సీత పోయిన మార్గం రాముడికి సూచించిన అడవి మృగాలు
శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-73
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రభూమి
ఆదివారం సంచిక (11-08-2019)
లక్ష్మణుడి మాటలకు జవాబుగా
శ్రీరాముడు తమ్ముడితో, “లక్ష్మణా! నువ్వు గోదావరీ
నది దగ్గరకు వెళ్లు. అక్కడ సీతాదేవి పద్మాలు కోయడానికి వెళ్లి వుండవచ్చు” అని
అనగానే లక్ష్మణుడు అలాగే అంటూ, గోదావరీ
తీరానికి వెళ్లాడు. అక్కడ “ఓ సీతమ్మా! ఓ వదినమ్మా!” అని ఎంత అరిచినా బదులు మాట
వినపడలేదు. అక్కడ అంతా వెతికి సీత కనబడనందున ఆ వార్తను అన్న రామచంద్రమోర్ర్తికి
తెలిపి ఇలా అన్నాడు. “ఎంత వెతికినా ఆ సీతాదేవి ఆకారం కనబడలేదు. ఆమె ఎక్కడికి
పోయిందో జాడ లేదు. పిలిచినా సీత పలకలేదు”.
లక్ష్మణుడి మాటలకు రామచంద్రుడు నదిని
చూసి, “తల్లీ! గోదావరీ! చిగుళ్ల లాంటి పాదాలుకల నా సీత ఇక్కడికి వచ్చిందా?
మరెక్కడికైనా పోయిందా? దొంగ ఎవడైనా వచ్చి హరించుకు
పోయాడా? చెప్పు” అని ప్రశ్నించాడు. జవాబు చెప్పమనీ,
రావణుడే హరించాడని తెలియచేయమనీ, భూతాలు
ఎంత సూచించినా రావణుడు ఏం చేస్తాడోనన్న భయంతో రామచంద్రమూర్తి ఎంతగా ప్రార్థించినా
గోదావరీ నది ఏమీ చెప్పలేదు. ఇలా నది మౌనం వహించడంతో ఇక సీతాదేవి లభించే ఆశ
లేదనుకున్నాడు రాముడు.
అప్పుడు తనలో తానే ఇలా అనుకుంటాడు
రాముడు: “సీత తండ్రి, నా తల్లి,
సీత ఏదని అడుగుతే నేనేమని చెప్పాలి?
రాజ్యాన్ని పోగొట్టుకుని అడవుల్లో దొరికే కందమూలాలతో కడుపు నింపుకుని,
కష్టాలను తన మనస్సుకు రానీయకుండా కాపాడే ఆ కమలాక్షి అడవిలో ఎక్కడికి పోయిందో?
నా గతేంటి అని అనునిత్యం విచారిస్తూ, ఆదరిస్తూ,
వుండే సీతాదేవి లేని కారణాన నిద్ర లేకపోవడంతో రాత్రంతా చాలా దీర్ఘంగా కనపడుతున్నది
కదా? ఆహా! ఇప్పుడు కనుక నాకు సీతాదేవి లభిస్తే,
ఈ జనస్థానంలో వుండే గోదావరీ జలాలలో, కొండవంకాలు
దూకుతున్న ప్రసవణగిరిలో,
సీతాదేవిని నాచేతిలో పట్టుకుని నా అపేక్షలన్నీ తీరేట్లు తిరిగేవాడిని కదా?”
అదే ధోరణి కొనసాగిస్తూ తమ్ముడితో,
“లక్ష్మణా! చూశావా? అడవి మృగాలు చాలా సార్లు నా వైపు
చూసుకుంటూ ఏదో చెప్పాలని తాపత్రయ పడుతున్నాయి. వీటికి సీత పోయిన జాడ తెలుసేమో?”
అని అంటూ కన్నీరు కార్చుకుంటూ వాటిని అడుగుతాడిలా. “మృగాలూ...సీత జాడ మీకు
తెలియునా?” అని. అవి చివాలున లేచి, దక్షిణ
దిక్కుగా పయనమై తలలు పైకి ఎత్తుకుని రామలక్ష్మణుల ముఖాలు చూసుకుంటూ పరుగెత్తాయి.
అప్పుడు లక్ష్మణుడు వాతి అభిప్రాయం అర్థం చేసుకుని అన్నతో ఇలా అన్నాడు.
“అన్నా! నువ్వు సీత ఏది?
అని అడగ్గా, నిన్ను చూసి మృగాలు, భూమి,
ఆకాశం దక్షిణ దిక్కును చూపిస్తున్నాయి. (ఆకాశం రావణుడు పోయిన మార్గం). మనం నైరుతి
దిక్కుగా పోదామా? చక్కగా పోతే,
గోదావరి నది దాటిపోవాల్సి వస్తుంది. కొంచెం పక్కగా తిరిగి పోతే ఏదీ
అడ్డంరాదు. కాబట్టి అలాగే పోదాం. మనం ఆ మార్గంలో పోతే, జానకి
లభించే ఉపాయం దొరకవచ్చు”.
లక్ష్మణుడు చెప్పింది విన్న రామచంద్రుడు,
ఆ ఆలోచన బాగుంది అనుకుంటాడు. వెంటనే లక్ష్మణుడు వెంటరాగా,
అక్కడంతా వెతుక్కుంటూ పోతూ, ఒకచోట
నేలమీద పూలు రాలి వుండడం చూశాడు. వాటిని చూసిన రఘువంశవర్ధనుడైన రామచంద్రమూర్తి కడు
దుఃఖంతో, డగ్గుత్తికతో తమ్ముడితో ఇలా అంటాడు.
“లక్ష్మణా! ఈ పూలు కోసి నేను తనకు ఇవ్వగా,
సీత, తన జడలో ముడుచుకుంది. ఇవి కొట్టుకుని పోకుండా,
దుమ్ము నిండకుండా, వాడిపోకుండా,
వుంది నేను గుర్తించడానికి వాయువు, భూమి,
సూర్యుడు రక్షించారు”. ఇలా అంటూనే,
రామచంద్రమూర్తి మెల్లగా పోయి జలపాతం కల పెద్ద కొండను చేరి బాధతో కూడిన స్వరంతో
“ఆబల, సర్వాంగ సుందరి, సీత,
మనోహర వనరాజి, నావల్ల విడవబడ్డ ఆమె ఇక్కడ తిరగడం నువ్వు చూశావా?”
అని పర్వతాన్ని ప్రశ్నించాడు. రాముడు ప్రశ్నించింది పర్వతాన్ని కాబట్టి ప్రతిధ్వని
పుట్టింది. ఆయన అన్న మాటలే మళ్లీ వినబడ్డాయి. ఇలా తాను చెప్పిన మాటలే మళ్లీ
వినపడడంతో నిర్లక్ష్య భావనతో తనను పర్వతం పరిహసిస్తున్నదని రామచంద్రమూర్తి
కోపగించుకున్నాడు. ఒక సింహం అల్ప మృగాన్ని చూసినట్లు, పర్వతాన్ని
చూసి రాముడు కళ్లెర్ర చేసుకుకుని, “బంగారు
కాంతి, మెరుపు కల నా సీతను చూపడానికి ప్రయత్నం చేయని ఓ పర్వతమా! నిన్ను,
నీ నెత్తాలను, గిత్తాలను నేలపడవేస్తాను. నేను మంచి మాటలతో అడిగినప్పుడు నువ్వు
సౌమ్య మార్గంలో సీతను అర్పించావా, సరే!
అలాకాకపోతే, నా బాణాలతో నిన్ను బాధించి నిన్ను కాల్చి బూడిద చేస్తాను” అని
అంటాడు.
సీతాదేవి వృత్తాంతం ఈ నది చెప్పకపోతే
దీనిలోని నీళ్లన్నీ ఇంకిపోయేట్లు చేస్తానని కోపంతో పలకాడు.
రాముడు భయపడుతూ అటూ-ఇటూ తిరుగుతూ సీతను
వెతుకుతూ వుండగా, ఆమె పాదాల చిన్న ముద్రలు,
అ అపాదాల వెంటే పోయిన పెద్ద-పెద్ద రాక్షస పాదాల ముద్రలు, విరిగిపడిన
ధనుస్సు, రథం, అమ్ములపొది,
అక్కడక్కడా పడి వుండడం గమనించాడు. అవి చూసి తొట్రుపడుతూ రాముడు లక్ష్మణుడితో ఇలా
అన్నాడు:
“లక్ష్మణా! సీతాదేవి ధరించిన జోమాలెపూసలు,
బంగారు సొమ్ములు, ఇవే
చూడు. ఆమె ధరించిన పూలదండలు నేలరాలాయి. నేలమీద బంగారు పూసల్లాగా నెత్తురు బొట్లు
పడ్డాయి. కాబట్టి కోరిన రూపం ధరించగల రాక్షసులు నా సీతను పట్టి తెచ్చి ఇక్కడ
తునకలు-తునకలుగా నరికి తిన్నారని భావిస్తాను. ఇక్కద విల్లు పడి వుండడానికి కారణం,
బహుశా ఇద్దరు రాక్షసులు ఆమె కొరకు పోరాడారేమో?
అలా కాకపొతే నిర్మానుష్యమైన ఈ అడవిలో ఇవెందుకున్నాయి?
లక్ష్మణా! బంగారు సొమ్ములతో అలంకరించబడి తళతళ మెరిసే రత్నాలతో,
ముత్యాలతో వున్నా ఈ విల్లు ఎవరిదో కదా? ఇది
ఇక్కడ విరిగి పడడానికి కారణం ఏంటో? అలాగే
ఎర్రటి, బంగారంతో చేయబడ్డ,
ముత్యాలు-వైడూర్యాలు చెక్కబడ్డ, నేలమీద పడ్డ
తునకలైన ఈ కవచం ఎవరిదో కదా?”.
“నూరు కమ్మలు కలిగి, మేలైన
పూదండలతో ప్రకాశిస్తూ విరిగిన ఈ గొడుగు బూమ్మీద ఇలా పడి వుండడానికి కారణం ఏమిటి?
ఇది ఎవరిది కావచ్చు? బంగారు కవచాలు,
భయంకర ఆకారాలు, పెద్ద దేహాలు, భయం
కలిగించే పిశాచ ముఖాలు కల కంచరగాడిదలు ఇక్కడ పది వుండడానికి కారణం ఏమిటి?
మండుతున్న అగ్నితో సమానంగా ప్రకాశిస్తున్న తెక్కంరతం విరిగిపడ్డది. ఇది ఏ వీరుడిదో?
బంగారు పిడుల ఈ బాణాలు ఎవరివో?
ఈ పొదుల్లో బాణాలు నిండినవి నిండినట్లే వున్నాయి. వెలితికాలేదు. తునిగిపడి
వున్నాయి. ఒక చేతిలో పగ్గాలు, ఒక
చేతిలో కొరడా పట్టుకుని సారథి చచ్చిపడి వున్నాడు. వీడేవారి సారథి కావచ్చు?
చెవులలో కుండలాలు, తలమీద పాగా కలవారై చామరాలు
పట్టుకున్న ఈ ఇద్దరెవరో?”
No comments:
Post a Comment