Monday, August 26, 2019

నిబద్ద నైపుణ్య సేవల కోసం... : వనం జ్వాలా నరసింహారావు


నిబద్ద నైపుణ్య సేవల కోసం...
వనం జ్వాలా నరసింహారావు
(హెచార్డీ ఇన్స్టిట్యూట్ మాజీ అదనపు సంచాలకుడు)
నమస్తే తెలంగాణ దినపత్రిక (27-08-2019)
గుర్తించబడిన ఒక ప్రాదాన్యాత అంశంగా ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు క్రమం తప్పకుండా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని, తదనుగుణంగా వినూత్నపద్ధతిలో స్టేట్ ట్రైనింగ్ ఇనిషియేటివ్ కు శ్రీకారం చుట్టితే బాగుంటుందేమో! ఇలా చేయడం ద్వారా శిక్షణ పొందినవారి వ్యక్తిగత, సామూహిక, సంస్థాగత పనితీరులో మెరుగుదల-పెరుగుదల ప్రస్ఫుటంగా కనిపించడంతో పాటు వారి సామర్థ్యం కూడా వృద్ధి చెందుతుంది. దీనికొరకు శిక్షణా కార్యక్రమాన్ని జిల్లాల కలెక్టర్ల, శాఖాధిపతుల ముఖ్యమైన బాధ్యతల్లో ఒకటిగా చేసి, వారి-వారి స్థాయిల్లో వారిని ట్రైనింగ్ కమీషనర్లుగా నామినేట్ చేయాలి. ట్రైనింగ్ కమీషనర్లుగా వీరి బాధ్యతల నిర్వహణలో చేదోడువాదోడుగా వుండడానికి ప్రతి జిల్లాలో, రాష్ట్ర స్థాయి ప్రభుత్వ శాఖలో శిక్షణా కార్యక్రమాల అమలుకు ట్రైనింగ్ కోఆర్డినేటర్లను నియమించాలి.

ప్రభుత్వం చేపట్టబోయే ఈ క్రమబద్ద శాస్త్రీయ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఏడాదిలో కనీసం ఒక్కసారైనా ప్రభుత్వ అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాల పైనా, ప్రభుత్వ పథకాలపైనా అవగాహన పరిపూర్ణంగా కలిగే రీతిలో, వారి పనితీరులో సామర్థ్య పెంపుదల దిశగా శిక్షణా డిజైన్ తయారుకావాలి. శిక్షణ పూర్వరంగంలో శిక్షణకు హాజరయ్యేవారి పనికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, ఒక గ్రూప్ గా వారు నిర్వహించాల్సిన విధుల గురించి, వారు పనిచేస్తున్న శాఖల అవసరాల గురించి, అభ్యర్థుల శిక్షణావసారాలు గుర్తించాలి.

ఈ యావత్ ప్రక్రియలో భాగంగా మొదటిగా, సచివాలయ స్థాయిలో, ప్రభుత్వ శాఖల స్థాయిలో, జిల్లా స్థాయిలో కార్యదర్శులుగా, హెచ్ఓడీలుగా, జిల్లా కలెక్టర్లుగా పనిచేస్తున్న అఖిలభారత సర్వీసు (ఐఏఎస్, ఐఎఫెస్, ఐపీఎస్) అధికారులకు ట్రైనింగ్ ద్వారా సామర్థ్యం పెంపుదలకు తీసుకుంటున్న చర్యలపై అవగాహన కలిగించడానికి మూడురోజుల ఓఎంఓటీ (ఓరియంటేషన్ టు మానేజ్మెంట్ ఆఫ్ ట్రైనింగ్) గోష్టి శిబిరం నిర్వహిస్తే మంచిది. ఈ శిబిరాలలో పాల్గొనే ఈ అధికారులకు వినూత్నపద్ధతిలో ప్రభుత్వం తలపెట్టిన స్టేట్ ట్రైనింగ్ ఇనిషియేటివ్ కు సంబంధించి చర్చించే అవకాశంతో పాటు, విజయవంతంగా శిక్షణా కార్యక్రమాలు కొనసాగడానికి వారి పాత్ర ఏమిటో, ఎలా ఉండాలో అవగాహన కూడా కలుగుతుంది. ట్రైనింగ్ విషయంలో ఉన్నత స్థాయి అధికారుల నిబద్ధత, అంకితభావం అవసరం ఎంతైనా వుంది కాబట్టి దానికి సంబంధించిన అంశాలు చర్చించే వీలు కూడా ఈ గోష్టిలో కలుగుతుంది. వీరికి చేదోడుగా పనిచేయాల్సిన ట్రైనింగ్ కోఆర్డినేటర్లకు మేనేజ్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ లో శిక్షణ ఇవ్వాలి.

శిక్షణా విధానం కేవలం అందులో పాల్గొంటున్న వారి విజ్ఞానం, నైపుణ్యం మెరుగుపరచడమే కాకుండా వారి కార్య ధోరణిలో, వైఖరిలో (attitude) గణనీయమైన మార్పు చోటు చేసుకుని, తద్వారా పౌరులకు, ప్రజా బాహుళ్యానికి మరింత సమర్ధవంతమైన, పటిష్టమైన సేవలు అందించడానికి దోహదపడాలి. ప్రభుత్వ పరంగా చేపట్టిన యావత్ శిక్షణా కార్యాచరణకు దార్శనికత చూపడానికి, స్థూల స్థాయిలో పర్యవేక్షించడానికి, సమీక్షించడానికి ఒక విధమైన రాష్ట్ర స్థాయి శిక్షణా మండలిని అవసరమనుకుంటే ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేసి, ఆ మండలిలో క్షేత్ర స్థాయి, ఉన్నత స్థాయి శిక్షణా యాజమాన్య నిపుణులను భాగస్వాములను చేస్తే బాగుంటుంది. వ్యక్తిగతంగా, శాఖాపరంగా, హెచ్హోడీ అవసరాలకు అనుగుణంగా శిక్షణావసరాలను గుర్తించాలి. శిక్షణావసారాల ఆధారంగా చక్కటి శిక్షణాడిజైన్ తయారు చేసి నిర్ణీత కాల వ్యవధిలో తగు శిక్షణ ఇప్పించాలి.


బడ్జెట్ అంచనాలతో సహా వారి-వారి శాఖలకు కావాల్సిన వార్షిక శిక్షణా కార్యాచరణ పథకాల రూపకల్పన బాధ్యతను సంబంధిత హెచ్హోడీలకు అప్పగించాలి. ఈ యావత్ ప్రక్రియకు ప్రధాన సమన్వయ సంస్థగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థను నియమించి, రాష్ట్రంలోని ఇతర శిక్షణా సంస్థల, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ లాంటి ప్రముఖ సంస్థల సేవలను ఉపయోగించుకోవాలి. ప్రభుత్వోద్యోగ, ప్రజా ప్రతినిధులను శిక్షణ నిమిత్తమై, వారి-వారి భాద్యతలకు అనుగుణంగా నాలుగు భాగాలుగా విభజించవచ్చు. అవి: మొదటిది విధాన స్థాయి (Policy), రెండవది పరిపాలనా స్థాయి (Administrative), మూడవది అమలుపరిచే స్థాయి (Implementation), నాల్గవది పై మూడు స్తాయిల వారికి మద్దతుగా పనిచేసే కింది స్థాయి (Support) సిబ్బంది.

పాలిసీ స్థాయి వారిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, (కార్యదర్శి, అంతకంటే కంటే పై స్థాయి) అఖిల భారత సర్వీస్ సీనియర్ అధికారులు వుంటారు. వీరికి సంస్థాగత ప్రవర్తనకు సంబంధించిన (Organizational Behavior) శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. అడ్మినిస్ట్రేటివ్ స్థాయి అధికారులలో హెచ్హోడీలు, కార్యదర్శి స్థాయి కంటే కింది అఖిలభారత సర్వీసు అధికారులు వుంటారు. ఎగజేక్యూటివ్ లేదా అమలుపరిచే స్థాయి వారిలో మండల స్థాయి వరకూ క్రియాశీలక పాత్ర పోషించే క్షేత్ర స్థాయి అధికారులుంటారు. మిగిలిన వారంతా కింది స్థాయి లేదా క్లరికల్, పర్యవేక్షక కేటిగరీకి,  చెందిన ఉద్యోగులు. రాష్ట్రం మొత్తం మీద అన్ని విభాగాలలో కలిపి సుమారు 5000-10000 మంది వ్యూహాత్మక బాధ్యతలు నిర్వర్తించే ప్రభుత్వోద్యోగులను, ప్రజా ప్రతినిధులను గుర్తించి, వారికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, ప్రభుత్వ కార్యక్రమాల, పథకాల అమలు పట్ల వారి నిబద్ధత, అంకిత భావం, కార్యనిర్వహణ పెంపొందేలా, మెరుగుపడేలా చేయాలి.

ఈ మొత్తం శిక్షణా వ్యవహారం విజయవంతం కావడానికి, సత్ఫలితాలు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ఎపెక్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ సేవలను ఉపయోగించుకోవడం మంచిదేమో. అప్పటి కేంద్ర ప్రభుత్వ సిఫార్సుల మేరకు మొదట్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఐఓఏ) గా మార్చ్ 1976 లో స్థాపితమైన ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ శిక్షణావసరాలు చూసేది. అంచెలంచలుగా ఎదిగిన హెచార్డీ ఇన్స్టిట్యూట్ ఈనాడు ప్రపంచంలోని అత్యుత్తమ శిక్షణాసంస్థలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. పబ్లిక్ మేనేజ్మెంట్ అవసరాలకు ఉపయోగపడే అత్యుత్తమ శిక్షణాసంస్థ (Institute of Excellence) కూడా ఇది.       

ఎంసీఆర్ హెచార్డీ ఇన్స్టిట్యూట్ లో విజ్ఞాన పరమైన అర్హతలు కల, అనుభవుజ్ఞులైన, కష్టపడి పని చేసే, నిబద్ధతకల నిపుణుల ఫాకల్టీ బృందం వుంది. వీరిలో అఖిలభారత సర్వీసు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉన్నత విద్యా సంస్థలకు చెందిన నిపుణులు కూడా వున్నారు. వీరిలో కొందరు విజిటింగ్ ఫాకల్టీ కాగా కొందరు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులు. ఇటీవలే సంస్థ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థతో దీర్ఘకాలం సంబంధం ఉన్నవారిని జ్ఞప్తి చేసుకుని కొందరిని సత్కరించింది. ఏటా దేశ వ్యాప్త అఖిలభారత సర్వీసు అధికారులతో సహా, కేంద్ర స్థాయి అధికారులతో సహా, సుమారు 15,000 మంది వివిధ స్థాయి ఉద్యోగులు ఈ సంస్థలో శిక్షణ పొందుతున్నారు.

       హెచార్డీ ఇన్స్టిట్యూట్ ఏర్పాటైనప్పుడు దాని బాధ్యతలలో ప్రధానమైనవి, రాష్ట్ర-కేంద్ర పబ్లిక్ సర్వీసు కమీషన్ల ద్వారా నేరుగా నియామకం అయినవారికి, ఐఏఎస్ అధికారులతో సహా, ఫౌండేషన్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం; ఉద్యోగాలలో వున్న వివిధ స్థాయి అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద, పథకాలమీద, కార్యక్రమాలమీద పునశ్చరణ శిక్షణా కార్యక్రమాలు (Refresher Courses) నిర్వహించడం; కొన్ని రకాల ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం; శాఖాపరమైన అవసరాల నిమిత్తం శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వున్నాయి. ఇప్పటికీ ఈ కార్యక్రమాలు ఒక మోతాదులో సంస్థ నిర్వహిస్తున్నప్పటికీ అందరికీ ఇవి అందుబాటులో తప్పనిసరిగా లేవు. అందరికీ శిక్షణ అన్న నినాదానికి అనుగుణంగా లేవు.     

ఒకానొక సందర్భంలో హెచార్డీ ఇన్స్టిట్యూట్ అభ్యర్ధన మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య, ప్రత్యేక ప్రధాన, ఇతర కార్యదర్శులు, హెచ్వోడీలు, ఇతర శిక్షణా సంస్థల అధిపతులు సుదీర్ఘమైన చర్చలు జరిపి ప్రతి డిపార్ట్మెంటులో, జిల్లాలో ట్రైనింగ్ కోఆర్డినేటర్లను నియమించాలని, వారికి ఆయా డిపార్ట్మెంట్ల, జిల్లాల శిక్షణావసరాలకు సంబంధించిన బాధ్యతలను ప్రత్యేకంగా అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా నియామకమైన జిల్లా, డిపార్ట్మెంట్ ట్రైనింగ్ కోఆర్డినేటర్లు ప్రస్తుతానికి ఏ మేరకు పని చేస్తున్నారో తెలియదు కాని, వుండనైతే వున్నారు. వారి సేవలను పునర్ నిర్వచించి ఉపయోగించుకోవచ్చు. గతంలో నిర్వచించిన ప్రకారం వారి బాధ్యతల్లో ప్రధానమైనవి, శిక్షణావసరాలు శాస్త్రీయంగా గుర్తించడం, తదనుగుణంగా ఏ మోతాదులో శిక్షణ ఇవ్వాలో నిర్ణయించడం, శాఖాపరమైన, జిల్లాల పరమైన శిక్షణా ప్రణాలికలు రూపొందించడం, బడ్జెట్ అవసరాలు గుణించడం, హెచార్డీ ఇన్స్టిట్యూట్ తో శిక్షణా పరమైన విషయాలలో సమన్వయం చేసుకోవడం వున్నాయి.

ఈ నేపధ్యంలో 1996 సంవత్సరంలో కేంద్రప్రభుత్వం జాతీయ శిక్షణా విధానాన్ని (National Training Policy) విడుదల చేసింది. దాన్నే తిరిగి 2012 లో ఆధునీకరించారు. జాతీయ విధానాన్ని దృష్టిలో వుంచుకుని ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తమ-తమ రాష్ట్ర శిక్షణా విధానాలను తయారు చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఆ దిశగా, తొలుత మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ 1997 లో పలు మూడురోజుల వ్యవధి వర్క్ షాపులు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న వివిధ స్థాయి ఉద్యోగుల శిక్షణావసరాలను గుర్తించింది. హెచార్డీ ఇన్స్టిట్యూట్ మిషన్ స్టేట్మెంట్ కూడా రూపొందించి, దాంట్లో, తమ సంస్థ, ఉద్యోగులందరికీ ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా తాజా-తాజా శిక్షణ ఇవ్వడానికి అంకితమై వుందని పేర్కొంది.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను జిల్లా ట్రైనింగ్ కమీషనర్లుగా నియామకం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. బహుశా ఇప్పటికీ అవి అమల్లోనే వుంది వుండాలి. లేకపోతె మళ్లీ అవసరమొస్తే పునర్ నిర్వచించి జారీ చేయవచ్చు. ఈ నేపధ్యంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ సేవలను ఉపయోగించుకుని ఒక క్రమ పద్ధతిలో ప్రభుత్వోద్యోగులందరికీ, ప్రజా ప్రతినిధులందరికీ వారి-వారి అవసరాలకు తగ్గ విధంగా శిక్షణా కార్యక్రమాలు అమలు చేయవచ్చేమో!   

No comments:

Post a Comment