అక్కడ మాతో కూలీలు చెప్పినట్లు నిధి-నిక్షేపాలున్న దాఖలాలు లేవు. పెద్దగా ఆర్కియలాజికల్ ప్రాముఖ్యత వున్నా లేకపోయినా, జియలాజికల్ ప్రాముఖ్యత తప్పకుండా వుంది. గుహలు-గుహ మార్గాలు అనేకం వుండి వుండాలి. భూగర్భ శాస్త్రజ్ఞులు అధ్యయనం చేయాల్సిందే. సహజ సిద్ధమైన గుహలుగా ఏర్పడడానికి ఎలా వీలవుతుందో తెల్సుకోవడానికి అక్కడ అధ్యయనం చేయవచ్చు. ఎలాంటి రకమైన రాతి కొండలలో గుహలు సహజంగా ఏర్పడే అవకాశం వుందో కూడా అధ్యయనం చేయవచ్చు. అలానే లైమ్ స్టోన్ ఫార్మేషన్ విషయంలోనూ అధ్యయనం చేయవచ్చు. ఆ ప్రదేశం మొత్తం పర్యాటక కేంద్రంగా కూడా ఏర్పాటు చేయవచ్చు. అక్కడకు "జటప్రోలు జంక్షన్" కొల్లాపూర్ కు పడమటి దిక్కుగా కేవలం పదమూడు కిలోమీటర్ల దూరంలోనే వుంది. ఆ ప్రదేశంలో ఎన్నో దేవాలయాలు శ్రీశైలం కృష్ణా జలాలలో ముంపుకు గురైనందున పునర్నిర్మిస్తున్నారప్పట్లో. అంటే, జటప్రోలు జంక్షన్ కు ఈ గుహలున్న ప్రదేశానికి మధ్య దూరం 35 కిలోమీటర్ల లోపే.

అప్పట్లో ఈ విషయాలను ప్రభుత్వ దృష్టికి తెస్తూ ఒక లేఖ కూడా రాశాను. ఒక పత్రికలో కూడా ఈ విషయాలను గురించి రాశాను. ఇప్పుడా ప్రదేశం ఎలా వుందో ఏమిటో తెలియదు. అందుకే, నిధులున్నాయని ఎవరైనా చెపితే, అవి దొరికినా-దొరకకపోయినా, ఏదైనా ఆసక్తికరమైన విషయం వెలుగులోకి రావచ్చు. విద్యారణ్య పాఠశాల ఆవరణలో నిధులు దొరికాయో లేదో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న! అదే విధంగా సచివాలయం కూలిస్తే నిధులు బయటపడతాయో లేదో తెలియదు.

ఏదేమైనా, మేమెళ్లిన రోజు రాత్రి "పెదవోట" అటవీ గ్రామస్థులు ఆ వూరి వాగు ఒడ్డున మాకు పెట్టిన విందు భోజనం జీవితాంతం మరువలేం!

1 comment:

  1. కనీసం నిధుల అన్వేషణ కొరకైనా పురాతన భవనాలను కూల్చి వేస్తే మంచిదేమో! -

    నిక్షేపం లాంటి భవనాలు కూలగొట్టుడేంది స్వామీ. ఆ వందల కోట్లు మెట్రోరైలును విస్తరించడానికి ఉపయోగించు. ట్రాఫిక్ లో లక్షల జనం అల్లాడిపోతున్నారు ఈసీఐఎల్, అల్వాల్, నాచారం ప్రజలు ఏమి పాపం చేశారు. ఆ ప్రాంతాలకు మెట్రో రైలు వేయించు జ్వాలా గారు. ఎర్రమంజిల్ ప్రాంతము ఎంతమాత్రం అనుకూలం కాదు అసెంబ్లీకి.
    ఎందుకు ఈ తగని పనులు.

    ReplyDelete