Tuesday, September 24, 2019

బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో లైబ్రేరియన్ ఉద్యోగం....జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-7:వనం జ్వాలా నరసింహారావు:


జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-7
బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో లైబ్రేరియన్ ఉద్యోగం
వనం జ్వాలా నరసింహారావు
          ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లైబ్రరీ సైన్స్ కోర్సు (1973-1974) చదవడం పూర్తయినా అప్పుడు కాంపస్ లో నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో సాధారణంగా మార్చ్-ఏప్రిల్ నెలలో జరగాల్సిన  పరీక్షలు ఇంకా జరగలేదు. నేను తిరిగి ఖమ్మం వెళ్లి శాంతినగర్ జూనియర్ కళాశాలలో ఉద్యోగంలో చేరాను. చేరిన కొన్నాళ్లకు పేపర్లో ఒక ప్రకటన కనిపించింది. హైదరాబాద్ సమీపంలోని రామచంద్రాపురంలో వున్న బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో లైబ్రేరియన్ పోస్టుకు దరఖాస్తు చేసుకోమని దాని సారాంశం. క్వాలిఫికేషన్ లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ వుండాలని, అనుభవం వున్న వారికి ప్రాధాన్యం వుంటుందని ప్రకటనలో వుంది. నాకు అనుభవం అయితే వుందికానీ, ఇంకా అప్పటికి అర్హత అయిన డిగ్రీ చేతికి రాలేదు. అసాధారణ వ్యక్తుల విషయంలో అర్హత సడలిస్తామని కూడా ప్రకటనలో వుండడంతో నేను కూడా అప్లయి చేద్దామనుకున్నాను.

         ఉద్యోగ బాధ్యతలతో ఖమ్మంలో వున్న నేను వెంటనే బీహెచ్ఇఎల్ లైబ్రేరియన్ పోస్టుకు దరఖాస్తు చేసుకోలేక పోయాను. దాదాపు సమయం మించిపోయే ముందు హైదరాబాద్ స్వయంగా వచ్చి ఈ విషయాన్ని స్నేహితుడు, బీఎస్సీ లో నా క్లాస్మేట్ విజయరామ్ శర్మ కు చెప్పాను. అప్పట్లో వాడి బావ బీహెచ్ఇఎల్ లో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి సహాయం తీసుకుని చివరి నిమిషంలో అప్ప్లై చేశాను. చేసి దాదాపు మర్చిపోయాను. కొన్నాళ్లకు స్కూల్ యాజమాన్యం నుండి ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. తెలిసిన స్నేహితుల ద్వారా విచారించగా మొత్తం పన్నెండు మందిని ఇంటర్వ్యూకి పిలిచినట్లు, నేను తప్ప అందరూ లైబ్రరీ సైన్స్ డిగ్రీ వున్నవారే అని తెలిసింది. కాకపోతే పనిచేసిన అనుభవం మాత్రం నాకుంది అన్న ధైర్యంతో ఇంటర్వ్యూకి పోవడానికి నిశ్చయించుకున్నాను.

         ఇంటర్వ్యూ డేట్ సమీపించే ముందర ఈ విషయాన్ని భద్రాచలంలో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మా బ్రదర్ ఇన్ లా డాక్టర్ ఏపీ రంగారావుకు చెప్పాను. అప్పట్లో భద్రాచలం సబ్-కలెక్టర్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన జంధ్యాల హరినారాయణ పనిచేస్తున్నాడు. డాక్టర్ రంగారావు యాధృచ్చికంగా నా ఇంటర్వ్యూ విషయం స్నేహితుడైన హరినారాయణకు చెప్పాడు. వెంటనే ఆయన వివరాలు నోట్ చేసుకుని, బీహెచ్ఇఎల్ లో అకౌంట్స్ ఉన్నతాధికారిగా, బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్ చైర్మన్ గా పనిచేస్తున్న స్వర్గీయ ఆకెళ్ళ అచ్యుత రామం గారికి చెప్పాడు. ఆయనలా చెప్పిన విషయం నాకు తెలియదు. నేను మామూలుగా ఇంటర్వ్యూకి వెళ్లాను. నేను ఇంటర్వ్యూకి పోవడం కూడా ఒక ప్రహసనం లాగా జరిగింది.

         నాకు గుర్తున్నంతవరకు ఇంటర్వ్యూ 1974 సంవత్సరం జూన్ నెలలో జరిగింది. ఆ రోజుల్లో హైదరాబాద్ గన్ఫవుండరీ స్టేట్ బాంక్ ఆఫ్ హైదరాబాద్ లో సమీప బంధువు, స్నేహితుడు వనం రంగారావు పనిచేస్తుండే వాడు. రంగారావు దంపతులు చిక్కడపల్లి-అశోకనగర్లో వున్న పర్సా మోహన్ రావుగారింట్లో ఒక గదిలో అద్దెకుండే వాడు. మోహన్ రావుగారు ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నతోద్యోగి. ఆయనకొక స్కూటర్ వుండేది. ఆ స్కూటర్ ను అడపదడప రంగారావు కూడా ఉపయోగించుకునే వాడు. నా బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఇంటర్వ్యూకి ఆ స్కూటర్ తీసుకుని రంగారావు, నేను వెళ్లాం. వచ్చేటప్పుడో, లేదా, వెళ్లేటప్పుడో గుర్తులేదుకాని స్కూటర్ క్లచ్ వైరో, గేర్ వైరో తెగి కొంత ఇబ్బంది కలిగింది.


         ఇంటర్వ్యూలో ఆకెళ్ళ అచ్యుత రామం గారితో పాటు స్కూల్ ప్రిన్సిపాల్ వై పద్మావతి, మరో సీనియర్ బీహెచ్ఇఎల్ అధికారి వున్నారు. ఒక సబ్జెక్ట్ నిపుణుడు కూడా వున్నాడు. లైబ్రరీసైన్స్ డిగ్రీ పాసైన పదకొండు మందినీ కాదని ఇంకా పరీక్షలు రాయని నన్ను అనుభవం వుందన్న కారణాన ఎంపిక చేశారు. కాకపోతే ఒక రైడర్ పెట్టారు. నేను పరీక్షలు రాసి పాసయ్యేంతవరకు నాకు లైబ్రేరియన్ జీతం కాకుండా అంతకంటే తక్కువ స్థాయిలో ఉంచుతామన్నారు. ఒప్పుకున్నాను. జులై 1, 1974 న ఉద్యోగంలో చేరాను. అదేనెల రెండో వారంలో లైబ్రరీ సైన్స్ పరీక్షలు రాసి, ఆ మరుసటి నెల ప్రకటించిన ఫలితాలలో యూనివర్సిటీ సెకండ రామక్ సాధించి ఉత్తీర్ణుడినయ్యాను. బీహెచ్ఇఎల్ స్కూల్ యాజమాన్యం అన్న మాట ప్రకారం నేను పరీక్ష రాసిన నాటినుండి లైబ్రేరియన్ స్కేల్ ఇచ్చింది. జీతం మొత్తం కలిపి రు. 330. ఖమ్మం కంటే 70-80 రూపాయలు ఎక్కువ.

         ఉద్యోగంలో చేరగానే మళ్లీ కాపురం హైదరాబాద్ కు మార్చాను. అశోకనగర్లో పీపుల్స్ హైస్కూల్ దాటిన తరువాత వచ్చే సందులో (స్వర్గీయ) భండారు మల్లిఖార్జున రావు గారింట్లో రెండు గదులు అద్దెకు తీసుకున్నాను. మాతో పాటే హైదరాబాద్ లొ చదువుకుంటున్న మా ఆవిడ తమ్ముడు (స్వర్గీయ) ఏవీజీ కుమార్ ఎలియాస్ వెంకన్న కూడా వుండేవాడు. మల్లిఖార్జున రావు గారి దంపతులు చాలా మంచివారు. మమ్మల్ని ఎప్పుడూ ఒక కంట కనిపెట్టేవారు. వారి పిల్లలు కూడా మాతో చాలా కలుపుగోలుగా వుండేవారు. బీహెచ్ఇఎల్ పోవడం అంటే పొద్దున్నే లేవాలి. ఉదయం ఆరున్నర గంటలకల్లా బ్రేక్ ఫాస్ట్ కానిచ్చి, మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకుని బయల్దేరే వాడిని. ఓ పది నిమిషాలు నడుచుకుంటూ హిమాయత్నగర్ చేరుకొని, అక్కడ బీహెచ్ఇఎల్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో (ఉదయం 6-50 కల్లా) ఎక్కి ఉదయం ఎనిమిది కల్లా బీహెచ్ఇఎల్ స్కూల్ చేరుకునేవాడిని. నాలాగే మిగతా స్కూల్ ఉద్యోగులు కూడా వెళ్లేవారు. స్కూల్ ఉదయం 9-30 కు మొదలయ్యేది. అప్పటి దాకా సిటీ నుండి వచ్చే టీచర్లు అంతా కలిసి కబుర్లు చెప్పుకునే వాళ్ళం. సాయంత్రం 4 గంటలకల్లా స్కూల్ అయిపోయేది. కాని, బస్ మాత్రం 5-45 దాకా వుండకపోయేది. మళ్లీ సాయంత్రం బస్సు వచ్చేదాకా కబుర్లే. అలా దాదాపు పన్నెండు సంవత్సరాలు 1974 నుండి 1986 వరకు అక్కడే ఉద్యోగం చేశాను.

         బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఉద్యోగం ఒక గొప్ప అనుభూతి. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ వై పద్మావతి దగ్గర నేర్చుకొని అంశం లేదంటే అతిశయోక్తి కాదు. వివరాలు ముందు...ముందు.           


No comments:

Post a Comment